సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జమ్ము, కశ్మీర్ లోని దోడా జిల్లాలో బహిరంగ సభనుద్దేశించి కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రసంగం, ప్రజాదర్బార్ నిర్వహణ


‘‘జమ్ము, కశ్మీర్ లోని అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధి లక్ష్యంగా శ్రీ మోదీ ప్రభుత్వం పని చేస్తోంది’’ : డాక్టర్ జితేంద్ర సింగ్

‘‘ప్రాంతీయంగా భద్రతను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది; ఉగ్రవాదులపై పోరాటానికి విడిజిలను పునరుజ్జీవింపచేస్తున్నాం’’ : జితేంద్ర సింగ్

‘‘ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటానికి అన్ని వర్గాలు చేతులు కలపాలి’’ : కేంద్ర మంత్రి పిలుపు

‘‘అమలులో ఉన్న ప్రాజెక్టుల తాజా స్థితిపై డాక్టర్ జితేంద్ర సింగ్ అధ్యక్షతన జిల్లా యంత్రాంగంతో సమీక్షా సమావేశం’’

Posted On: 20 JUL 2024 4:32PM by PIB Hyderabad

జమ్ము కశ్మీర్ లో గ్రామీణ రక్షణ దళాలను (విడిజిలు) పునరుద్ధరిస్తున్నట్టు కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రకటించారు. ఆయన శనివారం ఒక బహిరంగ సభలో పాల్గొనడంతో పాటు మూడు గంటలకు పైగా ‘‘ప్రజా దర్బార్’’ నిర్వహించారు.  

‘‘ఇటీవల దోడాలోను, చుట్టుపక్కల ప్రాంతాల్లోను చోటు చేసుకున్న ఉగ్రవాద సంఘటనల నేపథ్యంలో భద్రతాపరంగా పరిస్థితిని అదుపులో ఉంచడానికి భద్రతా దళాలు ఒక వ్యూహం రూపొందించుకున్నాయి. కాని అలాంటి వ్యూహాలను బహిరంగంగా చర్చించడం సాధ్యం కాదు’’ అని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయమంత్రి (స్వతంత్ర హోదా); పిఎంఓలో ఎంఓఎస్, సిబ్బంది వ్యవహారాలు, ప్రజా ఫిర్యాదులు, పింఛన్లు, అణు ఇంధన, అంతరిక్ష శాఖల సహాయ మంత్రి చెప్పారు.

ఉగ్రవాద కార్యకలాపాల జోరు అధికంగా ఉన్న ప్రాంతాల ప్రజలను సాధికారం చేయడం లక్ష్యంగా గ్రామీణ రక్షణ దళాలను (విడిజి) పునరుద్ధరిస్తున్నట్లు డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రకటించారు. ‘‘ఉగ్రవాదులు విసురుతున్న సవాలును దీటుగా ఎదుర్కొనే బహుముఖీన వ్యూహంలో భాగంగా ఎక్కడ అవసరమైతే అక్కడ విడిజిలను రంగంలోకి దింపాలని ప్రభుత్వం నిర్ణయించింది’’ అని ఆయన తెలియచేశారు. విడిజిలు ఉగ్రవాదులతో దీటుగా పోరాడేందుకు వీలుగా వాటికి ఎస్ఎల్ఆర్ రైఫిల్స్, ఇతర ఆయుధాలు అందిస్తామని ఆయన ప్రకటించారు.

ఉగ్రవాదంపై అన్ని వర్గాలు ఉమ్మడి పోరాటం సాగించాలని మంత్రి పిలుపు ఇచ్చారు.1990 దశకంలో ఉగ్రవాదంపతాక స్థాయిలో ఉన్న సమయంలో కూడా దోడా దానికి తలొగ్గలేదని ఆయన గుర్తు చేశారు. ‘‘ఈ ప్రాంత వాసులందరూ ఉగ్రవాద  దురాగతాన్ని తీవ్రంగా ప్రతిఘటించిన కారణంగా ఈ ప్రాంతం నుంచి ప్రజల వలసలను నివారించగలిగారు’’ అని మంత్రి చెప్పారు.

దోడాలో మౌలిక వసతుల అభివృద్ధి గురించి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రస్తావిస్తూ మారుమూల ప్రాంతాలకు కూడా కనెక్టివిటీ కల్పించడం, ప్రయాణ సమయాన్నితగ్గించడం, ప్రయాణికుల సౌకర్యం మెరుగుపరచడం కోసం గత 10 సంవత్సరాల్లో ప్రభుత్వం భారీ స్థాయిలో హైవే నెట్ వర్క్ ను అభివృద్ధి చేసిందన్నారు.

‘‘వ్యూహాత్మక ప్రాధాన్యం గల లఖన్ పూర్-బసోహ్లి-బనీ-భదేర్వా-దోడా జాతీయ రహదారి నిర్మాణం పూర్తయినట్టయితే ఈ మార్గంలో దూరం100 కిలోమీటర్ల మేరకు తగ్గుతుంది’’ అని ఆయన చెప్పారు. అలాగే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు ఏర్పడడంతో పాటు పర్యాటకం కూడా ఉత్తేజితం అవుతుందన్నారు.  అదే విధంగా నిర్మాణంలో ఉన్న, అన్ని  వాతవరణ పరిస్థితులకు అనుకూలమైన ఖెల్లాని సొరంగ మార్గం పూర్తయితే దోడా, కిష్ట్వార్ జిల్లాల ప్రజలు శ్రీనగర్, జమ్ముకు వెళ్లేం ప్రయాణ సమయం విశేషంగా తగ్గుతుందని డాక్టర్ సింగ్  చెప్పారు.

జమ్ము, కశ్మీర్ లో అన్ని ప్రాంతాల సమతూకమైన అభివృద్ధికి ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని కేంద్ర మంత్రి అన్నారు. ‘‘శ్రీ మోదీ ప్రభుత్వం గత ప్రభుత్వాల లోటుపాట్లన్నింటినీ అధిగమిస్తూ జమ్ము, కశ్మీర్ లో అసంపూర్తిగా  ఉండిపోయిన, తీవ్ర జాప్యం చోటు చేసుకున్న మౌలిక వసతుల ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసింది’’ అని చెప్పారు. సబ్  కా సాత్ సబ్ కా వికాస్ సిద్ధాంతంతో పని చేస్తున్న ప్రభుత్వం లబ్ధిదారుల కులం, వర్గం, మతంతో సంబంధం లేకుండా అందరికీ ఎల్ పిజి కనెక్షన్లు అందిస్తోందని, పిఎం ఆవాస్ కింద ఇళ్లు కూడా నిర్మిస్తోందని మంత్రి తెలిపారు.     

ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజల్లో చైతన్యం కల్పించవలసిన అవసరం ఉన్నదని డాక్టర్ జితేంద్ర సింగ్ నొక్కి చెప్పారు. ‘‘వివిధ సంక్షేమ పథకాల ప్రయోజనాలు వివరించేందుకు యువతకు, వారి తల్లిదండ్రులకు వర్క్ షాప్ లు నిర్వహించాలి’’ అని స్థానిక యంత్రాంగానికి మంత్రి సూచించారు.

సభ అనంతరం కేంద్ర మంత్రి ‘‘ప్రజా దర్బార్’’ నిర్వహించారు. మూడు గంటలకు పైగా జరిగిన ఈ ప్రజా దర్బార్ లో ప్రజాసమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు డిప్యూటీ  కమిషనర్ శ్రీ హర్విందర్ సింగ్ నాయకత్వంలో స్థానిక యంత్రాంగం పాల్గొంది.

ఈ ప్రజా దర్బార్ లో ప్రజలకు ప్రయోజనకరమైన పలు అంశాలు పరిశీలనకు వచ్చాయి. స్థానిక ప్రజలు తమ డిమాండ్లను ప్రభుత్వ ప్రతినిధులకు నివేదించి తమ ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలని కోరారు.

ప్రజల అభ్యర్థనలు విన్న డాక్టర్ జితేంద్ర సింగ్ ఆ సమస్యలను వేగంగా, సకాలంలో పరిష్కరించాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించారు. నిర్దిష్ట కాలపరిమితిలో ప్రజలకు సేవలందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించారు.

 

***


(Release ID: 2034866) Visitor Counter : 45