రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

మిత్ర దేశాల మధ్య సహకారం, సమన్వయం, విశ్వాసాన్ని తరంగ శక్తి విన్యాసం బలోపేతం చేస్తుంది: రక్షణ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్


“భారత సాయుధ బలగాల ప్రతిష్ఠకు ప్రతీక తరంగ శక్తి’’

“రక్షణ రంగంలో భారత ఆత్మనిర్భర సంకల్పాన్ని రూపం తరంగ శక్తి విన్యాసం’’

Posted On: 12 SEP 2024 4:13PM by PIB Hyderabad

‘తరంగ శక్తి’ పేరుతో దేశదేశాలతో కలిసి నిర్వహించే ఉమ్మడి విన్యాసాలు భాగస్వామ్య దేశాల మధ్య సహకారం, సమన్వయం, విశ్వాసాన్ని బలోపేతం చేసే ఒక ప్రయత్నంగా రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. ఈ భిన్నదేశాల ఉమ్మడి విన్యాసం రెండో దశలో- సందర్శకుల దినం సందర్భంగా జోధ్‌పూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రక్షణ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్ ప్రసంగించారు. తరంగ శక్తి ద్వారా అన్ని భాగస్వామ్య దేశాలతో భారత రక్షణ సంబంధాలు మరింత బలోపేతమయ్యాయని, అవసరమైన సమయంలో అందరం కలిసి నిలుస్తామన్న విశ్వాసాన్ని అందరిలో నింపిందని అన్నారు.

అన్ని దేశాలూ ఐక్యంగా ముందుకు సాగడాన్ని భారత్ విశ్వసిస్తుందన్న రక్షణ మంత్రి పరస్పర సహజీవనం, సహకారంపై భారత దార్శనికతను పునరుద్ఘాటించారు. “సంకీర్ణ, భారీ విన్యాసాల సమయంలో విభిన్న పని సంస్కృతులు, వాయు పోరాట అనుభవాలు, యుద్ధ పోరాట సూత్రాల నేపథ్యమున్న సైనికులు పరస్పరం అనేక అంశాలు నేర్చుకుంటారు’’ అని రక్షణ మంత్రి అన్నారు.

“భారత వాయు సేన సాధించిన ఘన విజయాలను ఆనందంగా పంచుకునేందుకు అవకాశం రావడం ఈ విన్యాసాల్లోని ప్రముఖమైన అంశం. వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఘన విజయాలు మాత్రమే కాకుండా, మన సాయుధ బలగాలకు ప్రపంచంలో అతి శక్తిమంతమైన సేనల్లో ఒకటిగా గుర్తింపు లభించడం గర్వకారణం’’ అని రక్షణ మంత్రి అన్నారు.

“స్వాతంత్ర్యం వచ్చే నాటికి భారత వైమానిక దళంలో రెండు రకాల విమానాలతో కూడిన ఆరు సైనిక విభాగాలు మాత్రమే ఉన్నాయి. యుద్ధ సామగ్రి కూడా పాతది. అదీ పరిమిత సంఖ్యలోనే ఉంది. కానీ నేడు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ, ఆధునిక యుద్ధ విమానాలు, అధునాతన పరికరాలతో భారత వైమానిక దళ స్వరూపమే మారిపోయింది’’ అని రక్షణ మంత్రి అన్నారు.

ఫ్రెంచ్ కంపెనీ సఫ్రాన్ హెలికాప్టర్ ఇంజిన్స్, హిందుస్థాన్ ఏరో నాటిక్స్ ఇటీవల భాగస్వామ్యం కుదుర్చుకున్న విషయాన్ని ప్రస్తావిస్తూ- ఆయుధాలు, పరికరాల దిగుమతిదారుగానే ఉన్న మనం నేడు 90 దేశాలకు ఆయుధాలు, సామగ్రిని ఎగుమతి చేసే దేశంగా ఎదిగామని రక్షణ మంత్రి అన్నారు. “ఆయుధాలు, విమానాల తయారీ దేశీయీకరణ దిశగా మన రక్షణ రంగం బలమైన అడుగులు వేసింది. తేలికపాటి యుద్ధ విమానాలు, సెన్సార్లు, రాడార్ల తయారీలో, ఎలక్ట్రానిక్ యుద్ధ నిర్వహణలో నేడు మనం చాలా వరకు స్వయం సమృద్ధిని సాధించాం” అని కూడా పేర్కొన్నారు.

సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ కూడా తరంగ శక్తి ప్రత్యేక అతిథుల దినోత్సవంలో పాల్గొన్నారు. సైనిక దళాల ప్రధానాధికారి (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్, వాయుసేన ప్రధానాధికారి (సీఏఎస్) ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి, ప్రధాన సైనికాధికారి (సీవోఏఎస్) జనరల్ ఉపేంద్ర ద్వివేది, నౌకాదళ ప్రధానాధికారి (సీఎన్ఎస్) అడ్మిరల్ దినేశ్ కె. త్రిపాఠి, మిత్ర దేశాల సీనియర్ మిలిటరీ అధికారులు కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో అగ్నివీర్ మహిళా వాయుయోధుల కవాతు బృందం (ఏడబ్ల్యూడీటీ) ప్రదర్శన నిర్వహించింది. దాంతో పాటు ఎల్ సీఏ తేజాస్, ఎల్ సీహెచ్ ప్రచండ్, సారంగ్, ఎస్ కేఏటీ బృందాల ప్రదర్శనలు జరిగాయి.

అనంతరం, ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ రక్షణ, ఏరోస్పేస్ ప్రదర్శన (ఐడాక్స్-24)ను రక్షణ మంత్రి ప్రారంభించారు. రక్షణ రంగ తయారీ, ఏరోస్పేస్ ఆవిష్కరణలను దేశీయం చేయడంలో భారత నిబద్ధతకు ఈ ప్రదర్శన నిదర్శనంగా నిలుస్తుంది.

ఈ కార్యక్రమంలో అంకుర సంస్థలు, ఎంఎస్ఎంఈలు, ప్రధాన వైమానిక పరిశ్రమలు ఉత్సాహంగా పాల్గొన్నాయి. అరవై ఎనిమిది పరిశ్రమల ప్రతినిధులు అత్యాధునిక రక్షణ సాంకేతికతలను ప్రదర్శించారు. ఏడు దేశాలు, ఇరవై ఒక్క పరిశీలక దేశాలు పాల్గొన్న ఈ విన్యాసాల రెండో దశలో ఐడాక్స్-24 అంతర్జాతీయ సహకారాన్ని ప్రతీకగా నిలిచింది. చర్చలు, సహకారం, నైపుణ్యాల వినిమయాన్ని పెంపొందించడంతో పాటు రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లో అంతర్జాతీయంగా భారత స్థాయిని మరింత బలోపేతం చేయడంలో ఇది దోహదపడుతుంది. 

****



(Release ID: 2054438) Visitor Counter : 26