ప్రధాన మంత్రి కార్యాలయం
సింగపూర్ ప్రధానితో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమావేశం
Posted On:
05 SEP 2024 10:22AM by PIB Hyderabad
సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు (గురువారం) సమావేశమయ్యారు. లారెన్స్ వాంగ్ పార్లమెంటు భవనం వద్ద ప్రధాన మంత్రికి సంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు.
భారత్ -సింగపూర్ ద్వైపాక్షిక సంబంధాలలో చోటుచేసుకొన్న పురోగతిని నేతలు ఇద్దరూ వారు జరిపిన చర్చలలో భాగంగా సమీక్షించారు. ద్వైపాక్షిక చర్చలలో మరింత విస్తృతికి అవకాశాలు అపారంగా ఉన్నాయని, ఈ సంబంధాన్ని ఒక సంపూర్ణ వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి తీసుకెళ్లాలని వారు నిర్ణయించారు. ఇది భారత్ అనుసరిస్తున్న ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’కి సైతం పెను ప్రోత్సాహాన్ని ఇవ్వనుంది. ఆర్థిక సంబంధాలలో బలమైన పురోగతిని నేతలు లెక్కలోకి తీసుకొని, రెండు దేశాల మధ్య వ్యాపారాన్ని, పెట్టుబడులను మరింతగా పెంచుకొందామంటూ పిలుపునిచ్చారు. భారత్ లో దాదాపు 160 బిలియన్ డాలర్ల మేరకు సింగపూర్ పెట్టుబడి పెట్టి భారత్ కు ఒక ప్రముఖ ఆర్థిక భాగస్వామ్య దేశంగా ఉన్న విషయాన్ని ప్రధాన మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. భారతదేశంలో వేగంగా చోటుచేసుకొంటున్న నిలకడతో కూడిన వృద్ధి సింగపూర్ వ్యాపార సంస్థలకు పెట్టుబడులు పెట్టడానికి గొప్ప అవకాశాలను ప్రసాదించిందని కూడా ఆయన అన్నారు. రక్షణ, భద్రత, సముద్ర సంబంధిత సహకారం, విద్య, కృత్రిమ మేధ (ఎఐ), ఫిన్‌టెక్, సరికొత్తగా ఉనికిలోకి వస్తున్న సాంకేతిక విజ్ఞాన ప్రధాన రంగాలు, విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక విజ్ఞానం వంటి రంగాలలో ఇప్పటికే కొనసాగుతున్న సహకారాన్ని కూడా వారు సమీక్షించారు. ఉభయ దేశాల ఆర్థిక బంధాలను, రెండు దేశాల ప్రజల మధ్య గల పరస్పర సంబంధాలను ఇప్పటి కన్నా మరింత పెంపొందింపచేసుకోవడానికి ఈ రెండు దేశాల మధ్య సంధానాన్ని పటిష్ట పరచవలసిన అవసరం ఉందని ఇద్దరు నేతలు పేర్కొన్నారు. గ్రీన్ కారిడార్ ప్రాజెక్టులను వేగవంతం చేయాలని కూడా వారు అభిప్రాయపడ్డారు.
సింగపూర్ లో కిందటి నెలలో నిర్వహించిన భారత్ - సింగపూర్ మంత్రిత్వ శాఖల రౌండ్ టేబుల్ సమావేశంలో చేసిన తీర్మానాల పైన కూడా ఇద్దరు నేతలు చర్చించారు. మంత్రిత్వశాఖల సంబంధిత రౌండ్ టేబుల్ సమావేశం అనేది ఒక విశిష్ట యంత్రాంగమని నేతలు అభిప్రాయపడుతూ, ద్వైపాక్షిక సహకారానికి ఒక కొత్త కార్యక్రమాల పట్టికను సిద్ధం చేయడంలోను, దానిని గురించి చర్చోపచర్చలు చేయడంలోను రెండు పక్షాల సీనియర్ మంత్రులు తీసుకొన్న చొరవను ప్రశంసించారు. మంత్రిత్వ శాఖల సంబంధిత రౌండ్ టేబుల్ సమావేశాల్లో గుర్తించిన అడ్వాన్స్‌డ్ మాన్యుఫాక్చరింగ్, సంధానం, డిజిటలీకరణ, ఆరోగ్య సంరక్షణ - మందులు, నైపుణ్యాభివృద్ధి, ఇంకా స్థిరత్వం మొదలైన సహకార ప్రధాన రంగాలలో మరింత త్వరిత కార్యాచరణకు నేతలు పిలుపునిచ్చారు. ఈ రంగాలలో ప్రత్యేకించి, సెమికండక్టర్స్ రంగంలో, కీలకమైన, సరికొత్తగా ఉనికిలోకి వస్తున్న సాంకేతికతల రంగంలోను సహకారం, ద్వైపాక్షిక సంబంధాలలో ఒక కొత్త అధ్యాయానికి దారి తీసి, తద్వారా మన సంబంధాలను భవిష్యత్తు అవసరాలకు తగినట్లుగా తీర్చిదిద్దుతాయని నేతలు స్పష్టం చేశారు.
ద్వైపాక్షిక సంబంధాలకు 60 ఏళ్ళు అవుతున్న సందర్భంగా సంబంధిత వార్షికోత్సవాన్ని 2025లో నిర్వహించాలనే అంశం కూడా నేతల చర్చలో ప్రస్తావనకు వచ్చింది. రెండు దేశాల మధ్య పెనవేసుకున్న సాంస్కృతిక బంధం ఈ సంబంధాలలో ఒక ముఖ్య భాగంగా ఉందని ప్రధాని ప్రముఖంగా ప్రస్తావిస్తూ, భారతదేశం తొలి తిరువళ్ళువార్ సాంస్కృతిక కేంద్రాన్ని సింగపూర్ లో ఏర్పాటు చేయనుందని ప్రకటించారు. భారత్- ఆసియాన్ సంబంధాలు, ఇండో-పసిఫిక్ ప్రాంతానికి సంబంధించి భారత్ దార్శనికతలు సహా పరస్పర ప్రయోజనాలు ముడిపడ్డ ప్రాంతీయ అంశాల పైన, ప్రపంచ అంశాల పైన సైతం నేతలు వారి ఆలోచనలను ఒకరికి మరొకరు తెలియజెప్పుకొన్నారు.
సెమికండక్టర్లు, డిజిటల్ సాంకేతికతలు, నైపుణ్యాభివృద్ధి, ఇంకా ఆరోగ్య సంరక్షణ రంగాలలో సహకారానికి ఉద్దేశించిన అవగాహనపూర్వక ఒప్పందం (ఎంఒయు) సంబంధిత పత్రాలను నేతలు ఇద్దరి సమక్షంలో ఉభయ పక్షాల ప్రతినిధులు ఒకరికి మరొకరు ఇచ్చి పుచ్చుకొన్నారు. ఇవి ఇంతవరకు భారత్- సింగపూర్ మంత్రిత్వ శాఖల సంబంధిత రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగినప్పునడు చోటుచేసుకొన్న చర్చల తాలూకు ఫలితాలు కావడం గమనించదగ్గది. సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ ను భారతదేశాన్ని సందర్శించవలసిందంటూ ప్రధాన మంత్రి ఆహ్వానించారు. ఈ ఆహ్వానానికి లారెన్స్ వాంగ్ అంగీకారాన్ని తెలిపారు.
***
(Release ID: 2052192)
Visitor Counter : 83
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam