ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

మంకీపాక్స్ పరిస్థితి, సన్నద్ధతను సమీక్షించిన కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ జేపీ నడ్డా


వ్యాధి వ్యాప్తి నియంత్రణ కోసం ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్న మంత్రి

దేశంలో ప్రస్తుతం మంకీపాక్స్ కేసులు లేవు

Posted On: 17 AUG 2024 4:29PM by PIB Hyderabad

ప్రపంచ ఆరోగ్య సంస్థ 14 ఆగస్ట్ 2024 వ తేదీన మంకీపాక్స్ ను అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర స్థితిగా (పిహెచ్ఇఐసి) గా ప్రకటించిన దృష్ట్యా, దేశంలో మంకీపాక్స్ పరిస్థితి సన్నద్ధతపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ప్రస్తుతం భారత్ లో ఇప్పటివరకు మంకీపాక్స్ కేసులు నమోదు కాలేదు.

 

మంకీపాక్స్ వైరస్ దేశంలోకి రాకుండా అడ్డుకట్టవేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముందు జాగ్రత్తగా చర్యలను తీసుకుంటున్నది. అన్ని విమానాశ్రయాలు, ఓడరేవులు, దేశ సరిహద్దుల వద్ద ఆరోగ్య యూనిట్లను అప్రమత్తం చేయడం; పరీక్షా కేంద్రాలను (32 కేంద్రాలు) సిద్ధం చేయడం; ఏదైనా కేసును గుర్తించడానికి, ఐసోలేట్ చేయడానికి నిర్వహించాల్సిన సౌకర్యాలను సిద్ధం చేయడం ఇందులో ఉన్నాయి.
 

మంకీపాక్స్ దానికదే నెమ్మదిస్తుంది. సాధారణంగా 2-4 వారాల మధ్య దాని ప్రభావం ఉంటుంది. రోగులు సాధారణ జాగ్రత్తలతో కోలుకుంటారు. వ్యాధి ఉన్న వారితో దీర్ఘకాలిక సన్నిహిత సంబంధం కలిగి ఉండడం ద్వారా, లైంగిక సంబంధం ద్వారా, శరీరం/ గాయాలతో ప్రత్యక్ష సంబంధం లేదా సోకిన వ్యక్తి దుస్తుల ద్వారా ఇది వ్యాప్తి చెందుతుంది.
 

ప్రపంచ ఆరోగ్య సంస్థ 2022 జూలైలో మంకీపాక్స్ ను అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యయిక స్థితి (పిహెచ్ఇఐసి) గా ప్రకటించింది. అనంతరం మే 2023 లో దానిని రద్దు చేసింది. ప్రపంచవ్యాప్తంగా 2022 నుండి, డబ్ల్యూహెచ్ఓ 116 దేశాల్లో ఈ మంకీ పాక్స్ వల్ల 99,176 కేసులు, 208 మరణాలు సంభవించినట్లు నివేదించింది. డబ్ల్యూహెచ్ఓ 2022 ప్రకటన తర్వాత భారతదేశంలో మొత్తం 30 కేసులు వచ్చాయి. చివరి కేసు 2024 మార్చిలో నమోదైంది.

మంకీపాక్స్ పరిస్థితిని సమీక్షించడానికి సంబంధిత రంగాల నిపుణులతో డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అధ్యక్షతన 16 ఆగస్ట్ 2024 వ తేదీ జాయింట్ మానిటరింగ్ గ్రూప్ సమావేశం జరిగింది. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ సెంటర్ ఫర్ వెక్టర్ బోర్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్, కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులు, ఎయిమ్స్ తదితర సంస్థల నిపుణులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాబోయే వారాల్లో విదేశాలనుంచి పలు కేసులు వచ్చే అవకాశాన్ని పూర్తిగా తోసిపుచ్చనప్పటికీ, వైరస్ వ్యాప్తి ప్రమాదం ప్రస్తుతం భారతదేశానికి తక్కువగా ఉందని అంచనా వేశారు.
కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది.

 

***

 


(Release ID: 2046507) Visitor Counter : 59