మంత్రిమండలి
సనంద్ లో మరో సెమీ కండక్టర్ పరిశ్రమకు మంత్రివర్గం ఆమోదం
పురోగతిలో దేశీయ సెమీ కండక్టర్ తయారీ వ్యవస్థ
Posted On:
02 SEP 2024 3:32PM by PIB Hyderabad
సెమీ కండక్టర్ పరిశ్రమల్ని ప్రోత్సహించే ధ్యేయంతో, గుజరాత్ లోని సనంద్ లో ఒక సెమీ కండక్టర్ పరిశ్రమను ఏర్పాటు చేయడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదించింది. గుజరాత్ లోని సనంద్ లో ఈ పరిశ్రమను ఏర్పాటు చేయడానికి కెయిన్స్ సెమికన్ అనే ప్రైవేటు కంపెనీ ముందుకు వచ్చింది. ప్రతిపాదిత యూనిట్‌ను రూ.3,300 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్నారు. ఈ యూనిట్ లో రోజుకు 60 లక్షల చిప్‌లు ఉత్పత్తి కానున్నాయి.
ఈ యూనిట్ లో ఉత్పత్తి చేసే చిప్‌లను పారిశ్రమిక, ఆటోమొబైల్, విద్యుత్తు వాహనాలు, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, టెలికమ్, మొబైల్ ఫోన్లు వంటి రంగాల్లో ఉపయోగిస్తారు. భారతదేశంలో ప్రోగ్రామ్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ సెమికండక్టర్స్ అండ్ డిస్‌ప్లే మాన్యుఫాక్చరింగ్ వ్యవస్థను మొత్తం రూ.76,000 కోట్ల వ్యయంతో కల్పించనున్నట్లు 2021 డిసెంబరు 21న ప్రకటించారు.
గుజరాత్ లోని సనంద్ లో ఒక సెమీకండక్టర్ పరిశ్రమను స్థాపించాలన్న మొదటి ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం 2023 జూన్ లోనే తన ఆమోదాన్ని తెలిపింది. మరో మూడు సెమీ కండక్టర్ పరిశ్రమలకు ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఆమోద ముద్ర వేశారు. గుజరాత్ లోని ధోలేరాలో టాటా ఎలక్ట్రానిక్స్ ఒక సెమీకండక్టర్ ఫాబ్ పరిశ్రమను ఏర్పాటు చేస్తుండగా, అస్సాంలోని మోరిగావ్ లో మరొక పరిశ్రమ వస్తోంది. గుజరాత్ సనంద్ లోనే సీజీ పవర్ అనే కంపెనీ సెమీ కండక్టర్ పరిశ్రమను ఏర్పాటు చేస్తోంది.
మొత్తం నాలుగు సెమీ కండక్టర్ పరిశ్రమల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఆయా పరిశ్రమల చుట్టూ అనుబంధ రంగాల వ్యవస్థ కూడా ఏర్పాటవుతున్నది. ఈ నాలుగు యూనిట్లు దాదాపు రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడిని తీసుకు వస్తాయి. ఇవన్నీ పని ప్రారంభిస్తే, రోజుకు సుమారు 7 కోట్ల చిప్ లు తయారవుతాయి.
***
(Release ID: 2051011)
Visitor Counter : 180
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Hindi_MP
,
Nepali
,
Bengali-TR
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam