బొగ్గు మంత్రిత్వ శాఖ

బొగ్గు దిగుమ‌తులు త‌గ్గిస్తూ ఎగుమ‌తుల పెంపు

Posted On: 29 JUL 2024 1:48PM by PIB Hyderabad

బొగ్గు దిగుమ‌తుల‌ను త‌గ్గించ‌డంతో పాటు ఎగుమ‌తుల‌ను ప్రోత్స‌హించేందుకు ప్ర‌త్యేక చొర‌వ తీసుకోవ‌డం ద్వారా దేశ విద్యుత్తు రంగంలో కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ‌ గ‌ణ‌నీయ మార్పును తీసుకువ‌స్తోంది. దేశీయంగా బొగ్గు ఉత్ప‌త్తిని పెంచ‌డం, విద్యుత్తు భ‌ద్ర‌త‌ను ప‌టిష్టం చేయడం, బొగ్గు రంగంలో వృద్ధికి స‌హ‌క‌రించ‌డ‌మే ల‌క్ష్యంగా ఈ వ్యూహాత్మ‌క అడుగు వేసింది.

2023-24 సంవ‌త్స‌రంలో భార‌త‌దేశ బొగ్గు ఉత్ప‌త్తిలో 11.65 శాతం విశేష‌మైన పెరుగుద‌ల న‌మోదైంది. స్వ‌యం స‌మృద్ధి సాధించడం ప‌ట్ల ప్ర‌భుత్వ నిబ‌ద్ధ‌త‌ను ఇది చాటుతోంది. 2024-25 సంవ‌త్స‌రంలో 1,080 మిలియ‌న్ ట‌న్నుల బొగ్గును ఉత్ప‌త్తి చేయ‌డం ద్వారా ప్ర‌ధాన బొగ్గు ఉత్పత్తిదారుగా భార‌త్ స్థానాన్ని ప‌దిలం చేసుకోవాల‌నేది ల‌క్ష్యం.

బొగ్గు ఉత్ప‌త్తుల‌ను త‌గ్గించ‌డానికి గానూ అంత‌ర్‌-మంత్రిత్వ శాఖ క‌మిటీని ఏర్పాటు చేయ‌డ‌మైంది. ఈ క‌మిటీ సంప్ర‌దింపులు జ‌ర‌ప‌డంతో పాటు వేర్వేరు మంత్రిత్వ శాఖ‌ల‌తో స‌మ‌న్వ‌యం చేసుకొని బొగ్గు దిగుమ‌తి ప్ర‌త్యామ్నాయానికి ఉన్న అవ‌కాశాల‌ను గుర్తిస్తుంది. కొంత‌వ‌ర‌కు హైగ్రేడ్ బొగ్గు దిగుమ‌తుల అవ‌స‌రాన్ని గుర్తిస్తూనే, త‌ప్ప‌నిస‌రి కానీ దిగుమ‌తుల‌ను త‌గ్గించ‌డం, దేశీయంగా ఉత్ప‌త్తైన బొగ్గు వినియోగాన్ని ప్రోత్స‌హించ‌డంపై ప్ర‌ధాన దృష్టి ఉంటుంది.

దిగుమ‌తుల‌ను త‌గ్గించ‌డంతో పాటు శిలాజ ఇంధ‌నాల‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్‌ను అందుకునేందుకు ప్ర‌భుత్వం బొగ్గు ఎగుమ‌తుల‌ను చురుగ్గా ప్రోత్స‌హిస్తోంది. అంత‌ర్జాతీయ బొగ్గు విప‌ణిలో భార‌త్‌ను కీల‌క‌స్థానంలో నిల‌పడంతో పాటు ఈ రంగంలో ఆదాయాన్ని పెంచుకోవ‌డం, ఉపాధి అవ‌కాశాల‌ను సృష్టించ‌డ‌మే దీని ల‌క్ష్యం.

భార‌త‌దేశ విద్యుత్తు భ‌ద్ర‌త‌ను ప‌టిష్టం చేసుకునేందుకు బొగ్గు దిగుమ‌తుల‌ను త‌గ్గించ‌డం, ఎగుమ‌తుల‌ను పెంచ‌డం అనేవి కీల‌క అడుగులు. దేశీయంగా ఉత్ప‌త్తైన బొగ్గుపై ఎక్కువ‌గా ఆధార‌ప‌డటం ద్వారా విదేశీ స‌ర‌ఫ‌రాల‌పై దేశం ఆధార‌ప‌డ‌టాన్ని త‌గ్గించ‌వ‌చ్చు. అంత‌ర్జాతీయ ధ‌ర‌ల హెచ్చుత‌గ్గుల ప్ర‌భావం నుంచి దూరంగా ఉండ‌వ‌చ్చు.

బొగ్గు రంగంలో ఈ ప‌రివ‌ర్త‌న దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై సానుకూల ప్ర‌భావాన్ని చూపించే అవ‌కాశం ఉంది. బొగ్గు ఉత్ప‌త్తిని, ఎగుమ‌తుల‌ను పెంచ‌డం ఆర్థిక వృద్ధికి, ఉద్యోగాల క‌ల్ప‌న‌కు, ప్ర‌భుత్వ ఆదాయం పెరిగేందుకు దోహ‌ద‌ప‌డుతుంది. పైగా, దిగుమ‌తుల‌పై ఆధార‌ప‌డ‌టాన్ని త‌గ్గించుకోవ‌డం విదేశీ మార‌క నిల్వ‌ల‌ను కాపాడుకునేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది.

ఐఐఎం అహ్మ‌దాబాద్ నిర్వ‌హించిన ఒక అధ్య‌య‌నం ప్ర‌కారం, ఈ ఇరుగుపొరుగు దేశాల‌కు 15 మిలియ‌న్ ట‌న్నుల బొగ్గు ఎగుమ‌తికి అవ‌కాశం ఉంది:

- నేపాల్ - 2 ఎంటీ
- మ‌య‌న్మార్ - 3 ఎంటీ
- బంగ్లాదేశ్ - 8 ఎంటీ
- ఇత‌ర దేశాలు - 2 ఎంటీ

ఎన్‌టీపీసీ, బంగ్లాదేశ్ ప‌వ‌ర్ డెవెల‌ప్‌మెంట్ బోర్డు(బీపీడీబీ) 50:50 వాటా క‌లిగిన‌ ఉమ్మ‌డి సంస్థ అయిన బంగ్లాదేశ్ ఇండియా ఫ్రెండ్‌షిప్ ప‌వ‌ర్ కంపెనీ లిమిటెడ్‌(బీఐఎఫ్‌పీసీఎల్‌) నిర్మిస్తున్న మైత్రీ సూప‌ర్ థెర్మ‌ల్ ప‌వ‌ర్ ప్రాజెక్టు(ఎంఎస్‌టీపీపీ)(2X660 ఎంవీ)కి అంత‌ర్జాతీయ ధ‌ర‌ల విధానం ప్ర‌కారం ఏటా 5 మిలియ‌న్ ట‌న్నుల బొగ్గు అవ‌స‌రం.

బొగ్గు దిగుమ‌తులు త‌గ్గించి, ఎగుమ‌తుల‌ను ప్రోత్స‌హించేందుకు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ తీసుకుంటున్న చొర‌వ దేశ విద్యుత్తు ప‌రివ‌ర్త‌న‌లో కీల‌క మైలురాయిగా నిలిచింది. దేశీయ ఉత్ప‌త్తిని పెంచ‌డం, దిగుమ‌తుల‌కు ప్ర‌త్యామ్నాయాన్ని అందించ‌డం, ఎగుమ‌తుల‌ను పెంచ‌డం ద్వారా స్వ‌యం స‌మృద్ధి సాధించాల‌ని, విద్యుత్తు భ‌ద్ర‌త‌ను ప‌టిష్టం చేసుకోవాల‌ని, బొగ్గు రంగంలో వృద్ధికి స‌హ‌క‌రించాల‌ని భార‌త్ ల‌క్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్ర‌య‌త్నాలు భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు, అంత‌ర్జాతీయ విద్యుత్తు రంగంలో దేశ స్థానానికి సుదూర ప్ర‌యోజ‌నాలు అందించే అవ‌కాశం ఉంది.

 

***



(Release ID: 2038478) Visitor Counter : 71