రక్షణ మంత్రిత్వ శాఖ
‘ఎఎస్‌డబ్ల్యు-ఎస్‌డబ్ల్యుసి’ (సిఎస్ఎల్) ప్రాజెక్టు కింద నిర్మించిన 4వ, 5వ నౌకలు ‘మాల్పే.. ముల్కీ’ ఒకేసారి జల ప్రవేశం
Posted On:
10 SEP 2024 9:45AM by PIB Hyderabad
భారత నావికాదళం కోసం ‘మెస్సర్స్ కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్’ (సిఎస్ఎల్) ‘‘యాంటీ-సబ్‌మెరైన్ వార్‌ఫేర్- షాలో వాటర్ క్రాఫ్ట్ ప్రాజెక్ట్’’ (ఎఎస్‌డబ్ల్యు-ఎస్‌డబ్ల్యుసి)లో భాగంగా నిర్మిస్తున్న8 నౌకలలో 4వ, 5వ నౌకలు ‘‘మాల్పే, ముల్కీ’’ 2024 సెప్టెంబరు 9న కొచ్చిలోని ‘సిఎస్ఎల్’ వద్ద జల ప్రవేశం చేశాయి. ఈ మేరకు సముద్ర సంప్రదాయాలకు అనుగుణంగా నావికాదళం దక్షిణ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ వైస్ అడ్మిరల్ వి.శ్రీనివాస్ సమక్షంలో శ్రీమతి విజయ శ్రీనివాస్ వీటిని ప్రారంభించారు.
భారత తీర ప్రాంతంలోని వ్యూహాత్మక రేవులకు గుర్తుగా ఈ ‘మాహే’ క్లాస్ ‘ఎఎస్‌డబ్ల్యు-ఎస్‌డబ్ల్యుసి’ నౌకలకు పేర్లు పెట్టారు. సముద్రంలో శత్రవుల మందుపాతరలను గుర్తించి, తొలగించడంలో ప్రసిద్ధి చెందిన ఈ రకం నౌకల అద్భుత వారసత్వాన్ని ఇవి కొనసాగించగలవు. కాగా, రక్షణ మంత్రిత్వ శాఖ, ‘సిఎస్ఎల్’ మధ్య ఈ 8 ‘ఎఎస్‌డబ్ల్యు-ఎస్‌డబ్ల్యుసి’ నౌకల నిర్మాణ ఒప్పందంపై 2019 ఏప్రిల్ 30న సంతకాలు పూర్తయ్యాయి.
దేశీయంగా రూపొందించిన ఈ ‘మాహే’ తరగతి నౌకలకు అత్యాధునిక జలాంతర సెన్సర్లు అమరుస్తారు. తీరజలాల్లో శత్రు జలాంతర్గాముల ఆనుపానులు పసిగట్టడంతోపాటు తక్కువ స్థాయి సముద్ర కార్యకలాపాలు, మందుపాతరలు అమర్చే పనులు కూడా నిర్వహించగలవు. అంతేకాదు... 25 నాట్ల గరిష్ఠ వేగంతో 1800 నాటికల్ మైళ్ల వరకు ప్రయాణించగలవు.
నౌకా నిర్మాణంలో స్వావలంబన దిశగా భారత్ పయనానికి ఈ రెండు నౌకలను ఏకకాలంలో ప్రారంభించడం ఒక నిదర్శనం. ఈ నౌకల నిర్మాణంలో 80 శాతానికిపైగా దేశీయంగా తయారైన ఉపకరణాలు, పరికరాలనే వాడారు. తద్వారా భారత సంస్థల ద్వారా భారీ ఎత్తున రక్షణ ఉత్పత్తుల తయారీ సహా దేశంలో ఉపాధి, సామర్థ్యం ఇనుమడిస్తుంది.
***
(Release ID: 2053509)
Visitor Counter : 112