రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

రాష్ట్రపతితో అబుధాబి యువరాజు సమావేశం

Posted On: 09 SEP 2024 6:04PM by PIB Hyderabad

   అబుధాబి యువరాజు షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఈరోజు రాష్ట్రపతి భవన్‌లో  రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ముతో సమావేశమయ్యారు.
   యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) నాయకత్వ మూడోతరం ప్రముఖుడిని రాష్ట్రపతి భ‌వ‌న్‌కు స్వాగతించడం తనకెంతో సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ఆమె అన్నారు. భారత్-‘యుఎఇ‘ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి అనుగుణంగా సుదీర్ఘ ఉన్నత స్థాయి స్నేహ సంబంధాల సంప్రదాయానికి ఇదొక కొనసాగింపుగా ఆమె పేర్కొన్నారు.
   రెండు దేశాల్లోని దార్శనిక నాయకత్వం కృషి ఫలితంగా చారిత్రక ద్వైపాక్షిక సంబంధాల్లో దశాబ్ద కాలం నుంచీ ప్రగతిశీల మార్పు సాధ్యమైందని రాష్ట్రపతి అన్నారు. ఈ నేపథ్యంలో యువరాజు పర్యటన సందర్భంగా వివిధ రంగాల్లో సహకారం దిశగా అనేక ఒప్పందాలతో ఈ భాగస్వామ్యం మరింత విస్తరించనుండటంపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు.
   ‘యుఎఇ’లో 35 లక్షల మందికిపైగా భారత పౌరులు నివసిస్తున్నారని, ప్రజల మధ్య పరస్పర సంబంధాలే రెండుదేశాల స్నేహ బంధానికి పునాది అని రాష్ట్రపతి పేర్కొన్నారు. అంతేకాకుండా భారత పౌరుల క్షేమంపై... ముఖ్యంగా సంక్లిష్ట కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారంటూ ‘యుఎఇ’ నాయకత్వాన్ని ఆమె అభినందించారు.
   రెండు దేశాల్లోనూ మతాలు, సంప్రదాయాలు కలగలసిన బహుళ సాంస్కృతిక వారసత్వంగల సమాజాలు పరిఢవిల్లాయని వారిద్దరూ అభిప్రాయపడ్డారు. అలాగే  మహాత్మా గాంధీ, మాననీయ షేక్ జాయెద్ చూపిన శాంతి, సహనం, సామరస్యపూరిత మార్గం మన ఉమ్మడి జాతీయతా భావనలో ఎంతో లోతుగా పాతుకుపోయిందన్నారు.
   ఎమిరేట్ సమాజంలోని అంశాలన్నిటా మహిళల భాగస్వామ్యం, పాత్ర అత్యధిక స్థాయిలో ఉండటంపై రాష్ట్రపతి హర్షం వెలిబుచ్చారు. ‘‘మహిళల సారథ్యంలో ప్రగతి’’ సూత్రం సామాజిక-ఆర్థిక సర్వతోముఖాభివృద్ధిలో ప్రభావశీల ఫలితాలివ్వగలదని మన రెండు దేశాలూ రుజువు చేశాయని ఆమె వ్యాఖ్యానించారు.

 

****


(Release ID: 2053295) Visitor Counter : 62