రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

మెంఫిస్ లో నేషనల్ సివిల్ రైట్స్ మ్యూజియంను సందర్శించిన రక్షణ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్


ప్రవాస భారతీయులతో చర్చా కార్యక్రమంతో ముగిసిన యూఎస్ పర్యటన

భారత్, అమెరికా మధ్య సుహృద్భావ సంబంధాలకు మీరే సజీవ వారధులంటూ ఎన్నారైలకు ప్రశంస

Posted On: 26 AUG 2024 9:58AM by PIB Hyderabad

రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆదివారం (ఆగస్టు 25, 2024) టెన్నెసీలోని మెంఫిస్ లో ఉన్న నేషనల్ సివిల్ రైట్స్ మ్యూజియంను సందర్శించారు. అనంతరం ప్రవాస భారతీయులతో సంభాషించారు. 17వ శతాబ్దం నుంచి నేటి వరకు అమెరికాలో పౌర హక్కుల సాధనకు జరిగిన ఉద్యమాల చరిత్రను నేషనల్ సివిల్ రైట్స్ మ్యూజియం తెలియజేస్తుంది. 1968లో మార్టిన్ లూథర్ కింగ్ హత్యకు గురైన ప్రదేశంలో దీనిని నిర్మించారు. మహాత్మాగాంధీ సాగించిన అహింసాయుత పోరాట స్ఫూర్తి చాటి చెప్పేలా ఆయన ప్రతిమను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు.

మెంఫిస్, అట్లాంటా, నాష్ విల్లే పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న భారతీయులతో శ్రీ రాజ్ నాథ్ సింగ్ ముచ్చటించారు. సామాజిక, ఆర్థిక, సైన్స్ రంగాల్లో వారు సాధించిన విజయాలు, చేస్తున్న కృషిని ప్రశంసించారు. వారిని భారత్, అమెరికా మధ్య ఉన్న స్నేహపూర్వక సంబంధాలకు సజీవ వారధులుగా  అభివర్ణించారు.

మహాత్మా గాంధీ 150 వ జయంతి సందర్భంగా నేషనల్ సివిల్ రైట్స్ మ్యూజియం సమీపంలో ఆయన విగ్రహాన్ని, ‘గాంధీ వే’ పేరుతో రెండు స్ట్రీట్ సిగ్నళ్లు ఏర్పాటు చేయడంలో ప్రవాస భారతీయులు చేసిన కృషిని రక్షణ మంత్రి కొనియాడారు. ఆయన పర్యటనలో ఇదే చివరి కార్యక్రమం. ఈ సందర్భంగా గత దశాబ్ద కాలంలో భారత్  ప్రగతి పరుగులు, ఉజ్వల భవిష్యత్తు గురించి శ్రీ రాజ్ నాథ్ సింగ్ ప్రధానంగా ప్రస్తావించారు.

 

***



(Release ID: 2048868) Visitor Counter : 12