నీతి ఆయోగ్
వృద్ధిని వేగవంతం చేసే మార్గాలు, వ్యూహాలపై నీతి ఆయోగ్ నివేదిక
ఆత్మనిర్భరత సాధనలో భాగంగా నివేదికను రూపొందించిన నీతి ఆయోగ్
Posted On:
29 AUG 2024 3:36PM by PIB Hyderabad
"ఆత్మనిర్భరత సాధనే లక్ష్యంగా వంట నూనె (ఎడిబుల్ ఆయిల్స్)ల రంగంలో వృద్ధిని వేగవంతం చేయడానికి మార్గాలు- ,వ్యూహాలు" పేరుతో నీతి ఆయోగ్ వైస్-ఛైర్మెన్ శ్రీ సుమన్ బేరీ ఒక నివేదికను విడుదల చేశారు. నీతి ఆయోగ్ సభ్యుడు ప్రొఫెసర్ రమేష్ చంద్ సమక్షంలో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖ , ఐసీఏఆర్ ఇన్‌స్టిట్యూట్‌లు, పరిశ్రమల ప్రతినిధులతో కలిసి ఈ నివేదిక విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నివేదికను నీతి ఆయోగ్ సీనియర్ సలహాదారు (వ్యవసాయం) డాక్టర్ నీలం పటేల్ సమర్పించారు.
గత కొన్ని దశాబ్దాలుగా దేశంలో తలసరి వంటనూనెల వినియోగం అనూహ్యంగా పెరిగిందని, ఇది సంవత్సరానికి 19.7 కిలోలకు చేరుకుందని నివేదిక ప్రత్యేకంగా పేర్కొంది. వంట నూనెల దేశీయ ఉత్పత్తికి మించి డిమాండ్ పెరిగింది. దాంతో దేశీయ, పారిశ్రామిక అవసరాలను తీర్చడానికి దిగుమతులపై అధికంగా ఆధారపడాల్సి వస్తోంది. 2022-23లో, భారతదేశం 16.5 మిలియన్ టన్నుల (ఎంటీ) వంట నూనెలను దిగుమతి చేసుకుంది. దేశీయంగా సాధిస్తున్న వంటనూనెల ఉత్పత్తి.. దేశ అవసరాలలో 40-45% మాత్రమే. దాంతో వంటనూనెల రంగంలో స్వయం సమృద్ధిని సాధించాలనే భారతదేశ లక్ష్యానికి పెను సవాళ్లు ఎదురవుతున్నాయి.
దేశ వంట నూనెల రంగం ప్రస్తుత స్థితినీ, దాని భవిష్యత్తు సామర్థ్యాన్నీ నివేదిక సమగ్రంగా వివరించింది. ఇది ఇప్పటికే ఉన్న సవాళ్లను ఎదుర్కోవడానికి వీలుగా వివరణాత్మకమైన ఒక పరిష్కార మార్గాన్ని చూపుతోంది. డిమాండ్-సరఫరా అంతరాన్ని తగ్గించడం, స్వయం సమృద్ధిని సాధించడానికి కొత్త విధానాలను అభివృద్ధి చేయడంపై దృష్టి సారిస్తోంది. ఎలాంటి మార్పులూ లేకుండా అయితే, 2030 నాటికి జాతీయ వంట నూనెల సరఫరా 16 ఎంటీ, 2047 నాటికి 26.7 ఎంటీకి పెరుగుతుందని అంచనా.
భవిష్యత్తు వంటనూనె అవసరాలపై పూర్తి అవగాహన కోసం, డిమాండు ఎంత ఉండొచ్చన్న అంచనా కోసం భిన్నమైన మూడు విధానాలను ఎంచుకున్నారు. (i) జనాభా అంచనాలు, కనీస తలసరి వినియోగ సమాచారాన్ని ఉపయోగించే 'స్థిర/గృహ వినియోగ విధానం మొదటిది. ఇది వినియోగ ప్రవర్తనలో స్వల్పకాలిక స్థిరమైన నమూనాను ఊహించే విధానం. ఇక రెండోది (ii) ఐసీఎంఆర్ -నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ICMR-NIN) నిర్దేశించినట్టుగా సిఫార్సు చేసిన ఆరోగ్యకరమైన స్థాయిలో వంటనూనెల్ని వినియోగించేలా చేసే 'విలువ ఆధారిత విధానం. ఇక మూడోది (iii) 'ప్రవర్తనాధారిత విధానం. ఇది
పెరుగుతున్న ఆదాయ స్థాయులు, ధరల హెచ్చుతగ్గుల కారణంగా అభివృద్ధి చెందుతున్న జీవనశైలి , ఆహారపు అలవాట్ల కారణంగా ఆహార వినియోగంలో వచ్చే మార్పుల సంభావ్యతను గుర్తిస్తుంది. అది రెండు రకాలుగా ఊహించవచ్చు. మొదటి ఊహాచిత్రం: తలసరి వినియోగం 25.3 కిలోలకు (అభివృద్ధి చెందిన దేశాల సగటు) పరిమితం చేశారు. డిమాండ్-సరఫరా అంతరం 2030 నాటికి 22.3 ఎంటీ, 2047 నాటికి 15.20 ఎంటీగా అంచనా వేశారు. ఇక రెండో ఊహాచిత్రం: తలసరి 40.3 కిలోల అధిక వినియోగ స్థాయి (అమెరికాతో సమానంగా) ఉంటుంది. ఇందులో 2030 నాటికి అంతరమనేది 29.5 ఎంటీ, 2047 నాటికి 40 ఎంటీకి పెరుగుతుంది.
ఎలాంటి మార్పులూ చేయని, యధాతథ పరిస్థితుల్లో- దేశంలో వంటనూనెల డిమాండ్ 2028 నాటికి మొదటి ఊహాచిత్ర స్థాయికీ, 2038 నాటికి రెండో ఊహాచిత్ర స్థాయికీ చేరుకుంటుంది. అధిక-ఆదాయ వృద్ధి పరిస్థితుల్లో ఊహాత్మక వార్షిక వృద్ధిని 8%గా అనుకుంటే, దేశ వంట నూనెల డిమాండ్ 2025 నాటికే మొదటి ఊహాచిత్ర స్థాయికి చేరుకుంటుంది. యథాతధ స్థితితో పోల్చితే, మూడు సంవత్సరాల ముందే వచ్చిన పరిస్థితి. 2031 నాటికి రెండో ఊహాచిత్ర పరిస్థితికి చేరుకుంటుంది. ఇది యథాతధ స్థితితో పోల్చితే, ఊహించిన దానికంటే 7 సంవత్సరాల ముందే వస్తుంది. వేగవంతమైన ఆర్థిక వృద్ధి కారణంగా అధిక డిమాండును ఇది చూపుతోంది.
'స్థిర/గృహ విధానం' ఆధారంగా, వెలువడిన అంచనాలు 2030, 2047 నాటికి వరుసగా 14.1 ఎంటీ, 5.9 ఎంటీ డిమాండ్-సరఫరా అంతరాన్ని సూచిస్తున్నాయి. అయితే, ఐసీఎంఆర్ -ఎన్ఐఎన్ సిఫార్సు చేసిన తలసరి వినియోగాన్ని అనుసరించినట్లయితే, 2030, 2047 నాటికి మన దేశం వరుసగా 0.13 ఎంటీ, 9.35 ఎంటీ వంట నూనెల మిగులును కలిగి ఉంటుందని అంచనా వేశారు.
ఈ రంగంలో స్వయం సమృద్ధిని సాధించడానికి, ఇప్పటికే ఉన్న అంతరాన్ని తగ్గించడానికి, దీర్ఘకాలిక స్థిరత్వాన్ని సాధించడానికి అనేక వ్యూహాత్మక చర్యలను నివేదిక సూచిస్తోంది. ప్రతిపాదిత వ్యూహం మూడు కీలక అంశాలపై రూపొందింది (i) పంట నిర్వహణ, మరలింపు (ii) క్షితిజ సమాంతర విస్తరణ (iii) లంబకోణ (vertical) విస్తరణ. క్షితిజ సమాంతర విస్తరణ వ్యూహం అనేది వంట నూనె పంటల సాగు చేసే ప్రాంతాన్ని వ్యూహాత్మకంగా పెంచడమే లక్ష్యంగా తయారైంది. నిర్దిష్ట నూనెగింజల కోసం ఎక్కువ భూమిని సాగులోకి తీసుకురావడానికి ఈ వ్యూహం ప్రయత్నిస్తుంది.
వంట నూనెల రంగంలో స్వయం సమృద్ధిని సాధించడానికి అనువైన మార్గాలలో అధిక దిగుబడినిచ్చే నూనెగింజల పంటల కోసం వరి బీడు భూములను ఉపయోగించాలి. తాటి సాగు ద్వారా రూపాంతరం చెందడానికి అత్యంత అనుకూలమైన బంజరు భూములు ఉపయోగించాలి. అలాగే అనువైనప్రాంతాలలో పంట నిర్వహణ, వైవిధ్యతను సమర్ధవంతంగా ప్రోత్సహించడం చేయాలి. ప్రత్యామ్నాయ పంటలతో పోలిస్తే ఉత్పత్తి సాధ్యతను నిర్ణయించడానికి వ్యయ-ప్రయోజన విశ్లేషణ అవసరం కావచ్చు. లంబకోణ విస్తరణ వ్యూహాలు అనేది ప్రస్తుతం చేస్తున్న నూనెగింజల సాగులో దిగుబడిని పెంచడంపై దృష్టి సారిస్తుంది. మెరుగైన వ్యవసాయ పద్ధతులు, మెరుగైన నాణ్యమైన విత్తనాలు, అధునాతన ఉత్పత్తి సాంకేతికతల ద్వారా అధిక దిగుబడిని సాధించవచ్చు.
ఈ నివేదికలో పేర్కొన్న 'రాష్ట్రాల వారీగా చతుర్భుజ విధానం అనేది వంట నూనెల రంగంలో "ఆత్మనిర్భరత"ను సాధించడానికి విలువైన సాధనాన్ని అందిస్తోంది. దేశవ్యాప్తంగా సాగు చేస్తున్న వంట నూనె పంటల కోసం నాలుగు భుజాలనూ ఉపయోగించడం ద్వారా రాష్ట్రంలోని క్లస్టర్లను ఈ నివేదిక గుర్తిస్తోంది.
అవి (i) అధిక విస్తీర్ణం-అధిక దిగుబడి (HA-HY), (iii.) అధిక ప్రాంతం-తక్కువ దిగుబడి (HA-LY), (iii) తక్కువ ప్రాంతం-అధిక దిగుబడి (LA- HY ) (iv) తక్కువ విస్తీర్ణం-తక్కువ దిగుబడి (LA-LY)] .
అధిక సాగు విస్తీర్ణం, దిగుబడి (HA-HY) ఉన్న రాష్ట్ర క్లస్టర్ల సామర్థ్యాన్ని మెరుగుపరచడం కోసం ప్రపంచ ప్రసిద్ధ ఉత్పత్తిదారుల నుండి ఉత్తమ పద్ధతులను తెలుసుకొని వాటిని అవలంబించడంపై దృష్టి పెట్టవచ్చు.
అధిక విస్తీర్ణం ఉండి, తక్కువ దిగుబడి (HA-LY) ఉన్న రాష్ట్రాల్లో నిలువు విస్తరణ (అంటే, దిగుబడిని పెంచడం) లక్ష్యంగా చర్యలు అవసరం. తక్కువ విస్తీర్ణంలో, అధిక దిగుబడి ఉన్న రాష్ట్రాల్లో (LA-HY), సమాంతర విస్తరణ వైపు దృష్టి మరల్చి సమర్ధతను కొనసాగిస్తూ సాగును విస్తరించాలి.. చివరగా, తక్కువ విస్తీర్ణం , తక్కువ దిగుబడి (LA-LY) ఉన్న ప్రాంతాలు క్షితిజ సమాంతర , నిలువు విస్తరణ వ్యూహాలు రెండింటిపైనా దృష్టి పెట్టాలి. వ్యూహాత్మకంగా ఈ క్లస్టర్‌లను లక్ష్యంగా చేసుకోవడంవల్లా, అనుకూలమైన చర్యలను అమలు చేయడం ద్వారా, వంటనూనెల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. వినియోగం పెరగడం వల్ల ఎదురయ్యే సమీప సవాళ్లను సమర్థవంతంగా పరిష్కరించవచ్చు.
ఈ నివేదికలో సిఫార్సు చేసిన వ్యూహాత్మక చర్యలు, మన దేశం వంట నూనెల దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించే దిశగా సరైన మార్గాన్ని చూపుతున్నాయి. వంట నూనెల ఉత్పత్తిని 43.5 ఎంటీకి గణనీయంగా పెంచే అవకాశం మన దేశంలో ఉందని నివేదిక పేర్కొంది. ఈ గణనీయమైన పెరుగుదల దిగుమతి అంతరాన్ని తగ్గించడమే కాకుండా, వంట నూనెల స్వయం సమృద్ధి దిశగా దేశాన్ని నడిపించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. నివేదికలోని విషయాలు ఇలా ఉన్నాయి.
నూనెగింజల పంటలను వ్యూహాత్మకంగా సంరక్షించడం, అవి వైవిధ్యతను కలిగి ఉండటం, తృణధాన్యాల సాగులో నష్టపోయే అవకాశమున్న ప్రాంతాలపై దృష్టి సారించడం వల్ల దేశంలోని తొమ్మిది రాష్ట్రాల్లో 20% వంట నూనెల ఉత్పత్తిని పెంచవచ్చు. తద్వారా 7.36 MT నూనెగింజల ఉత్పత్తి అదనంగా చేరుతుంది. దాంతో దిగుమతులపై ఆధారపడటాన్ని 2.1 ఎంటీకి తగ్గించవచ్చు.
దేశ వ్యాప్తంగా ఉన్న వరి బీడు ప్రాంతాలు... నూనెగింజల సాగులో క్షితిజ సమాంతర విస్తరణ చేపట్టడానికి ఒక మంచి అవకాశాన్ని దేశానికి ఇస్తున్నాయి.. పది రాష్ట్రాల్లోని వరి బీడు భూముల విస్తీర్ణంలో మూడింట ఒక వంతు నూనెగింజల సాగు కోసం వినియోగించుకోవడం ద్వారా నూనెగింజల ఉత్పత్తిని 3.12 మెట్రిక్ టన్నులు పెంచవచ్చు. అంతేకాదు దిగుమతులపై ఆధారపడడాన్ని 1.03 మెట్రిక్ టన్నుల వరకు తగ్గించవచ్చు.
మెరుగైన సాంకేతికతలు, సమర్థవంతమైన పంట నిర్వహణ పద్ధతులను విస్తృతంగా అమలు చేయడం ద్వారా ఆముదంలో, పొద్దుతిరుగుడు పంటల్లో ఉన్న దిగుబడి వ్యత్యాసాన్ని తగ్గించవచ్చు. అంటే నిలువుగా విస్తరించడం ద్వారా దేశీయ నూనెగింజల ఉత్పత్తిని 17.4 ఎంటీకి పెంచవచ్చు. దీనివల్ల 3.7 మెట్రిక్ టన్నుల వంట నూనెల దిగుమతులు తగ్గుతాయి.
లక్ష్య విస్తరణ చేపట్టడం వల్ల, పామాయిల్ మాత్రమే, 34.4 ఎంటీ వంట నూనెల్ని పెంచుతుంది. తద్వారా ఇప్పటికే ఉన్న డిమాండ్-సరఫరా అంతరాన్ని తగ్గించే దిశగా గణనీయమైన పురోగతిని సాధిస్తుంది. 284 జిల్లాల్లో ICAR-IIOPR గుర్తించిన, ఇంతవరకూ నూనె గింజల పంటల్ని పండించని ప్రాంతాల సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడంపై ఈ ప్రయత్నం దృష్టి సారించాలి, ఆయిల్ పామ్ సాగు కోసం దేశవ్యాప్తంగా అదనంగా 2.43 మిలియన్ హెక్టార్ల భూమి కావాలని అంచనా వేశారు. ఇంకా, ICAR-IIOPR గుర్తించని జిల్లాలలో (6.18 Mha) ఉన్న బంజరు భూములలో మూడింట రెండు వంతుల అత్యంత అనుకూలమైన ప్రాంతాలను వ్యూహాత్మకంగా ఉపయోగించడమనేది మరింత క్షితిజ సమాంతర విస్తరణలో కీలకమవుతుంది.
వరిపొట్టుద్వారా 1.9 ఎంటీ వంట నూనెల ఉత్పత్తిని సాధించవచ్చని అంచనా. ఇందులో 0.85 ఎంటీ ఉత్పత్తి ఇంతవరకూ జరగలేదు. అదేవిధంగా, పత్తి గింజలు అదనంగా 1.4 MT వంట నూనెల ఉత్పత్తికి దోహదం చేస్తున్నాయి. ఇది దేశంలోని వంట నూనెల డిమాండ్-సరఫరా అంతరం లేదా దిగుమతులపై ఆధారపడడానికి సంబంధించి 9.7% తగ్గింపునకు దోహదం చేస్తుంది.
మొత్తం మీద, ప్రతిపాదిత వ్యూహాత్మక చర్యలు 2030, 2047 సంవత్సరాల నాటికి వరుసగా 36.2 MT , 70.2 MT వంట నూనెల సరఫరాలను సాధించగలవు.
విత్తన వినియోగం, ప్రాసెసింగ్ సామర్థ్యాలను మెరుగుపరచడం అనేది వంట నూనెల రంగంలో స్వీయ-సమృద్ధి కోసం పునాదిని బలోపేతం చేయడంలో కీలకమని నివేదిక ప్రత్యేకంగా పేర్కొంది. అధిక-నాణ్యత గల విత్తనాలు మాత్రమే ఉత్పత్తిని పెంచడానికి గణనీయంగా (15-20%) దోహదపడగలవని నివేదిక సూచిస్తోంది. ఇతర వ్యవసాయ ఖర్చుల సమర్థవంతమైన నిర్వహణతో కలిపినప్పుడు అధిక స్థాయిలో (45%) ఉత్పత్తిని సాధించవచ్చని నివేదిక తెలిపింది. అయితే, ప్రస్తుత సీడ్ రీప్లేస్‌మెంట్ రేషియో (SRR) లక్ష్యం అనేది 80-85% కంటే తక్కువగా ఉంది, ఇది వేరుశనగలో 25% నుండి రాప్సీడ్ రకం ఆవాల్లో 62% వరకు ఉంది. ఇది మొత్తం దిగుబడి మెరుగుదలకు ఆటంకం కలిగిస్తుంది. ఇప్పటికే ఉన్న మిల్లులను ఆధునీకరించడం ప్రాసెసింగ్ మౌలిక సదుపాయాల్లో వ్యూహాత్మకంగా పెట్టుబడి పెట్టడం వల్ల సామర్థ్యం మెరుగుపడుతుందని, వ్యర్థాలను తగ్గించవచ్చని నివేదిక సూచించింది,. ఎందుకంటే దేశంలోని కూరగాయల, వంట నూనెల రంగం అనేక చిన్న-స్థాయి, తక్కువ-సాంకేతికత కలిగిన ప్లాంట్ల కారణంగా దాని సామర్థ్యంలో కేవలం 30 శాతం వంటనూనెల రిఫైనింగ్ సామర్థ్యాన్ని వినియోగించుకుంటోంది.
వంట నూనెల రంగంలో స్వయం సమృద్ధి సాధించడం అనేది కీలకమైన జాతీయ ప్రాధాన్యత. కాబట్టి, ఈ మార్గంలో విజయవంతంగా ప్రయాణం చేయడానికి గాను నూనెగింజల పంటల్ని సాగు చేస్తున్న ఏడు ప్రధాన రాష్ట్రాలలో, (రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక) 1,261 మంది రైతులతో కూడిన ప్రాధమిక క్షేత్ర సర్వే ద్వారా పొందిన విలువైన ఫలితాల ఆధారంగా ఈ నివేదిక సిఫార్సులను తయారు చేశారు.
నూనె గింజల విస్తీర్ణ సంరక్షణ, విత్తన సేకరణ, నాణ్యత హామీ, మెరుగైన , అధునాతన ఉత్పత్తి సాంకేతికతలను అమలు చేయడం, ప్రాసెసింగ్, రిఫైనింగ్ ద్వారా అదనపు విలువ పొందడం , సమర్థవంతమైన మార్కెటింగ్ , బలమైన మార్కెట్ అనుసంధానాలపై దృష్టి సారించడంతో సహా, వంట నూనెలలో స్వయం సమృద్ధిని సాధించడానికి అనేక సిఫార్సులను ఈ నివేదిక కలిగి ఉంది. ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాలను ప్రోత్సహించడం, సమతుల్య వృద్ధి కోసం డైనమిక్ వాణిజ్య విధానాన్ని అభివృద్ధి చేయడం, వంట నూనెలపై జాతీయ మిషన్ పరిధిని విస్తృతం చేయడం, సిఫార్సు చేసిన ఆహార మార్గదర్శకాలపై ప్రజలల్లో అవగాహన పెంచడం, ఆహార పరిశ్రమలో దేశీయ నూనెగింజల వినియోగాన్ని ప్రోత్సహించడం మొదలైనవి ఈ సిఫార్సులలో ఉన్నాయి.
నూనెగింజల దిగుబడిలో అసమానతలను పరిష్కరించడానికి ప్రాంతీయ అంతరాలను తగ్గించడానికి డేటా ఆధారిత విధానం , బలమైన వ్యవస్థలు అవసరమని ఈ నివేదిక పేర్కొంది.
జాతీయ ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వంతో వంట నూనెల రంగంలో “ఆత్మనిర్భరత”ను సాధించడానికి, వంట నూనెల రంగాన్ని అభివృద్ధి చేయడానికి పరిశోధన, అభివృద్ధిలో పెట్టుబడి చాలా కీలకమని నివేదిక ప్రత్యేకంగా పేర్కొంది.
ఈ నివేదికకోసం నొక్కాల్సిన లింక్..
https://www.niti.gov.in/sites/default/files/2024-08/Pathways_and_Strategy_for_Accelerating_Growth_in_Edible_Oil_towards_Goal_of_Atmanirbharta_August%2028_Final_compressed.pdf
***
(Release ID: 2049973)
Visitor Counter : 152