జల శక్తి మంత్రిత్వ శాఖ

జల్ జీవన్ మిషన్ ప్రభావం


15.04 కోట్లకు పైబడిన (77.87%) గ్రామీణ గృహాలకు కుళాయిల ద్వారా నీటి సరఫరా

గ్రామాల్లో నీటి సరఫరా వ్యవస్థ ప్రణాళిక రూపొందించి, అమలుపరిచి, నిర్వహించి, ఆపరేట్ చేసేందుకు గ్రామ పంచాయతీ స్థాయిలో 5.32 లక్షల పానీ సమితుల ఏర్పాటు

క్షేత్రస్థాయి పరీక్షలు నిర్వహించే కిట్ల ద్వారా నీటి నమూనాలు పరీక్షించడంతో 24.64 లక్షల మంది మహిళలకు శిక్షణ; 2024-25 సంవత్సరంలో ఇప్పటివరకు 54.20 లక్షల నమూనాల పరీక్ష

Posted On: 08 AUG 2024 1:10PM by PIB Hyderabad

నీటి టాప్  కనెక్షన్లు ఇవ్వడం ద్వారా  దేశంలోని ప్రతీ ఒక్క గృహానికి సురక్షితమైన నీరు సరఫరా చేయడం లక్ష్యంగా రాష్ర్ట ప్రభుత్వాల భాగస్వామ్యంలో కేంద్రప్రభుత్వం జల్ జీవన్ మిషన్ (జెజెఎం) అమలుపరుస్తోంది. క్రమం తప్పకుండా, దీర్ఘకాలిక ప్రాతిపదికన నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలతో (బిఐఎస్ : 10500) రోజువారీగా తలసరి 55 లీటర్ల (ఎన్ సిపిడి) సరఫరా చేయడం ఈ కార్యక్రమం లక్ష్యం.  

జల్ జీవన్ మిషన్ ప్రారంభమయ్యే నాటికి అంటే 2019 ఆగస్టు నాటికి 3.23 శాతం (16.8%) గ్రామీణ గృహాలకు మాత్రమే పంపుల ద్వారా నీటి సరఫరా సదుపాయం అందుబాటులో ఉండేది. వివిధ రాష్ర్టాలు/కేంద్రపాలిత ప్రాంతాలు అందించిన సమాచారం ప్రకారం 2024 ఆగస్టు 5వ తేదీ నాటికి జెజెఎం కింద గ్రామీణ ప్రాంతాల్లో అదనంగా 11.81 కోట్ల ఇళ్ళకు కుళాయిల ద్వారా నీటి సరఫరా కనెక్షన్లు అందచేశారు. ఆ రకంగా 2024 ఆగస్టు 5వ తేదీ నాటికి దేశంలోని 19.32 కోట్ల గ్రామీణ గృహాల్లోను 15.04 కోట్లు పైగా గృహాలకు (77.87%) కుళాయి నీటి కనెక్షన్లున్నాయి.

జీవితంలో పరివర్తనకు దోహదపడే జల్ జీవన్ మిషన్ కింద గ్రామీణ ప్రజలందరికీ సురక్షితమైన నీటిని సరఫరా చేయడం ద్వారా వారి జీవితాలను మెరుగుపరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రాధాన్యతా ప్రాతిపదికపై ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎన్నో సానుకూల మార్పులు చోటు చేసుకున్నాయని ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ సంస్థలు/వ్యక్తులు నిర్వహించిన సర్వేలో తేలింది.

వాటిలో కొన్ని ఈ దిగువన పొందుపరుస్తున్నాం.

      i.         జెజెఎంలో సంతృప్త స్థాయిని సాధించినట్టయితే గ్రామీణ ప్రాంతాల ప్రజలు ప్రత్యేకించి  మహిళలు ఇంటి అవసరాల కోసం నీరు తెచ్చేందుకు రోజువారీగా వెచ్చిస్తున్న 5.5 కోట్ల గంటలకు పైబడిన సమయం ఆదా అవుతుందన్నది  ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) అంచనా.  

       ii.       దేశంలోని అన్ని ఇళ్లకు సురక్షితమైన మంచినీరు అందించగలిగితే అతిసార వ్యాధి కారణంగా సంభవిస్తున్న 4,00,000 మరణాలను నిరోధించవచ్చునని కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) అంచనా వేసింది. ఆ రకంగా ప్రాణాలు కాపాడడం వల్ల 14 మిలియన్ అంగవైకల్య సద్దుబాటు జీవిత సంవత్సరాలను కూడా ఆదా చేయవచ్చునని తెలిపింది.  

      iii.       నోబెల్ బహుమతి గ్రహీన ప్రొఫెసర్  మైకేల్ క్రెమర్  అన్ని ఇళ్లకు సురక్షితమైన మంచినీరు అందించడం వల్ల ఏర్పడే ప్రభావంపై ఒక పరిశోధన పత్రం సమర్పించారు. అన్ని ఇళ్లకు సురక్షితమైన మంచి నీరు అందుబాటులో ఉన్నట్టయితే 5 సంవత్సరాల లోపు వయస్కులైన బాలల్లో మరణాలను 30% తగ్గించవచ్చునని, అంటే సుమారుగా ఏడాదికి 1,36,000 ప్రాణాలు కాపాడవచ్చునని ఆయన ఆ నివేదికలో తెలియచేశారు.

     iv.       జెజెఎం ఉపాధి కల్పన సామర్థ్యంపై అంతర్జాతీయ కార్మిక సంఘం (ఐఎల్ఓ) భాగస్వామ్యంలో ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ బెంగళూరు ఒక నివేదిక విడుదల చేసింది. జల్  జీవన్ మిషన్ అమలు ద్వారా జెజెఎం పెట్టబడుల దశలో 59.9 లక్షల వ్యక్తి-సంవత్సరాల ప్రత్యక్ష ఉపాధి, 2.2 కోట్ల వ్యక్తి-సంవత్సరాల పరోక్ష ఉపాధి అవకాశాలు  కల్పించవచ్చునని ఉభయ సంస్థలు విడుదల చేసిన ఆ నివేదిక అంచనా వేసింది. దీనికి తోడు ఈ కార్యక్రమం అమలు, నిర్వహణ ద్వారా 13.3 లక్షల వ్యక్తి-సంవత్సరాల ప్రత్యక్ష ఉపాధి లభిస్తుందని కూడా అంచనా.

ఈ పనులు చేపట్టిన వారికి చెల్లింపులు చేసే ముందే జెజెఎం కోసం నిర్మించిన మౌలిక వసతుల దీర్ఘకాలిక మన్నిక, అందులో ఉపయోగించిన వస్తువుల నాణ్యత, నిర్మాణ నాణ్యతపై థర్డ్ పార్టీ (మూడో వ్యక్తి లేదా సంస్థ) తనిఖీ కూడా నిర్వహిస్తున్నారు. సెన్సర్ ఆధారిత ఐఓటి సొల్యూషన్ ద్వారా గ్రామాల్లో సరఫరా చేస్తున్న నీటి నాణ్యతను పర్యవేక్షించి, మదింపు చేయడంతో పాటు చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా ప్రతీ ఇంటికీ లక్ష్యానికి అనుగుణంగా నీరు సరఫరా చేయడం కోసం ఇంటి పెద్ద ఆధార్ అనుసంధానం చేయడం, నిర్మించిన ఆస్తుల జియో టాగింగ్ వంటి చర్యలు తీసుకున్నారు.   

అంతే కాదు, పారదర్శకత, సమర్థ పర్యవేక్షణ కోసం ఆన్ లైన్ జెజెఎం డాష్ బోర్డు, మొబైల్ యాప్ ను కూడా రూపొందించారు. రాష్ర్ట/యుటి, జిల్లా స్థాయిలో గ్రామీణ గృహాలకు నీటి సరఫరాలో పురోగతిని పర్యవేక్షించేందుకు ఇవి ఉపయోగపడతాయి.  

గ్రామీణ సమాజం, పంచాయతీల్లో అందరిలోనూ యాజమాన్య భావం నెలకొనేలా చేసేందుకు జెజెఎం డిజైన్ లోనే నీటి సరఫరా వ్యవస్థలకు సంబంధించిన అన్ని నిర్ణయాల్లోనూ గ్రామీణ స్థాయి ప్రణాళిక, కమ్యూనిటీ భాగస్వామ్యానికి అవకాశం కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ సమాజాన్ని భాగస్వామిని చేసేందుకు తీసుకున్న ప్రధాన చొరవలు కొన్ని ఇలా ఉన్నాయి.

·      గ్రామ పంచాయతీల్లో 5.32 లక్షల సబ్-కమిటీ/యూజర్ గ్రూప్ లు అంటే గ్రామీణ నీరు, పారిశుధ్య కమిటీలు (విడబ్ల్యుఎస్ సి) లేదా పానీ సమితులు ఏర్పాటు చేశారు. గ్రామాల్లో నీటి సరఫరా వ్యవస్థల ప్రణాళిక, అమలు, నిర్వహణ బాధ్యతలు చేపట్టే ఈ కమిటీల్లో మహిళలకు 50 ప్రాతినిధ్యంతో పాటు సమాజంలో అట్టడుగు వర్గాల వారికి కూడా సముచిన ప్రాతినిథ్యం కల్పించారు.

·      క్షేత్ర స్థాయి పరీక్షా కిట్ల (ఎఫ్ టికె) సహాయంతో నీటి నమూనాలు పరీక్షించడంపై ప్రతీ గ్రామంలోనూ ఐదుగురు మహిళలను గుర్తించి శిక్షణ ఇచ్చారు. ఇప్పటివరకు 24.64 లక్షల మంది మహిళలకు శిక్షణ ఇచ్చారు. 2024-25 సంవత్సరంలో ఇప్పటి వరకు  ఎఫ్ టికెల సహాయంతో  54.20 లక్షల పైబడిన నమూనాలను పరీక్షించారు.

·      గ్రామీణ నీటి సరఫరా వ్యవస్థల ప్రణాళిక, అమలు, నిర్వహణ, ఆపరేషన్ లో సామాజిక భాగస్వామ్యం కల్పించడంలో భాగంగా 14,000 పైగా ఎన్ జిఓలు/విఓలు/మహిళా ఎస్ హెచ్ జిలు/సిబిఓలు/ట్రస్టులు/ఫౌండేషన్లకు భాగస్వామ్యం కల్పించారు. వీటిని ఐఎస్ఏలుగా వ్యవహరిస్తున్నారు.  

ఎంజిఎన్ఆర్ఇజిఎస్; గ్రామీణ స్థానిక సంస్థలు (ఆర్ఎల్ బి) /పంచాయతీ రాజ్ సంస్థలు (పిఆర్ఐ), ఇంటిగ్రేటె వాటర్ షెడ్ మేనేజ్ మెంట్ కార్యక్రమాలు (ఐడబ్ల్యుఎంపి), రాష్ర్ట పథకాలకు 15వ ఆర్థిక సంఘం గ్రాంట్లు; ఎంపి/ఎంఎల్ఏ-లాడ్ నిధులు, జిల్లా ఖనిజాభివృద్ధి నిధి వంటి పథకాలు; సిఎస్ఆర్ నిధులు, సామాజిక విరాళాల ద్వారా స్థానిక మంచినీటి వ్యవస్థల విస్తరణ, పటిష్ఠతకు జెజెఎం కింద చర్యలు తీసుకున్నారు. నీటి సరఫరా వ్యవస్థల నిర్వహణ, మెయింటెనెన్స్ సమస్యను పరిష్కరించడానికి కూడా జెజెఎం కింద తగు ఏర్పాట్లు చేశారు. పథకాన్ని ప్రారంభించిన తర్వాత దశలవారీగా మొత్తం పెట్టుబడి వ్యయంలో 10% వాటాను యూజర్ చార్జీల వసూలు ద్వారా సమకూర్చుకునేందుకు రివార్డులు/ప్రోత్సాహకాలు కల్పిస్తారు.

నీరు రాష్ర్ట పరిధిలోకి వచ్చే అంశం కావడం వల్ల  ఇళ్లకు సరఫరా చేసే నీరు  అది నిర్దేశిత ఆరోగ్య, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చేసేందుకు నిర్దిష్ట కాలపరిమితిలో నీటి నాణ్యతను పరీక్షించి, అవసరమైన చోట నివారణ చర్యలు తీసుకోవాలని రాష్ర్టాలు/యుటిలకు సలహా ఇచ్చారు.

అందరికీ సురక్షితమైన నీరు అందుతున్నదన్న నమ్మకం కలిగించడం కోసం ప్రజలు తమకు అందుతున్న నీటి నమూనాలు తెచ్చుకుని, నామమాత్రపు ధరకు నీటి నాణ్యతా పరీక్షలు నిర్వహించుకునేందుకు రాష్ర్టాలు/యుటిలు నీటి నాణ్యతా పరీక్షా కేంద్రాలు ప్రారంభించాయి. అంతే కాదు, రాష్ర్టాలు/యుటిలు నీటి నాణ్యత కోసం నీటి నమూనాలు పరీక్షించుకునేందుకు వీలుగా శాంపిల్ సేకరణ, రిపోర్టింగ్, పర్యవేక్షణ, నిఘా కోసం వాటర్ క్వాలిటీ మేనేజ్ మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (డబ్ల్యుక్యుఎంఐఎస్) పేరిట ఒక పోర్టల్ ను కూడా ప్రారంభించారు.  అలాగే ఇళ్లలో నుంచి వస్తున్న మురికినీరు/వ్యర్ధ జలాలను శుద్ధి చేయడం కోసం జెజెఎం నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో సోక్ పిట్లు ఏర్పాటు చేసుకునేందుకు రాష్ర్టాలు/యుటిలను ప్రోత్సహించారు.

నీటి ఎద్దడి అధికంగా ఉన్న, దుర్భిక్ష పీడిత, ఎడారి ప్రాంతాల్లో ఆధారనీయమైన మంచినీటి వనరు లేకపోవడం; భూగర్భ  జలవనరుల్లో భూ సంబంధిత కాలుష్యాలుండడం, భూభౌగోళిక స్వభావం ఎగుడుదిగుడులుగా ఉండడం, చెదురుమదురుగా విస్తరించిన గ్రామీణ ఆవాస ప్రాంతాలుండడం, కొన్ని రాష్ర్టాలు మాచింగ్ గ్రాంట్లు విడుదల చేయడంలో చేస్తున్న జాప్యం;  నీటి సరఫరా వ్యవస్థల ప్రణాళిక, నిర్వహణ, అమలులో గ్రామ పంచాయతీలు, స్థానిక సమాజానికి చెందిన అమలు ఏజెన్సీల్లో సాంకేతిక సామర్థ్యాలు  లోపించడం, పెరిగిపోయిన ముడిసరకు వ్యయాలు, చట్టపరమైన/ఇతరత్రా అనుమతుల్లో జాప్యాలు వంటి అవరోధాలు మిషన్ అమలులో ఎదురవుతున్నట్టు రాష్ర్టాలు తెలియచేశాయి.

ఈ సవాళ్లను సంపూర్ణ దృక్పథంతో ఎదుర్కొని, అధిగమించేందుకు భారత ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. మూలధన పెట్టుబడి ప్రాజెక్టులకు 50 సంవత్సరాల కాలపరిమితి గల వడ్డీ రహిత రుణాలు అందించడం కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖ ద్వారా రాష్ర్టాలకు ప్రత్యేక సహాయం అమలుపరచడం; రాష్ర్ట ప్రభుత్వాలు చట్టపరమైన/ఇతరత్రా అనుమతులు పొందేందుకు వీలుగా కేంద్ర నోడల్ మంత్రిత్వ శాఖలు/ప్రభుత్వ శాఖలు/ఏజెన్సీల్లో సమన్వయ విభాగంలో నోడల్ అధికారుల నియామకం;  రాష్ర్ట ప్రోగ్రామ్ నిర్వహణ యూనిట్లు (ఎస్ పిఎంయు), జిల్లా ప్రోగ్రామ్ నిర్వహణ యూనిట్ల (డిపిఎంయు) ఏర్పాటు; సాంకేతిక నైపుణ్యాల లభ్యతలో ఉన్న వ్యత్యాసాలను పూడ్చేందుకు స్థానిక సంస్థల స్థాయిలో నిపుణులను అందుబాటులో ఉంచడం కోసం ‘‘నల్ జల్ మిత్ర కార్యక్రమం’’ అమలు; ప్రోగ్రాం నిర్వహణకు హెచ్ఆర్ నియామకం వంటివి అందులో ఉన్నాయి.

ఇది కాకుండా గ్రామీణ స్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో నీటి సంరక్షణ కోసం నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న 256 జిల్లాల్లో 2019 సంవత్సరంలో ‘‘జల్ శక్తి అభియాన్ : నీటి చుక్క పట్టండి’’  (జెఎస్ఏ : సిటిఆర్) ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంచినీటి లభ్యత కోసం సుస్థిరంగా జలవనరుల నిర్వహణ ప్రాధాన్యాన్ని గుర్తించి 2023లో ‘‘మంచినీటి కోసం వనరుల సుస్థిరత’’ పేరిట జెఎస్ఏ-సిటిఆర్ ను అమలు పరిచారు. అలాగే జలవనరుల నిర్వహణలో మహిళల కీలక పాత్రను పరిగణనలోకి తీసుకుని 09.03.2024 నుంచి 30.11.2024 వరకు ‘‘నారీ శక్తితోనే జలశక్తి’’ పేరిట జెఎస్ఏను అమలుపరుస్తున్నారు.

కేంద్ర జలశక్తి సహాయమంత్రి శ్రీ వి.సోమన్న లోక్ సభకు సమర్పించిన లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయం తెలియచేశారు. 

***



(Release ID: 2043711) Visitor Counter : 30