ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
ఆర్జీ కర్ మెడికల్ కళాశాల మృతురాలి గుర్తింపు వివరాలను తొలగించాలనే సుప్రీంకోర్టు ఆదేశాలను సామాజిక మాధ్యమాలు పాటించాలి.
మృతురాలి పేరు, ఫోటోలు, వీడియో దృశ్యాలు మొదలైన వివరాలను ఆయా సామాజిక మాధ్యమాలు, ఎలక్ట్రానిక్ మీడియా వెంటనే తొలగించాలి
Posted On:
21 AUG 2024 5:32PM by PIB Hyderabad
ఆర్జీ కర్ వైద్య కళాశాల మృతురాలి ఘటనలో మృతురాలి పేరు, ఫోటోలకు సంబంధించిన కిన్నోరి ఘోష్ వర్సెస్ కేంద్ర ప్రభుత్వ కేసులో ఆగస్ట్ 20, 2024న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తప్పకుండా పాటించాలని భారతదేశంలోని అన్ని సామాజిక మాద్యమాలకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వశాఖ తెలిపింది.
దేశంలోని అన్ని సామాజిక మాధ్యమాలు, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలు మృతురాలి పేరును, ఫోటోలను, వీడియో క్లిప్పులను వెంటనే తొలగించాలని నిర్దేశిస్తూ కేంద్ర అత్యున్నత న్యాయస్థానం నిషేధాజ్ఞను జారీ చేసింది. ఈ ఘటనకు సంబంధించిన సున్నతిమైన సమాచార పంపిణీపై ఆందోళనల నేపథ్యంలో సుప్రీంకోర్ట్ ఈ ఆదేశాలను జారీ చేసింది.
కోర్ట్ ఆదేశాల్లోని కీలకమైన పారాగ్రాఫ్ ఇలా వుంది.
"మృతురాలి దేహం లభించినతర్వాత ఆమె వివరాలను, ఫోటోలను సామాజిక మాధ్యమాలు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రచురిస్తుండడంతో కోర్ట్ ఈ నిషేధాజ్ఞను జారీ చేస్తోంది.
కోర్ట్ తీర్పుకు అనుగుణంగా పైన తెలియజేసిన ఘటనలోని మృతురాలి వివరాలను, ఫోటోలను, వీడియో క్లిప్పులను తక్షణమే ఆయా సామాజిక మాధ్యమాలు, ఎలక్ట్రానిక్ మీడియా తొలగించాలని ఆదేశిస్తున్నాం."
ఈ తీర్పు నేపథ్యంలో వ్యక్తుల ప్రైవసీని, గౌరవ మర్యాదలను రక్షించాలనే కోర్టు ఆదేశాలను ఆయా సామాజిక మాద్యమాలు తప్పకుండా పాటించాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ కోరుతోంది. ఆయా వేదికలు కోర్టు తీర్పుకు అనుగుణంగా వెంటనే చర్యలు చేపట్టాలని తెలిపింది.
సున్నితమైన సమాచారాన్ని ఇక ముందు ప్రచురించవద్దని అన్ని సామాజిక మాధ్యమాల కంపెనీలను కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ కోరింది. సుప్రీంకోర్ట్ ఆదేశాలను పాటించకపోతే న్యాయపరమైన పరిణామాలు, నియంత్రణా చర్యలు వుంటాయని హెచ్చరించింది.
సుప్రీంకోర్ట్ తీర్పుకు అనుగుణంగా చేపట్టిన చర్యలను ఆయా సామాజిక మాధ్యమాల సంస్థలు కేంద్ర ఎలక్ట్రానిక్స్ , సమాచార శాఖకు తెలియజేయాలి. cyberlaw-legal@meity.gov.in మెయిల్‌కు సమాచారాన్ని పంపాలి.
*****
(Release ID: 2047529)