ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రతిష్టాత్మక క్వాడ్ క్యాన్సర్ కార్యక్రమానికి హాజరైన ప్రధానమంత్రి
Posted On:
22 SEP 2024 8:23AM by PIB Hyderabad
అమెరికాలోని డెలావేర్‌లో గల విల్మింగ్‌టన్‌లో జరుగుతున్న క్వాడ్ దేశాధినేతల సదస్సులో భాగంగా నిర్వహించిన ప్రతిష్టాత్మక క్వాడ్ క్యాన్సర్ కార్యక్రమానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరయ్యారు. అమెరికా అధ్యక్షుడు జోసెఫ్ ఆర్ బైడెన్ జూనియర్ ఈ కార్యక్రమానికి అతిథ్యమిచ్చారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ... గర్భాశయ క్యాన్సర్‌ను గుర్తింపు, చికిత్స, నిర్మూలన లక్ష్యంతో అమెరికా అధ్యక్షుడు బైడెన్ చేపట్టిన ఈ ఆలోచనాత్మక చొరవకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఇండో-పసిఫిక్ దేశాల ప్రజలకు అందుబాటులో సరసమైన, నాణ్యమైన వైద్య సంరక్షణ అందించేందుకు ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. భారత్ సైతం దేశంలో గర్భాశయ క్యాన్సర్ నిర్ధారణకు సామూహిక కార్యక్రమాన్ని చేపట్టిన విషయాన్ని ప్రస్తావించారు. భారత్ చేపడుతున్న ఆరోగ్య భద్రత చర్యలపై ఆయన మాట్లాడుతూ.. గర్భాశయ క్యాన్సర్‌కు టీకాను దేశం అభివృద్ధి చేసిందని, ఈ వ్యాధికి కృత్రిమ మేధ ఆధారిత చికిత్స విధానానికి కృషి చేస్తున్నదని పేర్కొన్నారు.
క్యాన్సర్ మూన్‌షాట్ కార్యక్రమంలో భారత్ భాగస్వామ్యం గురించి ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ... ఒకే ప్రపంచం, ఒకే ఆరోగ్యం అనే భారత్ దార్శనికతకు అనుగుణంగా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో క్యాన్సర్ పరీక్షలు, నిర్ధారణ కోసం 7.5 మిలియన్ యూఎస్ డాలర్ల నిధిని కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో రేడియోథెరఫీ చికిత్సకు, క్యాన్సర్ నివారణ కోసం సామర్థ్య నిర్మాణానికి భారత్ సహకారాన్ని అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. గావి, క్వాడ్ కార్యక్రమాల కింద ఇండో-పసిఫిక్ దేశాలకు 40 మిలియన్ డోసుల టీకాలను భారత్ నుంచి సరఫరా చేయనున్నట్టు ప్రకటించారు. క్వాడ్ కేవలం దేశాల కోసమే పని చేయదని, ప్రజల కోసం పని చేస్తుందని, మానవ కేంద్రీకృత విధాన అసలైన సారం ఇదేనని ఆయన పేర్కొన్నారు.
డిజిటల్ ఆరోగ్యంపై డబ్ల్యూహెచ్ఓ చేపట్టిన అంతర్జాతీయ చొరవ కోసం అందిస్తున్న 10 మిలియన్ యూఎస్ డాలర్ల సహకారం ద్వారా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఆసక్తి కలిగిన దేశాలకు క్యాన్సర్ నిర్ధారణ, చికిత్స కోసం డీపీఐ వినియోగంపై సాంకేతిక సహాయాన్ని భారత్ అందిస్తుందని ఆయన తెలిపారు.
క్యాన్సర్ మూన్‌షాట్ కార్యక్రమం ద్వారా ఇండో-పసిఫిక్ దేశాల్లో గర్భాశయ క్యాన్సర్ బాధితుల సంరక్షణ, చికిత్స విస్తారిత వ్యవస్థలో ఉన్న అంతరాలను పూడ్చడానికి కలిసి పని చేసేందుకు కట్టుబడి ఉన్నామని క్వాడ్ నేతలు చాటుకున్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి క్యాన్సర్ మూన్‌షాట్ ఫాక్ట్ షీట్‌ను విడుదల చేశారు.
***
(Release ID: 2057632)
Visitor Counter : 45
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam