ఆయుష్
azadi ka amrit mahotsav

వివిధ సిద్ధ మందుల కలయికతో కౌమారదశ అమ్మాయిల్లో రక్తహీనత తగ్గింది: అధ్యయనం

Posted On: 10 SEP 2024 1:09PM by PIB Hyderabad

కౌమారదశలో ఉన్న బాలికలలో రక్తహీనతను ఒక రకమైన ఔషధం తగ్గిస్తున్నట్లు ఇండియన్ ట్రెడిషనల్ నాలెడ్జ్ జర్నల్ ప్రచురించిన ఒక అధ్యయనం పేర్కొంది. పబ్లిక్ హెల్త్ ఇనీషియేటివ్ (పిహెచ్ఐ ని) నిర్వహిస్తున్న పరిశోధకులే ఈ అధ్యయనకర్తలు. రక్తహీనతకు సరైన పరిష్కారాన్ని అందించాలన్న లక్ష్యంతో ‘సిద్ధ’ ఔషధాలను వాడకంలోకి తెచ్చేందుకు వారు ప్రయత్నిస్తున్నారు.

ఆయుష్ మంత్రిత్వ శాఖ లోని సిద్ధ జాతీయ సంస్థ (ఎన్ఐఎస్), జేవియర్ రిసెర్చ్ ఫౌండేషన్ (తమిళనాడు), వేలుమైలు సిద్ధ వైద్య కళాశాల (తమిళనాడు), దాని అనుబంధ ఆస్పత్రి- సహా దేశంలో ప్రసిద్ధ ‘సిద్ధ’ సంస్థలకు చెందిన పరిశోధకుల బృందం ఈ అధ్యయనంలో పాల్గొన్నది. ఎబిఎమ్ఎన్ (అన్నపేటిసెంతూరమ్, బావనా కటుక్కాయ్, మాతులైమణప్పాకు, నెల్లిక్కయ్ లేకియమ్)   సిద్ధ మందుల కలయిక- రక్తహీనతకు లోనైన కౌమార దశలోని బాలికల్లో రక్తవర్ణం (Hemoglobin) స్థాయిని మెరుగుపరచడంతో పాటు పీసీవీ, ఎంసీవీ, ఎంసీహెచ్ (కణస్థాయి హీమోగ్లోబిన్) స్థాయులను చక్కదిద్దగలదని కనుగొన్నారు.

ఈ అధ్యయనంలో భాగంగా 2,648 మంది బాలికలు పాల్గొన్నారు. ఇందులో 45 రోజులపాటు నిర్ణీతంగా కొందరు ఉండాలి. అలా 2,300  మంది ఉన్నారు. కార్యక్రమాన్ని మొదలు పెట్టడానికి ముందు పరిశోధకులు అందరికీ నులిపురుగు చికిత్స చేశారు. ఇందుకోసం కంటైవర్రాల్  చూర్ణాన్ని ఉపయోగించారు. తర్వాత అన్నపేటి సెంతూరమ్, బావనా కటుక్కాయ్, మాటులైమణప్పాకు, నెల్లిక్కాయ్ లేకియమ్ ల తో(ఎబిఎమ్ఎన్) 45 రోజుల పాటు చికిత్స అందించి వారిని పర్యవేక్షణలో ఉంచారు.   

 

ఊపిరిఆడకపోవటం, అలసట, తలతిరగటం, తలనొప్పి, ఆకలి లేకపోవడం, పాలిపోవడం వంటి లక్షణాలనూ, వీటితోపాటు హీమోగ్లోబిన్ స్థాయిలను, ఇతర జీవ రసాయినిక స్థాయిలనూ- చికిత్సకు ముందూ, చికిత్స తర్వాతా పరిశీలించారు.   

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఒ) మార్గదర్శకాల శరీరంలో హీమోగ్లోబిన్ కనీసం 11.9 ఎమ్‌జి/డిఎల్ (ఒక్కో డెసి లీటరుకు మిల్లీ గ్రాముల)గా ఉండాలి. ఇది 8.0 ఎమ్‌జి/డిఎల్ కన్నా పడిపోతే దానిని తీవ్రమైన రక్తహీనతగానూ,  8.0 నుండి 10.9 ఎమ్‌జి/డిఎల్ గా ఉంటే దానిని మధ్యేమార్గంగాను, 11.0 నుంచి 11.9 ఎమ్‌జి/డిఎల్ మధ్య ఉన్నప్పుడు దానిని  స్వల్పంగాను లెక్కగట్టారు.

ఎంపిక చేసిన ఓ 283 మంది బాలికల్లో హీమోగ్లోబిన్, పీసీవీ, ఎంసీవీ, ఎమ్‌సిహెచ్, ఎర్ర రక్తకణాలు (ఆర్‌బిసి), ప్లేట్‌లెట్లు, తెల్ల రక్తకణాలు (డబ్ల్యుబిసి), న్యూట్రోఫిల్స్, లింఫోసైట్స్, ఈసినోఫిల్స్- ఎంత ఉన్నదీ చూడడానికి ప్రయోగశాల స్థాయి పరిశోధనను చేపట్టినట్లు అధ్యయనం తెలిపింది.  ఎబిఎమ్ఎన్ ను వాడినందువల్ల అది అలసట, ఆయాసం, జుత్తు రాలడం, తలనొప్పి, ఆసక్తి లోపించడం, రుతుపరమైన అపక్రమం వంటి రక్తహీన సంబంధి రోగచికిత్స లక్షణాలను చెప్పుకోదగినంత మేరకు తగ్గించడంతో పాటు ఆ బాలికలందరిలో హీమోగ్లోబిన్ స్థాయి, పీసీవీ, ఎమ్‌సీవీ, ఎంసీహెచ్ లు గణనీయంగా మెరుగుపడినట్లు పరిశోధకులు గుర్తించారు.

ఈ అధ్యయనం నివేదికను రూపొందించిన సీనియర్ రచయితలలో ఒకరైన సిద్ధ జాతీయ సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఆర్. మీనాకుమారి అధ్యయనంలో కనుగొన్న అంశాల ప్రభావాన్ని, ప్రాముఖ్యాన్ని గురించి వివరిస్తూ, ‘‘ఆయుష్ మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న సార్వజనిక ఆరోగ్య కార్యక్రమాలలో సిద్ధ వైద్యం చెప్పుకోదగిన పాత్రను పోషిస్తోంది.  యవ్వన (కౌమార) దశలో ఉన్న బాలికల్లో చైతన్యాన్ని తీసుకుని రావడం, పోషణ సంబంధిత సూచనలు-సలహాలు ఇవ్వడం, ముందు జాగ్రతగా అందించిన సంరక్షణ, సిద్ధ ఔషధాల ద్వారా అందించిన చికిత్స అనీమియా రోగులకు చికిత్సపరమైన ప్రయోజనాలను అందించింది. ఈ కారణంగా సిద్ధ మందులు వివిధ స్థితిగతుల్లో ఖర్చు తక్కువగా ఉండేటటువంటి, సులభ ఉపచారాన్ని అందించి సార్వజనిక ఆరోగ్య సంరక్షణలో తోడ్పడగలుగుతాయి’’ అని పేర్కొన్నారు.

 

***


(Release ID: 2053507) Visitor Counter : 81