రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

వాహ‌న తుక్కు విధానం-2021

Posted On: 08 AUG 2024 12:11PM by PIB Hyderabad

   దేశంలో పాత‌, వినియోగార్హ‌త లేని, కాలుష్య కార‌క‌ (జీవిత కాలం ముగిసిన) వాహనాల‌ను తుక్కుగా మార్చేలా వాటి యజ‌మానుల‌కు వాహ‌న తుక్కు విధానం కింద‌ కేంద్ర రోడ్డురవాణా-రహదారుల మంత్రిత్వశాఖ ప్రోత్సాహ‌కాలు ప్రకటించింది. ఈ మేరకు 2021 అక్టోబ‌రు 5న ‘జీఎస్ఆర్ 720 (ఇ)’ కింద ఉత్తర్వులు జారీచేసింది. దీని ప్ర‌కారం ‘డిపాజిట్ స‌ర్టిఫికెట్‌’పై కొనుగోలు చేసే ర‌వాణాయేత‌ర వాహ‌నాల‌పై 25 శాతం, ర‌వాణా వాహ‌నాల‌పై 15 శాతం వంతున మోటారు వాహ‌న ప‌న్నులో రాయితీ ఇస్తోంది.

   కాగా, 2021 అక్టోబ‌రు 4న ‘జీఎస్ఆర్ 714 (ఇ) కింద జారీచేసిన ‘డిపాజిట్ స‌ర్టిఫికెట్‌’పై రిజిస్ట్రేష‌న్ చేసుకున్న వాహ‌నానికి రిజిస్ట్రేష‌న్ స‌ర్టిఫికేట్‌ జారీ రుసుమును కూడా మాఫీ చేసింది.

   ఇక తుక్కు స్వీకరణ కోసం న‌మోదిత‌ వాహ‌న తుక్కు కేంద్రాల‌ (ఆర్‌వీఎస్ఎఫ్‌) ఏర్పాటు విధివిధానాలను 23.09.2021న ‘జీఎస్ఆర్’ 653(ఇ) ఉత్తర్వు ద్వారా (సమయానుగుణ సవరణలతో) జారీచేసిన మోటారు వాహ‌న (వాహ‌న తుక్కు కేంద్రం న‌మోదు, నిర్వ‌హ‌ణ‌) నిబంధ‌న‌లు-2021 నిర్దేశిస్తున్నాయి.

   ఇందులోని 10వ నిబంధ‌న కిందగల ఉప‌-నిబంధ‌న‌(xix) ప్ర‌కారం.. ‘ఆర్‌వీఎస్ఎఫ్‌’లు తుక్కుగా మార్చిన వాహ‌నంలోని ప్ర‌మాద‌క‌ర భాగాల‌ను తొలగించడంలో కేంద్ర కాలుష్య నియంత్ర‌ణ మండ‌లి (సీపీసీబీ) మార్గదర్శకాలను అనుసరించాలి. ఈ మేరకు జీవితకాలం ముగిసిన వాహ‌నాల పర్యావరణ పరమైన నిర్వహణపై ‘సీపీసీబీ’ నిర్దేశించిన ఈ మార్గ‌ద‌ర్శ‌కాల్లోని ‘ఏఐఎస్‌-129’ని విధిగా పాటిస్తూ తొల‌గించాలి లేదా పున‌ర్వినియోగించాలి లేదా నిర్మూలించాలి.

   అలాగే ఇందులోని 14వ నిబంధ‌న ప్ర‌కారం.. ‘ఆర్‌వీఎస్ఎఫ్’ ప్రతి ఏటా వార్షిక నియంత్ర‌ణ త‌నిఖీ నిర్వ‌హించ‌డంతోపాటు కేంద్ర మోటారు వాహ‌న నిబంధ‌న‌లు-1989లోని 126వ నిబంధ‌న కింద నిర్దేశించిన ఏదైనా సంస్థ‌తో ‘మాస్ ఫ్లో స్టేట్‌మెంట్’ త‌నిఖీ చేయించాలి.

   జీవిత కాలం ముగిసిన వాహ‌నాల నిర్వ‌హ‌ణ‌, తుక్కుగా మార్పు దిశగా పర్యావ‌ర‌ణ హిత కేంద్రాల‌కు సంబంధించి కూడా 2023 మార్చిలో ‘సీపీసీబీ’ మార్గ‌ద‌ర్శ‌కాలు ప్ర‌చురించింది.

   కేంద్ర ప‌ర్యావ‌ర‌ణ‌-అట‌వీ-వాతావ‌ర‌ణ మార్పుల మంత్రిత్వ శాఖ 30.01.2024న ‘ఎస్‌.ఒ.367(ఇ) ద్వారా జీవిత కాలం ముగిసిన వాహ‌నాల‌ (నిర్వ‌హ‌ణ‌) నిబంధ‌న‌లు-2024ను జారీచేసింది. దీనికింద ‘ఆర్‌వీఎస్ఎఫ్‌’ల‌లో ఇలాంటి వాహ‌నాల‌ను తుక్కుగా మార్చే బాధ్య‌త వాహ‌న ఉత్ప‌త్తిదారులకు (ఎగుమ‌తిదారులు స‌హా) నిర్దేశించబడింది. కాబట్టి, ‘ఎక్స్‌ టెండెడ్ ప్రొడ్యూస‌ర్ రెస్పాన్సిబులిటీ’ సంబంధిత మార్గ‌ద‌ర్శ‌కాల‌ను ఈ నిబంధ‌న‌లు వివరిస్తాయి.

   పాత, వినియోగార్హత లేని వాహనాలను శాస్త్రీయ పద్ధతిలో తుక్కుగా మార్చడంలో ప‌ర్యావ‌ర‌ణ హిత విధానం అనుసరించడం వల్ల ఆ ప్రక్రియలో వెలువడే కాలుష్యాన్ని త‌గ్గించడ‌మే వాహ‌న తుక్కు విధానం ల‌క్ష్యం. మరోవైపు అసంఘ‌టిత/అన‌ధికార రంగాన్ని కూడా అధికారిక తుక్కు వ్య‌వ‌స్థ‌లో చేర్చేలా (సమయానుగుణ సవరణలతో) ‘జీఎస్ఆర్’ 653(ఇ) జారీ అయింది. ఈ చట్టబద్ధ చట్రం కింద ఇప్ప‌టిదాకా ఏర్పాటైన 62 ‘ఆర్‌వీఎస్ఎఫ్‌’ల‌లో 22 ఈ రంగంలోని సంస్ధలు ఏర్పాటు చేసినవే.

   కేంద్ర‌ రోడ్డు ర‌వాణా-ర‌హ‌దారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గ‌డ్క‌రీ 08.09.2024న లోక్‌స‌భ‌లో ఒక ప్రశ్నకు లిఖిత‌పూర్వ‌క సమాధానమిస్తూ ఈ స‌మాచారం వెల్లడించారు.

****



(Release ID: 2044186) Visitor Counter : 35