హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పద్మ పురస్కారాల నామినేషన్ల స్వీకరణకు గడువు 15

Posted On: 03 SEP 2024 2:48PM by PIB Hyderabad

వచ్చే గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించబోయే పద్మ పురస్కారాల కోసం నామినేషన్లు/సిఫార్సులను ఈ నెల 15 వరకూ సమర్పించవచ్చు. మే 1న ఈ ప్రక్రియ మొదలైంది. పద్మ పురస్కారాల కోసం నామినేషన్లు/ సిఫార్సులను రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ (https://awards.gov.in) ద్వారా ఆన్లైన్ లో మాత్రమే స్వీకరిస్తారు.

పద్మ పురస్కారాలు - పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటి. 1954 నుంచి ఏటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా వీటిని ప్రకటిస్తున్నారు. కళలు, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సామాజిక సేవ, వైజ్ఞానిక రంగం, ఇంజినీరింగ్, ప్రజా వ్యవహారాలు, వాణిజ్యం, పరిశ్రమ వంటి అన్ని రంగాల్లో విజయాలు/ విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారాలు ప్రదానం చేస్తారు. జాతి, వృత్తి, హోదా లేదా లింగ భేదాలకు అతీతంగా అందరూ ఈ పురస్కారాలకు అర్హులే. వైద్యులు, శాస్త్రవేత్తలు మినహా ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు పద్మ పురస్కారాలకు అనర్హులు.

పద్మ పురస్కారాల్లో ‘ప్రజా పద్మాలు’గా పరివర్తన తేవడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇతర వ్యక్తులను నామినేట్/సిఫార్సు చేయడంతో పాటు స్వీయ నామినేషన్లకు కూడా అవకాశముంది. పురస్కారాలకు అర్హులైన మహిళలు, బడుగు, బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీలు, దివ్యాంగులు, సమాజానికి నిస్వార్థ సేవలందిస్తున్న ప్రతిభావంతులను గుర్తించడానికి సమష్టి కృషి అవసరం.

పోర్టల్ లోని నిర్దేశిత ఫార్మాట్ లో పేర్కొన్న అన్ని వివరాలూ నామినేషన్లు/సిఫార్సులలో ఉండాలి. నిర్దిష్ట రంగంలో వారి విశిష్ట సేవలు/ విజయాలను స్పష్టంగా తెలిపే కథన రూప వివరణ (గరిష్టంగా 800 పదాలు) కూడా అందులో ఉండాలి.

దీనికి సంబంధించిన వివరాలు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (https://mha.gov.in) వెబ్సైట్లో ‘పురస్కారాలు, పతకాలు’ శీర్షికన,  పద్మ పురస్కారాల పోర్టల్ (https://padmaawards.gov.in)లో అందుబాటులో ఉన్నాయి. ఈ పురస్కారాలకు సంబంధించిన నియమాలు, నిబంధనలు https://padmaawards.gov.in/AboutAwards.aspx లో వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. 

 

***


(Release ID: 2051555) Visitor Counter : 50