రక్షణ మంత్రిత్వ శాఖ
భారత్ - దక్షిణాఫ్రికా 12 వ నౌకాదళ సిబ్బంది చర్చలు
Posted On:
29 AUG 2024 3:50PM by PIB Hyderabad
భారత్-దక్షిణాఫ్రికా దేశాల నావికాదళాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం దిశగా ఆగస్ట్ 27-28 తేదీల్లో న్యూఢిల్లీ వేదికగా 12వ భారత్-దక్షిణాఫ్రికా నావికాదళ సిబ్బంది చర్చలు జరిగాయి. భారత నౌకాదళానికి చెందిన ఏసీఎన్ఎస్ (ఎఫ్‌సీఐ) రియర్ అడ్మిరల్ నిర్భయ్ బప్నా, దక్షిణాఫ్రికా నావికాదళం మారిటైమ్ స్ట్రాటజీ చీఫ్ డైరెక్టర్ రియర్ అడ్మిరల్ డేవిడ్ మానింగి మఖోంటో నేతృత్వంలో జరిగిన ఈ చర్చల్లో నౌకాదళ సంబంధాలు, కార్యాచరణ సమన్వయ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకున్నారు.
ఈ ఏడాది ద్వైపాక్షిక చర్చల్లో పలు కీలక రంగాలపై అధికారులు దృష్టి సారించారు. సన్నద్ధత, సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో కార్యాచరణ శిక్షణ వంటి అంశాలపై ప్రధానంగా చర్చిస్తూ దేశాల మధ్య భవిష్యత్ సహకారానికి బలమైన పునాది వేశారు. ఇరు వ్యవస్థల మధ్య సురక్షిత సమాచార మార్పిడి వ్యవస్థ ఏర్పాటుపై వారు చర్చించారు. సముద్ర రంగంలో రోజు రోజుకు నెలకొంటున్న సంక్లిష్టతలను పరిష్కరించడానికి ఇబ్సామార్ (ఇండియా-బ్రెజిల్-దక్షిణాఫ్రికా మారిటైం ఎక్స్ ర్ సైజ్ - IBSAMAR) వంటి నిరంతర విన్యాసాల ద్వారా పరస్పర కార్యాచరణ చర్యలను అధికారులు అన్వేషించారు.
అణు, జీవ, రసాయన, రక్షణ (ఎన్‌సిబిడి), నష్టనివారణ అంశాల్లో ఉత్తమ పద్ధతుల మార్పిడికి ఉన్న అవకాశాలు, నిపుణుల మార్పిడి (ఎస్ఎంఈఈ) ద్వారా డైవింగ్ సాయం అనే అంశాలపై అధికారులు చర్చించారు. సిబ్బంది బదలాయింపు, ఆయా శిక్షణా కేంద్రాల్లో సిబ్బంది అధునాతన శిక్షణ కోర్సులను పొందే అవకాశాలపై చర్చించారు.
ఇరు దేశాల మధ్య సాగిన చర్చలు సముద్ర వ్యాపార భద్రత, కార్యాచరణ సహకారం కోసం భాగస్వామ్య దార్శనికతకు ఉదాహరణగా నిలుస్తాయి. దక్షిణాఫ్రికా, భారత నావికాదళాల మధ్య బలమైన సహకారాన్ని పెంపొందించడానికి ఒక వేదికగా ఈ చర్చలు నిలుస్తాయి.
****
(Release ID: 2049966)