సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘కార్గిల్ విజయ్ దివస్’ రజతోత్సవం నేపథ్యంలో ఢిల్లీలోని సిరిఫోర్ట్ ఆడిటోరియంలో ‘సిబిసి’ ఫొటో ఎగ్జిబిషన్‌


నాటి యుద్ధంలో మన సైనికుల అసమాన శౌర్యపరాక్రమాలను చాటే ప్రదర్శన;

కార్గిల్‌లో అబ్బురపరిచే భారత సైనిక విన్యాసాలను కళ్లకు కట్టిన
అరుదైన చిత్రాలతో సగర్వంగా ఉప్పొంగిన సందర్శకుల హృదయాలు

నాడు పోస్టు చేయడమైనది: 26 JUL 2024 4:05PM by PIB Hyderabad

   ’కార్గిల్ విజయ దివస్’ రజతోత్సవం సందర్భంగా ‘‘కార్గిల్ విజయ్ దివస్: రజత్ జయంతి’’ పేరిట న్యూఢిల్లీలోని ఆగస్టు క్రాంతిమార్గ్‌లోగ‌ల‌ సిరిఫోర్ట్ ఆడిటోరియంలో ఇవాళ ఒక ప్రదర్శన ప్రారంభమైంది. కేంద్ర సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సిబిసి) ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన 2024 జూలై 31 వరకూ ఉదయం 10.00 నుంచి సాయంత్రం 6.00 గంటలదాకా ఆడిటోరియం (ప్రధాన విరామ ప్రాంగణం)లో కొనసాగుతుంది. కాగా, నేటి ప్రారంభోత్సవ వేడుకకు పాఠశాల విద్యార్థులతోపాటు పలువురు సందర్శకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

   కార్గిల్ యుద్ధంలో అసమాన శౌర్యపరాక్రమాలతో శత్రువును మట్టికరిపించిన మన సైనికుల  ధైర్యసాహసాలను, అంకితభావాన్ని చాటడం ఈ ప్రదర్శన ధ్యేయం. అలాగే దేశ సార్వభౌమాధికార  రక్షణలో ప్రాణాలొడ్డిన అమరవీరులకు నివాళి అర్పించడం దీని ప్రధాన లక్ష్యం. ఇందులో భాగంగా చరిత్రాత్మక ఛాయాచిత్రాలు, వీడియోలు ప్రదర్శనతోపాటు స్పర్శానుభూతి తెరలు (ఇంటరాక్టివ్ డిస్‌ప్లే), పాఠశాల విద్యార్థులకు క్విజ్ పోటీలు, వివిధ పాఠశాలల్లో వ్యాసరచన పోటీలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాల ద్వారా మన సాయుధ దళాల త్యాగాలపై అందరికీ అవగాహన కలుగుతుంది.

   ఈ ప్రదర్శన దేశ పౌరులతో దేశభక్తిని ప్రోది చేయడంతోపాటు మాతృభూమి రక్షణలో మన సైనిక బలగాల పాత్రపై లోతైన అవగాహన కల్పిస్తుంది. విద్యార్థులకు పాఠ్యాంశాలతోపాటు విలువలతో కూడిన అమూల్య విద్యానుభవాన్ని అందిస్తుంది. అంతేకాకుండా జ్ఞాన వికాసంతోపాటు సైనిక బలగాల ధైర్యసాహసాలు, ప్రతిరోధకతతో ముడిపడిన వీరోచిత గాథలు సందర్శకులకు ప్రేరణనిస్తాయి.

 

***


(రిలీజ్ ఐడి: 2037857) సందర్శకుల సూచీ సంఖ్య : : 67
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Manipuri , Urdu , हिन्दी , Hindi_MP , Assamese , Tamil , Kannada