రైల్వే మంత్రిత్వ శాఖ
రైల్వే బోర్డు చైర్మన్, ముఖ్య కార్యనిర్వహణాధికారిగా శ్రీ సతీశ్ కమార్
प्रविष्टि तिथि:
01 SEP 2024 5:42PM by PIB Hyderabad
రైల్వే బోర్డు (రైల్వే మంత్రిత్వశాఖ) చైర్మన్, ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో)గా శ్రీ సతీశ్ కుమార్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. రైల్వే బోర్డు చైర్మన్, సీఈవోగా సతీశ్ కుమార్ నియామకానికి కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది.
భారత రైల్వే మెకానికల్ ఇంజినీర్ సేవల (ఐఆర్ఎస్ఎంఈ) విభాగం 1986 బ్యాచ్ కు చెందిన శ్రీ సతీశ్ కుమార్ విలక్షణమైన అధికారిగా గుర్తింపు పొందారు. 34 ఏళ్లకు పైబడిన తన వృత్తి జీవితంలో భారత రైల్వేలకు గణనీయమైన సేవలందించారు. 2022 నవంబరు 8న ప్రయాగరాజ్ లోని ఉత్తర మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గా బాధ్యతలు స్వీకరించి, ప్రజాసేవా ప్రస్థానంలో మరో ఉన్నతస్థాయిని చేరుకున్నారు. ఆయన వృత్తిపరమైన విజయాల మాదిరిగానే, విద్యా నేపథ్యం కూడా ఆకట్టుకునేలా ఉంటుంది. జైపూర్ లోని ప్రతిష్ఠాత్మక మాలవీయ నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఎన్ ఐటీ) నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ లో బీటెక్ పట్టా పొందారు. ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) నుంచి కార్య నిర్వహణ – సైబర్ చట్టాలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమాతో తన పరిజ్ఞానాన్ని మరింత పెంచుకున్నారు.
భారతీయ రైల్వేలో శ్రీ సతీశ్ కుమార్ వృత్తి జీవితం 1988 మార్చిలో ప్రారంభమైంది. అప్పటి నుంచి వివిధ జోన్లు, డివిజన్లలో పలు కీలక పాత్రల్లో సేవలందించారు. రైల్వే వ్యవస్థలో ఆవిష్కరణలు, సమర్థత, భద్రత చర్యలను మెరుగుపరిచారు. గతంలో ఉన్న మధ్య రైల్వేకు చెందిన ఝాన్సీ డివిజన్, వారణాశిలోని డీజిల్ లోకోమోటివ్ వర్క్స్ (డీఎల్ డబ్ల్యూ)లో ఆయనకు మొదట పోస్టింగులు లభించాయి. అక్కడ ఆయన లోకోమోటివ్ ఇంజినీరింగ్, నిర్వహణలో నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. అనంతరం గోరఖ్ పూర్ ఈశాన్య రైల్వేలో, పాటియాలా లోకోమోటివ్ వర్క్స్ లో పనిచేశారు. ఈ విభాగాల నిర్వహణ సామర్థ్యాన్ని పెంచే కీలకమైన ప్రాజెక్టుల్లో ఆయన సహకారం ఉంది.
సంపూర్ణ నాణ్యతా నిర్వహణ (టీక్యూఎం)పై అంకితభావం శ్రీ కుమార్ వృత్తి జీవితంలో చెప్పుకోదగిన అంశాల్లో ఒకటి. 1996లో ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్ డీపీ) ద్వారా టీక్యూఎంలో ఆయన ప్రత్యేక శిక్షణ పొందారు. నిరంతర మెరుగుదల, అత్యున్నత నాణ్యత ప్రమాణాలకు కట్టుబడి ఉండేలా రైల్వే నిర్వహణ విధానాల రూపకల్పనలో ఈ శిక్షణ చాలా ఉపయోగపడింది. ఆయన చేపట్టిన వివిధ ప్రాజెక్టుల్లో టీక్యూఎం సూత్రాల ప్రయోగం స్పష్టంగా కనిపించింది. రైల్వే వ్యవహారాల భద్రత, విశ్వసనీయతలో గణనీయమైన పురోగతికి ఇది తోడ్పడింది.
పొగమంచు పరిస్థితుల్లో రైలు నిర్వహణ సురక్షితంగా జరగడానికి కీలకమైన ఆవిష్కరణ ‘పొగమంచు రక్షిత పరికరం (ఫాగ్ సేఫ్ డివైజ్)’ శ్రీ సతీశ్ కుమార్ విశేష కృషి ఫలితం. శీతాకాలంలో, ముఖ్యంగా దేశ ఉత్తర ప్రాంతాలలో పొంచి ఉన్న ప్రమాదాలను గణనీయంగా తగ్గించడంలో ఈ పరికరం కీలక పాత్ర పోషించింది. ఈ సాంకేతికతను మెరుగుపరచడంలో ఆయన కృషికి వివిధ వర్గాల నుంచి గుర్తింపు, ప్రశంసలు లభించాయి.
***
(रिलीज़ आईडी: 2050868)
आगंतुक पटल : 138