హోం మంత్రిత్వ శాఖ
స్మార్ట్ సిటీ మిషన్ కింద చండీగఢ్‌లోని మణిమజ్రా వద్ద నిరంతర నీటి సరఫరా ప్రాజెక్టుకు కేంద్ర హోం-సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా ప్రారంభోత్సవం
స్మార్ట్ సిటీస్ మిషన్ ద్వారా నగర జీవన నాణ్యత
మెరుగుకు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అవిరళ కృషి;
మోదీ మూడోదఫా పదవీకాలం ముగిసేలోగా దేశంలో ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు;
నేటినుంచి మణిమజ్రాలో లక్ష మందికిపైగా ప్రజలకు 24 గంటలూ స్వచ్ఛమైన తాగునీరు;
జల్ జీవన్ మిషన్ కింద దేశంలోని 74శాతం గృహాలకు స్వచ్ఛమైన మంచినీటి సౌలభ్యం;
జల్ జీవన్ మిషన్ వల్ల దేశంలో డయేరియా సంబంధ మరణాలు 3 లక్షల మేర తగ్గాయి;
మణిమజ్రా మహిళలకు ఎప్పుడు కొళాయి తిప్పినా మంచినీరు..
నీటికోసం ఇకపై వారు మొబైల్ అలారం పెట్టుకునే అవసరం లేదు;
గత పదేళ్లలో చండీగఢ్ ప్రగతికి కేంద్రం వెచ్చించిన రూ.30 వేల
కోట్లలో మౌలిక సదుపాయాల కల్పనకే రూ.29,000 కోట్లు;
ప్రభుత్వాన్ని అస్థిరత పాల్జేసేందుకు యత్నించే శక్తులు
ఐదేళ్ల పదవీకాలాన్ని మేం పూర్తి చేస్తామని ఇకనైనా గ్రహించాలి
Posted On:
04 AUG 2024 6:28PM by PIB Hyderabad
స్మార్ట్ సిటీ మిషన్ కింద కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్‌లోని మణిమజ్రా వద్ద దాదాపు రూ.75 కోట్లతో నిర్మించిన నిరంతర నీటి సరఫరా ప్రాజెక్టును కేంద్ర హోమ్-సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా ఇవాళ ప్రారంభించారు. పంజాబ్ గవర్నర్/చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ శ్రీ గులాబ్ చంద్ కటారియా, రాజ్యసభ సభ్యుడు శ్రీ సత్నామ్ సింగ్ సంధు, హోంశాఖ కార్యదర్శి, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీ అమిత్ షా ప్రసంగిస్తూ- ఈ ప్రాజెక్టుతో లక్షమందికి పైగా ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. ఈ మేరకు 855 ఎకరాల విస్తీర్ణంలోగల ఈ ఆవాస ప్రాంతంలో ఇప్పుడు 22 కిలోమీటర్ల పొడవైన కొత్త పైప్ లైన్ ద్వారా 24 గంటలూ తాగునీరు అందుతుందని తెలిపారు. నిరంతర నీటి లభ్యత కోసం రెండు భారీ రిజర్వాయర్లు నిర్మించినట్టు చెప్పారు. అలాగే స్మార్ట్ మీటర్ల ఏర్పాటు వల్ల ఇకపై లీకేజీ ఖర్చు భారం వినియోగదారులపై పడబోదని భరోసా ఇచ్చారు. దీంతోపాటు నీటి లీకేజీ ప్రదేశాలను తక్షణం గుర్తించి, తగిన పరిమాణంలో పీడనం నిర్వహణ కోసం ‘విఎఫ్‌డి’ పంపును కూడా ఏర్పాటు చేశారని వెల్లడించారు.
ప్రాణాధారమైన నీరు కలుషితమైనా, అవసరాలకు తగినంత లభ్యత లేకపోయినా ప్రజలు ఇబ్బంది పడటమేగాక వ్యాధుల పాలవుతారని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాంత ప్రజలకు ఇకపై ఇలాంటి ఇబ్బందులేవీ ఉండవని, నేటినుంచి రోజుకు 24 గంటలు, ఏడాదిలో 365 రోజులూ అత్యాధునిక వడపోత ప్లాంటు ద్వారా సురక్షిత మంచినీరు లభిస్తుందని తెలిపారు.
చండీగఢ్‌లో ఆదినుంచీ నీటి సరఫరా, మురుగు పారుదల వంటి సౌకర్యాలు ఉన్నాయని శ్రీ అమిత్ షా అన్నారు. అయితే, జనాభా పెరుగుదలతోపాటు పైపులైన్లు పాతబడటం వంటి కారణాలతో క్రమంగా జలనాణ్యత క్షీణించిందని పేర్కొన్నారు. వడపోత ప్లాంట్ల ఆధునికీకరణ, కొత్త పైపులైన్ల నిర్మాణం, నీటి లభ్యత పెంపు తదితర అంశాల దృష్ట్యా నేడు మణిమజ్రా ప్రాంత ప్రజలకు 24 గంటలూ నీరందించే ఈ పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఇకపై ఈ ప్రాంత మహిళలు నీళ్ల కోసం ఉదయాన్నే లేవడానికి మొబైల్ ఫోన్లలో అలారం పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఈ మేరకు ఎప్పుడు కొళాయి తిప్పితే అప్పుడు మంచినీరు వస్తుందని హోంమంత్రి తెలిపారు. అలాగే ఇకపై నీళ్ల ట్యాంకర్లతో పని లేదని, మొదటి లేదా నాలుగో అంతస్తు అనేదానితో నిమిత్తం లేకుండా మణిమజ్రాలోని మొత్తం లక్షమంది ప్రజలకు నేటినుంచి జలధార నిత్యం అందుబాటులో ఉంటుందని చెప్పారు.
శ్రీ నరేంద్ర మోదీ 2014లో తొలిసారి ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటినుంచి స్మార్ట్ సిటీ పథకం అమలు ద్వారా నగర జీవన నాణ్యత మెరుగుకు అవిరళ కృషి చేస్తున్నారని శ్రీ అమిత్ షా అన్నారు. ఇందులో భాగంగా తొలుత ప్రకటించిన స్మార్ట్ సిటీలలో చండీగఢ్ కూడా ఒకటని గుర్తుచేశారు. ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.1000 కోట్లకుపైగా ఖర్చు చేసిందని తెలిపారు.
ఇక జల్ జీవన్ మిషన్ కింద దేశవ్యాప్తంగా ప్రతి పౌరుడికి స్వచ్ఛమైన నీరు, ఇంటింటికీ కొళాయి కనెక్షన్ ఇచ్చే పథకానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన రెండోదఫా పదవీకాలంలో శ్రీకారం చుట్టారని శ్రీ అమిత్ షా తెలిపారు. అటుపైన ఏడేళ్ల లోపే 15 కోట్ల ఇళ్లకు కొళాయి కనెక్షన్లు ఇవ్వడంతో దేశంలోని 74 శాతం ఇళ్లకు స్వచ్ఛమైన నీరు సరఫరా అవుతోందని చెప్పారు. జల్ జీవన్ మిషన్ పథకం ప్రారంభించిన తర్వాత దేశంలో 3 లక్షల డయేరియా సంబంధిత మరణాలు తగ్గాయని పేర్కొన్నారు. ఒకనాడు డయేరియా మృతుల సంఖ్య ఏటా 4 లక్షలదాకా ఉండేదని గుర్తుచేశారు. ‘ఇంటింటికీ కొళాయి నీరు’ (హర్ ఘర్ నల్ సే జల్) కింద 2023లో మొత్తం 3 కోట్ల కనెక్షన్లు ఇచ్చామని చెప్పారు. ప్రధానమంత్రిగా శ్రీ నరేంద్ర మోదీ మూడోదఫ పదవీకాలం పూర్తయ్యేలోగా దేశంలో ప్రతి ఇంటికీ పరిశుభ్రమైన కొళాయి నీరు అందుతుందని శ్రీ షా విశ్వాసం వ్యక్తం చేశారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం స్మార్ట్ సిటీ భావన ప్రకారం చండీగఢ్ అభివృద్ధికి కృషి చేస్తోందని శ్రీ అమిత్ షా అన్నారు. ఈ నగరంలో 5 మురుగు శుద్ధి ప్లాంట్లు ఏర్పాటు కాగా, 20 ఎకరాల్లో ఘన వ్యర్థాల నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. అలాగే వాహన రాకపోకల క్రమబద్ధీకరణకు ‘ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్’ పనిచేస్తోందని, దీంతో నిబంధనల ఉల్లంఘన కేసులు 40 శాతం, ప్రాణాంతక రోడ్డు ప్రమాదాలు 31 శాతం తగ్గాయని తెలిపారు. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ హయాంలో గత పదేళ్లకుగాను చండీగఢ్ అభివృద్ధికి రూ.30వేల కోట్లు ఖర్చు చేయగా, అందులో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.29 వేల కోట్లు, రైల్వేల
అభివృద్ధికి రూ.500 కోట్లు ఖర్చు చేసినట్లు శ్రీ షా తెలిపారు.
దేశ ప్రగతి చరిత్రలో 2014-2024 మధ్య కాలాన్ని స్వర్ణయుగంగా పేర్కొనవచ్చునని శ్రీ అమిత్ షా అన్నారు. జనజీవనంలో పరివర్తనాత్మక మార్పు దిశగా మోదీ స్పృశించని అంశమంటూ ఏదీ లేదని హోంశాఖ మంత్రి అన్నారు. ఈ పదేళ్లలో దేశం ఎన్నో విజయాలు సాధించిందని చెప్పారు. చంద్రునిపై త్రివర్ణ పతాక ప్రతిష్టపాన, ఆకస్మిక వైమానిక దాడుల (సర్జికల్ స్ట్రైక్స్)తో శత్రువులకు గుణపాఠం నేర్పడం.. ఆర్టికల్ 370 రద్దు, రామ మందిర నిర్మాణం సహా రహదారుల నెట్ వర్క్ విస్తరణ దాకా మౌలిక సదుపాయాల సృష్టితో అన్ని రంగాల్లోనూ దేశ ప్రగతికి ప్రజలే ప్రత్యక్ష సాక్షులుగా నిలిచారని శ్రీ షా అన్నారు.
స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటి వివిధ కార్యక్రమాలు భారతదేశాన్ని నేడు ప్రపంచంలో తయారీ కూడలిగా మార్చాయన్నారు. అందుకే, ప్రజలు ‘ఎన్‌డిఎ’కి పూర్తి ఆధిక్యం కట్టబెట్టి మోదీని మూడోసారి ప్రధానమంత్రిని చేశారని శ్రీ అమిత్ షా అన్నారు. దేశంలో 1960 దశకం తర్వాత తొలిసారి ఒక వ్యక్తి, ఒక సంస్థ, ఓ పార్టీల కూటమి సంపూర్ణ ఆధిక్యంతో వరుసగా మూడోసారి అధికారంలోకి రావడం విశేషమన్నారు. ఇది ఒకరకంగా మోదీకి, ఆయన హయాంలో అభివృద్ధి పనులకు ప్రజల ఆమోదముద్ర వంటిదని పేర్కొన్నారు.
ప్రతిపక్షాలు ఏం చేస్తాయో అది చేయనిద్దామని, కానీ అవి ఎన్ని ప్రయత్నాలు చేసినా 2029లో నరేంద్ర మోదీ నాయకత్వంలో ‘ఎన్‌డిఎ’ మళ్లీ అధికారంలోకి వస్తుందని కేంద్ర హోం మంత్రి అన్నారు. కానీ, ఈ ప్రభుత్వం మనుగడ కష్టమని పదేపదే ప్రచారం చేయడం ద్వారా అస్థిరత్వ భావనను వ్యాప్తి చేయడానికి ప్రయత్నించే వారికి ఈ ప్రభుత్వం ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసి తీరుతుందని స్పష్టం చేస్తున్నామని శ్రీ షా అన్నారు.
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అన్ని రంగాల్లో ముందంజకు గొప్ప ముందుచూపుతో కృషిచేశారని శ్రీ అమిత్ షా అన్నారు. స్వాతంత్య్రం వచ్చి 25, 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాలు కేవలం లాంఛనాలు కాగా, స్వాతంత్య్రానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ద్వారా ప్రజల్లో దేశభక్తిని మేల్కోల్పారని గుర్తుచేశారు. అంతేగాక 130 కోట్లమంది ప్రజలలో ఆశావహ భావనను ప్రోదిచేసేందుకు శ్రీ మోదీ కృషి చేశారని శ్రీ అమిత్ షా అన్నారు. ఈ క్రమంలో 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు, అన్ని రంగాల్లో ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు మోదీ నాయకత్వాన 130 కోట్ల మంది దేశ ప్రజలు సమష్టిగా శ్రమిస్తున్నారని పేర్కొన్నారు.
ప్రజల సంకల్పమే భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా రూపొందే మార్గంలో నడిపిస్తుందని కేంద్ర హోం మంత్రి అన్నారు. కంచంలో ఆహారాన్ని వదలివేయరాదనే బాలల సంకల్పం, నిత్యం తల్లిదండ్రుల పాదాలకు వందనం చేసే సంకల్పం, పన్నులు ఎగవేయరాదనే వ్యాపారవేత్త సంకల్పం, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలనే జన సంకల్పం... ఇలా అన్నీ కలగలసిన మహా సంకల్పం దేశాన్ని బలోపేతం చేస్తూ ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని ఆయన అన్నారు. దేశంలోని 130 కోట్ల మంది ప్రజలు ఒక్క అడుగు వేస్తే అది దేశాన్ని 130 కోట్ల అడుగుల మేర ముందంజ వేయిస్తుందని, మోదీ సాధించిన అద్భుతం ఇదేనని ఆయన అభివర్ణించారు. భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు 130 కోట్ల మంది ప్రజలు ప్రతినబూనారని, తదనుగుణంగా నేడు చండీగఢ్‌లో మనం మరో అడుగు ముందుకేశామని శ్రీ అమిత్ షా వ్యాఖ్యానించారు.
******
(Release ID: 2042078)
Visitor Counter : 56