కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
ఈ-శ్రామ్ పోర్టల్‌లో నమోదు కావాలనీ, కార్మికుల పేర్లూ
నమోదు చేయాలంటూ వెబ్ సైటు యాజమాన్యాలను కోరిన భారత ప్రభుత్వం
నమోదుకు సంబంధించిన సమాచారం కోసం, మార్గనిర్దేశం చేయడానికి టోల్-ఫ్రీ ఫోన్ నెంబరు (14434) ఏర్పాటు
బుధవారం వెబ్ సైటు యజమానులతో సమావేశం కానున్న కేంద్ర మంత్రి డాక్టర్ మన్‌సుఖ్ మాండవియా
Posted On:
17 SEP 2024 10:32AM by PIB Hyderabad
ఉద్యోగులుగా కాకుండా, ఒక వెబ్ సైటు ద్వారా స్వతంత్రంగా సేవలు అందించే కార్మికుల (గిగ్ వర్కర్లు) సామాజిక భద్రత కల్పించేందుకు కార్మిక, ఉపాధి కల్పన మంత్రిత్వశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. వెబ్ సైట్ల యాజమాన్యాలు (ప్లాట్ ఫాం ఆగ్రిగేటర్లు) ఈ-శ్రామ్ పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని, ఆయా సంస్థలకు అనుబంధంగా పని చేస్తున్న కార్మికుల పేర్లను సైతం నమోదు చేయించాలని ప్రభుత్వం కోరుతున్నది. ఈ కార్మికులు సామాజిక సంక్షేమ పథకాలను అందుకోవడానికి ఈ-శ్రామ్ నమోదు చేసుకోవడం చాలా ముఖ్యం. దీని ద్వారా లబ్ధిదారులకు సంబంధించిన జాబితాను కచ్చితత్వంతో సేకరించడానికి వెబ్ సైటు యాజమాన్యాలు సాయపడినట్లు అవుతుంది.
ఈ ప్రక్రియలో మార్గనిర్దేశం చేసేలా ప్రామాణిక పని విధానం (ఎస్ఓపీ)తో కూడిన సూచనావళిని మంత్రిత్వ శాఖ జారీ చేసింది. ఇందులో కార్మికులను నమోదు చేయించడం, సమాచారాన్ని ఆధునికీకరించడం వంటి బాధ్యతలను యాజమాన్యాలకు సూచించింది. ఈ పోర్టల్‌లో నమోదు చేసుకున్న తర్వాత కార్మికులకు యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (యూఏఎన్) అందుతుంది. కీలకమైన సామాజిక భద్రత ప్రయోజనాలను పొందేందుకు ఇది అవకాశం కల్పిస్తుంది.
ప్రయోగాత్మకంగా కొన్ని వెబ్ సైట్ల యాజమాన్యాలతో కలిసి పని చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నమోదు ప్రక్రియను కంప్యూటర్ అప్లికేషన్ ద్వారా విజయవంతంగా పరీక్షించింది. ఈ కామార్స్ వెబ్ సైట్ల ద్వారా పని చేస్తున్న కార్మికులందరినీ దీని పరిధిలోకి తీసుకురావడమే వెబ్ సైట్ల యాజమాన్యాలు, మంత్రిత్వ శాఖల ఉమ్మడి ప్రయత్నం.
కార్మికులు ఎంతకాలం పని చేశారు, వారికి చేసిన చెల్లింపులు వంటి వివరాలను ఎప్పటికప్పుడు పొందుపర్చాలని యాజమాన్యాలకు మార్గదర్శకాలను జారీ చేశారు. ఎవరైనా కార్మికులు పని మానేస్తే వెంటనే ఆ సమాచారాన్ని తెలియజేయాల్సిందిగా కూడా ప్రభుత్వం కోరింది.
కార్మికులు, యాజమాన్యాలు నమోదు ప్రక్రియలో సహకరించేందుకు, సంబంధించిన సమాచారం, మార్గనిర్దేశం అందించేందుకు, నమోదు చేసేటప్పుడు ఏవైనా సాంకేతిక సమస్యలు వస్తే పరిష్కరించేందుకు టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్ (14434)ను ఏర్పాటు చేసింది.
ఈ ముఖ్యమైన కార్యక్రమం గురించి వివరించి, నమోదు చేసుకునేలా ప్రోత్సహించేందుకు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి డాక్టర్ మన్‌సుఖ్ మాండవియా అధ్యక్షతన బుధవారం వెబ్ సైట్ల యాజమాన్యాలతో మంత్రిత్వ శాఖ సమావేశం నిర్వహించనుంది.
***
(Release ID: 2055855)
Visitor Counter : 57