మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
నాట్స్ 2.0 పోర్టల్‌ను ప్రారంభించిన శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, ఉద్యోగంలో శిక్షణ కోసం యువ పట్టభద్రులు, డిప్లొమా హోల్డర్లకు డీబీటీ ద్వారా రూ.100 కోట్ల స్టైఫండ్ పంపణీ
ఉద్యోగ శిక్షణను అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు, నైపుణ్యాల కొరతను తీర్చేందుకు, యువత ఆకాంక్షలను నెరవేర్చేందుకు, వారిని భవిష్యత్తుకు సిద్ధం చేసేందుకు నాట్స్ 2.0 పోర్టల్ ఒక ముఖ్యమైన ప్రయత్నం - శ్రీ ధర్మేంద్ర ప్రధాన్
Posted On:
30 JUL 2024 7:51PM by PIB Hyderabad
కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ న్యూఢిల్లీలో మంగళవారం(30.07.2024) నేషనల్ అప్రెంటీస్‌షిప్ ఆండ్ ట్రైనింగ్ స్కీమ్(నాట్స్) 2.0 పోర్టల్‌ను ప్రారంభించడంతో పాటు అప్రెంటీస్‌లకు డీబీటీ పద్ధతిలో రూ.100 కోట్ల స్టైఫండ్‌ను పంపిణీ చేశారు. ఐటీ/ఐటఈఎస్, తయారీ, ఆటోమొబైల్ వంటి వేర్వేరు రంగాల్లో ఈ అప్రెంటీస్‌లు శిక్షణ పొందుతున్నారు. యువతకు నైపుణ్యాలు, ఉద్యోగావకాశాలు కల్పించాలనే ప్రభుత్వ దృష్టితో ప్రభుత్వం ఈ చొరవ తీసుకుంది. అప్రెంటీస్‌షిప్‌ల కోసం నమోదు చేసుకోవడానికి, దరఖాస్తు చేయడానికి నాట్స్ 2.0 పోర్టల్‌ను పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు వినియోగించుకునే అవకాశం ఉంది. దీంతో పాటు సంస్థలు/పరిశ్రమలు సైతం వాటి ఖాళీలు, ఒప్పందాల కోసం ఈ పోర్టల్‌ను వినియోగించుకుంటాయి. కాబట్టి, గణనీయమైన సంఖ్యలో యువ పట్టభద్రులు, డిప్లొమా హోల్డర్లు కచ్చితమైన నెలవారీ స్టైఫండ్‌తో పాటు ఉద్యోగ నైపుణ్యాలు పొందేందుకు ఇది సాయపడుతుంది.
కార్యక్రమంలో భాగంగా భవిష్యత్తులో అప్రెంటీస్‌షిప్‌లు - అప్రెంటీస్‌షిప్‌తో కూడిన డిగ్రీ ప్రోగ్రామ్, అన్ని అప్రెంటీస్‌షిప్‌లకు గుర్తింపు ఇవ్వడంతో పాటు పరిశ్రమ, ఉన్నత విద్య భాగస్వామ్యం, డీబీటీ కోసం సాంకేతికత వినియోగం, ఇ-గవర్నెన్స్‌ను పటిష్టం చేయడం వంటి అంశాలపైన నిపుణుల బృంద చర్చలు జరిగాయి. ఇందులో పలువురు ప్రముఖులు, విద్యావేత్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇన్‌ఫోసిస్ లిమిటెడ్, టెక్ మహింద్ర ప్రైవేట్ లిమిటెడ్ వంటి ప్రముఖ సంస్థలు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి.
ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి శ్రీ కె.సంజయ్ మూర్తి, ఏఐసీటీఈ చైర్మన్ ప్రొఫెసర్ టి.జి.సీతారామ్, యూజీసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.జగదీశ్ కుమార్, ఎన్ఈటీఎఫ్ చైర్‌పర్సన్ శ్రీ అనిల్ సహస్రబుధే, కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ గోవింద్ జైస్వాల్, ఉన్న విద్య డైరెక్టర్ శ్రీ గౌరవ్ సింగ్, విద్యావేత్తలు, అధికారులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇద్దరు అప్రెంటీస్‌లు వారి అనుభవాలను పంచుకున్నారు.
కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ... అప్రెంటీస్‌షిప్‌లను అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు, నైపుణ్యాల కొరతను తీర్చేందుకు, యువత ఆకాంక్షలను నెరవేర్చడానికి, వారిని భవిష్యత్తుకు సిద్ధం చేయడానికి నాట్స్ పోర్టల్ 2.0 ఒక ముఖ్యమైన ప్రయత్నమని పేర్కొన్నారు. ఇప్పుడు ప్రారంభించిన ఈ పోర్టల్ అప్రెంటీస్‌షిప్ అవకాశాలను విస్తృతం చేస్తుందని, అభ్యర్థులను, యాజమానులను కలిపేందుకు సాయపడుతుందని తెలిపారు.
సాంకేతికతో నడిచే ఈ యుగంలో కేవలం పట్టాలు పొందడానికి మాత్రమే పరిమితం కావొద్దని, సామర్థ్యాలను నిర్మించుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఈ శిక్షణ పాఠ్యాంశాలు ఉద్యోగ నైపుణ్యాలను పెంచడంపైనే దృష్టి పెట్టాలని ఆయన అన్నారు. నైపుణ్యాలు, ఉద్యోగ అవకాశాలను పెంచడానికి ఈ ఏడాది బడ్జెట్ పెద్దపీట వేసిన విషయాన్ని మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ అప్రెంటీస్‌షిప్ వ్యవస్థ విభిన్న, సరికొత్త రంగాలకూ వర్తింపజేయాలని ఆయన సూచించారు. దేశ జనాభా ప్రయోజనాన్ని సద్వినియోగం చేసుకునేందుకు సమగ్ర వ్యూహాన్ని రూపొందించాలని ఆయన అన్ని భాగస్వామ్యపక్షాలకు పిలుపునిచ్చారు.
అన్ని విద్యాసంస్థలు, పరిశ్రమలు నాట్స్ 2.0 పోర్టల్‌లో చేరాలని శ్రీ ప్రధాన్ కోరారు. అప్రెంటీస్‌షిప్‌ను ఒక సామూహిక కార్యక్రమంగా మార్చాలని ఆయన పేర్కొన్నారు.
నాట్స్ స్టైఫండ్ ప్రయోజనాలు అప్రెంటీస్‌లకు సమయబద్ధంగా, సమర్థంగా, పారదర్శకమైన పద్ధతిలో అందించాలనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం 2024లో తన వాటా స్టైఫండ్‌ను నేరుగా లబ్ధిదారుల ఖాతాకు బదిలీ(డీబీటీ) పద్ధతి ద్వారా చెల్లిస్తోంది. ఈ పథకంలోని లబ్ధిదారులందరికీ స్టైఫండ్‌లో ప్రభుత్వ వాటాను అందించేందుకు డీబీటీ పద్ధతిని వినియోగించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ పథకం కోసం ఏఐసీటీఈ, బోర్డ్ ఆఫ్ అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్/ప్రాక్టికల్ ట్రైనింగ్(బీఓటీఏ/బీఓపీటీ) సహకారంతో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖనే అభివృద్ధి చేసిన నాట్స్ 2.0 పోర్టల్‌ను అభివృద్ధి చేసింది. విద్యార్థుల నమోదు, ఖాళీల ప్రకటన, విద్యార్థుల దరఖాస్తులు, ఒప్పందం తయారీ, ధ్రువపత్రాల జారీ, నివేదించడంతో పాటు డీబీటీ ద్వారా స్టైఫండ్‌ను కూడా అందించేలా అప్రెంటీస్‌షిప్‌కు సంబంధించిన అన్ని పనులకు ఒకే చోట పరిష్కారంగా ఈ పోర్టల్ ఉంది. ఈ పోర్టల్‌ను విద్యార్థులు, పరిశ్రమలు, విద్యాసంస్థలతో పాటు బీఓటీఏ/బీఓపీటీ లాంటి కార్యక్రమాన్ని అమలు చేసే సంస్థలు సైతం వినియోగించుకుంటాయి. ఈ పోర్టల్‌ను మరింత మెరుగుపరిచేందుకు పైలట్ పద్ధతిలో ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం పూర్తిస్థాయిలో పని చేస్తున్న ఈ పోర్టల్‌ను కేంద్ర విద్యాశాఖ డీబీటీ ప్రక్రియకు వినియోగిస్తోంది.
వృత్తి విద్యను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడంతో పాటు వేర్వేరు విద్యా కోర్సుల మధ్య ఉన్న అడ్డంకులను తొలగించడం జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ) 2020 లక్ష్యం. సాధారణ, వృత్తి విద్యను ఏకం చేయడం ద్వారా విద్యార్థులకు మెరుగైన అవకాశాలు లభిస్తాయి. అప్రెంటీస్‌షిప్‌తో కూడిన డిగ్రీ ప్రొగ్రామ్‌ల(ఏఈడీపీ) కోసం ఎన్ఈపీ 2020 ప్రకారం యూజీసీ, ఏఐసీటీఈ ముసాయిదా మార్గదర్శకాలను జారీ చేశాయి.
***
(Release ID: 2039561)
Visitor Counter : 69