రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

పటిష్ఠమైన ఆర్థిక వ్యవస్థకు స్వావలంబన మొదటి షరతు. ‘ఆత్మనిర్భర్ భారత్’ దిశగా ప్రధాని మోదీ దార్శనికతను సాకారం చేసేందుకు పెద్ద ఎత్తున అడుగులు పడుతున్నాయి: రక్షణ మంత్రి


"2029 నాటికి మూడు లక్షల కోట్ల రూపాయల రక్షణ ఉత్పత్తి, రూ.50,000 కోట్ల రక్షణ ఎగుమతుల లక్ష్యం"


గ్లోబల్ సౌత్ లో అత్యంత కీలకం భారతదేశం: శ్రీ రాజ్‌నాథ్ సింగ్

"మార్పునకు మారుపేరుగా మా ప్రభుత్వానికి గుర్తింపు’’


అపూర్వమైన అభివృద్ధి, శ్రేయస్సు, సామాజిక సామరస్యం, వృద్ధి దిశగా భారతదేశపు గమనం"

Posted On: 30 AUG 2024 4:04PM by PIB Hyderabad

ప్రతి రంగంలోనూ స్వావలంబన అనేది ఒక బలమైన ఆర్థిక వ్యవస్థకు మొదటి షరతు అని రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘ఆత్మనిర్భర్ భారత్’ దార్శనికతను, సాకారం చేసుకునే దిశగా దేశం గొప్ప ప్రగతిని సాధిస్తోందని ఆయన తెలిపారు. ఈ రోజు కేరళలోని తిరువనంతపురంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రక్షణ పరిశోధన అభివృద్ధి, ఆవిష్కరణల కోసం బలమైన ఉత్పత్తి కేంద్రంగా భారత్ మారేందుకు, అందుకు అనుకూలమైన మౌలిక సదుపాయాలను, ఆర్ అండ్ డీ, ఆవిష్కరణల వ్యవస్థలను రూపొందించడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని ఆయన స్పష్టం చేసారు. 

రక్షణ మంత్రిత్వ శాఖ తీసుకున్న కొన్ని చర్యలను  శ్రీ రాజ్‌నాథ్ సింగ్ వివరించారు. ఉత్తరప్రదేశ్, తమిళనాడుల్లో డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్‌ల ఏర్పాటు, దేశీయంగా ఉత్పత్తి చేయగలిగిన 5500 పైగా వస్తువులతో కూడిన అయిదు జాబితాలను జారీ చేయడం వంటివి ఉన్నాయి. జీఈ-414 ఇంజిన్లు ఇప్పుడు భారతదేశంలో తయారవుతున్నాయని, ఇది దేశం ఇంజిన్ తయారీ సామర్థ్యంలో అద్భుతమైన పురోగతిని సూచిస్తుందని ఆయన తెలిపారు. అమెరికా రక్షణ సంస్థలతో నిర్వహించిన చర్చలు ఫలవంతమయ్యాయని, 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమంలో చేరేందుకు వారు ఉత్సాహంగా ఉన్నారని ఆయన ఇటీవలి తన అమెరికా పర్యటనను ప్రస్తావించారు.

రక్షణ అవసరాల కోసం మన దేశం ఇతర దేశాలపై ఆధారపడిన పరిస్థితి ఉండేదని, దాదాపు 65-70 శాతం రక్షణ పరికరాలను దిగుమతి చేసుకునే వాళ్లమని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. కానీ ఈరోజు ఆ స్థితి మారిపోయిందని, 65 శాతం భారతదేశంలోనే తయారవుతున్నాయని రక్షణ మంత్రి తెలిపారు. ఇప్పుడు 35 శాతం మాత్రమే  దిగుమతి అవుతున్నాయని తెలిపారు. 

వార్షిక రక్షణ ఉత్పత్తి రూ.1.27 లక్షల కోట్లు దాటిందని, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1.75 లక్షల కోట్లకు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రక్షణ మంత్రి తెలిపారు. 2029 నాటికి రక్షణ మంత్రిత్వ శాఖ మూడు లక్షల కోట్ల రూపాయల విలువైన రక్షణ ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకుంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
 

“ఈ రోజు, మేము భారతదేశంలో తయారైన రక్షణ పరికరాలను కూడా ఎగుమతి చేస్తున్నాము. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ రక్షణ ఎగుమతులు రూ.21,000 కోట్లు దాటాయి. 2029 నాటికి రక్షణ ఎగుమతులను రూ. 50,000 కోట్లకు పెంచడమే మా లక్ష్యం’’ అని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

అంతర్జాతీయ వేదికపై భారతదేశం ఎదుగుతున్న స్థాయి గురించి మాట్లాడుతూ, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇటీవల రష్యా, ఉక్రెయిన్ పర్యటనల గురించి రక్షణ మంత్రి ప్రస్తావించారు, రెండు దేశాల అభిప్రాయాలను విన్న ఏకైక ప్రపంచ నాయకుడు ఆయన మాత్రమే అన్నారు. “భారతదేశం నేడు గ్లోబల్ సౌత్ లో కీలకంగా మారింది. ముఖ్యమైన సమస్యలపై ప్రతి దేశం భారతదేశం అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నది, వింటున్నది. ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేతుల మీదుగా ప్రధానికి అత్యున్నత పౌర పురస్కారం లభించింది. దీంతో మన ప్రధానికి అత్యున్నత పౌర గౌరవం కల్పించిన 16 దేశాల్లో రష్యా చేరింది. ఈ దేశాల్లో యూఏఈ, సౌదీ అరేబియా, ఆఫ్ఘనిస్తాన్, మాల్దీవులు, బహ్రెయిన్ వంటి ముస్లిం దేశాలు కూడా ఉన్నాయి.

గత పదేళ్లలో దేశం మహత్తరమైన మార్పులు చూసిందని - ఆర్థిక సంస్కరణల నుండి సామాజిక పరివర్తన వరకు, సాంస్కృతిక పునరుజ్జీవనం నుండి గణనీయమైన రాజకీయ మార్పుల వరకు ఈ పరిణామాలు ఉన్నాయని ఆయన ఉద్ఘాటించారు. ఈ మార్పులో ప్రభుత్వంతో పాటు అత్యంత కీలక పాత్ర పోషించిన ఘనత ప్రజలకు ఉందన్నారు. "గత 10 సంవత్సరాలు చోటుచేసుకున్న మార్పులు దశాబ్దాల పాటు చరిత్రలో నిలిచిపోతాయి. మన ప్రధాన మంత్రి, ప్రభుత్వం ఎల్లప్పుడూ అతిపెద్ద 'మార్పునకు మారుపేరు'గా  గుర్తుండిపోతారు. భారతదేశం పెను మార్పుల దిశగా దూసుకుపోతోంది. ఇది భారతదేశాన్ని అపూర్వమైన అభివృద్ధి, శ్రేయస్సు, సామాజిక సామరస్యం, అభివృద్ధి యుగంలోకి తీసుకువెళుతుంది ” అని అన్నారాయన.

2014 నుండి భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వృద్ధిపై రక్షణ మంత్రి మాట్లాడారు. “భారత ఆర్థిక వ్యవస్థ అంతకుముందు ‘స్థిరంగా లేని అయిదు’లో ఉంది. నేడు, ఇది 'అద్భుతమైన అయిదు'లో ఒకటిగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. గత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఆర్థిక వృద్ధి రేటు 8.2 శాతం. ఇది అంతకు ముందు సంవత్సరం 7 శాతం వృద్ధి రేటు కంటే ఎక్కువ. వరుసగా రెండు సంవత్సరాలుగా, ప్రపంచంలోని అన్ని ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉంది. గత పదేళ్లలో 11వ స్థానం నుంచి భారత్‌ అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. పెట్టుబడి సంస్థ మోర్గాన్ స్టాన్లీ అంచనా ప్రకారం 2027 నాటికి భారతదేశం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది" అని  ఆయన అన్నారు.

వృద్ధి వేగంగా ఉన్నప్పటికీ, భారతదేశంలో ద్రవ్యోల్బణం అదుపులో ఉందని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. రిటైల్ ద్రవ్యోల్బణం గత ఐదేళ్లలో కనిష్టంగా 3.54 శాతంగా నమోదైందని జూలైలో  విడుదల చేసిన తాజా గణాంకాలను ఆయన ఉదహరించారు. “2014కి ముందు అంకుర సంస్థల సంఖ్య 1,000 కంటే తక్కువగా ఉండేది. ఇప్పుడు అది లక్షకు పైగా పెరిగింది. నేడు, భారతదేశం ప్రపంచంలో మూడో అతిపెద్ద అంకుర సంస్థలున్న దేశం. ప్రతి 10వ యునికార్న్ భారతదేశంలో ఉంది. భారతదేశం అంకుర సంస్థల సానుకూల వాతావరణం ఈ సంవత్సరం సుమారు ఒక బిలియన్ డాలర్ల నిధులను సమకూర్చుకోవచ్చని అంచనా. ఇది గత సంవత్సరం కంటే 25 శాతం ఎక్కువ" అని అన్నారు. 

సుపరిపాలనను ప్రభుత్వ ప్రాధాన్యతగా గుర్తిస్తూ, రక్షణ మంత్రి ప్రతి పాలసీ, కార్యక్రమాలు సుపరిపాలనను నిర్ధారించడానికి స్థిరత, స్థిరత్వం, కొనసాగింపు సూత్రాలపై పని చేస్తాయని పేర్కొన్నారు. అత్యధిక మూలధన వ్యయం రూపంలో ఉత్పాదక వ్యయం, సంక్షేమ పథకాల్లో అపూర్వమైన పెట్టుబడి, వృథా ఖర్చులకు అడ్డుకట్ట, ఆర్థిక క్రమశిక్షణ.. వీటిపైన ప్రభుత్వం దృష్టి పెట్టిందని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. 

కోవిడ్-19 మహమ్మారి సమయంలో ప్రభుత్వ శక్తి సామర్ధ్యాలు ఏమిటన్నది స్పష్టమైందని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. "మా ప్రభుత్వం ప్రాణాలను రక్షించే వనరులనీ, మందులనీ సకాలంలో అందుబాటులో ఉండేలా చూసింది. లాక్‌డౌన్‌ సమయంలో పేదలకు ఉచితంగా రేషన్‌ను అందుబాటులో ఉంచడం ద్వారా ఆహార భద్రతకు భరోసా కల్పించాం. మేడ్ ఇన్ ఇండియా వ్యాక్సిన్లను ఒక ప్రాధాన్యతగా పరిగణించాం. ఈ వ్యాక్సిన్ల లభ్యతను మేం ఎటువంటి ఆలస్యం లేకుండా వెంటనే ప్రతి పౌరునికి అందించాం” అని ఆయన చెప్పారు.

‘స్వచ్ఛ భారత్ అభియాన్’, ‘బహిరంగ మలవిసర్జన రహిత భారత్’ విజయాలను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకొచ్చిన ‘సానుకూల మార్పు’కు ఉత్తమ ఉదాహరణగా రక్షణ మంత్రి అభివర్ణించారు. ప్రజల అవసరాలను తీర్చే ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన వంటి కార్యక్రమాలను కూడా ఆయన ప్రస్తావించారు.

బేటీ బచావో, బేటీ పఢావో, నారీ శక్తి వందన్ అధినియం వంటి పథకాల ద్వారా లింగ సమానత్వం, మహిళా సాధికారత కోసం చేస్తున్న ప్రయత్నాలను కూడా శ్రీ రాజ్‌నాథ్ సింగ్ వివరించారు. ట్రిపుల్ తలాక్ పద్ధతిని రద్దు చేయడం గురించీ ఆయన ప్రస్తావించారు. ఇది వివక్షతతో కూడిన పద్ధతిని అంతం చేయాలనే ప్రభుత్వ సంకల్పం, కృత నిశ్చయాన్ని ప్రతిబింబిస్తుందని రక్షణ మంత్రి అన్నారు.

మహిళల ఆరోగ్యం, భద్రత, సంక్షేమాన్ని ప్రభుత్వ ప్రాధాన్యతగా ఆయన స్పష్టం చేశారు. “దేశంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, నేరాలను పరిశీలిస్తే, ఎన్నో మార్పులు వచ్చినప్పటికీ, ఇంకా చాలా చేయాల్సి ఉంది. మహిళలపై నేరాల పట్ల మా ప్రభుత్వం కఠినమైన వైఖరిని అవలంబించింది, కానీ చాలా రాష్ట్రాలు ఈ దిశగా చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేయడం లేదు. కోల్‌కతాలో ఇటీవల జరిగిన హృదయ విదారక సంఘటన చాలా బాధాకరమైనది. అవమానకరమైనది. అత్యాచారం వంటి క్రూరమైన నేరాలకు ఉరిశిక్ష విధించేలా చట్టాన్ని సవరించాం. ఈ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి’’ అని  శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
 

సాయుధదళాలలో మహిళల పాత్ర పెరుగుతోందని ప్రముఖంగా ప్రస్తావించారు. మహిళలు సైన్యంలోకి ప్రవేశించడానికి ఉన్న అనేక అడ్డంకులు తొలగిపోయాయని పేర్కొన్నారు. “సాయుధ దళాలలోని మూడు విభాగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేలా మేం నిర్ధారించాం. మహిళల కోసం శాశ్వత ఉద్యోగాలకు అనుమతించారు. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సైనిక శిక్షణా సంస్థల్లో ఒకటైన నేషనల్ డిఫెన్స్ అకాడమీ కూడా మహిళల కోసం ప్రారంభమైంది. మహిళా సాధికారత, మహిళా నాయకత్వ అభివృద్ధి అనే లక్ష్యంతో మా ప్రభుత్వం ముందుకెళ్తోంది" అని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

 



(Release ID: 2050346) Visitor Counter : 42