ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
జాతీయ పారిశ్రామిక కారిడార్ నిర్మాణ కార్యక్రమం కింద 12 పారిశ్రామిక సంగమాలు/నగరాలకు మంత్రిమండలి ఆమోదం
స్వర్ణ చతుర్భుజిలోని కీలక ప్రదేశాల్లో వెలిసే అత్యాధునిక పారిశ్రామిక నగరాల హారంతో భారత్ త్వరలో శోభిల్లుతుంది;
భారత పారిశ్రామిక రంగాన్ని విప్లవాత్మకంగా తీర్చిదిద్దడం కోసం రూ.28,602 కోట్ల విలువైన 12 ప్రాజెక్టులకు ప్రభుత్వ ఆమోదం;
సరికొత్త అత్యాధునిక పారిశ్రామిక నగరాలకు డిమాండ్ ఏర్పడేలోపే
‘ప్లగ్-అండ్ -ప్లే’.. ‘వాక్-టు-వర్క్’ విధానంలో ప్రపంచ ప్రమాణాలతో అవి రూపుదిద్దుకుంటాయి;
పెట్టుబడులను ఆకర్షించే దిశగా సమతుల ప్రాంతీయాభివృద్ధికి ఊతమిస్తూ బలమైన, సుస్థిర మౌలిక సదుపాయాల కల్పన;
వికసిత భారత్ దృక్కోణంతో రూపొందే ఈ ప్రాజెక్టులు పెట్టుబడిదారులకు తక్షణ భూ కేటాయింపు వెసులుబాటుతో అంతర్జాతీయ విలువ శ్రేణిలో భారత్ పాత్రను సుస్థిరం చేస్తాయి
Posted On:
28 AUG 2024 3:20PM by PIB Hyderabad
కేంద్ర ప్రభుత్వం నేడు తీసుకున్న అత్యంత కీలక నిర్ణయంతో భారత్ త్వరలోనే అత్యాధునిక పారిశ్రామిక నగరాల హారంతో శోభిల్లనుంది. ఈ మేరకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఆర్థిక వ్యవహారాల కమిటీ (సిసిఇఎ) జాతీయ పారిశ్రామిక కారిడార్ నిర్మాణ కార్యక్రమం (ఎన్ఐసిడిపి) కింద రూ.28,602 కోట్ల విలువైన ప్రతిపాదిత 12 ప్రాజెక్టులకు ఆమోదముద్ర వేసింది. భారత పారిశ్రామిక రంగంలో విప్లవాత్మక పరివర్తనను తెచ్చే ఈ నిర్ణయం ఫలితంగా ఆర్థిక వృద్ధిని, అంతర్జాతీయ పోటీతత్వాన్ని గణనీయంగా ప్రోత్సహించగల పారిశ్రామిక సంగమాలు, నగరాలతో బలమైన వ్యవస్థ రూపుదిద్దుకుంటుంది.
దేశంలోని 10 రాష్ట్రాలలో అమలయ్యే ఈ వ్యూహాత్మక ప్రణాళిక కింద 6 ప్రధాన కారిడార్లలో ఈ 12 ప్రాజెక్టులు నిర్మితమవుతాయి. భారత్ తన తయారీ సామర్థ్యంతోపాటు ఆర్థిక వృద్ధిని పెంచుకునే కృషిలో గణనీయ పురోగతిని ఇవి ప్రతిబింబిస్తాయి. ఈ మేరకు ఉత్తరాఖండ్‌లోని ఖుర్పియా; పంజాబ్‌లోని రాజ్‌పురా-పాటియాలా; మహారాష్ట్రలోని డిఘి; కేరళలోని పాలక్కాడ్; ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా, ప్రయాగ్‌రాజ్; బీహార్‌లోని గయ; తెలంగాణలోని జహీరాబాద్; ఆంధ్రప్రదేశ్‌లోని ఓర్వకల్, కొప్పర్తి; రాజస్థాన్‌లోని జోధ్‌పూర్-పాలి ప్రాంతాల్లో ఈ పారిశ్రామిక ప్రాంతాలు రూపుదిద్దుకుంటాయి.
కీలకాంశాలు:
వ్యూహాత్మక పెట్టుబడులు: దేశంలో శక్తిమంతమైన పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహించడం లక్ష్యంగా ‘ఎన్ఐసిడిపి’కి ప్రభుత్వం రూపకల్పన చేసింది. దీనికింద భారీ ‘యాంకర్’ పరిశ్రమలతోపాటు సూక్ష్మ-చిన్న-మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఇ) రెండింటిలోనూ పెట్టుబడుల సౌలభ్యం కల్పిస్తుంది. భారత్ 2030 నాటికి 2 ట్రిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యం సాధించడంలో ఈ పారిశ్రామిక సంగమాలు ఉత్ప్రేరకాలుగా తోడ్పడతాయి. అంతర్జాతీయ స్థాయిలో స్వావలంబన, పోటీతత్వం ప్రదర్శించగల భారత్‌ను రూపొందించడంలో ప్రభుత్వ దార్శనికతను ఇవి ప్రతిబింబిస్తాయి.
అత్యాధునిక నగరాలు-ఆధునిక మౌలిక సదుపాయాలు: ఈ సరికొత్త అత్యాధునిక పారిశ్రామిక నగరాలకు ‘‘డిమాండ్ ఏర్పడేలోపే’’ అవి ‘ప్లగ్-అండ్-ప్లే’, ‘వాక్-టు-వర్క్’ విధానంలో ప్రపంచ ప్రమాణాలతో రూపుదిద్దుకుంటాయి. ఈ విధానంతో నగరాలు సుస్థిర, సమర్థ పారిశ్రామిక కార్యకలాపాలకు మద్దతిచ్చే అధునాతన మౌలిక సదుపాయాలు సమకూరుతాయి.
***
(Release ID: 2049609)
Visitor Counter : 135
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Hindi_MP
,
Nepali
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam