ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ఆరోగ్య ప్రచారం, ఆరోగ్య ప్రాంగణం కార్యక్రమం; పొగాకు నియంత్రణపై దృష్టిసారిస్తూ దేశంలోని ఆరోగ్య నిపుణుల సంఘాలతో సమావేశం నిర్వహించిన ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్
రోగనిర్ధారణ, చికిత్స విధానాలపైనే కాకుండా, వ్యాధుల నివారణ దిశగా ఆరోగ్య రక్షణ వనరుల పెట్టుబడిపై ఎక్కువ దృష్టి పెట్టాలి: ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్
ఆరోగ్య ప్రచారానికి, ఆ భావనను అవలంభించడానికి సాధ్యమైన అన్ని చర్యలూ తీసుకోవడానికి అంగీకరించిన అన్న ఆరోగ్య నిపుణుల సంఘాలు
Posted On:
30 JUL 2024 9:40AM by PIB Hyderabad
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆరోగ్య సేమల డైరెక్టర్ జనరల్ (డీజీహెచ్ఎస్) ప్రొఫెసర్ (డాక్టర్) అతుల్ గోయల్ భారతదేశంలోని ప్రధాన ఆరోగ్య నిపుణుల సంఘాలతో సమావేశం నిర్వహించారు. హైబ్రిడ్ విధానంలో జరిగిన ఈ సమావేశంలో 27కు పైగా ఆరోగ్య నిపుణుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆరోగ్య ప్రచారంపై మంత్రిత్వ శాఖ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడం ఈ సమావేశ ప్రాథమిక ఎజెండా. ఆరోగ్యకరమైన ఆహారం, శారీరక శ్రమను ప్రోత్సహించడం, అంటువ్యాధులు కాని పొగాకు-ఆల్కహాల్ వంటి కీలక ప్రమాద కారక సమస్యలను పరిష్కరించడం మొదలైనవి అందులో ఉన్నాయి. ఆరోగ్యకరమైన వైద్య/దంత కళాశాల ప్రాంగణ భావనపై సమావేశంలో చర్చించారు. ఇది దేశవ్యాప్తంగా ఉన్న అన్ని వైద్య, దంత సంస్థలలో ఆరోగ్యం, శ్రేయస్సు అంశాలను ప్రోత్సహించడానికి ఉద్దేశించినది.
రోగనిర్ధారణ, చికిత్స పద్ధతులపై ‘మాత్రమే’ కాకుండా, వ్యాధుల నివారణ కోసం ఆరోగ్య రక్షణ వనరుల్లో ఎక్కువగా పెట్టుబడి పెట్టాలని డాక్టర్ అతుల్ గోయల్ నొక్కి చెప్పారు. ఆరోగ్య సంరక్షణ, వ్యాధుల నివారణ వ్యూహాలు, పొగాకు/ ఆల్కహాల్ వినియోగాన్ని నిర్మూలించడం, ఎలక్ట్రానిక్ సిగరెట్ల నిషేధ చట్టం 2019 అమలును బలోపేతం చేయడంపై కూడా సమావేశంలో చర్చించారు. ఆరోగ్య ప్రచార ప్రకటనను స్వీకరించడానికి, ఆ భావనకు తోడ్పాటు అందించడానికి సాధ్యమైన చర్యలు తీసుకోవడానికి అన్ని నిపుణుల సంఘాలు అంగీకరించాయి.
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కృషిని, సిఫార్సులను సభ్యులంతా ఏకగ్రీవంగా అభినందించి, ఆరోగ్య ప్రోత్సాహకానికి సహకార విధాన ప్రాధాన్యాన్ని గుర్తించారు. ఆరోగ్య ప్రచార లక్ష్యాలను మరింత ముందుకు తీసుకెళ్లేలా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖతో కలిసి పనిచేస్తామని ఆరోగ్య సంస్థలు స్పష్టం చేశాయి. పొగాకు వినియోగం, మద్యపానం, ఇతర ప్రమాద కారకాల ప్రాబల్యాన్ని తగ్గించడానికి ప్రజల్లో అవగాహన ప్రచారాలు, విద్యా కార్యక్రమాలు, విధానపరమైన చర్యల ఆవశ్యకతను ప్రముఖంగా పేర్కొన్నారు.
ఆరోగ్య విద్యతో పాటు ప్రమాద కారకాలను తగ్గించడంలో సమష్టి కృషి ద్వారా ఆరోగ్యకరమైన దేశ నిర్మాణంపై సమష్టి నిబద్ధతను ఈ సమావేశం స్పష్టంచేసింది. ప్రజారోగ్యాన్ని పరిరక్షించడంలో, తన సహకార-క్రియాశీల చర్యల ద్వారా ప్రజా సంక్షేమం దిశగా కృషి చేయడంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ స్పష్టమైన వైఖరితో ఉంది.
ఈఎంఆర్ అదనపు డీడీజీ & డైరెక్టర్ డాక్టర్ ఎల్.స్వస్తిచరణ్, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశంలో జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ), ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో), ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ), భారత వైద్యుల సంఘం (ఏపీఐ), జాతీయ హృద్రోగ నిపుణుల సంఘం (సీఎస్ఐ), ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ప్రివెంటివ్ అండ్ సోషల్ మెడిసిన్ (ఐఏపీఎస్ఎం), భారత ప్రజారోగ్య సంస్థ (ఐపీహెచ్ఏ), మీ డీ విజన్, భారతీ శిక్షిత నర్సుల సంఘం (టీఎన్ఏఐ), భారత ఆర్థోపెడిక్ సంస్థ (ఐవోఏ), భారత ఆంకాలజీ సంస్థ (ఐఎస్వో), ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్రీ (ఐఏపీహెచ్డీ), అసోసియేషన్ ఆఫ్ ఓరల్ అండ్ మాక్సిల్లోఫేషియల్ సర్జన్స్ ఆఫ్ ఇండియా (ఏవోఎంఎస్ఐ), నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ (ఎన్ఎంవో) తదితర ఆరోగ్య నిపుణుల సంఘాలు పాల్గొన్నాయి.
***
(Release ID: 2039301)
Visitor Counter : 69