యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
పారా బ్యాడ్మింటన్ బృందానికి సన్మానం... అసాధారణ పనితీరు కనబరిచిన అథ్లెట్లకు డాక్టర్ మాన్ సుఖ్ మాండవీయ ప్రశంసలు
\
సెప్టెంబర్ 3కి 20 పతకాలతో టోక్యో పారాలింపిక్స్ విజయాలను అధిగమించిన భారత్
పారా బ్యాడ్మింటన్‌లో ఐదు పతకాలతో భారత్ అత్యుత్తమ ప్రదర్శన
Posted On:
04 SEP 2024 5:03PM by PIB Hyderabad
భారత్‌కు తిరిగి వచ్చిన పారా బ్యాడ్మింటన్ క్రీడాకారులను దిల్లీలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడలు, కార్మిక, ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మాన్ సుఖ్ మాండవీయ సన్మానించారు. పారా బ్యాడ్మింటన్‌లో భారత్ అత్యుత్తమ ప్రదర్శనను ప్రస్తుతం జరుగుతోన్న పారిస్ పారా ఒలింపిక్స్‌లో కనబరిచింది. ఈ పోటీల్లో బాడ్మింటన్‌లో 5 పతకాలు (1 స్వర్ణం, 2 రజతాలు, 2 కాంస్యాలు) భారత్ గెలుచుకుంది.
ఈ సందర్భంగా మాట్లాడిన డాక్టర్ మాండవీయ అథ్లెట్ల విజయం చాలా గర్వం కలిగిస్తోందని అన్నారు. 'మీరు మీ అద్భుతమైన ప్రదర్శనతో యావత్ దేశం గర్వపడేలా చేశారు. మీ అంకితభావం, స్ఫూర్తి భారత క్రీడలకు కొత్త మైలురాళ్లను నెలకొల్పాయి’ అని అన్నారు.
పతకాలు కొద్దిలో చేజార్చుకున్న అథ్లెట్ల ప్రోత్సహిస్తూ మాట్లాడారు. "మనం పతకాలు పొందలేదు, మనం అమూల్యమైన అనుభవాన్ని సాధించాం" అని అన్నారు. భవిష్యత్ పారాలింపిక్స్‌లో దేశ పతకాల సంఖ్య మరింత పెరుగుతుందని, ప్రతి ఒక్కరూ విజేతలుగా నిలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.
అంతర్జాతీయ స్థాయి క్రీడా కార్యక్రమాల్లో దేశ పురోగతిని గురించి ప్రస్తావిస్తూ.. గత దశాబ్దంలో ఒలింపిక్స్, పారాలింపిక్స్ రెండింటిలోనూ భారత్ మెరుగైన పనితీరును ఆయన ప్రధానంగా పేర్కొన్నారు. "గత పదేళ్లుగా మన పనితీరును నిరంతరం మెరుగుపరుచుకున్నామని, ప్రపంచ వేదికపై మన సత్తాను నిరూపించుకున్నాం" అని అన్నారు.
పారా అథ్లెట్లకు మెరుగైన సౌకర్యాలు, శిక్షణ, అత్యున్నత స్థాయిలో రాణించేందుకు అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. నిరంతరం మద్దతు ఉంటుందని, భవిష్యత్తులో జరిగే పోటీల్లో మరింత ఉన్నత లక్ష్యాలు సాధించాలని ఆయన వారిని ప్రోత్సహించారు.
నితేష్ కుమార్ (స్వర్ణం), సుహాస్ ఎల్‌వై(రజతం), తులసీమతి మురుగేశన్ (రజతం), నిత్య శ్రీ (కాంస్యం), మనీషా రామదాస్ (కాంస్యం) పతకాలు సాధించారు.
టోక్యో పారాలింపిక్స్‌లో గతంలో సాధించిన 19 పతకాల సంఖ్యను అధిగమించి సెప్టెంబర్ 03కి భారత్ మొత్తం 20 పతకాలు సాధించింది.
పారిస్ పారాలింపిక్స్‌లో పాల్గొన్న 13 మంది పారా షట్లర్ల కోసం భారత ప్రభుత్వం మొత్తం 19 విదేశీ పర్యటనలను నిర్వహించింది.
****
(Release ID: 2052095)
Visitor Counter : 38