ఆర్థిక మంత్రిత్వ శాఖ
తయారీ రంగ ఉత్పత్తిలో ఎంఎస్ఎంఈల వాటా 35.4 శాతం
ఎంఎస్ఎంఈలకు ఊతమిచ్చిన 14 కీలక రంగాల్లోని ఉత్పత్తి ఆధారిత ప్రోత్సహకాల(పీఎల్ఐ) పథకం
ఒక జిల్లా ఒక ఉత్పత్తిని ప్రోత్సహించడానికి యూనిటీ మాల్ ఏర్పాటుకు రాష్ట్రాలను ప్రోత్సహకాలు
Posted On:
22 JUL 2024 2:35PM by PIB Hyderabad
భారత తయారీ రంగ ఉత్పత్తిలో 35.4 శాతం వాటా కలిగిఉన్న ఎంఎస్ఎంఈ రంగ ప్రాముఖ్యతను కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈ రోజు పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే నొక్కి చెప్పింది.
ప్రతి కార్మికుడి స్థూల విలువ జోడింపు (జీవీఏ) రూ.1,38,207 నుంచి రూ.1,41,769కు.. స్థూల ఉత్పత్తి విలువ (జీవీవో) రూ.3,98,304 నుంచి రూ.4,63,389కు పెరిగాయి. ఇది పెరిగిన ఉత్పాదకత, కార్మిక సామర్థ్యాన్ని తెలియజేస్తోంది. 05 జూలై 2024 నాటికి 4.69 కోట్ల రిజిస్ట్రేషన్లను అందుకున్న ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పోర్టల్ విజయాన్ని కూడా సర్వే ప్రధానంగా ప్రస్తావించింది. స్వీయ డిక్లరేషన్ ఆధారంగా సరళమైన, ఆన్‌లైన్, ఉచిత రిజిస్ట్రేషన్ ప్రక్రియను అందించడం ద్వారా ఎంఎస్ఎంఈలను క్రమబద్ధీకరించడంలో ఈ పోర్టల్ కీలక పాత్ర పోషిస్తోంది.
2019-20 నుంచి 2023-24 మధ్య గ్యారంటీల సంఖ్య, నిధుల మొత్తంలో గణనీయ పెరుగుదల ఉందని సర్వే పేర్కొంది.
వ్యయాన్ని తగ్గిస్తూ అదనంగా రూ. 2 లక్షల కోట్ల రుణాన్ని ఇచ్చే లక్ష్యంతో 2023-24లో క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్‌కు కేంద్ర బడ్జెట్ రూ .9వేల కోట్లు కేటాయించిన విషయాన్ని తెలిపింది.
'ఆత్మనిర్భర్'గా మారాలన్న భారతదేశ దార్శనికతను దృష్టిలో ఉంచుకుని, భారతదేశ తయారీ సామర్థ్యాలు, ఎగుమతులను పెంచడానికి రూ .1.97 లక్షల కోట్ల వ్యయంతో 14 కీలక రంగాలకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకాలను ప్రభుత్వం ప్రకటించింది. 2024 మే వరకు రూ .1.28 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు నమోదయ్యాయని.. ఇది రూ .10.8 లక్షల కోట్ల ఉత్పత్తి/అమ్మకాలు, 8.5 లక్షలకు పైగా ఉపాధి కల్పన (ప్రత్యక్ష, పరోక్ష) కు దారితీసిందని సర్వే పేర్కొంది. భారీ స్థాయి ఎలక్ట్రానిక్స్ తయారీ, ఫార్మాస్యూటికల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, టెలికాం & నెట్వర్కింగ్ ఉత్పత్తులు వంటి రంగాల నుండి గణనీయమైన సహకారంతో ఎగుమతులు రూ .4 లక్షల కోట్లు పెరిగాయని సర్వే తెలిపింది.
ఒక జిల్లా ఒక ఉత్పత్తి (ఓడీఓపీ) కార్యక్రమానికి ఊతమిచ్చేందుకు రాష్ట్రాలు తమ ఓడీఓపీల ప్రోత్సాహం, అమ్మకాల కోసం తమ రాజధానులు, అత్యంత ప్రముఖ పర్యాటక కేంద్రాలు లేదా ఆర్థిక రాజధానిలో 'యూనిటీ మాల్'ను ఏర్పాటు చేసేలా ప్రోత్సహిస్తామని 2023-24 కేంద్ర బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రకటించింది. ఓడీఓపీ కళాకారులు, వినియోగదారులను అనుసంధానం చేయడమే 'పీఎం-ఏక్తా మాల్స్' లక్ష్యమని సర్వే పేర్కొంది. దేశీయ, విదేశీ మార్కెట్లను లక్ష్యంగా చేసుకుని ఈ మాల్స్ దేశంలోని ప్రత్యేక ఉత్పత్తులకు శక్తివంతమైన మార్కెట్‌ను సృష్టిస్తున్నాయని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం, స్థానిక విక్రేతల మధ్య సహకారాన్ని సులభతరం చేయడానికి, దేశీయ పరిశ్రమలను పునరుద్ధరించడానికి 15 రాష్ట్రాల్లో 'ఓడీఓపీ సంపర్క్' వర్క్‌షాపులను నిర్వహించారు. భారత్ జీ20 అధ్యక్ష సమయంలో దేశవ్యాప్తంగా నిర్వహించిన జీ20 కార్యక్రమాల్లో ఓడీఓపీ ఉత్పత్తులు భారత్‌ను ప్రపంచానికి తెలియజేశాయని… ఈ కార్యక్రమాల్లో చేతివృత్తులు, అమ్మకందారులు, నేత కార్మికులు ప్రపంచ వేదికపై కనిపించే అవకాశాన్ని పొందారని సర్వే తెలిపింది.
***
(Release ID: 2035468)
Visitor Counter : 214