ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav g20-india-2023

న్యూయార్క్‌లో భార‌తీయ స‌మాజాన్ని ఉద్దేశించి ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌సంగం

Posted On: 23 SEP 2024 12:28AM by PIB Hyderabad

న్యూయార్క్‌లోని లాంగ్ ఐలాండ్‌లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో భారీ ఎత్తున హాజ‌రైన ప్ర‌వాస భార‌తీయుల‌ను ఉద్దేశించి సోమ‌వారం ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌సంగించారు. ఈ కార్య‌క్ర‌మానికి దాదాపు 15,000 మంది ప్ర‌జ‌లు హాజ‌ర‌య్యారు.

ప్ర‌ధాన‌మంత్రికి ప్ర‌వాస భార‌తీయులు ఘ‌నంగా, ఉత్సాహంగా స్వాగ‌తం ప‌లికారు. వారిని ఉద్దేశించి ప్ర‌ధాన‌మంత్రి మాట్లాడుతూ... భార‌త్ - యూఎస్ సంబంధాలను భార‌తీయ‌ అమెరిక‌న్ స‌మాజం ఎంతో సుసంప‌న్నం చేసింద‌ని పేర్కొన్నారు. రెండు గొప్ప ప్ర‌జాస్వామ్య దేశాల మ‌ధ్య సంబంధాల‌ను పెంపొందించ‌డంలో కీల‌క పాత్ర పోషించింద‌ని అన్నారు. అధ్య‌క్షుడు బైడెన్‌తో డెలావేర్‌లోని ఆయ‌న నివాసంలో జ‌రిగిన స‌మావేశం గురించి ప్ర‌ధాన మంత్రి మాట్లాడారు. భార‌తీయ స‌మాజం యునైటెడ్ స్టేట్స్‌తో నిర్మించుకున్న విశ్వాస‌ వార‌ధిని ఈ ప్ర‌త్యేక స‌మావేశం ప్ర‌తిబింబిస్తోందని పేర్కొన్నారు.

2047 నాటికి విక‌సిత్ భార‌త్ సాధించాల‌నే త‌న సంక‌ల్పం గురించి ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌సంగించారు. మాన‌వ చ‌రిత్ర‌లోనే అతిపెద్ద ప్ర‌జాస్వామ్య ప్ర‌క్రియ త‌న‌కు మూడో ప‌ర్యాయం ప‌ని చేసే చారిత్ర‌క అవ‌కాశం క‌ల్పించింద‌ని, ఈ ప‌ర్యాయం భార‌త‌దేశ పురోగ‌తి కోసం మ‌రింత గొప్ప అంకిత‌భావంతో ప‌నిచేసేందుకు క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని ఆయ‌న పేర్కొన్నారు. గ‌త ద‌శాబ్దకాలంలో భార‌త్‌లో వ‌చ్చిన ప‌రివ‌ర్త‌నాత్మ‌క మార్పుల‌ను ఆయ‌న ప్ర‌ధానంగా ప్ర‌స్తావించారు. త‌ర్వాతి త‌రం మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న జ‌ర‌గ‌డం, 25 కోట్ల మందిని పేద‌రికం నుంచి బ‌య‌ట‌కు తీసుకురావ‌డం, 10వ అతిపెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ నుంచి ఐదో అతి పెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా భార‌త్ ఆర్థిక వృద్ధిని సాధించ‌డం, ఇప్పుడు ప్ర‌పంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థగా ఎద‌గాల‌నే ల‌క్ష్యం పెట్టుకోవ‌డం వంటి వాటిని ఆయ‌న ప్ర‌స్తావించారు.

ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను అందుకోవ‌డానికి సంస్క‌ర‌ణ‌ల‌ను కొన‌సాగించ‌డానికి ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని ప్ర‌ధాన‌మంత్రి పేర్కొన్నారు. ఆవిష్క‌ర‌ణ‌లు, ఔత్సాహిక పారిశ్రామిక‌వేత్త‌ల‌ను త‌యారు చేయ‌డం, అంకుర సంస్థ‌లు, ఆర్థిక స‌మ్మిళితం, డిజిట‌ల్ సాధికార‌త వంటివి వృద్ధి, శ్రేయ‌స్సును ప్రోత్స‌హిస్తున్నాయ‌ని, త‌ద్వారా దేశంలో నూత‌న చైత‌న్యం క‌నిపిస్తున్న‌ద‌ని ఆయ‌న అన్నారు. మ‌హిళ‌ల నేతృత్వంలో అభివృద్ధి, ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ దిశ‌గా క్షేత్ర‌స్థాయిలో ప‌రివ‌ర్త‌నాత్మ‌క ప్ర‌భావాన్ని సాధించిన‌ట్టు ఆయ‌న పేర్కొన్నారు.

ప్ర‌పంచ వృద్ధి, శ్రేయ‌స్సు, శాంతి, భ‌ద్ర‌త‌, వాతావ‌ర‌ణ మార్పుపై చ‌ర్య‌లు, ఆవిష్క‌ర‌ణ‌లు, స‌ర‌ఫ‌రా, విలువ వ్య‌వ‌స్థ‌లు, ప్ర‌పంచ నైపుణ్య అంత‌రాల‌ను పూడ్చ‌డంలో భార‌త్ ప్ర‌ధాన స‌హాయ‌కారిగా నిలుస్తోంద‌ని ప్ర‌ధాన‌మంత్రి పేర్కొన్నారు. ఇవాళ ప్ర‌పంచంలో భార‌త‌దేశ వాణి మ‌రింత లోతుగా, బ‌లంగా వినిపిస్తోంద‌ని అన్నారు.

అమెరికాలోని బోస్ట‌న్‌, లాస్ ఏంజెల్స్‌లో రెండు కొత్త భార‌త‌దేశ దౌత్య కార్యాల‌యాల ఏర్పాటు, హోస్ట‌న్ విశ్వ‌విద్యాల‌యంలో త‌మిళ విద్య‌పై తిరువ‌ల్లూర్ పీఠం ఏర్పాటు ప్ర‌ణాళిక‌ల‌ను ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌క‌టించారు. వీటి ద్వారా భార‌త్‌కు, యునైటెడ్ స్టేట్స్‌లో నివ‌సిస్తున్న ప్ర‌వాస భార‌తీయుల‌కు మ‌ధ్య జీవ‌న వార‌ధి మ‌రింత బ‌లోపేతం అవుతుంద‌ని పేర్కొన్నారు. భార‌త్‌, యూఎస్ మ‌ధ్య స‌న్నిహిత సంబంధాల‌ను మ‌రింత బ‌లోపేతం చేయ‌డానికి అంద‌రినీ ఐక్యం చేయ‌గ‌ల బ‌ల‌మైన శ‌క్తి క‌లిగిన‌ ప్ర‌వాస భార‌తీయులు కీల‌క పాత్ర పోషిస్తార‌ని ఆయ‌న ఆశాభావం వ్య‌క్తం చేశారు.

 

****



(Release ID: 2057722) Visitor Counter : 45