గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ

ఆగ‌స్ట్ 25న 11 ల‌క్ష‌ల మంది ల‌ఖ్‌ప‌తి దీదీల‌కు ధ్రువ‌పత్రాలు అందించి, వారితో మాట్లాడనున్న ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ: శ్రీ శివ‌రాజ్ సింగ్ చౌహాన్


రూ. 2500 కోట్ల రివాల్వింగ్ ఫండ్‌ విడుదల చేయనున్న ప్రధాన మంత్రి

4.3 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని 48 లక్షల మందికి ప్రయోజనం: శ్రీ చౌహాన్


రూ. 5000 కోట్ల బ్యాంకు రుణం సైతం విడుదల చేయనున్న మోదీ

2,35,400 స్వయం సహాయక సంఘాల్లోని 25.8 లక్షల మందికి చేకూరనున్న ప్రయోజనం: శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్


34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుండి వర్చువల్ మాధ్యమం ద్వారా కార్యక్రమంలో 30,000 ప్రాంతాల నుంచి మహిళలు: శ్రీ చౌహాన్

Posted On: 22 AUG 2024 5:08PM by PIB Hyderabad

కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం,  రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 2024, ఆగస్ట్ 25న మహారాష్ట్రలోని జల్గావ్‌లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొననున్న కార్యక్రమం గురించి మంత్రి వివరించారు. ఈ మీడియా సమావేశానికి కేంద్ర సహాయ మంత్రి శ్రీ చంద్ర శేఖర్ పెమ్మసాని కూడా హాజరయ్యారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ లఖ్‌పతి దీదీలతో మాట్లాడడంతోపాటు, 11 లక్షల మంది కొత్త లఖ్‌పతి దీదీలకు ధ్రువీకరణ పత్రాలు అందజేస్తారని శ్రీ చౌహాన్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి రూ. 2500 కోట్ల రివాల్వింగ్ ఫండ్ - క‌మ్యూనిటీ ఇన్ వెస్ట్ మెంట్ ఫండ్‌ విడుద‌ల చేస్తారన్నారు. దీని ద్వారా 4.3 లక్షల స్వయం సహాయక బృందాలకు (ఎస్‌హెచ్‌జిలకు) చెందిన 48 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందని మంత్రి వివరించారు. 2,35,400 స్వయం సహాయక బృందాల్లోని (ఎస్‌హెచ్‌జిల్లోని) 25.8 లక్షల మందికి ప్రయోజనం చేకూర్చే రూ. 5000 కోట్ల బ్యాంకు రుణాన్ని కూడా ప్రధాని విడుదల చేస్తారని పేర్కొన్నారు. 34 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అంటే అంటే దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్ర రాజధానులు, జిల్లా ప్రధాన కార్యాలయాలు, సిఎల్ఎఫ్‌ల నుండి సుమారు 30,000 ప్రాంతాలకు చెందిన మహిళలు వర్చువల్ మాధ్యమం ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొనున్నట్లు శ్రీ చౌహాన్ తెలిపారు.

 

 

లఖ్‌పతి దీదీలు సంవత్సరానికి రూ. 1 లక్ష లేదా అంతకంటే ఎక్కువ సంపాదిస్తున్న మహిళలు అని శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. ఈ లఖ్‌పతి దీదీలు తమ కుటుంబాలను పేదరికం నుండి బయటపడేయడమే కాకుండా మిగిలిన సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఇప్పటికే కోటి మంది లఖ్‌పతి దీదీలను తయారు చేసినట్లు శ్రీ చౌహాన్ తెలియజేశారు. రాబోయే 3 సంవత్సరాలలో 3 కోట్ల మంది లఖ్‌పతి దీదీలను తయారుచేయడమే తమ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. ఈ సిఆర్‌పిలలో ఒకరు 95 మంది లఖ్‌పతి దీదీలను తయారుచేయడం హర్షణీయమన్నారు.

 

 

ఎస్‌హెచ్‌జి కుటుంబాలు రూ. 1 లక్ష లేదా అంతకంటే ఎక్కువ వార్షిక ఆదాయాన్ని సంపాదించేందుకు వీలుగా ఒక నిర్మాణాత్మక ప్రక్రియను మంత్రిత్వ శాఖ అనుసరించిందని కేంద్ర మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా సమర్థులైన నేషనల్ రిసోర్స్ పర్సన్‌లను సన్నద్ధం చేసి, ఆపై ప్రతి రాష్ట్రంలో మాస్టర్ ట్రైనర్‌లను సిద్ధం చేసినట్లు మంత్రి వివరించారు. ఈ మాస్టర్ ట్రైనర్‌లు వ్యాపార ప్రణాళిక, ఫైనాన్సింగ్ అలాగే కన్వర్జెన్స్ ప్రక్రియల గురించి కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్‌లకు (సిఆర్‌పిలు) మరింత శిక్షణ ఇస్తారని తెలిపారు.  వ్యాపార ప్రణాళిక, ఎస్‌హెచ్‌జి సభ్యుల నైపుణ్యాభివృద్ధి గురించి 3 లక్షల మంది కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ (సిఆర్‌పిలు) ప్రత్యేకంగా శిక్షణ పొందారని, వారి బృందం ఈ విషయంలో గొప్ప సేవ చేస్తున్నదని మంత్రి కితాబిచ్చారు. వీరిలో కొందరిని ఈ కార్యక్రమంలో భాగంగా సన్మానించనున్నట్లు మంత్రి తెలిపారు. 100 రోజుల్లో 11 లక్షల మందిని లఖ్‌పతి దీదీలుగా మార్చే లక్ష్యంలో భాగంగా ఇప్పటి వరకు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఏకంగా 15 లక్షల మంది లఖ్‌పతి దీదీలను తయారు చేసిందని మంత్రి వివరించారు. వీరిలో 11లక్షల మంది లఖ్‌పతి దీదీలను ప్రధానమంత్రి సత్కరించనున్నట్లు మంత్రి తెలిపారు.

***



(Release ID: 2047881) Visitor Counter : 20