యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
పారా అథ్లెట్ల విజయాలపై డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రశంసలు క్రీడల వేదికగా వికసిత్ భారత్
పారిస్ పారాలింపిక్స్ లో పతకాలు సాధించిన ఆరుగురిని సన్మానించిన కేంద్ర మంత్రి
Posted On:
07 SEP 2024 6:06PM by PIB Hyderabad
విజేతలుగా స్వదేశానికి తిరిగి వచ్చిన పారా షూటింగ్ బృందాన్ని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడలు, కార్మిక, ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ.. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ సహాయ మంత్రి శ్రీమతి రక్షా ఖడ్సే సంయుక్తంగా సన్మానించారు. పారిస్‌లో అవని లేఖరా (స్వర్ణం), మనీష్ నర్వాల్ (రజతం), రుబీనా ఫ్రాన్సిస్ (కాంస్యం), మోనా అగర్వాల్ (కాంస్యం) మొత్తం 4 పతకాలు సాధించారు.
అథ్లెట్లను ఉద్దేశించి డాక్టర్ మాండవీయ మాట్లాడుతూ.. ఆటగాళ్లు, వారి కోచ్‌లు, సహాయక సిబ్బందిని అభినందించారు. 'మీరు ఆడినప్పుడు, మీరు కేవలం మీ కోసం విజయాన్ని సాధించడమే కాకుండా, మీ కోచ్‌లకు, మీ తల్లిదండ్రులకు, మొత్తం దేశానికి గర్వకారణంగా నిలిచారు. మన 84 మంది పారా అథ్లెట్లు పారిస్ బయలుదేరే ముందు ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. కొందరు పతకాలతో తిరిగి రాగా, మరికొందరు విలువైన అనుభవాన్ని సాధించారు. ఈ అనుభవాలను ఆసరాగా చేసుకుని ఎల్లప్పుడూ బంగారు పతకమే లక్ష్యంగా దృఢ సంకల్పంతో ముందుకు సాగుదాం.” అని ఆయన వ్యాఖ్యానించారు.
దేశ ప్రగతికి మూలస్తంభంగా క్రీడలను అభివృద్ధి చేయటానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. ‘‘స్వాతంత్య్రం వచ్చి 2017 నాటికి 100 ఏళ్లు పూర్తి అవుతుంది. ఆ నాటికి 'వికసిత్ భారత్' దార్శనికతను సాకారం చేసేందుకు రాబోయే పోటీల్లో మంచి ప్రదర్శనను కొనసాగించాలి. క్రీడాకారులందరికీ అంతర్జాతీయ స్థాయి శిక్షణ అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది’’ అని చెబుతూ అథ్లెట్‌లు, కోచ్‌లకు అండగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు.
మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్‍హెచ్ 1 పోటీలో అవని లేఖరా 249.7 పాయింట్లతో కొత్త పారాలింపిక్ రికార్డు(పీఆర్)ను సృష్టించి స్వర్ణ పతకం గెలుచుకుంది. 2020 టోక్యోలో గెలిచిన తన టైటిల్‌ను కూడా కాపాడుకుంది. పారాలింపిక్స్ లేదా ఒలింపిక్స్ లో రెండుసార్లు స్వర్ణ పతకం సాధించిన ఏకైక భారత మహిళా అథ్లెట్‌గా రికార్డు సృష్టించింది.
సన్మానించిన వారిలో పారా ఆర్చర్ రాకేశ్ కుమార్, పారా అథ్లెట్ ప్రణవ్ సూర్మా కూడా ఉన్నారు. మిక్స్ డ్ టీం కాంపౌండ్ ఆర్చరీ పోటీలో శీతల్ దేవితో కలిసి రాకేష్ కాంస్య పతకం సాధించాడు. పారాలింపిక్స్ లో కాంపౌండ్ ఆర్చరీలో భారత్‌కు తొలి పతకం ఇది. 39 ఏళ్ల రాకేష్ వ్యక్తిగత విభాగంలో నాలుగో స్థానంలో నిలిచాడు. కేవలం 1 పాయింట్ తేడాతో కాంస్య పతకాన్ని చేజార్చుకున్నాడు.
పురుషుల క్లబ్ త్రో ఎఫ్51 పోటీలో రజత పతకం సాధించిన ప్రణవ్ అదే ఈవెంట్లో స్వర్ణ పతకం సాధించిన సహచరుడు ధరంబీర్‌తో కలిసి పోడియం పంచుకున్నాడు.
08.09.2024 రోజు పోటీలు ముగిసే సమయానికి భారత్ మొత్తం 27 పతకాలు (6 స్వర్ణాలు, 9 రజతాలు, 12 కాంస్యాలు) గెలుచుకుంది. టోక్యో 2020 రజత పతక విజేత ప్రవీణ్ కుమార్ పురుషుల హైజంప్ - టీ64 పోటీలో 2.08 మీటర్ల వ్యక్తిగత ఉత్తమ జంప్‌తో బంగారు పతకం సాధించటమే కాకుండా ఆసియా రికార్డు(ఏరియా రికార్డు)ను సృష్టించాడు.
ఖేలో ఇండియా అథ్లెట్, పారాలింపిక్స్ అరంగేట్ర ఆటగాడు హొకాటో సెమా పురుషుల షాట్ పుట్ - ఎఫ్57 పోటీలో 14.65 మీటర్ల వ్యక్తిగత ఉత్తమ త్రోతో కాంస్య పతకం గెలుచుకున్నాడు. 40 ఏళ్ల వయస్సులో పతకం సాధించటంతో పారాలింపిక్స్ లో పతకం సాధించిన పెద్ద వయసు భారతీయుడిగా రికార్డు సృష్టించాడు.
****
(Release ID: 2053010)
Visitor Counter : 45