శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
మోదీ ప్రభుత్వ కొత్త జీవ ఆర్థిక విధానంతో ప్రపంచ అగ్రగామిగా భారత్: కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
“ప్రపంచ జీవ సాంకేతిక కేంద్రంగా భారత్ ఆవిర్భవిస్తున్నందున, నూతన జీవసాంకేతిక వృద్ధిలో విజేతగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి”
కీలక మైలురాయి కానున్న బయో-ఈ3 విధానం: డాక్టర్ సింగ్
గణనీయ వృద్ధి సాధించిన భారత జీవ ఆర్థిక వ్యవస్థ... 2014లో 10 బిలియన్ డాలర్ల నుంచి 2024లో దాదాపు 130 బిలియన్ డాలర్లకు; 2030 నాటికి 300 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని అంచనా
Posted On:
26 AUG 2024 12:59PM by PIB Hyderabad
“మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త జీవ ఆర్థిక విధానం రానున్న సంవత్సరాల్లో భారత్‌ను ప్రపంచంలో అగ్రగామిగా నిలబెడుతుంది” అని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. భారతదేశ తయారీ రంగంలో పరివర్తనాత్మక మార్పును తీసుకురాబోతున్న ప్రతిష్టాత్మక బయోఈ3(ఆర్థిక, ఉపాధి, పర్యావరణానికి జీవసాంకేతికత) విధానంపై ఇటీవలి కేంద్ర మంత్రివర్గ నిర్ణయాన్ని ఆయన మీడియాకు వివరించారు.
ప్రపంచ జీవసాంకేతిక కేంద్రంగా భారత్ ఆవిర్భవిస్తున్నందున ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రపంచవ్యాప్తంగా జీవసాంకేతికత వృద్ధిలో విజేతగా ప్రశంసలు దక్కుతున్నాయని డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. ఆర్థిక, ఆవిష్కరణ, ఉద్యోగాలు, పర్యావరణ నిబద్ధతలకు ఇది భరోసానిస్తోందని అన్నారు.
సంప్రదాయ వినియోగ పద్ధతుల నుంచి అధిక పనితీరు, పునరుత్పాదక జీవ ఉత్పత్తుల తయారీ దిశగా ముందడుగు వేయడం ద్వారా స్వచ్ఛమైన, హరిత, మరింత సౌభాగ్యవంతమైన భారతదేశమే లక్ష్యంగా ముందుచూపుతో ఈ విధానానికి రూపకల్పన చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టి కలిగిన నాయకత్వాన్ని శాస్త్ర, సాంకేతిక మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రశంసించారు.
జీవ ఆర్థిక వ్యవస్థలో ఎదుగుదలపై శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి(స్వతంత్ర హోదా), ఎర్త్ సైన్సెస్ శాఖ సహాయ మంత్రి(స్వతంత్ర హోదా), పీఎంఓ సహాయ మంత్రి, అంతరిక్ష, అణుశక్తి విభాగాలు, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ... “భారత జీవ ఆర్థిక వ్యవస్థ గణనీయ వృద్ధిని సాధించింది. ఇది 2014లో 10 బిలియన్ డాలర్లు ఉండగా 2024లో 130 బిలియన్ డాలర్లకు ఎదిగింది. 2030 నాటికి ఇది 300 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. ఈ ఎదుగుదల భారతదేశ పటిష్టమైన ఆర్థిక వృద్ధిని ప్రతిబింబిస్తోంది. వృద్ధి స్ఫూర్తిని ప్రేరేపించడంతో పాటు 4వ పారిశ్రామిక విప్లవంలో భారత్‌ను శక్తిమంతమైన అగ్రగామిగా ఇటీవలి విధానం నిలబెడుతుంది” అని పేర్కొన్నారు.
“వృద్ధి గమనాన్ని బయోఈ3 పాలసీ వేగవంతం చేస్తుంది. కనిష్ట కార్బన ఉద్గారాలతో జీవ ఆధారిత ఉత్పత్తుల అభివృద్ధిని ప్రోత్సహించి 'మేక్ ఇన్ ఇండియా'కు గణనీయ తోడ్పాటును అందిస్తుంది.” అని డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు.
1) రసాయన ఆధారిత పరిశ్రమల నుంచి సుస్థిరమైన జీవ ఆధారిత విధానాలకు మారడం, 2) వృత్తాకార జీవ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడం, 3) వ్యర్థాల వినియోగం కోసం వినూత్న కార్యక్రమాల ద్వారా ల్యాండ్ ఫిల్స్, గ్రీన్‌హౌజ్ వాయువులు, జీవద్రవ్యం నుంచి కార్బన ఉద్గారాలను సున్నాకు తీసుకురావడం, 4) జీవ ఆధారిత ఉత్పత్తుల అభివృద్ధి, ఉద్యోగ కల్పనను ప్రోత్సహించడం ద్వారా వాతావరణ మార్పు, క్షీణిస్తున్న పునరుత్పాదక వనరులు వంటి క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొనేందుకు బయోఈ3 విధానాన్ని రూపొందించినట్లు డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.
బయో ఆధారిత రసాయనాలు, స్మార్ట్ ప్రొటీన్లు, బయో థెరఫ్యూటిక్స్, వాతావరణ పరిస్థితులను తట్టుకునే వ్యవసాయం, కార్బన్ డయాక్సైడ్‌ను వేరు చేసి, శుద్ధి చేయడం వంటి విభిన్న రంగాల్లో వ్యవస్థాపకతను ఈ విధానం ప్రోత్సహిస్తుందని కీలక అంశాలను వివరిస్తూ డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు.
ఈ విధానం ద్వారా అధునాతన జీవ ఆధారిత తయారీ కేంద్రాలు, జీవ ఆధారిత పారిశ్రామిక క్లస్టర్లు, జీవ ఆధారిత ఏఐ కేంద్రాలు ఏర్పాటు కానున్నట్టు ఆయన తెలిపారు.
అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నైతిక జీవ భద్రత నియమాలు, అంతర్జాతీయ నియంత్రణపై మరింత దృష్టి సారించినట్టు మంత్రి పేర్కొన్నారు.
జీవ ఆధారిత తయారీ కేంద్రాల ప్రాముఖ్యతను వివరిస్తూ ఇవి జీవ ఆధారిత ఉత్పత్తుల అభివృద్ధి, ఉత్పత్తి, వాణిజ్యీకరణకు కీలకమైన కేంద్రీకృత సౌకర్యాలుగా సేవలందిస్తాయని డాక్టర్ సింగ్ ప్రధానంగా పేర్కొన్నారు. “లాబొరేటరీ స్థాయి, వాణిజ్య స్థాయి తయారీ మధ్య ఉన్న అంతరాన్ని ఈ కేంద్రాలు తగ్గిస్తాయి. అంకుర సంస్థలు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, వ్యవస్థాపక తయారీదారుల మధ్య సహకారాన్ని ప్రోత్సహిస్తాయి.” అని ఆయన పేర్కొన్నారు.
ఎంఆర్ఎన్ఏ -ఆధారిత టీకాలు, ప్రొటీన్లు వంటి ఉత్పత్తులను భారీ ఎత్తున తయారు చేయడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. భారీ స్థాయిలో జీవసంబంధ సమాచారాన్ని విశ్లేషించడానికి ఏఐని అనుసంధానం చేయడం ద్వారా కొత్త జన్యు చికిత్సలు, ఆహార తయారీ ప్రక్రియలకు మార్గం చూపడంలో బయో-ఏఐ కేంద్రాలు ఆవిష్కరణగా మారుతాయని ఆయన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
ఉద్యోగాల సృష్టిలో ఈ విధానానికి ఉన్న సామర్థ్యాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, “జీవ ఆధారిత తయారీ కేంద్రాలు ఏర్పాటు చేసే ప్రాంతాల్లో, ప్రత్యేకించి టైర్-II, టైర్-III నగరాల్లో గణనీయంగా ఉద్యోగ అవకాశాల సృష్టి జరుగుతుందని ఆశిస్తున్నాం. ఈ కేంద్రాలు స్థానికంగా జీవద్రవ్య మూలాలపై ప్రభావాన్ని పెంచుతాయి. తద్వారా ఈ ప్రాంతాల్లో ఆర్థికాభివృద్ధి పెరుగుతుంది.” డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు.
దేశ ఆర్థిక, పర్యావరణ, ఉద్యోగాలపై దృష్టి పెట్టడం ద్వారా 'వికసిత భారత్'(అభివృద్ధి చెందిన భారత్) సాధించాలనే భారతదేశ సంకల్పానికి బయోఈ3 విధానం తోడ్పాటును అందిస్తుందని డాక్టర్ జితేంద్ర సింగ్ పునరుద్ఘాటించారు. దేశాభివృద్ధికి, సుస్థిరతకు శాస్త్ర విధానాలు ఎలా సమర్థంగా పనిచేస్తాయో చెప్పడానికి ఈ విధానం ఒక ప్రమాణాన్ని నిర్దేశిస్తుందని ఆయన తెలిపారు.
***
(Release ID: 2048978)
Visitor Counter : 145