వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
పలు ప్రముఖ సాంకేతిక సంస్థల బోధనా సిబ్బందికి 82 ప్రాజెక్టులు మంజూరు చేసిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్
Posted On:
24 JUL 2024 10:46AM by PIB Hyderabad
రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కార్యకలాపాలను మరింత విస్తరించడం, వైవిధ్యపరచడం, వేగవంతం చేయడం కోసం ఐ.ఐ.టి.లు, ఎన్.ఐ.టి.లు సహా పలు ప్రముఖ సాంకేతిక సంస్థల బోధనా సిబ్బందికి, ఇతర నిపుణులకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బి.ఐ.ఎస్) 82 రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (ఆర్ & డి) ప్రాజెక్టులను మంజూరు చేసింది.
ప్రతీది పది లక్షల రూపాయల వరకు బడ్జెట్, పూర్తి చేయడం కోసం ఆరు నెలల కాలపరిమితి కలిగి ఉన్న ఈ ప్రాజెక్టులు కేవలం సైద్ధాంతిక సమీక్షలకే పరిమితం కాకుండా విస్తృత క్షేత్రస్థాయి అధ్యయనాలను కలిగి ఉంటాయి. ప్రధానంగా అత్యాధునిక డొమైన్స్ అయిన కృత్రిమ మేధ, బ్లాక్‌చెయిన్ సాంకేతికత, వైద్య పరికరాలు, పునరుత్పాదక శక్తి, సుస్థిరత, స్మార్ట్ నగరాలు, డిజిటల్ పరివర్తన వంటి డొమైన్స్ ఈ ప్రాజెక్టులలో భాగంగా ఉన్నాయి.
అభివృద్ధి చెందుతున్న ఈ రంగాలను చేర్చడం ద్వారా, వినియోగదారుల రక్షణ కోసం ప్రమాణాలను అభివృద్ధి చేయడం అలాగే వినూత్న ఉత్పత్తులు, సేవల నాణ్యతను, విశ్వసనీయతను నిర్ధారించడం బి.ఐ.ఎస్. లక్ష్యం.
మంజూరు చేసిన 82 ప్రాజెక్టులకు అదనంగా, మరో 99 ప్రాజెక్టులు కేటాయింపుల దశలో ఉండగా, మరో 66 ప్రాజెక్టులు దరఖాస్తు కోసం సిద్ధంగా ఉన్నాయి. ఈ అవకాశాల వివరాలు బి.ఐ.ఎస్. వెబ్‌సైట్ BIS R&D Projects ద్వారా అందుబాటులో ఉంటాయి. ఈ కార్యక్రమం ప్రామాణీకరణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది అలాగే పరిశోధనా సంఘాలకు గణనీయ మద్దతునిస్తుంది, భారతదేశ వ్యాప్తంగా విద్యాసంస్థలలో ఆవిష్కరణలు, సమర్థత గల వాతావరణాన్ని పెంపొందిస్తుంది.
శ్రీ ప్రమోద్ కుమార్ తివారీ, డైరెక్టర్ జనరల్, బి.ఐ.ఎస్., ఈ ప్రయత్నాల ప్రాముఖ్యతను ప్రధానంగా ప్రస్తావిస్తూ, “ప్రముఖ విద్యాసంస్థలతో మా పరస్పర సహకారం, అనేక ఆర్ & డి ప్రాజెక్టులను మంజూరు చేయడం సాంకేతిక పురోగతులు, పెరుగుతున్న పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ప్రామాణీకరణను అభివృద్ధి చేయడం పట్ల మా నిబద్ధతను సూచిస్తుంది. మా ప్రమాణాల రూపకల్పన ప్రక్రియలో రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ పట్ల మరింత దృష్టి సారించడం ద్వారా, మా ప్రమాణాలు ఆధునిక సాంకేతికత, పారిశ్రామిక పద్ధతుల సవాళ్లను పరిష్కరించడానికి తగినంత పటిష్టంగా, ఔచిత్యంగా, సమర్థంగా ఉండేలా వాటిని రూపొందిచడం మా లక్ష్యంగా ఉంది.” అన్నారు.
తాజా సాంకేతిక ధోరణులు, పారిశ్రామిక పద్ధతులను ప్రతిబింబించే సమగ్రమైన, సమకాలీనమైన ప్రమాణాలను అభివృద్ధి చేయడానికి బి.ఐ.ఎస్. కట్టుబడి ఉంది. మెరుగైన ఈ ఆర్ & డి ప్రయత్నాల ద్వారా, వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణకు, అలాగే భారతదేశంలో సురక్షితమైన, మరింత విశ్వసనీయమైన మార్కెట్‌ప్లేస్‌ను అభివృద్ధి చేసేందుకు బి.ఐ.ఎస్. ప్రయత్నిస్తున్నది.
నేషనల్ స్టాండర్డ్స్ బాడీ ఆఫ్ ఇండియా వలె బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బి.ఐ.ఎస్.) ఉత్పత్తులు, ప్రక్రియలు, సేవల కోసం భారతీయ ప్రమాణాల అభివృద్ధికి నాయకత్వం వహిస్తున్నది. ఈరోజు వరకు, బి.ఐ.ఎస్. 22,000లకు పైగా భారతీయ ప్రమాణాలను రూపొందించి, దేశంలో అనేక రకాల సరుకులు, సేవల నాణ్యత, భద్రతను నిర్ధారించుటలో కీలక పాత్ర పోషిస్తూ ఉంది. ప్రామాణీకరణ ప్రక్రియలో కీలకమైన రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (ఆర్&డి) యొక్క ప్రాముఖ్యతను గుర్తించడం ద్వారా, వేగవంతమైన సాంకేతికత పురోగతులు, వ్యాపార, సామాజిక రంగాల్లో పరివర్తనాత్మక మార్పుల ద్వారా ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించేందుకు బి.ఐ.ఎస్. తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది.
తయారీ రంగంలో పెరుగుతున్న వైవిధ్యత, ఆవిష్కరణలు, సంక్లిష్టతలకు, సేవల పరిణామానికి తగినట్లుగా, ప్రామాణీకరణ ప్రక్రియతో ఆర్&డి ప్రాజక్టులను సమీకృతం చేయాల్సిన అవసరాన్ని బి.ఐ.ఎస్. నొక్కి చెప్పింది. అయితే ఈ సమీకృత ప్రక్రియ కోసం, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కృషి ద్వారా ఈ పనిని నిర్వహించగల సామర్థ్యం గల డొమైన్ నిపుణుల యొక్క విస్తృతమైన నెట్‌వర్క్‌ని ఉపయోగించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత నెట్‌వర్క్‌ని విస్తరించడానికి, ఐ.ఐ.టి.లు. ఎన్.ఐ.టి.లు సహా పలు ప్రముఖ విద్యాసంస్థలతో బి.ఐ.ఎస్. అవగాహన ఒప్పందాలను (ఎమ్.ఓ.యు.లు) చేసుకుంటుంది, తద్వారా వాటిలో గల బోధనా సిబ్బంది, పరిశోధన విద్యార్థుల ద్వారా అందుబాటులోకి వచ్చే అపార మేధో సంపత్తిని సద్వినియోగం చేసుకుంటుంది.
ఈ అవగాహన ఒప్పందాల ద్వారా, ఈ విద్యా సంస్థలలో పరిశోధనలకు మద్దతునిస్తూ అదే సమయంలో ప్రమాణాల రూపకల్పనకు అవసరమైన రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌ను ప్రోత్సహించుటను బి.ఐ.ఎస్. లక్ష్యంగా నిర్దేశించుకుంది. ప్రామాణీకరణ కోసం ఎంచుకున్న సబ్జెక్టులపై ఫోకస్ గ్రూప్ చర్చలను, అలాగే ఉత్పత్తి తయారీ, సేవలను అందించు రంగాలలో ప్రస్తుత ప్రక్రియలు, పద్ధతుల గురించి వివరణాత్మక క్షేత్ర-స్థాయి అధ్యయనాలను నిర్వహించడం ద్వారా ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కోసం ఒక సమగ్రమైన విధానాన్ని రూపొందించుటను సులభతరం చేస్తుంది.
బి.ఐ.ఎస్. యొక్క రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కార్యక్రమాల గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి, అందుబాటులో ఉన్న ప్రాజెక్టులను గురించి తెలుసుకోవడానికి బి.ఐ.ఎస్. యొక్క వెబ్‌సైట్ www.bis.gov.in ను సందర్శించవచ్చు.
***
(Release ID: 2036716)
Visitor Counter : 32