ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జార్ఖండ్‌లోని టాటానగర్‌లో రూ.660 కోట్ల పైచిలుకు విలువైన రైల్వే ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన.. జాతికి అంకితం


అనుసంధానాన్ని పెంచే ఆరు వందే భారత్ రైళ్లు ప్రారంభం

32 వేల మంది లబ్ధిదారులకు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ (పీఎంఏవై-జీ) మంజూరు పత్రాల పంపిణీ, మొదటి విడతలో రూ.32 కోట్లు విడుదల

46 వేల మంది లబ్ధిదారుల గృహ ప్రవేశం

దేశంలో సుసంపన్న రాష్ట్రంగా మారే సామర్థ్యం జార్ఖండ్‌కు ఉంది, రాష్ట్రాభివృద్ధికి, దేశాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: ప్రధాని

'సబ్ కా సాథ్, సబ్ కా వికాస్' నినాదం దేశ ఆలోచనలు, ప్రాధాన్యాలను మార్చేసింది

తూర్పు భారతంలో రైలు అనుసంధాన విస్తరణ ద్వారా ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది

దేశవ్యాప్తంగా గిరిజన సోదరసోదరీమణుల కోసం పీఎం జన్మన్ యోజన అమలు చేస్తున్నాం: ప్రధానమంత్రి

Posted On: 15 SEP 2024 12:33PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు జార్ఖండ్‌లోని టాటానగర్‌లో రూ.660 కోట్ల పైచిలుకు విలువైన వివిధ రైల్వే ప్రాజెక్టులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేశారు. 32 వేల మంది ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ (పీఎంఏవై-జీ) లబ్ధిదారులకు మంజూరు పత్రాలను కూడా పంపిణీ చేశారు. టాటానగర్ జంక్షన్ రైల్వే స్టేషన్‌లో ఆరు వందే భారత్ రైళ్లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  జెండా ఊపి ప్రారంభించారు.

బాబా బైద్యనాథ్, బాబా బసూకీనాథ్, బిర్సా ముండాలకు శ్రద్ధాంజలి ఘటించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. జార్ఖండ్‌లో ప్రకృతిని ఆరాధిస్తూ చేసుకునే కర్మ పర్వదిన విశిష్టతను ప్రధాని సమావేశంలో ప్రస్తావించారు. రాంచీ విమానాశ్రయంలో కర్మ పర్వ్ చిహ్నాన్ని ఒక మహిళ ఆయనకు బహూకరించినట్లు పేర్కొన్నారు. ఈ పర్వదినం సందర్భంగా మహిళలు తమ సోదరులు సుఖసంతోషాలతో జీవించాలని కోరుకుంటారని అన్నారు. ఈ దివ్యమైన రోజు సందర్భంగా ప్రధాని జార్ఖండ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నేడు ఆరు నూతన వందే భారత్ రైళ్ల ప్రారంభోత్సవం, రూ.600 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టుల శంకుస్థాపన, పీఎం ఆవాస్ యోజన కింద రాష్ట్ర ప్రజలకు పక్కా గృహాలు లభించాయని తెలిపారు. నేటి నుంచి వందేభారత్ సేవలను పొందనున్న రాష్ట్రాలకు, వివిధ ప్రాజెక్టులను పొందిన జార్ఖండ్ ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

ఆధునిక/ అధునాతన అభివృద్ధి ఫలాలు కేవలం కొన్ని రాష్ట్రాలు, పట్టణాలకే పరిమితమై, జార్ఖండ్ వంటి రాష్ట్రాలు వెనుకపడిపోయిన రోజులను ప్రధాని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం 'సబ్ కా సాథ్, సబ్ కా వికాస్' నినాదం దేశ ఆలోచనా విధానాన్ని, ప్రాధాన్యాలను మార్చివేసిందన్నారు. "పేదలు, గిరిజనులు, దళితులు, అణగారిన వర్గాలు, మహిళలు, యువత, రైతులే దేశానికి ప్రాధాన్యాలు" అని తన సందేశంలో పేర్కొన్నారు.
రైళ్ల అనుసంధానతను పెంపొందించడానికి నేడు ప్రతి నగరం, ప్రతి రాష్ట్రం వందే భారత్ రైలును కోరుకుంటున్నాయని ప్రధాన మంత్రి తెలిపారు. ఇటీవల దేశంలోని వివిధ రాష్ట్రాలకు మూడు కొత్త వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకుంటూ, నేడు ఆరు కొత్త వందే భారత్ రైళ్లు ప్రారంభమైనట్లు ప్రధాని తెలిపారు. తూర్పు భారతదేశంలో రైలు అనుసంధానాన్ని విస్తరింపజేయడం ద్వారా ఈ ప్రాంత ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని, వ్యాపారస్తులకు, వృత్తి నిపుణులకు, విద్యార్థులకు భారీగా ప్రయోజనం చేకూరుతుందని ప్రధాన మంత్రి మోదీ తెలిపారు. నేడు ప్రారంభించిన ఆరు వందే భారత్ రైళ్ల ద్వారా సాంస్కృతిక కార్యకలాపాలు పెంపొందుతాయని మోదీ అన్నారు. దేశ విదేశాల నుంచి కాశీని సందర్శించే పర్యాటకులు ఇకనుంచి వందే భారత్ రైలును ప్రవేశపెట్టడం ద్వారా దేవఘడ్ లోని  బాబా బైద్యనాథ్‌ను సందర్శించే అవకాశం పొందుతారని అన్నారు. దీని ఫలితంగా ఈ ప్రాంతంలో పర్యాటక రంగం బలోపేతం అవుతుందని, టాటానగర్ పారిశ్రామిక అభివృద్ధికి ప్రోత్సాహం  లభిస్తుందని, తద్వారా యువతకు కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. "వేగవంతమైన అభివృద్ధి కోసం ఆధునిక రైల్వే మౌలిక సదుపాయాలు అత్యవసరం" అని ప్రధాని మోదీ అన్నారు. దేవఘడ్ జిల్లాలో మధుపూర్ బై పాస్ మార్గానికి శంకుస్థాపన చేయడం వల్ల హౌరా-ఢిల్లీ ప్రధాన మార్గంలో రైళ్ల రాకపోకలు తగ్గడంతో పాటు గిరిఢి- జసిధి మధ్య ప్రయాణ సమయం కూడా తగ్గుతుంది. హజారీబాగ్ జిల్లాలోని హజారీబాగ్ టౌన్ కోచింగ్ డిపోను కూడా ప్రధాని సమావేశంలో ప్రస్తావించారు. ఇది ఈ స్టేషన్ లో కోచింగ్ స్టాక్స్ (నిల్వల) నిర్వహణకు సహాయపడుతుందని పేర్కొన్నారు. కుర్కురా-కనరోన్ లైన్ డబ్లింగ్ పనుల ద్వారా జార్ఖండ్ లో రైలు అనుసంధానతను పెంచుతుందని, ఉక్కు పరిశ్రమలకు లాభదాయకంగా ఉంటుందని అన్నారు.

జార్ఖండ్ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి, పురోగతి కోసం కేంద్ర ప్రభుత్వం పెట్టుబడులను పెంచడంతో పాటు అభివృద్ధి పనుల్లో వేగాన్ని పెంచిందని ప్రధాని ఉద్ఘాటించారు. జార్ఖండ్ రాష్ట్రంలో రైల్వే మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి ఈ ఏడాది బడ్జెట్‌లో రూ .7 వేల కోట్లకు పైగా మంజూరు చేసినట్లు తెలిపారు. ఇది పదేళ్ల క్రితం కేటాయించిన బడ్జెట్‌తో పోలిస్తే 16 రెట్లు అధికమని అన్నారు.  రైల్వే నిధులను పెంచడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఆయన ప్రజలకు వివరించారు. కొత్త మార్గాల అభివృద్ధి లేదా రైల్వే మార్గాల విద్యుద్దీకరణ లేదా డబ్లింగ్ పనులు లేదా స్టేషన్లలో కొత్త మౌలిక సదుపాయాల కల్పనకు చెందిన పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. రైల్వే మార్గాలు 100 శాతం విద్యుదీకరణ చేసిన రాష్ట్రాల్లో జార్ఖండ్ ఒకటని ప్రధాని మోదీ ప్రశంసించారు. అమృత్ భారత్ రైల్వే స్టేషన్ పథకం కింద జార్ఖండ్‌లోని 50కి పైగా రైల్వే స్టేషన్లను పునరుద్ధరిస్తున్నట్లు ఆయన ఈ సందర్భంగా వివరించారు.

ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ (పిఎంఎవై-జి) మొదటి విడత నేడు ప్రారంభిస్తున్నామని, ఇది వేలాది మంది లబ్ధిదారులకు సొంతింటి కలను నెరవేరుస్తుందని ప్రధాన మంత్రి తెలిపారు. పీఎంఏవై-జీతో పాటు మరుగుదొడ్లు, తాగునీరు, విద్యుత్, గ్యాస్ కనెక్షన్ వంటి ఇతర సౌకర్యాలను కూడా కల్పించినట్లు తెలిపారు. ఒక కుటుంబానికి సొంత ఇల్లు ఉంటే వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. ప్రజలు జీవితంలో స్థిరత్వాన్ని కలిగి ఉంటే, మంచి భవిష్యత్తు కోసం ఆలోచించడం ప్రారంభిస్తారని ఆయన అన్నారు. పిఎం ఆవాస్ యోజన ద్వారా జార్ఖండ్ ప్రజలకు పక్కా ఇళ్లతో పాటు గ్రామాలు, నగరాల్లో వేలాది ఉద్యోగాలు కల్పిస్తున్నామని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

2014 నుంచి దేశంలోని పేదలు, దళిత, అణగారిన, గిరిజన కుటుంబాల సాధికారత కోసం అనేక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రధాని తెలిపారు. గిరిజన సమాజం కోసం పీఎం జన్మన్ యోజనను జార్ఖండ్‌తో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా అత్యంత వెనుకబడిన గిరిజనులకు చేరువయ్యేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. గిరిజన కుటుంబాలకు ఇళ్లు, రోడ్లు, విద్యుత్, నీరు, విద్యను అందించేందుకు అధికారులే స్వయంగా వారి వద్దు చేరుకుంటారని తెలిపారు. జార్ఖండ్ అభివృద్ధి కోసం ప్రభుత్వం చేస్తున్న తీర్మానాల్లో భాగంగానే ఇలాంటి ప్రయత్నాలు చేపడుతున్నట్లు ఆయన వివరించారు. ఈ తీర్మానాలు తప్పకుండా నెరవేరుతాయని, ప్రజల ఆశీస్సులతో జార్ఖండ్ కలలు సాకారం అవుతాయని ప్రధాన మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా తన హెలికాప్టర్ రాకపోకలకు ఆటంకం ఏర్పడటంతో, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయాల్సి రావడంతో రాష్ట్ర ప్రజలకు ఆయన వినయపూర్వకంగా క్షమాపణలు చెప్పారు.

ఈ కార్యక్రమంలో జార్ఖండ్ గవర్నర్ శ్రీ సంతోష్ గంగ్వార్, కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు.

నేపథ్యం:

ప్రధాన మంత్రి రూ.660 కోట్లకు పైగా విలువ చేసే వివిధ రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేశారు. దేవఘడ్ జిల్లాలోని మధుపూర్ బై పాస్ మార్గం, జార్ఖండ్ లోని హజారీబాగ్ జిల్లాలోని హజారీబాగ్ టౌన్ కోచింగ్ డిపోలకు శంకుస్థాపన చేశారు. ఇది మధుపూర్ బైపాస్ లైన్ హౌరా-ఢిల్లీ ప్రధాన మార్గంలో రైళ్లను నిలిపి ఉంచడాన్ని నివారిస్తుంది. గిరిధి, జసిధి మధ్య ప్రయాణ సమయం తగ్గుతుంది. హజారీబాగ్ టౌన్ కోచింగ్ డిపో ద్వారా స్టేషన్‌లో కోచింగ్ స్టాక్స్ (నిల్వలు) నిర్వహణను సులభతరం చేస్తుంది.

బందాముండా-రాంచీ సింగిల్ లైన్ సెక్షన్‌లో భాగమైన కుర్కురా-కనరోన్ డబ్లింగ్, రాంచీ, మురి, చంద్రపుర స్టేషన్ల మీదుగా రూర్కెలా-గోమోహ్ మార్గంలో కొంత భాగాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు జాతికి అంకితం చేశారు. సరుకులు, ప్రయాణికుల రాకపోకలను గణనీయంగా పెంచడానికి ఈ ప్రాజెక్టు సహాయపడుతుంది. వీటితో పాటు ప్రజల భద్రత కోసం నాలుగు రోడ్ అండర్ బ్రిడ్జిలు (ఆర్‌యూబీ)లను జాతికి అంకితం చేశారు.

'అందరికీ ఇళ్లు' అనే నిబద్ధతకు అనుగుణంగా 32 వేల మంది జార్ఖండ్‌ రాష్ట్ర లబ్దిదారులకు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన- గ్రామీణ్ (పీఎంఏవై-జీ) మంజూరు పత్రాలను ప్రధాని పంపిణీ చేశారు. లబ్ధిదారులకు మొదటి విడత సాయాన్ని ఆయన విడుదల చేశారు. 46 వేల మంది లబ్ధిదారులు గృహ ప్రవేశ వేడుకల్లో ప్రధాని పాల్గొన్నారు.


 

 

*****

MJPS/SR/TS



(Release ID: 2056293) Visitor Counter : 22