ప్రధాన మంత్రి కార్యాలయం
గ్రీన్ హైడ్రోజన్ రెండో అంతర్జాతీయ సమావేశంలో ప్రధానమంత్రి వీడియో సందేశం- ప్రసంగ పాఠం
Posted On:
11 SEP 2024 11:25AM by PIB Hyderabad
విశిష్ట అతిథులు,
శాస్త్రవేత్తలు, నూతన ఆవిష్కర్తలు, పరిశ్రమ రంగ ప్రముఖులు, నా ప్రియ మిత్రులారా, మీకందరికీ ఇవే నా స్నేహపూర్వక శుభాభినందనలు. గ్రీన్ హైడ్రోజన్ అంశంపై ఏర్పాటు చేసిన రెండో అంతర్జాతీయ సమావేశానికి మిమ్ములను అందరినీ ఆహ్వానించడం సంతోషాన్ని ఇస్తోంది.
మిత్రులారా, ప్రపంచం ఒక ముఖ్య పరివర్తన దశలో ఉంది. వాతావరణ మార్పు భవిష్యత్తునకు సంబంధించిన అంశం ఒక్కటే కాదన్న తెలివిడి అంతకంతకు పెరుగుతున్నది. వాతావరణ మార్పు తాలూకు ప్రభావం ఇప్పుడే, ఇక్కడే మన అనుభవంలోకి వస్తోంది. తక్షణ కార్యాచరణను చేపట్టవలసిన అవసరం ఇప్పుడే, ఇక్కడే ఉంది. ఇంధన రంగంలో మార్పులు, స్థిరత్వం- ప్రపంచ విధాన రూపకల్పనలో కీలకంగా మారిపోయాయి.
మిత్రులారా, ఒక స్వచ్ఛమైన, పచ్చదనంతో అలరారే భూగ్రహాన్ని ఆవిష్కరించేటందుకు భారతదేశం కంకణం కట్టుకొంది. హరిత ఇంధనాల విషయంలో పారిస్ లో మనం చెప్పునకొన్న సంకల్పాలకు ఆచరణ రూపాన్ని ఇవ్వడంలో జి20 సభ్యత్వ దేశాల కంటే మేమే ముందున్నాం. ఈ వాగ్దానాలను 2030 కల్లా సాధించాలని లక్ష్యంగా పెట్టుకొంటే అంత కన్నా తొమ్మిది సంవత్సరాలు ముందుగానే వాటిని నెరవేర్చాం. భారతదేశంలో శిలాజేతర ఇంధన స్థాపిత సామర్థ్యం గడచిన పది సంవత్సరాలలో సుమారుగా 300 శాతం వృద్ధి చెందింది. మా సౌర శక్తి సామర్థ్యం, అదే కాలంలో, 3 వేల శాతానికి పైగా పెరిగింది. అయితే, ఈ కార్యసాధనలతో మేం మిన్నకుండి పోవడం లేదు. ప్రస్తుతం ఆచరించి చూపుతున్న పరిష్కారాలను దృఢతరం చేయడం పైన మేం శ్రద్ధ వహిస్తున్నాం. మేం కొత్త కొత్త రంగాలకేసి సైతం దృష్టిని సారిస్తున్నాం. సరిగ్గా ఇక్కడే గ్రీన్ హైడ్రోజన్ తెర మీదకు వచ్చింది.
మిత్రులారా, ప్రపంచంలో ఇంధన ముఖచిత్రంలో గ్రీన్ హైడ్రోజన్ ఒక ఆశాభరిత అదనపు హంగులాగా ఉనికిలోనికి వస్తున్నది. విద్యుదుత్పత్తి కష్టసాధ్యంగా ఉన్న పరిశ్రమల్లో- కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ఇది సహాయపడుతుంది. చమురు శుద్ధి కర్మాగారాలు, ఎరువులు, ఉక్కు, భారీ స్థాయి రవాణా వంటి రంగాలు అనేకం దీనివల్ల లాభపడనున్నాయి. శిలాజేతర ఇంధనాల మిగులును నిలవ చేయడానికి కూడాను గ్రీన్ హైడ్రోజన్ దోహదపడగలదు. భారతదేశం నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ను 2023లోనే ప్రారంభించింది.
మేం గ్రీన్ హైడ్రోజన్ ఉత్పాదన, వినియోగం, ఇంకా ఎగుమతి.. ఈ విషయాల్లో భారతదేశాన్ని ఒక ప్రపంచానికే ఒక కూడలిగా తీర్చిదిద్దాలని కోరుకొంటున్నాం. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ నవకల్పనకు, మౌలిక సదుపాయాల నిర్మాణానికీ, ఈ ఇంధన రంగానికీ, పెట్టుబడులకీ ఉత్తేజాన్ని అందిస్తున్నది. మేం అత్యాధునిక పరిశోధన- అభివృద్ధి (ఆర్ అండ్ డి) లో పెట్టుబడులను పెడుతున్నాం. పరిశ్రమ రంగానికీ, విద్య బోధన రంగానికీ మధ్య భాగస్వామ్యాలను నెలకొల్పుతున్నాం. ఈ రంగాల్లో కృషి చేస్తున్న అంకుర సంస్థలను, ఔత్సాహిక పారిశ్రమిక వేత్తలను ప్రోత్సహిస్తున్నాం. గ్రీన్ జాబ్స్ అనుబంధ వ్యవస్థల్ని (ఎకో సిస్టమ్) విస్తరించేందుకు అవకాశాలు చాలానే ఉన్నాయి. దీనిని ఆవిష్కరించడం కోసం, ఈ రంగంలో యువతీ యువకులకు నైపుణ్యాలను అందించే దిశగా కూడా శ్రమిస్తున్నాం.
మిత్రులారా, వాతావరణ మార్పు, ఇంధన వినియోగంలో వస్తున్న పెనుమార్పులు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగించే అంశాలు. వీటికి మన సమాధానాలు కూడా ప్రపంచ స్థాయిలోనే ఉండాలి. కర్బన స్థాయులను క్షీణింపచేసే దిశలో గ్రీన్ హైడ్రోజన్ తాలూకు ప్రభావాన్ని ప్రోత్సహించాలంటే అంతర్జాతీయ స్థాయి భాగస్వామ్యం చాలా ముఖ్యం. ఉత్పత్తిని పెంచడం, ఖర్చులను తగ్గించడం, మౌలిక సదుపాయాలను నిర్మించడం- సహకారం ద్వారానే సాధ్యం అవుతాయి. సాంకేతిక విజ్ఞానాన్ని మరింతగా ముందుకు తీసుకు పోవడానికి పరిశోధనలోను, నవకల్పనలోను కలసికట్టుగా పెట్టుబడులను పెట్టవలసిన అవసరం కూడా ఉంది. గత సెప్టెంబరు లో జి20 శిఖరాగ్ర సమావేశాన్ని భారతదేశం లో నిర్వహించారు. ఈ శిఖరాగ్ర సమావేశంలో గ్రీన్ హైడ్రోజన్ కు పెద్దపీట వేశారు. న్యూఢిల్లీ లో జరిగిన జి20 నేతల తీర్మానంలో హైడ్రోజన్ అంశంపై అయిదు ఉన్నత స్థాయి స్వచ్ఛంద సూత్రాలను ఆమోదించారు. ఈ సూత్రాలు ఒకే విధమైన మార్గసూచీని తయారు చేయడంలో మనకు సాయపడుతున్నాయి. ఇప్పుడు మనం తీసుకొనే నిర్ణయాలు రాబోయే తరాల భవిష్యత్తును నిర్ణయిస్తాయన్న విషయాన్ని తప్పక గుర్తు పెట్టుకోవాలి.
మిత్రులారా, ఇంతటి అతి ప్రధాన రంగంలో, ఈ రంగ నిపుణులు నాయకత్వం వహించి కలిసికట్టుగా పని చేయడం కీలకం. మరీ ముఖ్యంగా, మన ప్రపంచ విజ్ఞాన శాస్త్ర సముదాయానికి నేను చేసే విజ్ఞప్తి ఏమిటంటే దీనికి సంబంధించిన వివిధ దశలను అన్వేషించడానికి వారంతా ఏకతాటి మీద నడవాలనే. గ్రీన్ హైడ్రోజన్ రంగానికి సాయపడే విధంగా సార్వజనిక విధానంలో మార్పు చేర్పులను శాస్త్రవేత్తలు, నవకల్పనదారులు (ఇన్నొవేటర్స్) సూచించ గలుగుతారు. విజ్ఞానశాస్త్ర సంబంధిత సముదాయం నిశితంగా పరిశీలించదగిన ప్రశ్నలు కూడా అనేకం ఉన్నాయి. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి ప్రక్రియలో ఎలక్ట్రోలైజర్స్, తదితర అంశాల సమర్థతను మనం మెరుగుపరచ గలమా? ఉత్పత్తి కోసం సముద్ర జలం, మునిసిపాలిటీ వ్యర్థ జలాలను ఉపయోగించడానికి వీలుందేమో మనం పరిశీలించవచ్చా? ఆ తరహా అంశాలను కలిసికట్టుగా పరిశీలించడం ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ ఎనర్జీ దిశగా మళ్లేందుకు ఎంతగానో సహాయకారి కాగలదు. అలాంటి అంశాల విషయంలో రకరకాల ఆలోచనలను పరస్పరం పంచుకునేందుకు ఈ సమావేశం సాయపడుతుందన్న విశ్వాసం నాలో ఉంది.
మిత్రులారా, గతంలో మానవజాతి అనేక సవాళ్ళను ఎదుర్కొంది. ప్రతిసారీ, మనం సమష్టి పరిష్కారాల, కొత్త కొత్త ఉపాయాల ద్వారా ప్రతికూలస్థితులపై పైచేయిని సాధించాం. సమష్టి కార్యాచరణ, వినూత్న కార్యాచరణల తాలూకు చైతన్యమే మనను దీర్ఘకాలిక భవితవ్యం దిశలో ముందుకు నడిపిస్తాయి. మనం ఒకరితో మరొకరం కలసి ముందుకు పయనించినప్పుడు దేనిని అయినా సాధించవచ్చు. రండి, గ్రీన్ హైడ్రోజన్ అభివృద్ధిలో, దానిని వినియోగించడంలో మన ప్రయత్నాలను కలసికట్టుగా వేగవంతం చేద్దాం.
గ్రీన్ హైడ్రోజన్ విషయంపై ఏర్పాటైన ఈ రెండో అంతర్జాతీయ సమావేశంలో పాలుపంచుకొంటున్న అందరికీ మళ్లీ నా శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను.
***
(Release ID: 2054014)
Visitor Counter : 82
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam