సహకార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

కేంద్ర సహకార శాఖ గత 100 రోజులలో చేపట్టిన కార్యక్రమాలపై గురువారం ఢిల్లీలో జాతీయ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్న కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా


2 లక్షల కొత్త ఎం పి ఎ సి లు, డెయిరీ, ఫిషరీ సహకార సంఘాల ఏర్పాటు, బలోపేతం , శ్వేత విప్లవంపై స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ 2.0, సహకార సంఘాల మధ్య సహకారంపై మార్గదర్శికను ప్రారంభించనున్న శ్రీ అమిత్ షా

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వం, శ్రీ అమిత్ షా మార్గదర్శకత్వంలో అన్ని స్థాయిల్లో సహకార సంఘాల బలోపేతానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్న కేంద్ర ప్రభుత్వం

ప్రధాని మోదీ 'సహకార్ ర్ సే సమృద్ధి' దార్శనికతకు అనుగుణంగా దేశంలో సుస్థిరత్వం దిశగా నిలకడగా కదులుతున్న సహకార ఉద్యమం

2026 నాటికి 22,౭౫౨ కొత్త బహుళ ప్రయోజన ప్రాథమిక సహకార సంఘాల (మల్టీపర్పస్ పి ఎ సి లు), 2029 నాటికి 47,248 చొప్పున వచ్చే ఐదేళ్లలో 70,000 ఏర్పాటు

వచ్చే అయిదేళ్లలో కొత్తగా 56 వేల మల్టీపర్పస్ డెయిరీ కోఆపరేటివ్ సొసైటీల (ఎం డి సి ఎస్) ఏర్పాటు

వచ్చే అయిదేళ్లలో కొత్తగా 6 వేల మత్స్య సహకార సంఘాల ఏర్పాటు

ప్రస్తుతం ఉన్న 46,500 డెయిరీ సహకార సంఘాలు, ప్రస్తుతం ఉన్న 5,500 మత్స్య సహకార సంఘాలను బలోపేతం చేయడం లక్ష్యం

పంచాయితీ లేదా గ్రామ స్థాయిలో సులభంగా రుణం, ఇతర సేవలు లభ్యం అయ్యేలా చొరవ

Posted On: 18 SEP 2024 8:14PM by PIB Hyderabad

సహకార మంత్రిత్వ శాఖ గత 100 రోజుల్లో చేపట్టిన పలు కార్యక్రమాలను కేంద్ర హోం , సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా  సెప్టెంబర్ 19 న న్యూఢిల్లీ  పూసాలోని ఐసిఎఆర్ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి సదస్సులో ప్రారంభిస్తారు. సదస్సు ప్రారంభ సమావేశంలో సహకార్ -సే-సమృద్ధి ఇతివృత్తం కింద మంత్రిత్వ శాఖ  రూపొందించిన  100 రోజుల కార్యక్రమాలను శ్రీ అమిత్ షా ప్రారంభిస్తారు. 2 లక్షల కొత్త ఎం పి ఎ సి లు, డెయిరీ, ఫిషరీ సహకార సంఘాల  ఏర్పాటు, బలోపేతం , శ్వేత విప్లవంపై స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ 2.0, సహకార సంఘాల మధ్య సహకారంపై మార్గదర్శికను కూడా శ్రీ అమిత్ షా ప్రారంభిస్తారు.  కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లాలన్ సింగ్ తో పాటు పలువురు ప్రముఖులు ఈ సదస్సుకు హాజరుకానున్నారు.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వం, శ్రీ అమిత్ షా మార్గదర్శకత్వంలో అన్ని స్థాయిల్లో సహకార సంఘాల బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను ముఖ్యంగా అట్టడుగు స్థాయిలో  చేపడుతోంది.  ప్రధాన మంత్రి శ్రీ  నరేంద్ర మోదీ  సహకార్ సే సమృద్ధి దార్శనికత స్ఫూర్తితో దేశంలో సహకార ఉద్యమం సుస్థిరత్వం దిశగా నిలకడగా కదులుతూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా కీలక పాత్ర పోషిస్తోంది.  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దార్శనికతను ముందుకు తీసుకు వెడుతూ, సహకార మంత్రిత్వ శాఖ మార్గదర్శకత్వంలో ఇఫ్కో ఈ ఏడాది చివరిలో ఢిల్లీలో ఐసిఎ గ్లోబల్ కోఆపరేటివ్ కాన్ఫరెన్స్ 2024ను నిర్వహిస్తోంది. సహకార సంఘాలతో ముడిపడిన ప్రపంచ అతిపెద్ద గ్రామీణ ఆర్థిక వ్యవస్థలపై సహకార మంత్రిత్వ శాఖ భవిష్యత్ కార్యాచరణను ఈ సదస్సు ఆవిష్కరిస్తుంది.
నేడు 29 కోట్ల మంది ప్రజలు సహకార రంగంతో ప్రత్యక్ష భాగస్వాములుగా ఉండి దాని సమాజ ఆధారిత ఆర్థిక భద్రత , జీవనోపాధి అవకాశాల నుండి ప్రయోజనం పొందుతున్నారు. ఈ సదస్సులో 2,00,000 బహుళ ప్రయోజన ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (మల్టీపర్పస్ ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీ లు-.ఎం పి ఎ సి ఎస్ ) ఏర్పాటు, సహకార సంఘాల మధ్య సహకారం, శ్వేత విప్లవం 2.0 అనే అంశాలపై మూడు సాంకేతిక  సెషన్లు జరగనున్నాయి.

ప్రతి పంచాయతీలో కొత్త మల్టీపర్పస్ పి ఎ సి లు, పాడి, మత్స్య సహకార సంఘాల ఏర్పాటు, బలోపేతంపై మార్గదర్శిక (కార్యాచరణ ప్రణాళిక)

దేశంలో సుమారు 2.7 లక్షల గ్రామ పంచాయతీలు ఉండగా, చాలా పంచాయతీలు ఇంకా పి ఎ సి ఎస్, డెయిరీ, మత్స్య సహకార సంఘాల పరిధిలోకి రాలేదు. దేశ సమగ్ర, సమతుల్య అభివృద్ధిలో ఈ ప్రాథమిక స్థాయి సహకార సంఘాలు పోషించే ముఖ్యమైన పాత్రను దృష్టిలో ఉంచుకుని, దేశంలో ఇప్పటికీ అందుబాటు లేని గ్రామ పంచాయతీల్లో కొత్త బహుళ ప్రయోజన పి ఎ సి ఎస్, , డెయిరీ, ఫిషరీస్ కోఆపరేటివ్ సొసైటీల ఏర్పాటు ప్రణాళికకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీన్ని నిర్ణీత కాలవ్యవధిలో సమర్ధంగా అమలు చేసేందుకు నాబార్డు, ఎన్ డి డి బి, ఎన్ ఎఫ్ డి బి సహకారంతో సహకార  శాఖ 'మార్గదర్శిక'ను రూపొందించింది. కొత్త బహుళ ప్రయోజన సహకార సంఘాల ఏర్పాటు, బలోపేతంతో వాటితో అనుబంధం ఉన్న కోట్లాది మంది చిన్న, సన్నకారు రైతుల అభ్యున్నతికి భరోసా ఏర్పడుతుంది. అంతేకాకుండా, ఇది దేశంలోని మొత్తం గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై గుణాత్మక ప్రభావాన్ని చూపుతుంది.

శ్వేత విప్లవం 2.0  చొరవ మహిళల సాధికారత, ఉపాధి కల్పన , సహకార విస్తృతికి దోహద పడుతుంది.  డెయిరీ సహకార సంఘాలు ఐదో సంవత్సరం చివరి నాటికి రోజుకు 1,000 లక్షల కిలోల పాలను సేకరిస్తాయని, ఇది గ్రామీణ ఉత్పత్తిదారుల జీవనోపాధిని గణనీయంగా పెంచుతుందని అంచనా.ఈ కార్యక్రమం పాల ప్రాసెసింగ్ , మౌలిక వసతుల అభివృద్ధి నిధి (డి ఐ డి ఎఫ్) , జాతీయ పాడి అభివృద్ధి కార్యక్రమం (ఎన్ పి డి డి ), అలాగే పశుసంవర్థక , పాడి శాఖ ప్రతిపాదిత ఎన్ పి డి డి  2.0 పథకాల వంటి ఇప్పటికే ఉన్న కార్యక్రమాల ప్రయోజనాన్ని ఉపయోగించి లక్ష్యాన్ని సాధించేందుకు సహాయపడుతుంది.

సహకార మంత్రిత్వ శాఖ వచ్చే ఐదు సంవత్సరాలలో 70,000 కొత్త బహుళ ప్రయోజన పిఏసిఎస్‌ల ఏర్పాటును లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో 2026 నాటికి 22,752 ఏర్పాటు చేస్తారు.  2029 నాటికి 47,248, సంఘాలుఏర్పాటు చేస్తారు. 56,500 కొత్తబహుళప్రయోజనడెయిరీసహకారసంఘాలు (ఎండిసిఎస్),  6,000 కొత్త మత్స్య సహకార సంఘాలను కూడా ఏర్పాటు చేస్తారు. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పిఎంఎంఎస్ వై) సహా ప్రస్తుతం ఉన్న భారత ప్రభుత్వ పథకాల ద్వారా ఇప్పుడున్న 46,500 డెయిరీ సహకార సంఘాలు, 5,500 మత్స్య సహకార సంఘాలను పటిష్టం చేస్తారు.అదనంగా, 25,000 కొత్త పి ఎ సి లు,  పాడి, మత్స్య సహకార సంఘాలను ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు సహకారం అందిస్తాయి. పంచాయతీ లేదా గ్రామ స్థాయిలో సులభంగా రుణాలు, ఇతర సేవలు అందుబాటులో ఉండేలా చూస్తారు.

గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ ఉత్పాదకత పెంపు, పాల ఉత్పత్తి పెంపుపై దృష్టి సారించడంతో పాటు వారి సుస్థిర జీవనోపాధికి, వారి అభున్నతికి అదనపు ఆదాయ వనరులను అందించడానికి మార్గాలను అన్వేషిస్తున్నందున ఈ సదస్సు రైతులకు ప్రయోజనకరంగా ఉంటుంది.  ఈ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడానికి, సహకార పరిష్కారాలను ప్రోత్సహించడానికి, దేశవ్యాప్తంగా సుస్థిర అభివృద్ధిని పెంపొందించడానికి ఈ ఒక రోజు సదస్సు ఒక వేదికగా ఉపయోగపడుతుంది.

జాతీయ సహకార సమాఖ్యల చైర్మన్లు/ ఎండీలు, మంత్రిత్వ శాఖల సీనియర్ అధికారులు, అన్ని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల సహకార, ఆహార, పౌరసరఫరాల శాఖల అదనపు ప్రధాన కార్యదర్శులు, అన్ని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల సహకార సంఘాల రిజిస్ట్రార్లు, నాబార్డు, ఎఫ్.సిఐ , ఎన్ డి డి బి , ఎన్ ఎఫ్ డి బి వంటి ఇతర సంబంధిత సంస్థల అధికారులు సహా 2000 మందికి పైగా అతిథులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.


 

***



(Release ID: 2056550) Visitor Counter : 38