జాతీయ మానవ హక్కుల కమిషన్
“యాచకత్వ నివారణ, యాచకుల పునరావాసం”పై జాతీయ మానవ హక్కుల సంఘం బహిరంగ చర్చ’’
దేశం ఆర్థిక పురోగతి సాధించినా, ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలుపరుస్తున్నా ఇంకా యాచక వృత్తి కొనసాగుతుండడానికి కారణం దేశంలో లోతుగా పాతుకుపోయిన సామాజిక, ఆర్థిక వ్యత్యాసాలే : తాత్కాలిక చైర్ పర్సన్ శ్రీమతి విజయ భారతి సయానీ
దేశంలో 80 కోట్ల మంది ఉచిత ఆహార ధాన్యాలు అందుకుంటున్న వాతావరణంలో యాచక వృత్తిలోని 4 లక్షల మందికి పునరావాసం కల్పించడం ఏమంత కష్టం కాకూడదు : సెక్రటరీ జనరల్ శ్రీ భరత్ లాల్
యాచకులు అధిక సంఖ్యలో కనిపిస్తున్న ప్రాంతాల గుర్తింపు, వారందరికీ ఆధార్ కార్డుల జారీ, యాచకత్వాన్ని నేరాల జాబితా నుంచి తొలగించడం అవసరమని చర్చలో సలహాలు
Posted On:
30 AUG 2024 3:46PM by PIB Hyderabad
జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్చార్సీ) ప్రాంగణంలో నేడు ‘‘యాచకత్వ నివారణ, యాచక వృత్తిలోని వారి పునరావాసం’’ అనే అంశంపై బహిరంగ సభ నిర్వహించారు.
(ఎన్‌హెచ్చార్సీ) నిర్వహణలో ఈ కార్యక్రమం జరిగింది. దేశం వేగంగా పురోగమిస్తుండడంతో పాటు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు అమలుపరుస్తున్నప్పటికీ యాచకవృత్తి కొనసాగడానికి సమాజంలో లోతుగా పాతుకుపోయిన సామాజిక, ఆర్థిక వ్యత్యాసాలే కారణమని ఎన్‌హెచ్చార్సీ తాత్కాలిక చైర్ పర్సన్ శ్రీమతి విజయ భారతి సయానీ ఈ సందర్భంగా అన్నారు. 2011 సంవత్సరం నాటి జనాభా లెక్కల ప్రకారం దేశంలో 4,13,000 వేల మంది యాచకులు, విచ్చలవిడి తిరుగుబోతులు ఉన్నారు. వారిలో జీవన పోరాటం సాగిస్తున్న మహిళలు, బాలలు, ట్రాన్స్ జెండర్లు, వృద్ధులు కూడా ఉన్నారు.
ఒకప్పుడు సమాజంలో దానధర్మాలు చేయడం, స్వీకరించడం రెండూ ఆధ్యాత్మిక జీవనంలో భాగంగా ఉండేవని, కాని నేడు ధర్మం అనే పదం దాని నుంచి విడివడిపోయిందని శ్రీమతి విజయ భారతి అన్నారు. పేదరికం లేదా సంఘ వ్యతిరేక శక్తులు మనుషులను అక్రమంగా అపహరించి యాచకులుగా మార్చడం వంటి చర్యలే యాచక వృత్తి ప్రబలడానికి కారణమని పేర్కొన్నారు. తాము చెరబట్టిన వారి నుంచి అధిక మొత్తంలో ధనం ఆర్జించడమే ఈ సంఘ వ్యతిరేకుల లక్ష్యమన్నారు. అంతే కాదు, సామాజిక నిర్లక్ష్యం కారణంగా దివ్యాంగులు తమ రోజువారీ జీవనం కోసం ఇతరులపై ఆధారపడక తప్పని పరిస్థితి ఏర్పడిందని చెప్పారు.
ఇలాంటి వారందరి మానవ హక్కులను సంరక్షించడానికి; వారికి గౌరవం, న్యాయం దక్కేలా చేయడానికి కమిషన్ కట్టుబడి ఉందని శ్రీమతి విజయ భారతి సయానీ చెప్పారు. ఈ నేపథ్యంలో సమాజంలో నిర్లక్ష్యానికి గురవుతున్న వ్యక్తుల జీవనోపాధి, ఔత్సాహిక పారిశ్రామిక ధోరణులకు మద్దతు (స్మైల్)-బి పథకం (సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిడ్యువల్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఎంటర్ప్రైజ్ (స్మైల్)-బి) ప్రాధాన్యాన్ని ఆమె నొక్కి చెప్పారు. ఈ పథకం యాచక వృత్తిలో ఉన్న వ్యక్తుల పునరావాసంపై దృష్టి సారిస్తుంది.
యాచకత్వ నిర్మూలన, యాచకత్వంలో ఉన్న వారి జీవన నాణ్యత పెంపునకు వ్యూహాలు రూపొందించాలని ఇటీవల కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు; కేంద్రపాలిత ప్రాంతాలకు కమిషన్ సలహా ఇచ్చిందని ఎన్‌హెచ్చార్సీ జనరల్ సెక్రటరీ శ్రీ భరత్ లాల్ చెప్పారు. ప్రభుత్వాలు ప్రత్యేకించి ఇటీవలి కాలంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు పౌరుల జీవన నాణ్యతను మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నాయని ఆయన చెప్పారు. నీరు, గూడు, విద్యుత్ వంటి ప్రాథమిక వసతులు అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తున్నాయన్నారు. దేశంలో 80 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందిస్తుండగా 4 లక్షల మంది యాచకులకు పునరావాసం కల్పించడం ఏ మాత్రం కష్టం కారాదని ఆయన వ్యాఖ్యానించారు.
పౌర సమాజ సంస్థలు సహా సమాజ భాగస్వాములందరూ కలిసికట్టుగా కృషి చేసినట్టయితే వారికి పునరావాసం కల్పించడం కష్టమైన పనేం కాదని శ్రీ లాల్ అన్నారు. ఆధార్ కార్డులు జారీ చేయడం ద్వారా వారికి కూడా ఆహార ధాన్యాలు, ఇల్లు, విద్యుత్ కనెక్షన్లు, మరుగుదొడ్లు, వంటగ్యాస్ అందించవచ్చునన్నారు.
ప్రస్తుత చట్టాలు, వైఖరులను మదింపు చేయవలసిన అవసరం ఉన్నదని జాయింట్ సెక్రటరీ శ్రీ దేవేంద్ర కుమార్ నిమ్ బహిరంగ చర్చకు నాందిగా చెప్పారు. రాజ్యాంగ సిద్దాంతాలు, ఇటీవల కోర్టులు ప్రకటించిన తీర్పులకు అనుగుణంగా యాచకులకు శిక్షలు విధించడం మాని పునరావాసంపై దృష్టి సారించాలని సూచించారు. ఇలాంటి మార్పు యాచక సమస్యకు మరింత సమర్థవంతమైన, మానవతా పూర్వకమైన మార్గం చూపుతుందన్నారు.
తమ సంరక్షణ శిబిరాల్లో ఉన్న వారందరి ఆధార్ నమోదు నూరు శాతం పూర్తి చేశామని సొసైటీ ఫర్ యూత్ అండ్ మాసెస్ డైరెక్టర్ శ్రీ రాజేశ్ కుమార్ చెప్పారు. యాచకులను తన కంపెనీలో భాగస్వాములు చేయడం ద్వారా తాను వారిని ఏ విధంగా ఔత్సాహిక పారిశ్రామికులుగా తీర్చి దిద్దిందీ బెగ్గర్స్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ శ్రీ చంద్ర మిశ్రా వివరించారు.
ఎన్‌హెచ్చార్సీ రిజిస్ర్టార్ (లా) శ్రీ జోగీందర్ సింగ్; సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ప్రతినిధితో పాటు బిహార్, రాజస్తాన్, ఢిల్లీ ఎన్‌సీటీ ప్రభుత్వాల ప్రతినిధులు, ఎన్జీఓలు, విద్యావేత్తలు, ఈ విభాగంలో నిపుణులు బహిరంగ చర్చలో పాల్గొన్నారు.
సమావేశంలో వచ్చిన ప్రధాన సూచనలు, సలహాలు...
• యాచకులు అధిక సంఖ్యలో తిరిగే ప్రదేశాలను గుర్తించాలి. సమగ్ర గణాంకాలను రూపొందించేందుకు వీలుగా యాచకుల సంఖ్యపై సర్వే నిర్వహించాలి.
• యాచకులకు సామాజిక భద్రతా పథకాలు, వాటి ప్రయోజనాలు అందించేందుకు వీలుగా యాచకులుగా ఉన్న వారందరికీ రాష్ర్ట ప్రభుత్వాలు ఆధార్ కార్డులు జారీ చేయాలి.
• యాచకులను నేరస్థులుగా పరిగణించకూడదు. శిక్షాపూర్వకమైన చర్యలను, పునరావాస చర్యలను ఒక్కటిగా కలపకూడదు.
• యాచకులందరూ ఏకవర్గానికి చెందిన వ్యక్తులు కాదు. అందుకే వారి వ్యక్తిగత అవసరాలకు దీటుగా కార్యక్రమాలు చేపట్టాలి.
***
(Release ID: 2050516)
Visitor Counter : 102