రాష్ట్రపతి సచివాలయం
ఉజ్జయిని లో ‘సఫాయి మిత్ర సమ్మేళన్’లో పాల్గొన్న రాష్ట్రపతి
Posted On:
19 SEP 2024 1:29PM by PIB Hyderabad
మధ్య ప్రదేశ్ లోని ఉజ్జయిని లో ఈ రోజు జరిగిన ‘సఫాయి మిత్ర సమ్మేళన్’ లో రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము పాల్గొని, సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఇదే కార్యక్రమంలో ఇండోర్, ఉజ్జయినిల మధ్య నిర్మించే ఆరు దోవల రహదారి పథకానికి శంకుస్థాపన కూడా చేశారు.
సభికులను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తూ, మన ‘సఫాయి మిత్ర’లు ముందు వరుసలో నిలిచిన పారిశుధ్య యోధులు అని ప్రశంసించారు. వారు మనను వ్యాధుల బారి నుంచి, ధూళి బారి నుంచి, ఆరోగ్య సంబంధిత నష్టాల బారి నుంచి కాపాడుతుంటారన్నారు. దేశ నిర్మాణంలో వారు అతి ప్రధానమైన పాత్రను పోషిస్తున్నారని కొనియాడారు. స్థానిక, రాష్ట్ర, జాతీయ స్థాయిలలో స్వచ్ఛత రంగంలో మనం సాధించిన విజయాల తాలూకు అతి పెద్ద ఖ్యాతి మన ‘సఫాయి మిత్ర’లకే దక్కుతుందని రాష్ట్రపతి అన్నారు.
‘సఫాయి మిత్ర’ల సురక్షకు, గౌరవానికి, సంక్షేమానికి పూచీ పడడం ప్రభుత్వంతో పాటుగా సమాజానికున్న అతి ముఖ్య బాధ్యతలలో ఒకటని రాష్ట్రపతి అన్నారు. మేన్-హోల్స్‌కు స్వస్తి పలికి, వాటిని యంత్రాల సాయంతో శుభ్రపరచేందుకు తగ్గ ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆమె తెలిపారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుపరుస్తున్న వివిధ సంక్షేమ పథకాలలో భాగంగా ‘సఫాయి మిత్ర’లకు ప్రయోజనాన్ని అందించే కృషి జరుగుతోందన్నారు. సఫాయి మిత్ర సురక్ష శిబిరాలను నిర్వహించడం ద్వారా వారి ఆరోగ్య పరీక్షలకు ఉపయోగపడే సదుపాయాలను కూడా అందుబాటులోకి తీసుకువస్తున్నారని రాష్ట్రపతి అన్నారు. మధ్య ప్రదేశ్ లో అనేక నగరాలను ‘సఫాయి మిత్ర సురక్షిత్’ నగరాలుగా ప్రకటించిన సంగతి తెలిసాక సంతోషిస్తున్నానని రాష్ట్రపతి అన్నారు.
వచ్చే ఏడాది వరకు కొనసాగనున్న ‘స్వచ్ఛ్ భారత్ మిషన్’ రెండో దశ కాలంలో సంపూర్ణ స్వచ్ఛత లక్ష్యాన్ని మనం సాధించవలసి ఉందని రాష్ట్రపతి అన్నారు. ‘ఆరుబయలు ప్రదేశాలలో మల మూత్రాదుల విసర్జనకు తావు లేని’ స్థాయి ని నిలబెట్టుకొంటూనే ఘన వ్యర్థాల, ద్రవ వ్యర్థాల నిర్వహణలో జాతీయ లక్ష్యాలను సాధించవలసి ఉందని ఆమె అన్నారు.
‘స్వభావ్ స్వచ్ఛత, సంస్కార్ స్వచ్ఛత’ అనే సందేశాన్ని దేశమంతటా వ్యాప్తి చేయడానికి ఒక ప్రచార ఉద్యమం కొనసాగుతోందని రాష్ట్రపతి అన్నారు. మలినాలను, చెత్తను తొలగించడం ద్వారా భరత మాతకు సేవ చేస్తాం అంటూ ప్రజలు ప్రతిన బూనుతున్నారని ఆమె అన్నారు. ప్రతి గ్రామంలో, వీధి వీధినా స్వచ్ఛ్ భారత్ అభియాన్ ను ప్రోత్సహించడానికి, మరి ఈ ప్రచార ఉద్యమంలో శ్రమదానం చేయడానికి పౌరులంతా ఉత్సాహంగా ముందుకు వస్తారన్న విశ్వాసాన్ని రాష్ట్రపతి వ్యక్తం చేశారు. ఈ పనిని చేయడం ద్వారా మనం జాతి పిత గాంధి మహాత్ముడు బోధించిన స్వచ్ఛత సంబంధిత ఆదర్శాలను ఆచరణలోకి తేగలిగినవారం అవుతాం అని ఆమె అన్నారు. స్వచ్ఛత పరిరక్షణ మార్గంలో మనం వేసే ఒక్కో అడుగు యావత్తు దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో సార్థకమైందిగా రుజువవుతుంది అని ఆమె అన్నారు. స్వచ్ఛ్ భారత్ ను, స్వస్థ్ భారత్ ను, వికసిత్ భారత్ ను ఆవిష్కరిస్తాం అంటూ ప్రతిజ్ఞను స్వీకరించండని పౌరులందరికీ రాష్ట్రపతి విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రపతి ప్రసంగ పాఠం
Please click here to see the President's speech -
(Release ID: 2056973)
Visitor Counter : 66