రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

రైతులలో నానో ఎరువుల వాడకాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వం


దేశంలో ఆరు నానో యూరియా ప్లాంట్లు, నాలుగు నానో డీఏపీ ప్లాంట్ల ఏర్పాటు

Posted On: 30 JUL 2024 2:25PM by PIB Hyderabad

ఎరువుల నియంత్రణ ఉత్తర్వు, 1985 కింద నిర్దిష్ట కంపెనీలు ఉత్పత్తి చేసే నానో యూరియా, నానో డీఏపీ ప్రత్యేక లక్షణాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దాంతోపాటు దేశంలో 26.62 కోట్ల బాటిళ్ల (ఒక్కొక్కటి 500 మిల్లీ లీటర్లు) వార్షిక సామర్థ్యంతో ఆరు నానో యూరియా ప్లాంట్లు; 10.74 కోట్ల బాటిళ్ల (ఒక్కొక్కటి 500/1000 మిల్లీ లీటర్లు) వార్షిక సామర్థ్యం కలిగిన నాలుగు నానో డీఏపీ ప్లాంట్లను ఏర్పాటు చేశారు.

అంతేకాకుండా, దేశంలో నానో యూరియా ఉత్పత్తిని పెంచే ఉద్దేశంతో ఎరువుల శాఖ తన పరిధిలోని నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (ఎన్ఎఫ్ఎల్), రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (ఆర్సీఎఫ్) వంటి ప్రభుత్వ రంగ సంస్థలను నానో యూరియా ప్లాంట్ల ఏర్పాటు దిశగా ప్రోత్సహించింది.

రైతులలో నానో ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించడానికి కింది చర్యలు తీసుకున్నారు:-

  • అవగాహన శిబిరాలు, వెబినార్లు, నుక్కడ్ నాటకాలు, క్షేత్ర ప్రదర్శనలు, కిసాన్ సమ్మేళనాలు, ప్రాంతీయ భాషల్లో చలనచిత్రాలు మొదలైన విభిన్న కార్యకలాపాల ద్వారా నానో యూరియా వినియోగాన్ని ప్రచారం చేశారు.
  • ప్రధాన మంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాల్లో (పీఎంకేఎస్ కే) నానో యూరియాను సంబంధిత కంపెనీలు అందుబాటులో ఉంచాయి.
  • ఎరువుల శాఖ క్రమం తప్పకుండా జారీ చేసే నెలవారీ సరఫరా ప్రణాళికలో నానో యూరియాను చేర్చారు.
  • భారత మృత్తికాశాస్త్ర సంస్థ ద్వారా భోపాల్ లోని ఐసీఏఆర్ ద్వారా ఇటీవల ‘ఎరువుల సమర్థవంతమైన, సమతౌల్య వినియోగం (నానో ఎరువులు సహా)’ అనే అంశంపై జాతీయస్థాయి ప్రచారం నిర్వహించింది.
  • 2023 నవంబర్ 15న ప్రారంభమైన వికసిత భారత్ సంకల్ప యాత్ర (వీబీఎస్ వై) సందర్భంగా నానో ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించారు.
  • 15,000 మహిళా స్వయం సహాయక బృందాలకు డ్రోన్లను అందించాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం ‘నమో డ్రోన్ దీదీ’ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద నమో డ్రోన్ దీదీల మహిళా స్వయం సహాయక సంఘాలకు 1094 డ్రోన్లను ఎరువుల కంపెనీలు అందుబాటులో ఉంచాయి. ఇది డ్రోన్ల ద్వారా నానో ఎరువుల వినియోగాన్ని పెంచేలా ప్రోత్సహిస్తుంది.
  • ఎరువుల కంపెనీల సహకారంతో సంప్రదింపులు, క్షేత్ర స్థాయి ప్రదర్శనల ద్వారా దేశంలోని మొత్తం 15 వ్యవసాయ-వాతావరణ మండలాల్లో నానో డీఏపీని వినియోగించడానికి ఎరువుల శాఖ మహా అభియాన్ ప్రారంభించింది. అది మాత్రమే కాకుండా, ఎరువుల కంపెనీల సహకారంతో దేశంలోని 100 జిల్లాల్లో నానో యూరియా ప్లస్ పై క్షేత్రస్థాయి ప్రదర్శనలు, అవగాహన కార్యక్రమాలను ఎరువుల శాఖ ప్రారంభించింది.

కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి శ్రీమతి అనుప్రియా పటేల్ రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా ఈ విషయాన్ని వెల్లడించారు.

***



(Release ID: 2039321) Visitor Counter : 46