ఆర్థిక మంత్రిత్వ శాఖ
ల్యాండ్ కస్టమ్స్ స్టేషన్ల (LCS) పనితీరుపై సిబిఐసి (CBIC) 4వ జాతీయ సదస్సు నిర్వహణ
అంతర్జాతీయ వాణిజ్యం, కార్గో రవాణాను మరింత సులభతరం చేయాలనే లక్ష్యంతో, సదస్సు నిర్వహణ.
భారతదేశం ల్యాండ్ కస్టమ్స్ స్టేషన్లు, ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్‌లలో కార్యకలాపాలను మెరుగుపరచడంపై రెండు రోజుల సదస్సు.
పరస్పర సహకారంతో వ్యూహాలను రూపొందించాలనే లక్ష్యంతో సదస్సు నిర్వహణ.
'బ్రిడ్జింగ్ బోర్డర్స్ & కనెక్టింగ్ నేషన్స్: ఇండియాస్ ల్యాండ్ కస్టమ్స్ స్టేషన్స్' అనే బుక్‌లెట్‌ను ఆవిష్కరించిన రెవెన్యూ కార్యదర్శి శ్రీ సంజయ్ మల్హోత్రా
Posted On:
30 AUG 2024 4:18PM by PIB Hyderabad
పరోక్ష పన్నులు, సుంకాల (CBIC) కేంద్ర బోర్డు ఆధ్వర్యంలో ల్యాండ్ కస్టమ్స్ స్టేషన్ల (LCS) పనితీరుపై 4వ జాతీయ సదస్సును 2024 ఆగస్టు 28 , 29 తేదీలలో న్యూఢిల్లీలో నిర్వహించారు. ఈ రెండు రోజుల సదస్సును రెవెన్యూ కార్యదర్శి శ్రీ సంజయ్ మల్హోత్రా ప్రారంభించారు. సిబిఐసి ఛైర్మన్ శ్రీ సంజయ్ కుమార్ అగర్వాల్ అధ్యక్షతన సదస్సును నిర్వహించారు. కస్టమ్స్ సభ్యుడు శ్రీ సూర్జిత్ భుజబల్, ఐటీ, పన్ను చెల్లింపుదారుల సేవల సభ్యురాలు శ్రీమతి అరుణా నారాయణ్ గుప్తా, కంప్లయన్స్ మేనేజ్‌మెంట్ సభ్యుడు శ్రీ రాజీవ్ తల్వార్, ల్యాండ్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ శ్రీ ఆదిత్య మిశ్రా తదితరులు ఈ సదస్సులో పాల్గొన్నారు.
భారతదేశ ల్యాండ్ కస్టమ్స్ స్టేషన్లు , ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్‌ల కార్యకలాపాలను మెరుగుపరచడానికి రెండు రోజుల సదస్సు నిర్వహించారు. భారతదేశ పొరుగు దేశాలకు ప్రయాణం చేసేవారికి అందించే సేవలను మెరుగుపరచడానికి , అలాగే ఈ రంగంలో ఎదురవుతున్న ప్రస్తుత సవాళ్లు , భవిష్యత్తు వ్యూహాలగురించి ఈ రంగంలోని కీలకవాటాదారులు చర్చించడానికి వీలుగా ఈ రెండు రోజుల సమావేశం నిర్వహించారు..
ఈ సమావేశంలో వంద మందికి పైగా నిపుణులు, కీలక వాటాదారులు పాల్గొని కింది అంశాలపై కొన్ని ప్రత్యేక సిఫార్సులు చేశారు.
పొరుగు దేశాలతో ఎల్ సీ ఎస్‌ల వద్ద వాణిజ్య, రవాణా సౌకర్యాలు
స్మగ్లింగ్‌ను ఎదుర్కోవడానికి రిస్క్ మేనేజ్‌మెంట్ వ్యూహాలు
స్మగ్లింగ్ వ్యతిరేక కార్యకలాపాలలో ఉత్తమ పద్ధతులు
సరిహద్దు భద్రతను పటిష్టం చేసేందుకు సాంకేతిక పురోగతి
ఏజెన్సీల మధ్య సహకారం , సమాచార భాగస్వామ్యం
సమర్థవంతమైన సరిహద్దు నిర్వహణ కోసం సామర్థ్య నిర్మాణం, శిక్షణ
ఏజెన్సీల మధ్య సమన్వయంతో కూడిన క్రాస్ బోర్డర్ నిర్వహణ, అంతర్ కార్యనిర్వహణ కోసం విధాన సంస్కరణల అవసరం.
ఈ సందర్భంగా 'బ్రిడ్జింగ్ బోర్డర్స్ & కనెక్టింగ్ నేషన్స్: ఇండియాస్ ల్యాండ్ కస్టమ్స్ స్టేషన్స్' అనే బుక్‌లెట్‌ను రెవెన్యూ కార్యదర్శి శ్రీ సంజయ్ మల్హోత్రా ఆవిష్కరించారు. సిబిఐ సి ఛైర్మన్ శ్రీ సంజయ్ కుమార్ అగర్వాల్, ప్రత్యేక కార్యదర్శి, కస్టమ్స్ సభ్యుడు శ్రీ సూర్జిత్ భుజబల్, ప్రత్యేక కార్యదర్శి ఐటీ, పన్ను చెల్లింపుదారుల సేవల సభ్యురాలు శ్రీమతి అరుణా నారాయణ్ గుప్తా సమక్షంలో బుక్ లెట్ ఆవిష్కరణ జరిగింది.
భారతదేశ ల్యాండ్ కస్టమ్స్ స్టేషన్‌ల గురించిన సమగ్ర సమాచారాన్ని ఈ బుక్ లెట్ అందిస్తోంది. వాణిజ్యాన్ని సులభతరం చేయడానికి, ప్రాంతీయ కనెక్టివిటీని మెరుగుపరచడానికి , పొరుగు దేశాలతో సంబంధాలను బలోపేతం చేయడానికి భారతదేశం చేస్తున్న కృషిని ఇది వివరిస్తుంది.
సమావేశం మొదటి రోజున అంతర్ మంత్రిత్వ శాఖల చర్చలపై దృష్టి సారించారు. సిబిఐసి ఫార్మేషన్‌ల అధికారులతో పాటు, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల శాఖ, ల్యాండ్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, వాణిజ్యం, పరిశ్రమల శాఖ, ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, రైల్వే శాఖ, టెక్స్‌టైల్స్ శాఖ, రోడ్డు రవాణా, రహదారుల శాఖ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వ్యవసాయం, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ, మత్స్య శాఖ, పశుసంవర్ధక , పాడి పరిశ్రమ శాఖ, భారత ఆహార భద్రత , ప్రమాణాల అథారిటీ, ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రతినిధులతోపాటు, పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నాయి.
భూటాన్, బంగ్లాదేశ్, నేపాల్‌లపై ప్రత్యేక దృష్టి సారించి పొరుగు దేశాలతో అంతర్జాతీయ సరిహద్దుల వద్ద ల్యాండ్ కస్టమ్స్ స్టేషన్ల కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, వాణిజ్య కార్యకలాపాలను పెంపొందించడంపై ఈ సమావేశ చర్చలు కొనసాగాయి.
అంతర్ మంత్రిత్వశాఖల మధ్యన జరిగిన చర్చలు ఎలాంటి అవాంతరాలు లేని వాణిజ్య వాతావరణాన్ని కల్పించడానికిగాను వివిధ మంత్రిత్వశాఖలు, సంస్థల మధ్య వుండాల్సిన సమన్వయ ప్రయత్నాల ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది.
దక్షిణాసియా ప్రాంతంలో ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలు, నాలెడ్జ్ ప్రాజెక్ట్‌లపై తాజా సమాచారాన్ని ఆయా అంతర్జాతీయ సంస్థలు, మేధో సంస్థలు,వాణిజ్య వ్యాపార సంస్థలు అందించాయి.
ల్యాండ్ కస్టమ్స్ స్టేషన్లలో మౌలిక సదుపాయాల అభివృద్ధి , లాజిస్టిక్స్ సమస్యలు, మానవ వనరుల సమస్యలు, స్మగ్లింగ్ నిరోధక, రిస్క్ మేనేజ్‌మెంట్, డిజిటలీకరణ, ప్రకియ మెరుగుదల, అలాగే జెండర్ మెయిన్ స్ట్రీమింగ్ గురించి రెండవ రోజున చర్చలు జరిగాయి.
పటిష్టమైన అంతర్-విభాగ సమన్వయం, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించడం ఈ సమావేశంలో ఒక ముఖ్య అంశంగా చర్చించారు. భారతదేశ భూ సరిహద్దుల ద్వారా సులభతరమైన , మరింత సమర్థవంతమైన వాణిజ్య కార్యకలాపాలను నిర్వహించడానికి గాను మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, విధానాలను క్రమబద్ధీకరించాల్సిన ప్రాముఖ్యతను సమావేశంలో పాల్గొన్నవారు ప్రత్యేకంగా నొక్కి చెప్పారు.
సంబంధిత వాటాదారులకు కీలకమైన అంశాలను అందించేలా సిబిఐసి ఈ సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించింది. భారతదేశ మొదటి గ్రామాలుగా గుర్తింపు పొందిన భారతదేశ సరిహద్దుల్లో వాణిజ్య నిర్వహణ కోసం సహకారం కీలకం' అనే సందేశంతో ఒక స్పష్టమైన మార్గాన్ని ఈ సమావేశం నిర్దేశించింది. సమావేశం సాధించిన ఫలితాలనేవి
ఎల్ సీ ఎస్ ల సమర్థత ను పెంపొందించడానికి సిబిఐసి కొనసాగిస్తున్న ప్రయత్నాలకు గణనీయంగా దోహదపడతాయని అంచనా వేశారు, భారతదేశ వాణిజ్య నిర్వహణ యంత్రాంగాలు ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా తయారయ్యేలా చేయడానికి సమావేశం కృషి చేసింది.
ల్యాండ్ కస్టమ్స్ స్టేషన్ల పనితీరును మెరుగుపరచడానికి, ఎలాంటి అవాంతరాలు లేని సరిహద్దు వాణిజ్యాన్ని నిర్వహించడానికిగాను కట్టుబడి వున్నామని సిబిఐసి తెలిపింది. సిబిఐసి చేస్తున్న కృషి భారతదేశ ఆర్థిక వృద్ధికి, అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలకు కీలకం.
ఈ ప్రయత్నాలు ప్రాంతీయ వాణిజ్యాన్ని పెంపొందించడానికి, సరిహద్దుల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి, పొరుగు దేశాలతో ఆర్థిక ఏకీకరణను పెంపొందించడమే లక్ష్యంగా చేపట్టిన వికసిత్ భారత్ , 'ఆత్మనిర్భర్ భారత్' వంటి భారతదేశ కార్యక్రమాల లక్ష్యాలకు అనుగుణంగా వున్నాయి.
భారతదేశంలోని ల్యాండ్ కస్టమ్స్ స్టేషన్లు
కస్టమ్స్ చట్టం, 1962 కింద నోటిఫై చేసిన 122 ల్యాండ్ కస్టమ్స్ స్టేషన్లు (LCSలు) భారతదేశంలో ఉన్నాయి. వీటిని భారతదేశ సరిహద్దుల వెంబడి 16 రాష్ట్రాలలో వ్యూహాత్మకంగా ఏర్పాటు చేశారు. భారత్ తో సరిహద్దు కలిగి ఏడు పొరుగు దేశాలతో అంటే ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, చైనా, మయన్మార్, నేపాల్ , పాకిస్తాన్‌లతో వాణిజ్యం కోసం వీటిని ఏర్పాటు చేశారు.
ఈ ఎల్ సీ ఎస్‌లు అంతర్జాతీయ సరిహద్దుల ద్వారా వస్తువుల సరఫరా, వ్యక్తుల ప్రయాణం సాఫీగా జరిగేలా చేస్తాయి.
12 కీలక ప్రదేశాలలో సమీకృత చెక్ పోస్ట్‌లు (ICPలు)ఏర్పాటు చేశారు. ఇవి అట్టారీ రోడ్, అగర్తలా, పెట్రాపోల్, జోగ్బానీ, రక్సాల్, మోరే, డేరా బాబా నాంక్, సుటర్‌కండి, శ్రీమంతపూర్, డాకి, రూపాయిధియా , సబ్‌రూమ్ లలో వున్నాయి. ఇవి కస్టమ్స్ క్లియరెన్స్ సమర్థవంతంగా జరగడంకోసం ఆధునిక మౌలిక సదుపాయాలను, క్రమబద్ధమైన ప్రక్రియలను అందిస్తున్నాయి. అదనంగా, భారతదేశం-బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి నిర్దిష్ట ప్రదేశాలలో 7 బోర్డర్ హాట్‌లను ఏర్పాటు చేశారు. నిర్దేశిత ప్రాంతాలలో వస్తువులను విక్రయించేలా స్థానిక వ్యాపారులను అనుమతించడం ద్వారా స్థానిక వ్యాపారాన్ని ప్రోత్సహించడానికి, సరిహద్దు వర్గాల ఆర్థిక పురోభివృద్ధికి 7 బోర్డర్ హాట్‌లు దోహదపడుతాయి.
సిబిఐసి తన భాగస్వామ్య దేశాలతో ద్వైపాక్షిక, బహుపాక్షిక సంభాషణలలో మెరుగ్గా నిమగ్నమై కస్టమ్స్ విధానాలను సమన్వయం చేస్తోంది. వాణిజ్య నిర్వహణ కోసం అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటు చేస్తోంది. నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ (SWIFT), అధునాతన రిస్క్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, పోస్ట్ క్లియరెన్స్ ఆడిట్, అధీకృత ఆర్థిక ఆపరేటర్ (AEO) ప్రోగ్రామ్, ఎలక్ట్రానిక్ కార్గో ట్రాకింగ్ సిస్టమ్ (ECTS) కింద కార్గో తరలింపు, సరిహద్దుల వెలుపల క్లియరెన్స్‌లను ప్రోత్సహించడం ద్వారా భూ సరిహద్దులవద్ద రద్దీని తగ్గించడం వంటి సంస్థాగత సంస్కరణలు ఆయా ల్యాండ్ కస్టమ్స్ స్టేషన్లలో వ్యాపారాన్ని సులభతరం చేయడాన్ని ప్రోత్సహిస్తున్నాయి.. సిబిఐసి ప్రచురించిన నేషనల్ టైమ్ రిలీజ్ స్టడీ (NTRS) 2024 ప్రకారం, 2023లోని సంబంధిత కాలంతో పోలిస్తే 2024లో ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్‌ల విషయంలో సగటు విడుదల సమయం గణనీయంగా 50 శాతం తగ్గింది.
ఇటీవలి కాలంలో పొరుగు దేశాలతో వాణిజ్యం, రవాణాను ప్రోత్సహించడానికి సిబిఐసి అనేక కార్యక్రమాలు చేపట్టింది, అవి ఇలా వున్నాయి.
గత నెలలో బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం ఎయిర్ కార్గో కాంప్లెక్స్ ద్వారా తృతీయ దేశాలకు బంగ్లాదేశ్ ఎగుమతి కార్గోను రవాణా చేయడానికి సిబిఐసి అనుమతించింది. ఈ ప్రయోజనం కోసం ముందుగా నోటిఫై చేసిన ఢిల్లీ, కొల్‌కతా మొదలైన ఎయిర్ కార్గో కాంప్లెక్స్‌లకు ఈ సేవలు అదనం.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ముర్షిదాబాద్ జిల్లాలోని మైయా ల్యాండ్ కస్టమ్స్ స్టేషన్ ను , బంగ్లాదేశ్‌కు అనుసంధానించే నది మార్గాన్ని కూడా నోటిఫై చేశారు. మైయా నుండి బంగ్లాదేశ్ మీదుగా అస్సాంలోని ధుబ్రి వరకుగల కొత్త జలమార్గం మార్గంవల్ల , కోల్‌కతా గుండా ధుబ్రి వరకు ఉన్న మునుపటి జలమార్గ మార్గంతో పోలిస్తే దాదాపు 930 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది.
గత సంవత్సరం, కస్టమ్స్ చట్టం కింద త్రిపురలోని నిశ్చింత్‌పూర్ రైల్వే స్టేషన్ ను LCSగా నోటిఫై చేశారు. ఇది అగర్తల-అఖౌరా రైల్వే ప్రాజెక్ట్‌లో ఒక భాగం. అంతే కాకుండా ఈశాన్య ప్రాంతం, బంగ్లాదేశ్ మధ్య మొదటి రైల్వే ప్రాజెక్ట్. ఇది ఈ ప్రాంతంలో పర్యాటకం, వాణిజ్యం, ప్రజలమధ్య సంబంధాలను పెంచుతుందని భావిస్తున్నారు.
మే 2023లో త్రిపురలో సబ్రూమ్ ఎల్ సీ ఎస్ కు సంబంధించిన అదనపు మార్గాన్ని సిబిఐసి నోటిఫై చేసింది. ఈ 1.9 కి.మీ పొడవున్న మైత్రి సేతు రహదారి వాణిజ్యం, ప్రజల మధ్య సంబంధాల్లో కొత్త అధ్యాయాన్ని ఆవిష్కరించడానికి సిద్దంగా వుంది. దీనితో సబ్రూమ్ నుండి కేవలం 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ పోర్ట్‌తో వున్న యాక్సెస్‌కారణంగా త్రిపుర 'గేట్‌వే ఆఫ్ నార్త్ ఈస్ట్'గా మారవచ్చు.
మే 2023లో, జోగ్‌బానిలో ఇండియన్ కస్టమ్స్ యార్డ్‌ను సిబిఐసి ప్రారంభించింది. జోగ్‌బానిని నేపాల్‌లోని బిరత్‌నగర్‌కు కలిపే రైలు మార్గాన్ని సిబిఐసి నోటిఫై చేసింది.
రైలు మార్గం ద్వారా సరకు రవాణా అనేది రెండు దేశాల మధ్య ల్యాండ్ కస్టమ్స్ స్టేషన్ల ద్వారా వ్యాపార రీతులను విస్తరించడమే కాకుండా కార్యకలాపాల సామర్థ్యాన్ని, వ్యయ-పోటీని పెంచుతుంది. కోల్‌కతా, హల్దియా ,విశాఖపట్నంలలోని ఇండియన్ గేట్‌వే పోర్ట్‌ల నుండి ఈ మార్గం గుండా నేపాల్‌కు రైలు ద్వారా సరుకుల రవాణాను చేయడం అనేది ఎలక్ట్రానిక్ కార్గో ట్రాకింగ్ సిస్టమ్‌లో ఉంటుంది. ఇది ప్రాసెసింగ్ సమయాన్ని తగ్గిస్తుంది. కార్గో భద్రతను పెంచుతుంది.
ఇటీవల, సిబిఐసి నేతృత్వంలోని అంతర్-మంత్రిత్వ నిపుణుల ప్రతినిధి బృందం భూటాన్‌ను సందర్శించింది. వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న భూటాన్ ఎస్ ఎమ్ ఇ ఎగుమతిదారుల ప్రయోజనాల కోసం నాలుగు వేర్వేరు నగరాల్లో సామర్థ్య-నిర్మాణ వర్క్‌షాప్‌లను నిర్వహించింది. భారతదేశం చూపిన ఈ చొరవను భూటాన్ ప్రభుత్వం హృదయపూర్వకంగా అభినందించింది.
చుట్టూ భూ సరిహద్దులను కలిగి, అభివృద్ధి చెందుతున్న దేశమైన భూటాన్‌కు కనెక్టివిటీని అందించడానికి సిబిఐసి ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని ప్రకటించింది. దీనిద్వారా
అస్సాంలోని జోగిఘోపా, పాండు పోర్ట్‌ల వద్ద ఎంట్రీ/ఎగ్జిట్ పాయింట్‌లతో భారతదేశం ద్వారా నది మార్గంలో భూటాన్ , బంగ్లాదేశ్ మధ్య వస్తువుల రవాణాను అనుమతించడం జరుగుతుంది.
కస్టమ్స్ కెపాసిటీ బిల్డింగ్‌పై 2017లో సంతకం చేసిన SASEC మెమోరాండం ఆఫ్ ఇంటెంట్ కింద NACINలో శిక్షణలను కూడా సిబిఐసి నిర్వహిస్తోంది. పైన తెలిపిన మెమోరాండం ఆఫ్ ఇంటెంట్ క్రింద SASEC దేశాల ప్రతినిధుల కోసం ఇప్పటివరకు అనేక సామర్థ్య నిర్మాణ కార్యక్రమాలను ఎన్ ఏ సి ఐ ఎన్ నిర్వహించింది. క్రాస్ బోర్డర్ ఇ-కామర్స్ కోసం ట్రేడ్ ఫెసిలిటేషన్‌పై తాజా SASEC కెపాసిటీ-బిల్డింగ్ ప్రోగ్రా మ్ ను 2023 డిసెంబర్ నెలలో NACIN ద్వారా నిర్వహించారు.
****
(Release ID: 2050685)
Visitor Counter : 60