మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

న్యూఢిల్లీలో ఇండియా ర్యాంకింగ్స్-2024ను విడుదల చేసిన కేంద్రమంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్


‘‘ఉపాధి సాధన నైపుణ్యాలే ర్యాంకులకు కీలక ప్రాతిపదిక కావాలి’’;
దేశంలోని మొత్తం 58 వేల ఉన్నత విద్యాసంస్థలు

‘‘ర్యాంకింగ్-రేటింగ్ చట్రం ర్యాంకుల పరిధిలోకి రావాలి’’;

‘‘విద్యాసంస్థ నాణ్యత.. పనితీరు.. సామర్థ్యం గురించి
తెలుసుకోవడం విద్యార్థులు... తల్లిదండ్రుల హక్కు’’;

కేంద్ర విద్యాశాఖ 2015లో ప్రారంభించిన ‘ఎన్ఐఆర్ఎఫ్’ ద్వారా
2016-2024 మధ్య ఇండియా ర్యాంకింగ్స్‌ ప్రక్రియ నిర్వహణ;

‘సమగ్రత విభాగం’లో అగ్రస్థానం నిలబెట్టుకున్న ఐఐటి-మద్రాస్;

వివిధ విభాగాలు.. సబ్జెక్టులపరంగా 13 ర్యాంకులుసహా రాష్ట్ర.. సార్వత్రిక..
నైపుణ్య విశ్వవిద్యాలయాల చేరికతో ఇండియా ర్యాంకుల పరిధి విస్తరణ

Posted On: 12 AUG 2024 7:10PM by PIB Hyderabad

   కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ఇవాళ ఢిల్లీలో ‘ఇండియా ర్యాంకింగ్స్-2024’ను ఆవిష్కరించారు. విద్యా మంత్రిత్వశాఖ 2015లో ఏర్పాటు చేసిన ‘నేషనల్ ఇన్‌స్టిట్యూష‌న‌ల్‌ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్’ (ఎన్ఐఆర్ఎఫ్) ఆధారంగా ఈ ర్యాంకులు ప్రకటిస్తారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కె.సంజయ్ మూర్తి; యూజీసీ ప్రొఫెసర్ ఎం.జగదీష్ కుమార్; ‘ఎఐసిటిఇ’ చైర్మన్ ప్రొఫెసర్ టి.జి.సీతారాం; ‘ఎ‌న్ఇటిఎఫ్’ చైర్మన్ ప్రొఫెసర్ అనిల్ సహస్రబుద్ధే; ‘ఎన్‌బిఎ’ సభ్య కార్యదర్శి డాక్టర్ అనిల్ కుమార్ నస్సా; ఉన్నత విద్యాశాఖ అదనపు కార్యదర్శి సునీల్ కుమార్ బరన్వాల్;   సంయుక్త కార్యదర్శి గోవింద్ జైస్వాల్ సహా పలువురు విద్యావేత్తలు, విద్యా సంస్థల అధిపతులు పాల్గొన్నారు.

   ఈ సందర్భంగా శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ- విద్యాసంస్థలకు ర్యాంకింగ్‌, రేటింగ్‌, అక్రిడిటేషన్  అనేవి కొత్త విద్యా విధానం-2020 (ఎన్ఇపి) ప్రధాన సిఫారసులలో ఒక ప్రక్రియ అని గుర్తుచేశారు. ఈ మేరకు ‘ఎన్ఐఆర్ఎఫ్’ ప్రకటించే ఈ ర్యాంకులు ‘ఎన్ఇపి’ స్ఫూర్తిని ప్రతిబింబిస్తున్నాయని హర్షం వ్యక్తం చేశారు. బోధన, ఆవిష్కరణ, పరిశోధన, గ్రాడ్యుయేషన్ ఫలితాలు, ఇతరత్రా అంశాల్లో అత్యుత్తమ పనితీరుతో ‘ఇండియా ర్యాంకింగ్స్-2024లో అగ్రస్థానం పొందిన ఉన్నత విద్యాసంస్థలన్నింటినీ కేంద్ర మంత్రి అభినందించారు.

   విద్యాసంస్థల నాణ్యత పనితీరు, సామర్థ్యం తదితరాలను తెలుసుకోవడం విద్యార్థుల, తల్లిదండ్రుల హక్కు అని ఆయన స్పష్టం చేశారు. కాబట్టి, దేశంలోని మొత్తం 58వేల ఉన్నత విద్యాసంస్థలూ ఈ చట్రం పరిధిలోకి రావాలని మంత్రి ఆకాంక్షించారు. ఉపాధి సాధన సామర్థ్యం, నైపుణ్య కల్పన ప్రాతిపదికగానే ర్యాంకులలో ప్రాధాన్యమిస్తున్నట్లు పేర్కొన్నారు. మన ర్యాంకింగ్ యంత్రాంగంలో నైపుణ్యాన్ని కూడా ఒక పరామితిగా చేర్చాలన్నారు. విద్య సంబంధిత అతి సునితాంశాలే అభ్యాస-వికాసాలకు ఉత్తేజమిస్తాయని మంత్రి చెప్పారు. కాబట్టి, అటువంటి అంశాలను ర్యాంకింగ్ చట్రం పరిధిలోకి తెచ్చే ప్రక్రియలను రూపొందించాలని సూచించారు.

   భారత విద్యారంగంలోని ప్రధాన సంస్థలన్నీ ర్యాంకింగ్ చట్రం కిందకు రావాలని, ప్రతిష్టాత్మక లక్ష్య నిర్దేశంతో భవిష్యత్ ర్యాంకింగులలో అగ్రస్థానం కోసం కృషి చేయాలని మంత్రి కోరారు. వికసిత భారత్ సంకల్ప సాధనలో విశిష్ట విద్యా పర్యావరణ సృష్టిని సమష్టిగా ప్రోత్సహిద్దామని మంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

   దేశంలోని విద్యా సంస్థల సార్వజనీనత, ఆవిష్కరణాత్మకత లక్ష్యంగా జాతీయ విద్యా విధానం-2020కి రూపకల్పన చేశారంటూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి డాక్టర్ సుకాంత మజుందార్ తన ప్రసంగంలో కృతజ్ఞతలు తెలిపారు. ఉన్నత విద్యా సంస్థల మధ్య ఆరోగ్యకర పోటీవల్ల భవిష్యత్ ప్రమాణాల్లో సమగ్రత మెరుగవుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ‘ఎన్ఐఆర్ఎఫ్’ ప్రారంభం తర్వాత పరిశోధనలతోపాటు విద్యార్థుల సంక్షేమం, ప్రచురణలు వగైరాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు డాక్టర్ మజుందార్ తెలిపారు.

   విద్యా సంస్థలు మెరుగైన ర్యాంకు సాధించేలా జాతీయ, ప్రాంతీయ స్థాయులలో విద్యా మంత్రిత్వ శాఖ అనేక కార్యశాలలు నిర్వహించిందని కార్యదర్శి శ్రీ కె.సంజయ్ మూర్తి తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఇందులో అఖిల భారతీయ శిక్షా సమాగమం పేరిట 2024 జూలై 29న నిర్వహించిన ప్రధానమైన కార్యశాల గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. జాతీయ-అంతర్జాతీయ విద్యా సంస్థల మధ్య సహకారం ప్రాముఖ్యాన్ని కూడా ఆయన నొక్కిచెప్పారు.

దేశంలోని ఉన్నత విద్యాసంస్థలకు ఇది వరుసగా 9వ దఫా ర్యాంకుల ప్రకటన కాగా, ప్రస్తుత (2024) ప్రక్రియలో జోడించిన నాలుగు ప్రత్యేకాంశాలిలా ఉన్నాయి:

  1. రాష్ట్ర స్థాయి, సార్వత్రిక, నైపుణ్య విశ్వవిద్యాలయాల పేరిట మూడు కొత్త విభాగాలకు ప్రవేశం.
  2. ‘ఎన్ఐఆర్ఎఫ్’ చట్రం ద్వారా ‘ఇండియా ర్యాంకింగ్స్’లో ‘ఆవిష్కరణ’ విభాగానికి స్థానం.

రాష్ట్ర స్థాయి, సార్వత్రిక, నైపుణ్య విశ్వవిద్యాలయాలను చేర్చడంతో ప్రస్తుత ర్యాంకింగ్ ప్రక్రియ 16 కేటగిరీలు, పాఠ్యాంశాలకు విస్తరించింది.

   తొలి ఇండియా ర్యాంకింగ్స్-2016లో విశ్వవిద్యాలయాలతో పాటు ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్, ఫార్మసీ రంగాలకు ర్యాంకులను ప్రకటించారు. అటుపైన తొమ్మిదేళ్లలో 7 కొత్త కేటగిరీలు, ఐదు కొత్త పాఠ్యాంశాలను జోడించి 8 కేటగిరీలు చేశారు. ఈ జాబితాలో- సమగ్ర (ఓవరాల్) ర్యాంకింగ్,  విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పరిశోధన సంస్థలు, రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయాలు, సార్వత్రిక విశ్వవిద్యాలయాలు, నైపుణ్య విశ్వవిద్యాలయాలు, ఆవిష్కరణ సంస్థలు ఉన్నాయి. ఇక పాఠ్యాంశాల పరంగా విద్యారంగంలో- ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్, వైద్యం, న్యాయ విద్య, డెంటల్, వ్యవసాయం-అనుబంధ రంగాలున్నాయి.

ర్యాంకింగ్‌ నిర్ణయంలో ఐదు విస్తృత కేటగిరీల పారామితులు.. ప్రాముఖ్యం:

   విద్యా మంత్రిత్వ శాఖ 2015 నవంబరులో ప్రారంభించిన ‘నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్)ను ఈ ఏడాది సహా 2016 నుంచి 2023 వరకు ఇండియా ర్యాంకింగ్స్ ప్రక్రియలో ఉపయోగించారు. ‘ఎన్ఐఆర్ఎఫ్’లో ఐదు విస్తృత కేటగిరీల పారామితులు, వాటి ప్రాముఖ్యం ఇలా ఉన్నాయి:

వ.సం.

ప్రమాణం

మార్కులు

ప్రాముఖ్యం

1

బోధన, అభ్యాసం-వనరులు

100

0.30

2

పరిశోధన, వృత్తిపరమైన అభ్యాసం

100

0.30

3

డిగ్రీ ఫలితాలు

100

0.20

4

చేరువ, సార్వజనీనత

100

0.10

5

భావనలు

100

0.10

 

ఈ ఐదు ప్రమాణాల్లో ప్రతి ఒక్కోదానికి 2 నుంచి 5 ఉప ప్రమాణాలున్నాయి. వివిధ కేటగిరీలు, సబ్జెక్ట్ డొమైన్లలో ఉన్నత విద్యాసంస్థల ర్యాంకింగ్ కోసం 18 ప్రమాణాలను ఉపయోగిస్తారు. ఈ ఐదు విస్తృత ప్రమాణాల్లో ప్రతిదానికీ కేటాయించిన మొత్తం మార్కుల ఆధారంగా సంస్థలకు ర్యాంకులు ఇస్తారు.

   వివిధ ప్రమాణాల మూల్యాంకనంలో దరఖాస్తు చేసున్న సంస్థల నుంచి అందిన సమాచారంతో పాటు థర్డ్ పార్టీ సంస్థల వనరులను కూడా సాధ్యమైనంత మేర ఉపయోగించారు. ప్రచురణలు-పత్రాల సమాచారం డేటా కోసం స్కోపస్ (ఎల్సెవియర్ సైన్స్), వెబ్ ఆఫ్ సైన్స్ (క్లారివేట్ అనలిటిక్స్) ఉపయోగించారు. పేటెంట్లపై గణాంకాల సేకరణకు డెర్వెంట్ ఇన్నోవేషన్ ఉపయోగించగా, ఈ వనరుల నుంచి సమీకరించిన గణాంకాలను పారదర్శకత లక్ష్యంగా ఆయా సంస్థలతో పంచుకున్నారు.

2016 నుంచి 2024 వరకూ ర్యాంకింగ్ దరఖాస్తుల పెరుగుదల:

   ఇండియా ర్యాంకింగ్స్ 2024 కోసం మొత్తం 6,517 విద్యా సంస్థలు ‘‘ఓవరాల్’’ కేటగిరీలో, నిర్దిష్ట రంగం లేదా డొమైన్-ప్రత్యేక ర్యాంకింగ్స్ కోసం దరఖాస్తు చేయగా, ఇవన్నీ ప్రత్యేక సంస్థలు. వివిధ కేటగిరీలు/డొమైన్ల కింద మొత్తం 10,845 దరఖాస్తులు రాగా- ఓవరాల్ కేటగిరీలో 2,781, ఇంజనీరింగ్ విభాగంలో 1,463, జనరల్ డిగ్రీ కాలేజీల్లో 3,371 ఉన్నాయి. దేశంలోని ఉన్నత విద్యా సంస్థలకు సంబంధించి ఇది సముచిత, పారదర్శక ర్యాంకింగ్ ప్రక్రియగా గుర్తింపు పొందిందనడానికి ఈ ఏడాది దరఖాస్తుల గణనీయంగా పెరడటమే నిదర్శనం. ఆ మేరకు ప్రత్యేక దరఖాస్తుదారుల సంఖ్య 2016లో 2,426 కాగా 2024 నాటికి 6,517కు చేరింది. అలాగే వివిధ కేటగిరీలలో ర్యాంకింగ్ కోసం మొత్తం దరఖాస్తుల సంఖ్య 2016లో 3,565 కాగా 2024 లో 10,845కు చేరింది. మొత్తం మీద 4091 (168.63 శాతం) నుంచి 7,280 (204.21 శాతం) మేర పెరిగాయి.

2016 నుంచి 2024 వరకు ర్యాంకులు.. సాధించిన సంస్థల సంఖ్యలో పెరుగుదల:

   ఈ ర్యాంకింగ్స్ ప్రారంభం నుంచి చారిత్రకంగా ‘ఓవరాల్’ కేటగిరీ కింద విశ్వవిద్యాలయాలు, ఇంజనీరింగ్ కళాశాల విభాగాల్లో 100 సంస్థలకు ర్యాంకులు ఇచ్చారు. బడ్డాయి. వీటితోపాటు 100 సంస్థలకు ఓవరాల్ కేటగిరీ, విశ్వవిద్యాలయ కేటగిరీల్లో 50 చొప్పున రెండేసి ర్యాంకులు ఇచ్చారు. ఇంజనీరింగ్, కళాశాలల్లో 100-150, 151-200 చొప్పున రెండు ర్యాంక్ బ్యాండ్లు, 201-300 చొప్పున 100 మంది చొప్పున ఒక ర్యాంక్ బ్యాండ్ వంతున మూడు ర్యాంకు బ్యాండ్లలో 200 అదనపు సంస్థలకు ర్యాంకులిచ్చారు. మేనేజ్‌మెంట్, ఫార్మసీలో 2022 నుంచి ర్యాంకుల సంఖ్యను 75 నుంచి 100కు పెంచడంతో పాటు ఈ రెండు విభాగాల్లో (మేనేజ్‌మెంట్, ఫార్మసీ) 25 చొప్పున ర్యాంకులు సాధించారు. ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్, లా, మెడికల్, డెంటల్, పరిశోధనా సంస్థలు, వ్యవసాయం అనుబంధ రంగాలు వంటి అంశాలకు 40 నుంచి 50 వరకు ర్యాంకులు వచ్చాయి.

   కొత్తగా కేటగిరీల విషయానికొస్తే ఈ ఏడాది 50 రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు 51-100 ర్యాంకు బ్యాండులో అదనంగా 50 ర్యాంకులు లభించాయి. అయితే సార్వత్రిక విశ్వవిద్యాలయాలు, నైపుణ్య విశ్వవిద్యాలయాల కేటగిరీల్లో కేవలం మూడు సంస్థలకు మాత్రమే ర్యాంకులు దక్కాయి. ఆవిష్కరణ సంస్థల విషయంలో 10 సంస్థలకు ర్యాంకులు ఇవ్వగా, అదనంగా మరో 40 సంస్థలకు 11-50 ర్యాంకులు ఇచ్చారు.

ఇండియా ర్యాంకింగ్-2024లో ప్రధానాంశాలు

  • ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ - మద్రాస్ ఓవరాల్ కేటగిరీలో వరుసగా ఆరో ఏడాది (2019 నుంచి 2024 వరకు), ఇంజినీరింగ్ విభాగంలో వరుసగా తొమ్మిదో ఏడాది (2016 నుంచి 2024 వరకు) అగ్ర స్థానం నిలబెట్టుకుంది.
  • ఓవరాల్ కేటగిరీలో ఉత్తమ 100 ర్యాంకుల్లో 23 రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, 22 ప్రైవేటు డీమ్డ్ యూనివర్సిటీలు, 16 ఐఐటీలు, 9 ఎన్ఐటీలు, 7 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు 7 ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, 4 ఒక్కో ఎయిమ్స్, ఐఐఎస్ఈఆర్, ప్రభుత్వ డీమ్డ్ యూనివర్సిటీలు, 3 ఇతర సీఎఫ్టీఐలు, ఒక కళాశాల ఉన్నాయి.
  • విశ్వవిద్యాలయాల కేటగిరీలో బెంగళూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ 2016 నుంచి 2024 వరకు వరుసగా తొమ్మిదో ఏడాది అగ్రస్థానంలో నిలిచింది. పరిశోధన సంస్థల రంగంలో వరుసగా నాలుగో ఏడాది (2021 నుంచి 2024 వరకు) అగ్ర స్థానంలో నిలిచింది.
  • మేనేజ్‌మెంట్ సబ్జెక్టులో ఐఐఎం-అహ్మదాబాద్ 2020 నుంచి 2024 వరకు వరుసగా ఐదో ఏడాది మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంది. ఇది 2016 నుండి 2019 వరకు ఇండియా ర్యాంకింగ్స్ లో మేనేజ్‌మెంట్ సబ్జెక్టులో మొదటి రెండు స్థానాల్లో నిలిచింది.
  • ఢిల్లీలోని ఎయిమ్స్ 2018 నుంచి 2024 వరకు వరుసగా ఏడో ఏడాది వైద్యరంగంలో అగ్రస్థానంలో నిలిచింది. ఓవరాల్ కేటగిరీలో ఎయిమ్స్ 7వ స్థానంలో ఉంది. 2023లో ఓవరాల్ కేటగిరీలో 6వ స్థానంలో నిలిచింది.
  • ఢిల్లీలోని జామియా హమ్దర్ద్ ఈ ఏడాది ఫార్మసీలో అగ్రస్థానంలో నిలిచింది. జామియా హమ్దార్ద్ వరుసగా నాలుగేళ్లు (2019 నుంచి 2022 వరకు) మొదటి స్థానంలో నిలిచింది. 2018, 2023 సంవత్సరాల్లో ఫార్మసీలో 2వ స్థానంలో నిలిచింది.
  • కళాశాల రంగంలో 2017 నుంచి 2023 వరకు వరుసగా ఏడేళ్లు మొదటి స్థానాన్ని నిలబెట్టుకున్న మిరాండా హౌస్ స్థానాన్ని హిందూ కళాశాల తొలిసారిగా దక్కించుకుంది. హిందూ కళాశాల 2019, 2022, 2023 సంవత్సరాల్లో 2వ స్థానంలోనూ 2020, 2018లో వరుసగా 3, 4 స్థానాల్లో నిలిచింది.
  • ఐఐటీ రూర్కీ ఆర్కిటెక్చర్ & ప్లానింగ్‌లో వరుసగా నాలుగో ఏడాది (2021 నుంచి 2024 వరకు) మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంది. ఐఐటీ రూర్కీ 2018 నుంచి 2020 వరకు రెండో స్థానంలో నిలిచింది.
  • బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ వరుసగా ఏడో సంవత్సరం (2018 నుంచి 2024 వరకు) న్యాయశాస్త్రంలో మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంది.
  • మొదటి 10 కళాశాలల్లో ఢిల్లీ నుంచే ఆరు కాలేజీలు ఉండగా, వాటి ర్యాంకింగ్ లో ఢిల్లీలోని కాలేజీలు తమ ఆధిపత్యాన్ని కొనసాగించాయి.
  • డెంటల్ సబ్జెక్టులో చెన్నైలోని సవీత ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ టెక్నికల్ సైన్సెస్ వరుసగా మూడో ఏడాది అగ్రస్థానంలో నిలిచింది.
  • ఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ వరుసగా రెండో ఏడాది వ్యవసాయ-అనుబంధ రంగాల్లో అగ్రస్థానంలో నిలిచింది.
  • 2024లో తొలిసారి ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాల కేటగిరీలో చెన్నైలోని అన్నా యూనివర్సిటీ అగ్రస్థానంలో నిలిచింది.
  • ఢిల్లీలోని ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) 2024లో తొలిసారి ప్రవేశపెట్టిన ఓపెన్ యూనివర్సిటీల కేటగిరీలో అగ్రస్థానంలో నిలిచింది.
  • ఆవిష్కరణల విభాగంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ అగ్రస్థానంలో నిలిచింది.
  • పుణెలోని సింబయాసిస్ స్కిల్ అండ్ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎస్ఎస్పీయూ) ఈ ఏడాది తొలిసారిగా నైపుణ్య విశ్వవిద్యాలయాల కేటగిరీలో అగ్రస్థానంలో నిలిచింది.

***



(Release ID: 2044773) Visitor Counter : 20