వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రభుత్వ కీలక పథకాల లబ్ధిదారులైన 500 మంది రైతులకు వ్యవసాయ-రైతు సంక్షేమ మంత్రిత్వశాఖ నుంచి స్వాతంత్య్ర దినోత్సవ ప్రత్యేక కార్యక్రమానికి ఆహ్వానం


‘నేషనల్ పెస్ట్ సర్వైలెన్స్ సిస్టమ్‌’ను 2024 ఆగస్టు 15న
ప్రారంభించనున్న కేంద్ర మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్;

వ్యవసాయ పద్ధతుల మెరుగుకు వీలుగా అత్యాధునిక సాంకేతికతలు.. సుస్థిర విధానాలపై క్షేత్రస్థాయి సందర్శన ద్వారా రైతులకు ప్రత్యక్ష అవగాహన కల్పన లక్ష్యం

Posted On: 14 AUG 2024 5:20PM by PIB Hyderabad

భారత 78వ స్వాతంత్ర్య దినోత్సవ శుభ సందర్భంలో కర్షక వీరులను సన్మానించే రెండు రోజుల ప్రత్యేక కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కేంద్ర వ్యవసాయ-రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ దేశంలోని 1,000 మందికిపైగా రైతులు, వారి జీవిత భాగస్వాములకు ఆహ్వానం పంపింది. వీరంతా పిఎం-కిసాన్ సమ్మాన్ నిధి యోజన, పిఎం ఫసల్ బీమా యోజన వంటి కేంద్ర ప్రభుత్వ కీలక పథకాల లబ్ధిదారులు, ‘ఎఫ్‌పిఒ’ల ప్రతినిధులు కావడం గమనార్హం.

   ఈ ప్రత్యేక ఆహ్వానితులంతా ‘పియుఎస్ఎ’లోని సుబ్రమణియం హాలులో ఆగస్టు 15న వ్యవసాయ-రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సమావేశం కానున్నారు. ఈ కార్యక్రమంలో ఆ శాఖ సహాయ మంత్రులు శ్రీ రామ్‌నాథ్ ఠాకూర్, శ్రీ భగీరథ్ చౌదరి కూడా పాల్గొంటారు.

   ఈ ప్రత్యేక సందర్భంలో నేషనల్ పెస్ట్ సర్వైలెన్స్ సిస్టమ్ (ఎన్‌పిఎస్ఎస్)ను శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభిస్తారు. పంటలపై చీడపీడలను సకాలంలో, కచ్చితంగా గుర్తించి తగిన చర్యలు చేపట్టేలా సూచనలు-సలహాలు ఇవ్వడం ఈ డిజిటల్ కార్యక్రమ లక్ష్యం. ఇందుకోసం కృత్రిమ మేధ (ఎఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్) వంటి అత్యాధునిక సాంకేతికతలను ఈ వ్యవస్థ ఉపయోగించుకుంటుంది. తదనుగుణంగా అందరికీ అనువైన మొబైల్ యాప్, వెబ్ పోర్టల్‌తో రైతులకు అందుబాటులో ఉంటుంది. ప్రత్యక్ష సమాచారం, అధునాతన విశ్లేషణల ద్వారా తెగుళ్ల గుర్తింపు,  పర్యవేక్షణ, నిర్వహణలో ఇది కచ్చితత్వంతో తోడ్పాటునిస్తుంది.

   ఈ వ్యవస్థ తెగుళ్లు, పంటలను ఆశించే చీడపీడలకు సత్వర పరిష్కారాలు సూచిస్తుంది కాబట్టి రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దీనివల్ల పంట నష్టాలను తగ్గి, దిగుబడి  మెరుగవుతుంది. తెగుళ్లపై సమగ్ర సమాచార సేకరణ, స్వయంచలిత సూచనలిచ్చే ఈ వ్యవస్థ రైతులకు క్రియాశీల విశ్లేషణతో సాధికారత కల్పిస్తుంది. అవగాహనతో కూడిన నిర్ణయాలు తీసుకోవడంలో, పంటల రక్షణకు ముందస్తు చర్యలు చేపట్టడంలో సహాయపడుతుంది.

   దేశంలో వ్యవసాయ రంగం ఆధునికీకరణ, ఆహార భద్రతను మెరుగుపరచడం, సుస్థిర వ్యవసాయ పద్ధతులకు మద్దతివ్వడంలో ‘ఎన్‌పిఎస్ఎస్’ ఆవిష్కరణ ముఖ్యమైన ముందడుగు కాగలదు. రైతు సంక్షేమం, వ్యవసాయ రంగ పురోగమనం కోసం సాంకేతిక పరిజ్ఞాన సద్వినియోగంలో ప్రభుత్వ నిబద్ధతను ఈ కార్యక్రమం స్పష్టం చేస్తుంది.

   శాస్త్రవేత్తలతో రైతులు ప్రత్యక్షంగా మాట్లాడేందుకు వీలుగా వారికొక గొప్ప అనుభవం కలిగించడం కోసం ప్రసిద్ధ ‘పియుఎస్ఎ’ ప్రాంగణంలో క్షేత్ర సందర్శనను 2024 ఆగస్టు 14న నిర్వహించారు.

   రైతులను శాస్త్రవేత్తలతో మమేకం చేసే లక్ష్యంతో సాగిన ఈ కార్యక్రమంలో ఐఎఆర్ఐ-‘పియుఎస్ఎ’ లోని ప్రాంగణంలో గ్రీన్ హౌస్ ఆర్నమెంటల్ నర్సరీ, బిందు సేద్యం కింద కూరగాయల సాగు, పుట్టగొడుగుల యూనిట్, ‘ఐఎఫ్‌ఎస్’-వర్షాధారిత వ్యవస్థ, పోషకాల నిర్వహణ ప్లాంట్, సాగు యంత్రాల వర్క్‌ షాప్, సజ్జల బ్లాక్, వరి బ్లాక్, కంపోస్టింగ్ యూనిట్ సహా మరెన్నో క్లస్టర్స్, బ్లాకుల గురించి శాస్త్రవేత్తలు రైతులకు నేరుగా వివరించారు.

   వ్యవసాయ పద్ధతుల మెరుగుదల, అందుకు కావాల్సిన అత్యాధునిక సాంకేతికతలు, సుస్థిర విధానాలపై రైతులకు ప్రత్యక్ష అవగాహన కల్పించడంతోపాటు మెరుగైన ఆదాయ అవకాశాలను చేరువచేసే లక్ష్యంతో ఈ క్షేత్ర సందర్శన నిర్వహించారు.

****


(Release ID: 2045531) Visitor Counter : 107