హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మూడు కొత్త నేర విచారణ చట్టాల సంబంధిత 4 అనువర్తనాలను ప్రారంభించిన కేంద్ర హోం-సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా


చండీగ‌ఢ్‌లో ‘ఇ-సాక్ష్య.. న్యాయసేతు.. న్యాయశ్రుతి.. ఇ-సమన్’ అనువర్తనాల ఆవిష్కరణ;

కొత్త చట్టాలు.. వాటి ఆధారిత నేర న్యాయవ్యవస్థ
21వ శతాబ్దపు అతిపెద్ద సంస్కరణగా నిలుస్తాయి;

ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ తెచ్చిన కొత్త చట్టాలు- ‘బిఎన్ఎస్‌.. బిఎన్ఎస్ఎస్‌.. బిఎస్ఎ’
భారతీయతతోపాటు మనవైన న్యాయ నైతిక విలువల పరిమళాలను వెదజల్లుతాయి;

దీనికి అనుగుణంగా నాలుగు కొత్త అనువర్తనాలు యావత్
వ్యవస్థ సాంకేతిక సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయి;

కొత్త చట్టాల లక్ష్యం ప్రజలకు న్యాయమేగానీ శిక్ష కాదు...
అందుకే- ఇది శిక్షాస్మృతి కాదు... ‘న్యాయ సంహిత’;

వీటి పూర్తిస్థాయి అమలు తర్వాత ప్రపంచంలోనే అత్యాధునిక
సాంకేతిక ఆధారిత నేరన్యాయ వ్యవస్థ భారతదేశానిదే అవుతుంది;

కొత్త చట్టాల సక్రమ అమలు దిశగా మోదీ ప్రభుత్వం ‘సిసిటిఎన్ఎస్’ నుంచి
‘ఎస్‌హెచ్ఒ’లకు శిక్షణ.. ‘ఎఫ్ఎస్ఎల్’ ఏకీకరణ దాకా ఎన్నో చర్యలు చేపట్టింది;

మరో రెండు నెలల్లో కొత్త చట్టాలు 100 శాతం అమలు చేసిన
దేశంలోని తొలి పాలన విభాగంగా అవతరించనున్న చండీగఢ్;

కొత్త చట్టాల్లో వ్యవధి నిర్దేశిత విధివిధానాలు.. సుప్రీంకోర్టు సహా
ఏ న్యాయస్థానంలోనైనా కేసులపై

Posted On: 04 AUG 2024 8:04PM by PIB Hyderabad

   కేంద్ర హోమ్-సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా ఇవాళ చండీగ‌ఢ్‌లో మూడు కొత్త నేర విచారణ చట్టాల సంబంధిత నాలుగు అనువర్తనాలకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు ‘‘ఇ-సాక్ష్య, న్యాయసేతు, న్యాయశ్రుతి, ఇ-సమన్’’ పేరిట రూపొందించిన అనువర్తనాల ఆవిష్కరణ కార్యక్రమంలో పంజాబ్ గవర్నర్/చండీగఢ్ పాలనాధికారి గులాబ్ చంద్ కటారియా, కేంద్ర హోంశాఖ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

   ఈ సందర్భంగా శ్రీ అమిత్ షా ప్రసంగిస్తూ- కొత్త చట్టాల రూపంలో 21వ శతాబ్దపు అతిపెద్ద సంస్కరణ అమలును నేడిక్కడ మనమంతా ప్రత్యక్షంగా చూస్తున్నామని వ్యాఖ్యానించారు. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ తెచ్చిన కొత్త చట్టాలు- ‘‘భారతీయ న్యాయ సంహిత (బిఎన్ఎస్‌), భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బిఎన్ఎస్ఎస్‌), భారతీయ సాక్ష్య అధినియం (బిఎస్ఎ)’’ భారతీయత సహా మనవైన న్యాయ నైతిక విలువల పరిమళాలను వెదజల్లుతాయని ఆయన అభివర్ణించారు. దేశంలో ప్రతి ఒక్కరికీ న్యాయప్రదానం బాధ్యతను రాజ్యాంగం మనకు నిర్దేశించిందని, ఆ స్ఫూర్తిని సాకారం చేయడంలో నేర న్యాయవ్యవస్థ ఒక ఉపకరణమని మంత్రి పేర్కొన్నారు.

   ఎప్పుడో 150 ఏళ్ల కిందటి చట్టాలకు కాలం చెల్లిందని, నేడు వాటికి ఔచిత్యం లేదని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. వలస పాలన సమయంలో 1860 నాటి పరాయి ప్రభుత్వ లక్ష్యాలకు-నేటి భారతావనికి, ఆనాటి పాలకుల ప్రయోజనాలకు-నేటి రాజ్యాంగ లక్ష్యాలకు ఎంతో వ్యత్యాసం ఉందన్నారు. కానీ, అమలు యంత్రాంగంలో ఏ మార్పూ రాకపోగా, న్యాయం కోసం ప్రజలు ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సి వస్తున్నదని చెప్పారు. ప్రతిసారి కొత్త విచారణ తేదీలతో వాయిదాలు వేయడం తప్ప న్యాయం లభించదంటూ న్యాయవ్యవస్థ నిందకు గురవుతున్నదని అమిత్ షా గుర్తుచేశారు. దీంతో వ్యవస్థలపై ప్రజల్లో క్రమేణా విశ్వాసం సన్నగిల్లుతున్నదని చెప్పారు. అందుకే, ‘ఐపిసి’కి ‘బిఎన్ఎస్’, ‘సీఆర్పీసీ’ స్థానంలో ‘బిఎన్ఎస్ఎస్’, ‘ఎవిడెన్స్ యాక్ట్’ ప్రత్యామ్నాయంగా ‘బిఎస్ఎ’ అమలు చేసే కర్తవ్యాన్ని మోదీ ప్రభుత్వం స్వీకరించిందని పేర్కొన్నారు.

   ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎర్రకోట పైనుంచి ప్రసంగిస్తూ- ‘పంచ్ ప్రాణ్’ గురించి ప్రస్తావించారని శ్రీ అమిత్ షా గుర్తుచేశారు. అన్ని రూపాల్లోగల బానిసత్వ నిర్మూలన అందులో ఒకటని పేర్కొన్నారు. తదనుగుణంగానే భారతీయులు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు రూపొందించినవిగా కొత్త నేరవిచారణ చట్టాలు పార్లమెంటులో ఆమోదం పొందాయని తెలిపారు. ఈ వినూత్న చట్టాల్లో శిక్షకన్నా న్యాయ ప్రదానానికే పెద్దపీట వేసినట్లు చెప్పారు. ఆ మేరకు కొత్త చట్టాల లక్ష్యం ప్రజలకు న్యాయం చేయడమే తప్ప శిక్షించడం కాదని, అందుకే- ఇది శిక్షాస్మృతి కాదు... ‘న్యాయ సంహిత’ అని ఆయన అభివర్ణించారు.

   ఈ చట్టాలు పూర్తి స్థాయిలో అమలోకి వచ్చాక ప్రపంచంలోనే అత్యాధునిక సాంకేతిక ఆధారిత నేరన్యాయ వ్యవస్థ భారతదేశానిదే కాగలదని కేంద్ర మంత్రి అన్నారు. ఈ చట్టాలు సవ్యంగా అమలయ్యేలా కేంద్ర హోంశాఖ వివిధ స్థాయులలో శిక్షణ, నైపుణ్యాభివృద్ధికి ఏర్పాట్లు చేసిందని తెలిపారు. ఇక ఈ చట్టాలు అమల్లోకి రాకముందే ఫోరెన్సిక్ సైన్స్ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ఆ మేరకు నేడు దేశంలోని 8 రాష్ట్రాల్లో ఫోరెన్సిక్ సైన్స్ విశ్వవిద్యాలయాలు ఉన్నాయని, ఈ రంగంలో నిపుణుల లభ్యత పెంచడమే ప్రభుత్వ ధ్యేయమని శ్రీ అమిత్ షా తెలిపారు. తదనుగుణంగా త్వరలోనే మరో 8 రాష్ట్రాల్లో ఈ విశ్వవిద్యాలయాలు ఏర్పాటవుతాయని, వీటిలో ఏటా 36 వేల మంది ఫోరెన్సిక్ నిపుణులు తయారవుతారని చెప్పారు.

   ఏడేళ్లు లేదా అంతకన్నా ఎక్కువ శిక్ష పడే నేరాల విషయంలో ఫోరెన్సిక్ నిపుణుల పరిశీలనను ఈ చట్టాలు తప్పనిసరి చేస్తున్నాయని తెలిపారు. శిక్షకు విధించదగిన సాక్ష్యాల నిరూపణకు సాంకేతిక ఆధారాలు కూడా తోడ్పడతాయని శ్రీ అమిత్ షా అన్నారు. ఈ కేసుల్లో ‘డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్’ను ఏర్పాటు చేశామని, కేసుల విచారణ ప్రక్రియ మొత్తాన్నీ ఈ వ్యవస్థ నిరంతరం పర్యవేక్షిస్తుందని తెలిపారు. జిల్లా నుంచి తాలూకా స్థాయి వరకు ఈ వ్యవస్థను సిద్ధం చేశామని, అధికారాలను కూడా నిర్ణయించామని చెప్పారు.

   ఈ చట్టాలు పూర్తిస్థాయిలో అమలు కావాలంటే వ్యవస్థ మొత్తం సాంకేతిక సామర్థ్యం పెంచుకోవాల్సి ఉంటుందని కేంద్ర హోం మంత్రి అన్నారు. అందులో భాగంగానే ఈ రోజున ‘‘ఇ-సాక్ష్య, న్యాయసేతు, న్యాయశ్రుతి, ఇ-సమన్’’ అనువర్తనాలను ఆవిష్కరించినట్లు తెలిపారు. ‘ఇ-సాక్ష్య’ కింద వీడియోగ్రఫీ, ఫొటోగ్రఫీ సాక్ష్యాలన్నీ ‘ఇ-ఎవిడెన్స్’ స‌ర్వ‌ర్‌లో భద్రపరుస్తారని చెప్పారు. తద్వారా అవి కోర్టులకు తక్షణ అందుబాటులో ఉంటాయన్నారు. అలాగే ‘ఇ-సమన్’ కింద కోర్టు నుంచి పోలీస్ స్టేషనుకు, సమను చేరాల్సిన వ్యక్తులకు ఎలక్ట్రానిక్ పద్ధతిలో పంపుతారని వివరించారు. పోలీసు, వైద్య, ఫోరెన్సిక్,  ప్రాసిక్యూషన్, జైళ్ల శాఖలను ‘న్యాయసేతు’ డ్యాష్ బోర్డులో అనుసంధానిస్తారని చెప్పారు. దీంతో కేవలం ఒక్క క్లిక్ ద్వారా దర్యాప్తు సంబంధిత సమస్త సమాచారం అందుబాటులో ఉంటుందన్నారు. ఇక ‘న్యాయ్ శ్రుతి’ ద్వారా కోర్టు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమంలో సాక్షులను విచారిస్తుందన్నారు. దీనివల్ల సమయం, డబ్బు ఆదాతోపాటు కేసుల సత్వర పరిష్కారం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

   లలల

   ఈ మూడు కొత్త చట్టాల సక్రమ అమలుకు శ్రీ మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని శ్రీ అమిత్ షా చెప్పారు. ఈ మేరకు ‘సిసిటిఎన్ఎస్’ నుంచి ‘ఎస్‌హెచ్ఒ’లకు శిక్షణ.. ‘ఎఫ్ఎస్ఎల్’ ఏకీకరణ దాకా ఎన్నో చర్యలు చేపట్టిందన్నారు. ఈ వ్యవస్థ మొత్తానికీ సాంకేతిక పరిజ్ఞానాన్ని కీలక మూలస్తంభంగా మార్చామని చెప్పారు. ఒక్క చండీగఢ్‌లోనే 22 మంది ఐటీ నిపుణులు, 125 మంది డేటా విశ్లేషకులను నియమించినట్లు తెలిపారు. అలాగే పోలీస్ స్టేషన్లలో 107 కొత్త కంప్యూటర్లు, స్పీకర్లు, రెండు వెబ్ కెమెరాలు, 170 ట్యాబ్లెట్లు, 25 మొబైల్ ఫోన్లు, 144 కొత్త ఐటీ కానిస్టేబుళ్లను నియమించినట్లు వెల్లడించారు. తద్వారా దేశంలో కొత్త చట్టాలను 100 శాతం అమలు చేసిన తొలి పాలన విభాగంగా మరో రెండు నెలల్లో చండీగఢ్ అవతరించగలదన్నారు. స్వార్థం నుంచి పరమార్థం దాకా స్వామి వివేకానంద ప్రబోధాలను అనుసరించే వారే అసలైన జ్ఞానులని, దీన్ని సాకారం చేసేందుకు మన సైబర్ సైనికులు కృషిచేశారని పేర్కొన్నారు.

   మాదకద్రవ్య వినియోగ వ్యసనం నిర్మూలనపై తాము చేపట్టింది ప్రభుత్వపరమైన ప్రచారం కాదని, నవతరాన్ని దీన్నుంచి విముక్తం చేసే ఒక ఉద్యమమని కేంద్ర హోం మంత్రి అన్నారు. మాదకద్రవ్యాల ఊబిలో చిక్కిన వారితోపాటు వారి కుటుంబాల్లో నెలకొన్న న్యూనత భావనను తొలగిస్తూ చికిత్స చేయడంతోపాటు అవగాహన కల్పించాల్సి ఉందన్నారు.

   ఈ మూడు కొత్త చట్టాలు... వాటి ఆధారిత నేర న్యాయవ్యవస్థ 21వ శతాబ్దపు అతిపెద్ద సంస్కరణగా నిలుస్తాయని శ్రీ అమిత్ షా అన్నారు. రాబోయే 50 ఏళ్ల అవసరాలను తీర్చగలిగే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ చట్టాల్లో పొందుపరిచామని తెలిపారు. మన రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ఈ పౌర-కేంద్రక చట్టాలను రూపొందించినందువల్ల వాటి పూర్తిస్థాయి అమలు తర్వాత సుప్రీంకోర్టు సహా ఏ న్యాయస్థానంలోనైనా కేసులపై మూడేళ్లలో తీర్పు ఖాయం కాగలదని విశ్వాసం వెలిబుచ్చారు.

   ఈ చట్టాలపై అవగాహన కల్పించే బాధ్యత కేంద్ర హోం మంత్రిత్వ శాఖతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలకు, న్యాయమూర్తులకు ఉన్నదని శ్రీ అమిత్ షా చెప్పారు. అయితే, ఈ విషయంలో పౌరులపైనా అంతే బాధ్యత ఉందని కేంద్ర హోం మంత్రి అన్నారు. ఈ చట్టాలపై అపోహలను హోం మంత్రిత్వ శాఖ లేదా చండీగఢ్ పాలన యంత్రాంగం నుంచి అధికారికంగా నివృత్తి చేసుకోవాలని చండీగఢ్ ప్రజలకు కేంద్ర హోం మంత్రి  విజ్ఞప్తి చేశారు. చివరగా- వదంతులను పట్టించుకోకుండా కొత్త చట్టాల అమలుకు ప్రజలంతా చురుగ్గా, నిర్మాణాత్మకంగా సహకరించాలని కోరారు.

****


(Release ID: 2042899) Visitor Counter : 102