యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
పారిస్ ఒలింపిక్స్ 2024లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్న మను బాకర్
ఒలింపిక్స్‌లో పతకం గెలుచుకున్న మొదటి భారతీయ మహిళా షూటర్‌గా ఘనత
Posted On:
28 JUL 2024 6:05PM by PIB Hyderabad
పారిస్ 2024 ఒలింపిక్స్‌లో జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో మను బాకర్ కాంస్య పతకాన్ని గెలుచుకొని చరిత్ర సృష్టించారు. పారిస్ 2024 ఒలింపిక్స్‌లో భారత్‌కు ఇది మొదటి పతకం. 2012 లండన్ ఒలింపిక్స్ తర్వాత షూటింగ్‌లో భారత్ అందుకున్న మొదటి ఒలింపిక్ మెడల్ కూడా ఇదే.
గత 20 ఏళ్లలో వ్యక్తిగత ఈవెంట్‌లో ఒలింపిక్స్ ఫైనల్ చేరిన మొదటి భారతీయ మహిళా షూటర్‌గా రికార్డు సృష్టించిన మరుసటి రోజే ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన మొదటి భారతీయ మహిళా షూటర్‌గా మను బాకర్ ఘనత సాధించారు.
ఒలింపిక్స్ ఆటల్లో పతకాన్ని సాధించిన ఐదో భారతీయ షూటర్‌గా మను బాకర్ నిలిచారు. ఇందుకుముందు షూటింగ్‌లో రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్(2004 ఏథెన్స్), అభినవ్ బింద్రా(2008 బీజింగ్), విజయ్ కుమార్(2012 లండన్), గగన్ నారంగ్(2012 లండన్) ఒలింపిక్స్ పతకాలు సాధించారు.
క్వాలిఫికేషన్ రౌండ్ ముఖ్యాంశాలు
- క్వాలిఫికేషన్ రౌండ్‌లలో 3వ దానిని మను బాకర్ 580 స్కోర్‌తో ముగించారు. అత్యధిక సార్లు(27) ఫర్ఫెక్ట్ స్కోర్లు సాధించారు.
- గత 20 ఏళ్లలో ఒలింపిక్స్ ఫైనల్ చేరిన మొదటి భారతీయ మహిళా షూటర్‌గా మను నిలిచారు. చివరిసారిగా 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో సుమ శిరుర్ ఫైనల్‌కు చేరుకున్నారు.
- ఒలింపిక్స్‌లో ఇప్పటివరకు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళల ఈవెంట్‌లో ఫైనల్ రౌండ్‌కు చేరుకున్న మొదటి భారతీయ మహిళగా మను నిలిచారు.
ప్రభుత్వం అందించిన ముఖ్యమైన ప్రోత్సాహాలు, ఆర్థిక సహకారం(పారిస్ సైకిల్):
- మందుగుండు సామాగ్రి, ఆయుధ సర్వీసింగ్, పెల్లెట్, మందుగుండు సామాగ్రి పరీక్ష, బ్యారెల్ ఎంపికకు సహకారం.
- ఒలింపిక్స్ కోసం సిద్ధమవడానికి లగ్జెంబర్గ్‌లో వ్యక్తిగత శిక్షకుడు జస్పాల్ రాణా ద్వారా శిక్షణ ఇప్పించింది.
- టీఓపీఎస్ కింద ఆర్థిక సహకారం: రూ.28,78,634
- శిక్షణ, పోటీల కోసం వార్షిక క్యాలెండర్(ఏసీటీసీ) కింద అందించిన ఆర్థిక సహకారం: రూ.1,35,36,155
సాధించిన విజయాలు:
- ఏషియన్ గేమ్స్(2022)లో 25 మీటర్ల పిస్టల్ జట్టులో బంగారు పతకం
- బాకులో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్(2023)లో 25 మీటర్ల పిస్టల్ విభాగంలో బంగారు పతకం
- 2024 చంగ్వాన్‌లో జరిగిన ఏషియన్ షూటింగ్ చాంపియన్‌షిప్(2023)లో పారిస్ గేమ్స్ కోసం కోటా ప్లేస్ సాధించారు.
- భోపాల్‌లో జరిగిన ప్రపంచ కప్(2023)లో 25 మీటర్ల పిస్టల్ విభాగంలో కాంస్య పతకం
- కైరోలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్(2022)లో 25 మీటర్ల విభాగంలో రజత పతకం
- చెంగ్డులో జరిగిన ప్రపంచ విశ్వవిద్యాలయ ఆటల్లో(2021) 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత, మహిళా జట్టు విభాగాల్లో రెండు బంగారు పతకాలు.
నేపథ్యం:
మను బాకర్ షూటింగ్ విభాగంలో పోటీ పడే భారత ఒలింపియన్. బాక్సర్లు, రెజ్లర్లకు ప్రాచూర్యం పొందిన రాష్ట్రమైన హర్యానాలోని ఝజ్జర్‌లో ఆమె జన్మించారు. పాఠశాలలో మను బాకర్ టెన్నీస్, స్కేటింగ్, బాక్సింగ్ వంటి క్రీడల్లో పాల్గొనేవారు. 'తంగ్ త' అనే ఒక రకమైన యుద్ధ విద్యలోనూ ఆమె పాల్గొని జాతీయ స్థాయిలో పతకాలు సాధించారు. 2016 రియో ఒలింపిక్స్ ముగిసిన తర్వాత ఆమె షూటింగ్ వైపు వెళ్లాలని నిర్ణయించుకొని, దీనినే ఇష్టపడ్డారు.
2017లో జరిగిన జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో మను బాకర్ తన ప్రదర్శనతో ఒలింపియన్, మాజీ ప్రపంచ నెంబర్ 1 హీనా సిధును ఆశ్చర్యపరిచి తొమ్మిది బంగారు పతకాలను గెలుచుకున్నారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్‌లో 242.3 రికార్డు స్కోర్ సాధించి సిధును అధిగమించారు. షూటర్‌గా మను బాకర్‌కు 2018 విజయవంతమైన సంవత్సరం. ఆ ఏడాది జరిగిన కామన్‌వెల్త్ గేమ్స్‌లో 16 ఏళ్ల వయస్సులోనే బంగారు పతకం సాధించి యువ సంచలనంగా ఆమె మారారు.
మెక్సికోలోని గ్వాడలజరలో 2018లో జరిగిన అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ ప్రపంచ కప్‌లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో గతంలో రెండుసార్లు చాంపియన్ అయిన మెక్సికోకు చెందిన అలెజాండ్ర జవాలాను మను బాకర్ ఓడించారు.
2019లో మునిచ్‌లో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్‌లో నాలుగో స్థానంలో నిలిచి ఒలింపిక్స్‌లో పోటీ పడే అవకాశాన్ని(కోటా ప్లేస్) మను బాకర్ ఖాయం చేసుకున్నారు. అయితే, ఆమె ఆరంగేట్రం మాత్రం అనుకున్నట్టు జరగలేదు. 2020 టోక్యో ఒలింపిక్స్ ముగిసిన వెంటనే లీమాలో జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళా విభాగంలో మను బాకరన్ జూనియర్ ప్రపంచ చాంపియన్‌గా నిలిచారు. 2022లో జరిగిన కైరో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 25 మీటర్ల పిస్టల్ మహిళా విభాగంలో ఆమె రజన పతకాన్ని సాధించారు. హాంగ్జౌలో జరిగిన 2023 ఏషియన్ గేమ్స్‌లో ఇదే ఈవెంట్‌లో ఆమె బంగారు పతకాన్ని గెలుచుకున్నారు.
శిక్షణ తీసుకున్న చోటు: డాక్టర్ కర్ణి సింగ్ షూటింగ్ రేంజ్, న్యూఢిల్లీ
జన్మస్థలం: ఝజ్జర్, హర్యానా
***
(Release ID: 2038455)
Visitor Counter : 54
Read this release in:
Punjabi
,
Kannada
,
Malayalam
,
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Hindi_MP
,
Gujarati
,
Tamil