ప్రధాన మంత్రి కార్యాలయం

భారత్ – మలేషియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంపై సంయుక్త ప్రకటన

Posted On: 20 AUG 2024 8:29PM by PIB Hyderabad

తమ దేశంలో పర్యటించాలన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ విన్నపాన్ని మన్నిస్తూ 2024, ఆగస్ట్ 20వ తేదీన మలేషియా ప్రధాన మంత్రి డాటో సెరీ అన్వర్ ఇబ్రహీం భారత పర్యటనకు వచ్చారు. మలేషియా ప్రధాని దక్షిణాసియా ప్రాంతంలో పర్యటించడం ఇదే తొలిసారి కాగా ఇరు దేశాల ప్రధానమంత్రులు తొలిసారిగా సమావేశం అయ్యారు. ఈ సమావేశం ఇరుదేశాల మధ్య మెరుగైన వ్యూహాత్మక సంబధాలకు వేదికైంది. అనేక అంశాలపై జరిగిన విస్తృత స్థాయి చర్చలు భారత్ – మలేషియా మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేశాయి.


మలేషియా విదేశాంగ మంత్రి డాటో సెరీ ఉటామా హజీ మహ్మద్ బిన్ హజీ హసన్, పెట్టుబడులు, వర్తకం మరియు పరిశ్రమల శాఖ మంత్రి టెంగ్కు డాతుక్ సెరీ ఉటామా జఫ్రుల్ అబ్దుల్ అజీజ్‌, పర్యాటకం, కళలు మరియు సాంస్కృతిక శాఖ మంత్రి డాతుక్ సెరీ టియాంగ్ కింగ్ సింగ్, డిజిటల్ శాఖ మంత్రి గోబింద్ సింగ్ డియో అలాగే మానవ వనరుల మంత్రి, శ్రీ స్టీవెన్ సిమ్ సహా ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం ప్రధాని అన్వర్ ఇబ్రహీం వెంట భారత పర్యటనకు హాజరయ్యారు.

ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీంకు రాష్ట్రపతి భవన్‌లో సాదర స్వాగతం లభించింది. అనంతరం ఆయన రాజ్‌ఘాట్‌ను సందర్శించి మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. ఆ తరువాత ఇరు దేశాల ప్రధానుల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఆపై, ఇరువురు ప్రధానులు ద్వైపాక్షిక ఒప్పందాలను పరస్పరం మార్చుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఇచ్చిన విందుకు మలేషియా ప్రధాని హాజరయ్యారు. భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్మును కలిసిన మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం మర్యాదపూర్వకంగా ఆమెతో భేటీ అయ్యారు. అనంతరం భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ ను ఉద్దేశించి మలేషియా ప్రధాని ప్రసంగించారు.

2015లో మొదలైన భారత్-మలేషియా వ్యూహాత్మక భాగస్వామ్యం అనేక రంగాలలో ఇరుదేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో సహాయపడినట్లు ఇరు దేశాల ప్రధానులు అభిప్రాయపడ్డారు. భారత్ – మలేషియా మధ్య అన్ని రంగాలలో పరస్పర సహకారంతో ఇరుదేశాల సంబంధాలు బలోపేతం అయిన క్రమంలో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంగా ఈ సంబంధాలను మరింత ఏకీకృతం చేయడానికి ఇది అనుకూల సమయమని ప్రధానులు నిర్ణయించారు.   


భారత్, మలేషియా దేశాలతో పాటు ఇరు దేశాల ప్రజల మధ్య నెలకొన్న స్నేహభావం, సామాజిక-సాంస్కృతిక సంబంధాల పట్ల ఇరు దేశాల నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఇరు దేశాల ఉమ్మడి చరిత్ర, మలేషియాలో ప్రవాస భారతీయుల తోడ్పాటు ఇరు దేశాలను ఆర్థిక వృద్ధి, అభివృద్ధి రంగాలలో విశ్వసనీయమైన భాగస్వాములుగా చేస్తున్నాయి.


రాజకీయం, రక్షణ, భద్రతా సహకారం, ఆర్థిక రంగం, వర్తకం, డిజిటల్ సాంకేతికతలు, అంకుర సంస్థలు, ఫిన్‌టెక్, పునరుత్పాదక ఇంధనాలు సహా ఇంధన రంగం, ఆరోగ్య సంరక్షణ, ఉన్నత విద్య, సంస్కృతి, పర్యాటకం ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలు సహా అన్ని రంగాలలో ద్వైపాక్షిక సహకారం గురించి ఇరువురు ప్రధానులు చర్చించారు.  

నియామకం, ఉపాధి, కార్మికులను స్వదేశానికి పంపడం; ఆయుర్వేదం, ఇతర సంప్రదాయిక వైద్య విధానాలు, డిజిటల్ సాంకేతికతలు, సంస్కృతి, కళలు మరియు వారసత్వం, పర్యాటకం, ప్రజా పరిపాలన అలాగే పాలనాపరమైన సంస్కరణలు, యువత, క్రీడలు, లాబువాన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అథారిటీ (ఎల్ఎఫ్ఎస్ఎ), ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ సర్వీసెస్ అథారిటీ, ఇండియా (ఐఎఫ్ఎస్‌సిఎ) మధ్య ఆర్థిక సేవల రంగాలలో పరస్పర సహకారంపై ఇరు దేశాల నాయకులు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు. 

వాయిస్ ఆఫ్ ది గ్లోబల్ సౌత్ సమ్మిట్ (విఓజిఎస్ఎస్) నిర్వహణలో భారతదేశ చొరవను మలేషియా ప్రశంసించింది. దీని ద్వారా గ్లోబల్ సౌత్ దేశాలు తమ ఆందోళనలు, ఆసక్తులు, ప్రాధాన్యతలను చర్చించి, పరిష్కరించుకోవడానికి అలాగే ఆలోచనలను, పరిష్కారాలను పంచుకునేందుకు చక్కటి అవకాశం లభించిందని మలేషియా అభిప్రాయపడింది. విఓజిఎస్ఎస్ మూడు విడతలలోనూ పాలుపంచుకున్న మలేషియాను భారత్ ప్రశంసించింది.

ఇరుదేశాల మధ్య ఉన్నత స్థాయి పర్యటనలు కొనసాగడం పట్ల ఇరువురు ప్రధానులు సంతృప్తి వ్యక్తం చేశారు. సన్నిహిత సంబంధాల ప్రాముఖ్యతను గుర్తిస్తూ, జాయింట్ కమీషన్ సమావేశాలు (జెసిఎమ్‌లు), విదేశాంగ కార్యాలయ స్థాయి సంప్రదింపులు క్రమం తప్పకుండా నిర్వహించడంతో పాటు పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన ద్వైపాక్షిక, బహుపాక్షిక సమస్యలపై నిరంతర చర్చలు కొనసాగించేందుకు వారు అంగీకరించారు.

 

ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ఇరుదేశాల పార్లమెంట్ల మధ్య మెరుగైన పరస్పర చర్యలు, సహకారాన్ని ఇరువురు ప్రధానులు ఆకాంక్షించారు.

దేశాల అభివృద్ధిలో యువత  పాత్రను గుర్తించిన ఇరువురు ప్రధానమంత్రులు ఈ క్రమంలో, ఇరు దేశాల యువత మధ్య పరస్పర సహకారాన్ని మరింత ప్రోత్సహించేందుకు అంగీకరించారు.

 

ఇరువురు ప్రధానులు ద్వైపాక్షిక వాణిజ్యంపై సంతృప్తి వ్యక్తం చేశారు. రెండు దేశాల మెరుగైన వ్యూహాత్మక భాగస్వామ్యానికి వాణిజ్యం మూలాధారమని వారు అంగీకరించారు. ఈ ద్వైపాక్షిక వాణిజ్యం 19.5 బిలియన్ డాలర్ల రికార్డు స్థాయికి చేరడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇరు దేశాల పరస్పర ప్రయోజనం కోసం సుస్థిరమైన పద్ధతిలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింతగా పెంపొందించుకోవడానికి ఇరు దేశాలు పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నాయి. ఈ విషయంగా వారు ఉన్నత స్థాయి సీఈఓల ఫోరమ్‌కు అభినందనలు తెలిపారు అలాగే 2024, ఆగస్ట్ 19న న్యూఢిల్లీలో తొమ్మిదో సమావేశాన్ని ఏర్పాటు చేయడం ప్రశంసనీయమన్నారు.

 

పెరుగుతున్న ద్వైపాక్షిక పెట్టుబడులను ఇరు దేశాల ప్రధానులు స్వాగతించారు అలాగే అనేక రంగాలలో  పరస్పర సహకారం, పెట్టుబడులను మరింత ప్రోత్సహించాలని అభిప్రాయపడ్డారు.

 

2025 నాటికి గణనీయమైన పురోగతి సాధించాలనే లక్ష్యంతో ఎఎస్ఇఎఎన్-ఇండియా ట్రేడ్ ఇన్ గూడ్స్ ఒప్పందం (ఎఐటిఐజిఎ)ను  వ్యాపారాలకు మరింత ప్రభావవంతమైనదిగా, వినియోగదారుల హితమైనదిగా, సరళమైనదిగా, వాణిజ్యానికి అనువైనదిగా చేయడం కోసం దానిని సమీక్షించే ప్రక్రియకు మద్దతు ఇవ్వడం అలాగే ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి.

రెండు దేశాల సమకాలీన ఆర్థిక ప్రాధాన్యతలను గుర్తించాల్సిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని, మలేషియా-భారత్ సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం (ఎమ్ఐసిఇసిఎ) 2వ జాయింట్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయడం గురించిన చర్చలను ఇరువురు ప్రధానులు స్వాగతించారు.

 

ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులలో స్థానిక కరెన్సీ సెటిల్‌మెంట్ వినియోగాన్ని ప్రోత్సహించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ నెగరా మలేషియా మధ్య పరస్పర సహకారాన్ని ఇరు దేశాల ప్రధానమంత్రులు ప్రశంసించారు అలాగే స్థానిక కరెన్సీ భారత రూపాయి, మలేషియా రింగిట్లలో ఇన్‌వాయిస్, సెటిల్‌మెంట్‌ను మరింత సులభతరం చేయడానికి ఇరు దేశాల పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామన్నారు.

డిజిటల్ సహకార రంగంలో, డిజిటల్ టెక్నాలజీస్‌పై అవగాహన ఒప్పందం చేసుకోవడాన్ని ప్రధానమంత్రులిద్దరూ స్వాగతించారు. డిజిటల్ రంగంలో నిమగ్నతకు మార్గనిర్దేశం చేసేందుకు, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ బీటుబీ భాగస్వామ్యం, డిజిటల్ కెపాసిటీ బిల్డింగ్, సైబర్ సెక్యూరిటీ, అలాగే 5G, క్వాంటం కంప్యూటింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, ఇంటర్నెట్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల విషయంలో రెండు దేశాల మధ్య పరస్పర సహకారాన్ని వేగవంతం చేయడం కోసం మలేషియా-ఇండియా డిజిటల్ కౌన్సిల్ ముందస్తు సమావేశం నిర్వహించడం ప్రశంసనీయమన్నారు.


ఇరు దేశాల డిజిటల్ ఆర్థిక ప్రాధాన్యతలను దేశాధినేతలు గుర్తించారు. భారతదేశం యొక్క యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపిఐ) సాధించిన విజయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు అలాగే భారత్, మలేషియాల మధ్య చెల్లింపు వ్యవస్థల రంగంలో కొనసాగుతున్న కృషిని అభినందించారు.

ఇండియా-మలేషియా స్టార్ట్-అప్ అలయన్స్ ద్వారా ఇతర వాటాదారులలో స్టార్ట్-అప్ ఇండియా, మలేషియాకు చెందిన క్రెడిల్ ఫండ్ మధ్య జరుగుతున్న చర్చలను ఇరుపక్షాలు స్వాగతించాయి.

అంతరిక్షం, అణు శక్తి, సెమీకండక్టర్స్, టీకాలు, ఇతర ప్రాధాన్య రంగాలు సహా సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఇద్దరు ప్రధానులు అంగీకరించారు.

 

ద్వైపాక్షిక రక్షణ, భద్రతా భాగస్వామ్యంలో స్థిరమైన, బలమైన సహకారం మెరుగైన వ్యూహాత్మక భాగస్వామ్యానికి కీలకమైన వాటిలో ఒకటిగా ఇరువురు ప్రధానులు అంగీకరించారు. నిరంతర సంప్రదింపులు, చర్చలు, ప్రక్రియలు అలాగే సామర్థ్య నిర్మాణ సహకారం ద్వారా రక్షణ రంగంలో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి.

 

రక్షణ రంగంలో సహకారంతో పాటు రక్షణ రంగ పరిశోధన, అభివృద్ధిలో పరస్పర సహకారాన్ని మరింత విస్తరించేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయి.

తీవ్రవాదాన్ని తీవ్రంగా ఖండించిన ఇరువురు ప్రధానులు, అన్ని రూపాలలో, వ్యక్తీకరణలలో తీవ్రవాదాన్ని అన్ని దేశాలు ముక్తకంఠంతో వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఏ దేశమూ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించకూడదని ఇరువురు ప్రధాన మంత్రులు నొక్కిచెప్పారు అలాగే దేశీయ చట్టాలు, అంతర్జాతీయ ఒప్పందాలకు అనుగుణంగా ఉగ్రవాదానికి పాల్పడే వారిని త్వరితగతిన న్యాయస్థానం ఎదుటకు తీసుకువచ్చేందుకు కలిసి పనిచేయడానికి వారు అంగీకరించారు.  

ఉగ్రవాదం, అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరాల మధ్య సంబంధాలను గుర్తించి, వాటిని పూర్తిగా నిర్మూలించేందుకు కూడా వారు అంగీకరించారు. ఉగ్రవాదం సహా ఇతర సాంప్రదాయిక, సంప్రదాయేతర ముప్పులను ఎదుర్కోవడానికి సమాచారాన్ని, ఉత్తమ పద్ధతులను పరస్పరం పంచుకోవడం అలాగే ఈ విషయంలో సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి ఇరు దేశాలు అంగీకరించాయి.

ఉన్నత విద్యా రంగంలో సహకారాన్ని మరింత మెరుగుపరిచేందుకు ఇద్దరు ప్రధానులు అంగీకరించారు. సామర్థ్య నిర్మాణంలో బలమైన ద్వైపాక్షిక సహకారం, సన్నిహిత సంబంధాలను గుర్తిస్తూ, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ రంగాలలో భారతదేశపు సాంకేతిక, ఆర్థిక సహకారం (ఐటిఇసి) కార్యక్రమం కింద మలేషియా జాతీయుల కోసం ప్రత్యేకంగా 100 సీట్లు కేటాయించడాన్ని మలేషియా స్వాగతించింది.

భారత ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఆయుర్వేద శిక్షణ, పరిశోధనా సంస్థ (ఐటిఆర్ఎ) ద్వారా మలేషియాలోని టుంకు అబ్దుల్ రెహమాన్‌ యూనివర్శిటీలో ఆయుర్వేద పీఠాన్ని ఏర్పాటు చేయడం సహా, ఇరుదేశాల భాగస్వామ్యాన్ని కొనసాగించడం పట్ల తమ నిబద్ధతను ఇద్దరు ప్రధానులు స్పష్టం చేశారు. ఫార్మాకోపియా సహకారంపై ముందుగానే అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి.

యూనివర్శిటీ మలయా (యూఎమ్)లో తిరువల్లువర్ చైర్ ఆఫ్ ఇండియన్ స్టడీస్ ఏర్పాటుకు సంబంధించిన చర్చలను ఇరుపక్షాలు స్వాగతించాయి.

ఉమ్మడి పరిశోధన, అభివృద్ధి, సామర్థ్యాల పెంపు అలాగే వ్యవసాయంలో డిజిటల్ సాంకేతికతల వినియోగం సహా వ్యవసాయ రంగంలో సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి ఇరుపక్షాలు ఎదురుచూస్తున్నాయి.

ఇరు దేశాల మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న సాంస్కృతిక-అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకుని, ఆడియో-విజువల్ సహనిర్మాణంలో సహకారాన్ని విస్తరించుకోవాలని ఇద్దరు ప్రధానులు నిర్ణయించారు.

సుస్థిర ఇంధనాన్ని ప్రోత్సహించడంలో, వాతావరణ మార్పులకు అనుగుణంగా సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని ఇద్దరు ప్రధానులు నిర్ణయించారు. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ (ఐఎస్ఎ) మరియు కొయలిషన్ ఫర్ డిజాస్టర్ రెసిలెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (సిడిఆర్ఐ) ఏర్పాటులో భారతదేశ చొరవను మలేషియా అభినందించినది.

 

ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ (ఐబిసిఎ) వ్యవస్థాపక సభ్య దేశంగా చేరాలన్న మలేషియా నిర్ణయాన్ని కూడా భారత్ స్వాగతించింది. ఐబిసిఎ ముసాయిదా ఒప్పందంపై చర్చలను త్వరితగతిన ముగించాలని ఇద్దరు ప్రధానులు నిర్ణయించారు.

 

మలేషియా ఆర్థిక వ్యవస్థకు మలేషియాలోని భారతీయ పౌరుల నిరంతర, విలువైన సహకారాన్ని ఇద్దరు ప్రధానులు స్వాగతించారు. ఇరు దేశాల మధ్య నైపుణ్యం కలిగిన ప్రతిభావంతుల రాకపోకలను మరింత క్రమబద్ధీకరించడానికి, బలోపేతం చేయడానికి కూడా వారు అంగీకరించారు.

రెండు దేశాల మధ్య పర్యాటకం, ప్రజల మధ్య పరస్పర సంప్రదింపులను ప్రోత్సహించడానికి ప్రత్యేకించి రెండు దేశాలు వీసా నిబంధనలను సడలించడం సహా ఇటీవల చేపట్టిన కార్యక్రమాలను ఇద్దరు ప్రధానులు స్వాగతించారు. పర్యాటక సహకారాన్ని పెంపొందించుకోవడం, సుస్థిర పర్యాటకంలో ఉత్తమ పద్ధతులను పంచుకోవడం అలాగే రెండు దేశాల మధ్య పర్యాటకాన్ని అభివృద్ధి చేసే అవకాశాలను అన్వేషించడం వంటి చర్యల పట్ల ప్రధానమంత్రులు ఇరువురూ తమ నిబద్ధతను వ్యక్తం చేశారు. 2026 సంవత్సరాన్ని విజిట్ మలేషియా సంవత్సరంగా భారత్ గుర్తించింది, ఈ సంవత్సరం వేడుకలకు భారత్ నుండి అధిక సంఖ్యలో పర్యాటకులను మలేషియా స్వాగతిస్తున్నది.

రెండు దేశాల మధ్య సంబంధాలు పర్యాటకుల తాకిడి అధికంగా ఉండేందుకు కీలకమని ఇరుదేశాల నాయకులు అంగీకరించారు అలాగే రెండు దేశాల మధ్య విమాన కనెక్టివిటీని మెరుగుపరచడానికి చర్చలు కొనసాగించాలని ఇరు దేశాల పౌర విమానయాన అధికారులకు సూచించారు.

 

యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ద లా ఆఫ్ ద సీ (యుఎన్‌సిఎల్ఓఎస్) 1982కు అనుగుణంగా, అంతర్జాతీయ న్యాయ సూత్రాల ఆధారంగా నావిగేషన్, ఓవర్‌ఫ్లైట్ స్వేచ్ఛను అలాగే అవరోధం లేని చట్టబద్ధమైన వాణిజ్యాన్ని గౌరవించడం పట్ల ఇద్దరు నాయకులు తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు. యుఎన్‌సిఎల్ఓఎస్ 1982తో సహా అంతర్జాతీయ చట్టం యొక్క ప్రపంచ ఆమోదం పొందిన నియమాలకు అనుగుణంగా అన్ని పక్షాలు శాంతియుత మార్గాల ద్వారా వివాదాలను పరిష్కరించుకోవాలని ఇరువురు నేతలు విజ్ఞప్తి చేశారు.

 

 

ఏఎస్ఇఎఎన్‌తో భారతదేశ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ప్రాముఖ్యతను పునరుద్ఘాటిస్తూ, 2025లో ఏఎస్ఇఎఎన్‌ కేంద్రీకరణ అలాగే మలేషియా ఏఎస్ఇఎఎన్‌ ఛైర్మన్‌షిప్‌ పొందే విషయంగా భారతదేశం అందిస్తున్న సంపూర్ణ మద్దతును మలేషియా ప్రశంసించింది. ఇప్పటికే ఉన్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసుకునే దిశగా ఏఎస్ఇఎఎన్‌ నేతృత్వంలోని యంత్రాంగాల ద్వారా ఏఎస్ఇఎఎన్‌, భారతదేశం మధ్య మరిన్ని ప్రయత్నాలను మలేషియా స్వాగతించింది.

యుఎన్‌ఎస్‌సి, యుఎన్‌హెచ్‌ఆర్‌సి మరియు ఇతర బహుపాక్షిక వేదికలతో సహా ఐక్యరాజ్యసమితిలో సహకారం, సమన్వయాన్ని బలోపేతం చేసుకోవడానికి ఇద్దరు ప్రధానులు అంగీకరించారు. శాంతి, అభివృద్ధి సాధన కోసం తప్పనిసరిగా నిబంధనల ఆధారిత అంతర్జాతీయ వ్యవస్థకు కట్టుబడి ఉండుటను ఇరువురు దేశాధినేతలు సమర్థించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలితో సహా అంతర్జాతీయ సంస్థలలో మరింత ప్రాతినిధ్యం కోసం, సమకాలీన వాస్తవాలను ప్రతిబింబించే బహుపాక్షికతను మెరుగుపరచడానికి కలిసి పని చేస్తామని వారు ప్రతిజ్ఞ చేశారు. శాశ్వత, అశాశ్వత వర్గాలలో యుఎన్ఎస్‌సి విస్తరణ సహా అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రాతినిధ్యాన్ని పెంచడంపై దృష్టి సారించి కౌన్సిల్ సభ్యత్వాన్ని బలోపేతం చేయడం ప్రస్తుత ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడంలో మరింత ప్రభావవంతంగా ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు. సంస్కరించబడిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారతదేశానికి శాశ్వత సభ్యత్వం కోసం మలేషియా మద్దతును భారతదేశం అత్యంత అభినందించింది.

తనకు, తమ ప్రతినిధుల బృందానికి అపూర్వ ఆదరణ, ఆతిథ్యం అందించినందుకు మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం భారత ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే త్వరలోనే తమ దేశంలో పర్యటించాలంటూ ప్రధాని మోదీని ఆయన ఆహ్వానించారు

 

***



(Release ID: 2047516) Visitor Counter : 12