ప్రధాన మంత్రి కార్యాలయం
పారిస్ ఒలింపిక్ క్రీడా బృందంతో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ సంభాషణ
“ ఎవరూ ఎప్పటికీ ఓడిపోని, అందరూ పాఠాలు నేర్చుకునే ఏకైక రంగం క్రీడలు ”
“ప్రతి క్రీడాకారునిపట్ల శ్రద్ధ తీసుకున్నాం”
“భారతదేశ పేరుప్రతిష్టలకు భంగం కలగకుండా క్రీడాకారులు కృషి చేశారు. ఈ ఘనత మనం సాధించిన అతిపెద్ద సంపద”
“ఈ పారిస్ ఒలింపిక్స్ పలు విధాలుగా భారతదేశానికి చారిత్రాత్మకమైనవి”
“విజయం మనకోసం ఎదురు చూస్తూ వుంది. మనం ఆగే ప్రసక్తే లేదు”
“ఖేలో ఇండియా అనేది భారతదేశ కీలక కార్యక్రమం. దీనికి తగిన ప్రాధాన్యత, బలం అవసరం”
“మీరు నా 2036 బృందంలో సైనికులు. మీ సహకారంతో ఇంతవరకూ ప్రపంచంలో ఎన్నడూ జరగనివిధంగా 2036లో మనదేశంలో ఒలింపిక్స్ క్రీడలు నిర్వహించబోతున్నాం”
Posted On:
16 AUG 2024 11:50AM by PIB Hyderabad
పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత క్రీడా బృందంతో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ సంభాషించారు. ఈ కార్యక్రమం ప్రధాని నివాసమైన 7 లోక్ కళ్యాణ్ మార్గ్ లో నిర్వహించారు.
ఈ సందర్భంగా పారిస్ ఒలింపిక్ క్రీడా బృందాన్ని ఉద్దేశించి మాట్లాడిన ఆయన ఎవరూ ఓడిపోని ప్రతి ఒక్కరూ నేర్చుకునే ఒకే ఒక రంగం క్రీడలని ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఒక పతకం కూడా సాధించనివారు తాము ఓడిపోయామనే ఆలోచనను పక్కన పెట్టాలని సూచించారు. మీరు భారతదేశ పతాకాన్ని చేతబూని క్రీడల్లో పాల్గొని ఎంతో కొంత నేర్చుకున్నారు అని ప్రధాని అన్నారు. పతకాలు గెలవనివారు తాము వెనకబడిపోయామని అనుకోవద్దని, తమ తమ అనుభవాల ద్వారా నేర్చకున్నామని అనుకోవాలని వారికి ప్రధాని మార్గనిర్దేశనం చేశారు. ప్రధాని చెప్పిన సలహాను క్రీడాకారులందరూ ఏకగ్రీవంగా అంగీకరించారు.
పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొన్న క్రీడాకారులు తమ అనుభవాలను వివరించాలని, ఇతర దేశాల క్రీడాకారులను కలుసుకొని మాట్లాడిన విషయాలను తెలపాలని ప్రధాని కోరారు. దీనికి స్పందించిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు లక్ష్యసేన్ తన టోర్నమెంట్ పోటీలు సుదీర్ఘంగా సాగాయని తనకు ఇవి మొదటి ఒలింపిక్స్ క్రీడలని ఎన్నో గొప్ప విషయాలను నేర్చుకున్నానని అన్నారు. ఖాళీ సమయంలోను, భోజనాలకు వెళ్లినప్పుడు ఇతర దేశాల క్రీడాకారులతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకున్నట్టు ప్రధానికి వివరించారు. భారీ స్టేడియంలో, పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రేక్షకుల ముందు ఆడుతున్నప్పుడు మొదటి రెండు మూడు మ్యాచుల సందర్భంగా కాస్త ఆందోళనకు గురయ్యానని అన్నారు. టోర్నమెంట్ ముందుకు సాగేకొద్దీ తనలో ఆత్మవిశ్వాసం పెరిగిందని లక్ష్యసేన్ అన్నారు. విజయానికి చాలా దగ్గరగా వచ్చి పతకం సాధించలేకపోవడంతో చాలా ఆవేదన చెందినట్టు అతను ప్రధానితో అన్నారు. రాబోయే రోజుల్లో తాను తన ఆటను మెరుగు పరుచుకుంటానని ప్రధానికి హామీ ఇచ్చారు. క్రమశిక్షణ అవసరాన్ని ప్రధాని తన ప్రసంగంలో వివరించారు. ఒలింపిక్ క్రీడలు జరిగినప్పుడు వాటిని తిలకించే భారతీయుల సంఖ్య గణనీయంగా పెరిగిందని భారతీయ క్రీడాకారులు ఇతర దేశాల క్రీడాకారుల స్థాయిలో పోటీ పడగలరనే భావన భారతీయుల్లో కలుగుతోందని ప్రధాని అన్నారు.
పారిస్ ఒలింపిక్స్ సమయంలో క్రీడాకారులపై వేడిగాలుల ప్రభావం తగ్గించడానికి అధికారులు ఎంతో వేగంగా నిర్ణయం తీసుకొని ఎయిర్ కండిషనర్లని ఏర్పాటు చేశారని ప్రధాని ప్రశంసించారు. ప్రతి క్రీడాకారునిపట్ల శ్రద్ధ తీసుకోవడం జరిగిందని అన్నారు.
ఒలింపిక్ క్రీడా పోటీల్లో రెండోసారి పాల్గొన్న షూటింగ్ క్రీడాకారిణి అంజుమ్ మోడ్గిల్ మాట్లాడుతూ గెలిచినప్పుడు అపరిమితమైన సంతోషాన్ని పొందడం, అపజయం పొందినప్పుడు అపరిమితమైన నిరాశకలగడం ప్రతి క్రీడాకారునికి ప్రతిసారీ ఎదురయ్యే అనుభవమని అది ఈ పోటీల్లో తాను పొందానని అన్నారు. మను గెలిచినప్పుడు, పలువురు భారత క్రీడాకారులు నాలుగో స్థానంలో నిలిచినప్పుడు, వినేశ్ విషయంలో వచ్చిన విషాదకర ఫలితం, హాకీ పతకం విషయంలో వచ్చిన ఫలితం తదితర ఘటనలపై మాట్లాడిన అంజుమ్ ఆయా సందర్భాల్లో కలిగిన ఆనందాలను , విషాదాలను పోల్చుతూ మాట్లాడారు. క్రీడాకారులు ప్రతి రోజూ పొందిన వివిధ రకాల భావావేశాలను దేశం యావత్తూ పొందిందని ఆమె అన్నారు. దేశంలో క్రీడా సంస్కృతిని ప్రోత్సహించడానికి సరైన సమయంలోనే ఒలింపిక్స్ క్రీడలు జరిగాయని, వీటి ద్వారా క్రీడాకారుల ప్రయాణం ఎలా వుంటుందో అర్థం చేసుకోవడానికి ప్రజలకు వీలు కలుగుతుందని అన్నారు. నేడు వచ్చిన సానుకూల మార్పులు భవిష్యత్తులో మెరుగుపడడానికి దోహదం చేస్తాయని అన్నారు. ఆమె అభిప్రాయాలతో అంగీకరించిన ప్రధాని అవే భావాలు దేశమంతా నెలకొన్నాయని అన్నారు.
పురుషుల హాకీ జట్టు గోల్‌కీపర్ శ్రీ పీఆర్ శ్రీజేష్ తన రిటైర్‌మెంట్‌పై ముందుగానే నిర్ణయం తీసుకోవడంపై ప్రధాని ఆరా తీశారు. దీనికి స్పందించిన శ్రీజేష్ తాను కొన్నేళ్లుగా రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తూ వచ్చానని అయితే ఇరవై ఏళ్లు దేశానికి సేవ చేశాక, ఘనమైన ఒలింపిక్స్ వేదికమీదనుంచి రిటైర్మెంట్ ప్రకటన చేయాలని భావించినట్టు ప్రధానికి తెలియజేశారు. టీమ్ శ్రీజేష్‌కి ఇచ్చిన ఘనమైన వీడ్కోలును ప్రత్యేకంగా పేర్కొన్న ప్రధాని, అతను లేని లోటు టీమ్ సభ్యులకు కలుగుతుందని అన్నారు. సెమీ ఫైనల్‌లో ఓడిపోవడం నిరుత్సాహపరిచిందని, అయితే మొత్తం జట్టు కాంస్య పతకాన్ని తనకోసం గెలవాలని ఆడిందని శ్రీజేష్ పేర్కొన్నాడు. పోడియం నుంచి జట్టుకు వీడ్కోలు పలికే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నాడు.
గ్రేట్ బ్రిటన్ తో జరిగిన హాకీ మ్యాచ్ సందర్భంగా మొదటి క్వార్టర్ సమయానికి భారత టీమ్ సభ్యుల సంఖ్య 10కి తగ్గిందని అలాంటి సమయంలో ఎదుర్కొన్న సమస్యల గురించి ప్రధాని ఆరా తీశారు. దీనిపై మాట్లాడిన జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ కోచింగ్ సిబ్బంది పోషించిన కీలక పాత్రను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆటకు సంబంధించిన ప్రణాళికల్ని పక్కాగా అమలు చేయడంతో టీమ్‌లో ఉత్సాహం పెరిగిందని అన్నారు. హాకీలో గ్రేట్ బ్రిటన్ కు, భారతదేశానికి మధ్యన కొనసాగుతున్న క్రీడాపరమైన శత్రుత్వం (పోటీ) గురించి అతను ప్రస్తావించినప్పుడు దీనికి స్పందించిన ప్రధాని ఇరు దేశాల మధ్యన క్రీడాపరమైన శత్రుత్వం 150 సంవత్సరాలుగా కొనసాగుతోందని సరదాగా అన్నారు. వెంటనే బదులిచ్చిన హర్మన్ ప్రీత్ సింగ్ తాము ఆ సంప్రదాయాన్ని అనుసరిస్తున్నామని అన్నారు. 52 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఒలింపిక్స్‌లో ఆస్ట్రేలియా హాకీ టీమ్ పై గెలిచామని కెప్టెన్ అన్నారు. హాకీ టీమ్ విజయాన్ని పురస్కరించుకొని కెప్టెన్ కు ప్రధాని అభినందనలు తెలిపారు. ఒలింపిక్స్ లో వరుసగా పతకాలు సాధించామని ప్రత్యేకంగా ప్రధాని పేర్కొన్నారు.
మల్లయోధుడు అమన్ షెరావత్ మాట్లాడుతూ తాను చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకున్నానని పదేళ్ల వయస్సునుంచే అనేక కష్టాలను అనుభవించానని ప్రధానికి వివరించారు. పతకాన్ని సాధించడంద్వారా తన తల్లిదండ్రులకు నివాళి ఘటించానని అతను అన్నారు. క్రీడాకారునిగా తాను అభివృద్ది చెందడంలో టాప్స్, సాయ్, డబ్ల్యు ఎఫ్ ఐ చేసిన కృషి ఎంతో వుందని అన్నారు.
క్రీడా బృందంలోని క్రీడాకారులకు ఏవైనా మారుపేర్లు తగిలించారా అని ప్రధాన మంత్రి ఆరా తీశారు. దీనికి బీహార్ శాసనసభ సభ్యురాలు కూడా అయిన షూటర్ శ్రేయాస్ సింగ్ స్పందించారు. తనను తన సహచరులు ‘విధాయక్ దీదీ’ అని పిలుస్తారని ప్రధానికి వివరించారు.
సామాజిక మాధ్యమాల వినియోగం గురించి ప్రదాని ఆరా తీశారు. దీనికి స్పందించిన హాకీ కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ ఒలింపిక్స్ క్రీడలు జరుగుతున్నంతకాలం మొబైల్ ఫోన్లను, సామాజిక మాధ్యమాలను వినియోగించవద్దని మొత్తం టీమ్ నిర్ణయించిందని అన్నారు. వాటివల్ల సానుకూలమే కాదు, ప్రతికూల ప్రభావాలు కూడా వుంటాయనే తాము ఆ పని చేశామని అన్నారు. వారు అనుసరించిన విధానాన్ని ప్రశంసించిన ప్రధాని దాన్ని అనుసరించాలంటూ నేటి యువతకు సలహా ఇవ్వాలని హర్మన్ ప్రీత్ సింగ్ కు సూచించారు. మొదటి సారి ఒలింపిక్ క్రీడల్లో పాల్గొన్న రితికా హుడా ఒక పాయింట్ తేడాతో ఓడిపోయారు. విజయాలు సాధించడానికి ఆమెకు ఇంకా వయస్సు వుందని అంటూ ప్రధాని ప్రోత్సాహకరంగా మాట్లాడారు. భవిష్యత్తులో ఆమె దేశానికి కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారని ప్రధాని ధీమాను వ్యక్తం చేశారు.
పారిస్ ఒలింపిక్స్ ప్రధాన వైద్యాధికారిగా సేవలందించిన డాక్టర్ దిన్ షా పార్దీవాలా మాట్లాడుతూ క్రీడా పోటీల సమయంలో మనదేశ ఆటగాళ్లకు చాలా తక్కువ గాయాలు అయ్యాయని అన్నారు. గత ఒలింపిక్స్‌లో మూడు నాలుగు సీరియస్ గాయాలు అయ్యాయని ఈ సారి మాత్రం ఒకటి రెండు సీరియస్ గాయాలకు మాత్రమే ఆపరేషన్ అవసరమైందని అన్నారు. పాలిక్లినిక్ ను, ఇతర సదుపాయాలను ఒకే భవంతిలోనే ఏర్పాటు చేశారని దాంతో క్రీడాకారులు చాలా సులువుగా కోలుకున్నారని, గాయాలకు చికిత్సలు సులువుగా జరిగాయని, అలాగే పోటీలకు తయారీ ఇబ్బందులు లేకుండా జరిగిందని అన్నారు. అది క్రీడాకారుల్లో అంతులేని ఆత్మవిశ్వాసాన్ని నెలకొల్పిందని అన్నారు. భవిష్యత్తులో కూడా క్రీడాకారులకు వైద్య సేవలందించాలనే తన ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు. ఆయన కృషిని ప్రధాని ప్రశంసించారు. గాయాలు తగ్గించుకోవడమనేది క్రీడల్లోని ప్రతి అంశంలో ప్రావీణ్యతను కలగజేస్తుందని అన్నారు. చిన్న చిన్న సమస్యలను, అవరోధాలను తమకు తాము ఎదుర్కొనేలా క్రీడాకారులు కృషి చేయడాన్ని ప్రధాని ప్రశంసించారు. తద్వారా సీరియస్ గాయాలయ్యే అవకాశం పూర్తిగా తగ్గుతుంది. మీరు మీ దేహాలకు కఠిన శిక్షణ ఇచ్చి వుంటారు, చాలా కష్టపడి పని చేసి వుంటారనడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి మీ అందరూ ప్రశంసలకు అర్హులు అని ప్రధాని అన్నారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర క్రీడాశాఖ మంత్రి శ్రీ మాన్ సుఖ్‌మాండవీయా, కేంద్ర క్రీడాశాఖ సహాయ మంత్రి శ్రీమతి రక్షా ఖడ్సే , భారతీయ ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు శ్రీ పిటి ఉష పాల్గొన్నారు. వారిని పలకరించిన ప్రధాని క్రీడాకారులందరికీ సాదర స్వాగతం పలికి వారి కృషిని ప్రశంసించారు. భారతదేశ క్రీడాకారులకున్న పట్టుదల, క్రమశిక్షణ, వ్యవహారశైలిని మొత్తం ప్రపంచమే మెచ్చుకుంటున్నదని ప్రధాని గర్వంగా అన్నారు. భారతదేశ పేరుప్రతిష్టలకు భంగం కలగకుండా క్రీడాకారులు కృషి చేశారు. ఈ ఘనత మనం సాధించిన అతిపెద్ద సంపద అని ప్రధాని మెచ్చుకున్నారు. మొత్తం క్రీడా బృంద సభ్యులందరికీ అబినందనలు తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా భారతదేశ జాతీయ పతాక గౌరవాన్ని ఇనుమడించిన తర్వాత మన క్రీడాబృంద సభ్యులు దేశానికి తిరిగి వచ్చారంటూ ప్రధాని సగర్వంగా పేర్కొన్నారు. పారిస్ ఒలింపిక్స్ కు బయలుదేరడానికి ముందు క్రీడాబృందంతో తాను జరిపిన సంభాషణను ప్రధాని గుర్తు చేసుకున్నారు. ప్రతి ఒక్కరూ తమ శాయశక్తులా కృషి చేశారని ఆయన అన్నారు. భారతీయ క్రీడాకారులది చిన్నవయస్సేనని వారు ఇప్పుడు సాధించిన అనుభవంతో ముందు ముందు విజయాలు సాధిస్తారని, అందుకు కావలసిన సమయం వారికి వుందని అన్నారు. ఈ అనుభవంద్వారా దేశం లబ్ధి పొందుతుందని అన్నారు.
ఈ పారిస్ ఒలింపిక్ప్ క్రీడలే అన్ని విధాలా భారతదేశానికి చరిత్రాత్మకమైనవని చెబుతూ... దేశంకోసం క్రీడాకారులు నెలకొల్పిన పలు రికార్డులను ప్రత్యేకంగా ప్రస్తావించారు. అవి లక్షలాది యువతకు స్ఫూర్తినిస్తాయని అన్నారు. భారత దేశం నుంచి వ్యక్తిగత విభాగాల్లో రెండు పతకాలు సాధించిన మొదటి భారతీయ మహిళా షూటర్ గా మను బాకర్ నిలిచారని, 125 సంవత్సరాల ఒలింపిక్స్ చరిత్రలో ఆమె ఈ రికార్డ్ సాధించారని ప్రధాని పేర్కొన్నారు. 52 సంవత్సరాల తర్వాత భారత హాకీ టీమ్ వరుసగా రెండు పతకాలు సాధించిందని, 21 సంవత్సరాల వయస్సులో అమన్ షెరావత్ పతకం గెలిచారని అన్నారు. మల్లయోధురాలు వినేశ్ ఫోగట్ రెజ్లింగ్ క్రీడలో ఫైనల్స్ కు చేరుకున్న మొదటి భారతీయ క్రీడాకారిణిగా రికార్డ్ సాధించారు. మొదటిసారిగా ఏడు షూటింగ్ ఈవెంట్లలో భారతీయ క్రీడాకారులు ఫైనల్స్ కు చేరుకున్నారని ప్రధాని గర్వంగా పేర్కొన్నారు. అలాగే విలువిద్యలో పతకంకోసం పోటీ పడిన మొదటి భారతీయ విలువిద్య క్రీడాకారులుగా ధీరజ్, అంకిత నిలిచారని ప్రధాని అన్నారు. ఒలింపిక్స్‌లో సెమీ ఫైనల్ కు చేరుకున్న ఏకైక పురుష భ్యాడ్మింటన్ ఆటగానిగా లక్ష్యసేన్ రికార్డ్ సాధించారని అన్నారు. స్టీపుల్ ఛేజ్ ఫార్మాట్లో ఫైనల్స్ కు ఎంపికైన మొదటి భారతీయ క్రీడాకారునిగా అవినాష్ సాబ్లే రికార్డ్ సాధించారని అన్నారు.
పతకాలు సాధించివారిలో ఎక్కువమంది 20 సంవత్సరాల వయస్సు కలిగినవారే నని ప్రధాని అన్నారు. టోక్యో ఒలింపిక్స్ కు, పారిస్ ఒలింపిక్స్ కు మధ్యన సమయం నాలుగేళ్లు వుండాల్సింది మూడేళ్ల లోపే వుందని మరొక ఏడాది సమయం వారికి లభించి వుంటే వారు మరింత బాగా తమ ప్రతిభను చూపేవారని ప్రధాని అన్నారు. భారతీయ క్రీడాకారులు తమ సుదీర్ఘ కెరీర్ లో ప్రసిద్ధి చెందిన టోర్నమెంట్లలో ఆడతారని, వారు తమ ప్రయాణాన్ని కొనసాగించాలంటూ ప్రధాని ప్రోత్సహించారు. మీరు ఒక మ్యాచ్ ను కూడా వదులుకోవద్దు. క్రీడల్లో భారతదేశ భవిష్యత్తు ఎలా వుండబోతున్నదనేదానికి ఈ యువ క్రీడాకారుల బృందమే నిదర్శనమని ప్రధాని అన్నారు. భారతదేశ క్రీడారంగం ప్రస్తుత దశకు పారిస్ ఒలింపిక్స్ క్రీడలు లాంచ్ ప్యాడ్ గా ఉపయోగపడ్డాయనే నమ్మకాన్ని ప్రధాని వ్యక్తం చేశారు. మనకోసం విజయం ఎదురుచూస్తోంది. మనం ఆగే ప్రసక్తే లేదు అని ప్రధాని క్రీడాకారుల్లో ఉత్సాహం నింపారు.
ప్రపంచస్థాయి క్రీడా వ్యవస్థను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని ప్రధాని ప్రత్యేకంగా వివరించారు. మారుమూల ప్రాంతాలకు చెందిన క్రీడాకరులను గుర్తించి వారిలోని ప్రతిభను వెలికితీయడం ముఖ్యమని ప్రధాని అన్నారు. ప్రతి పల్లె, పట్టణం నుంచి యువ ప్రతిభను ప్రోత్సహించడానికే ఖేలో ఇండియా కార్యక్రమం రూపొందించామని ఆయన ప్రస్తావించారు. ఈ సారి ఒలింపిక్ క్రీడాల్లో పాల్గొన్నవారిలో 28మంది ఆటగాళ్లు ఖేలో ఇండియా కార్యక్రమంనుంచి వచ్చినవారే అని ప్రధాని సంతోషంగా చెప్పారు. ఖేలో ఇండియా క్రీడాకారులుగా తమ క్రీడా ప్రయాణాన్ని మొదలుపెట్టిన అమన్, అమన్ జీత్, ధీరజ్, సర్వజోత్ మొదలైన క్రీడాకారుల పేర్లను ఆయన తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఖేలో ఇండియా భారతదేశానికి చాలా కీలకమైన కార్యక్రమమని, దీనికి మరింత ప్రాధాన్యత, బలం అవసరం అని ప్రధాని అన్నారు. ఖేలో ఇండియా ఆటగాళ్లను అధిక సంఖ్యలో తయారు చేస్తున్నామని అందుకోసం బడ్జెట్ కేలాయింపులు వరుసగా పెరుగుతున్నాయని తద్వారా ఆయా క్రీడాకారులు సదుపాయాలు,వనరుల కొరత లేకుండా శిక్షణ పొందుతారని ప్రధాని అన్నారు. ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనడానికంటే ముందు క్రీడాకారులందరూ అనేక అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడంపట్ల ప్రధాని సంతృప్తిని వ్యక్తం చేశారు. క్రీడాకారుల ఆహారంపట్ల, వారు ఉపయోగించే క్రీడా పరికరాల విషయంలో కోచులు, నిపుణులు శ్రద్ధ తీసుకున్నారని ప్రపంచస్థాయి సదుపాయాల కల్పనకు కృషి చేశారంటూ ప్రధాని ప్రశంసించారు. క్రీడాకారులను ప్రోత్సహించడంకోసం ప్రత్యేకమైన పరిస్థితులను కల్పించడం జరిగిందని ప్రధాని నొక్కి చెప్పారు. ఇది దేశ క్రీడా విధానాల్లో వచ్చిన మార్పు మాత్రమే కాదు, ఇది తన యువతరంపై భారతదేశం పెట్టుకున్న నమ్మకానికి ప్రతీక అని ప్రధాని గట్టిగా పేర్కొన్నారు.
క్రీడాకారులందరూ దేశ యువతకు స్ఫూర్తిగా నిలిచారని గత ఒలింపిక్స్ లో సాంకేతిక సమస్యలను ఎదుర్కొన్న మను బాకర్ తిరిగి తన సత్తా చాటారని ప్రధాని తన ప్రసంగంలో పేర్కొన్నారు. అంకిత తన అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారని, మనికా బాత్రా, శ్రీజా ఆకుల అందరి దృష్టిని ఆకర్షించారని ప్రధాని అన్నారు. నీరజ్ స్థిరత్వాన్ని, క్రమశిక్షణను పేర్కొన్న ప్రధాని అవరోధాలను అదిగమించి స్వప్నిల్ పతకాన్ని సాధించాడని, హాకీ టీమ్ సత్తా చాటిందని ప్రధాని ప్రశంసించారు. పతకాన్ని గెలిచినవారు కావచ్చు లేదా ఒకపాయింట్ లేదా కొన్ని సెకండ్ల తేడాతో గెలవలేనివారయినా కావచ్చు ప్రతి ఒక్కరు అదే తీర్మానాన్ని పునరావృతం చేశారు. పసిడి పతకాన్ని సాధించకుండా ఈ సిరీస్ ముగియదు అని చాటారని అన్నారు. క్రీడాకారులపై తన నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ ఈ దేశ యువత వారినుంచి చాలా నేర్చుకుంటుందని అన్నారు.
2036 లో ఒలింపిక్స్ పోటీలను నిర్వహించడానికి భారతదేశం తయారవుతోందని ఇంతవరకూ ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొన్నవారి సూచనలు, సలహాలు చాలా ముఖ్యమని ప్రధాని తన ప్రసంగంలో ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఒలింపిక్స్ ప్రణాళిక తయారీ దగ్గరనుంచి ఏర్పాట్లవరకూ, క్రీడల నిర్వహణనుంచి క్రీడాంశాల నిర్వహణవరకు, మీరు మీ అనుభవాలను, పరిశీలనలను రాసి వాటిని ప్రభుత్వంతో పంచుకోండి. వాటి ఆధారంగా ,వాటిలోని సూక్ష్మ విషయాలనుకూడా వదలకుండా వినియోగించుకుంటూ 2036 ఒలింపిక్స్ నిర్వహణకు తయారవుతామంటూ ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. 2036 ఒలింపిక్స్ నిర్వహణకు తయారుకావడానికి ఇంతకాలం మనం ఎదుర్కొన్న లోపాలు కూడా ఉపయోగపడతాయని ప్రధాని అన్నారు. ఒక విధంగా చెప్పాలంటే మీరు నా 2036 టీమ్ సభ్యులు. మీరందరూ నాకు సాయం చేయాలి. తద్వారా ఇంతవరకూ ప్రపంచంలో ఎన్నడూ జరగని విధంగా 2036 ఒలింపిక్స్ ను నిర్వహిస్తామని ప్రధాని ధీమావ్యక్తం చేశారు. ఇందుకోసం క్రీడా శాఖ ఒక ముసాయిదాను తయారు చేయాలని, క్రీడాకారులందరి దగ్గరనుంచి వివరంగా ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని అధికారులకు ప్రధాని ఆదేశాలిచ్చారు.
నేటి యువతను సామాజిక మాధ్యమాలద్వారా చేరుకొని వారిలో క్రీడలపట్ల స్ఫూర్తిని నింపాలని క్రీడాకారులకు ప్రధాని విజ్ఞప్తి చేశారు. వివిధ వర్గాలకు చెందిన ప్రజలతో మాట్లాడడానికి వీలుగా వారితో కార్యక్రమాలను నిర్వహించాలని కేంద్ర క్రీడాశాఖ, ఇతర క్రీడాసంస్థలను ప్రధాని ఆదేశించారు.
పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం కొనసాగుతున్న ఏక్ పేడ్ మా కే నామ్ కార్యక్రమంలో పాల్గొనాలని క్రీడాకారులకు విజ్ఞప్తి చేశారు. పారిస్ లో జరిగిన ప్రయత్నాలను ఆయన ప్రస్తావించారు. పర్యావరణ హిత సమతుల్య వ్యవస్థ గురించి మాట్లాడారు ధరిత్రిని కాపాడుకోవడం కోసం సహజసాగు విధానాన్ని ప్రచారం చేయాలని ఆయన క్రీడాకారులకు సూచించారు. క్రీడలపట్ల, ఆరోగ్యంపట్ల యువతలో స్ఫూర్తిని నింపాలని కోరారు.
భేటీ ని ముగిస్తూ భారతదేశ క్రీడాకారులు దేశానికి కీర్తి ప్రతిష్టలు తెస్తారనే ధీమా వ్యక్తం చేశారు. ప్రతిభావంతులైన యువత విజయం సాధించినప్పుడు అభివృద్ధి చెందిన దేశ సాధన దిశగా సాగుతున్న ప్రయాణం మరింత అందంగా వుంటుందని ప్రధాని అన్నారు. నా దృష్టిలో మీరందరూ విజేతలే. ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి సాధించారు. నా దేశ యువత ఎంతో కొంత విజయం సాధించినప్పుడు, దేశం కూడా వారిపై ఆధారపడి విజయం సాధిస్తుందని ఆకాంక్షిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తన భేటీ ని ముగించారు.
****
(Release ID: 2047963)
Visitor Counter : 64