సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

‘వింగ్స్ టు అవర్ హోప్స్- మొదటి సంపుటి’, ‘రాష్ట్రపతి భవన్: హెరిటేజ్ మీట్స్ ది ప్రెజెంట్’, ‘కహానీ రాష్ట్రపతి భవన్ కీ’ పుస్తకాలను ఆవిష్కరించిన శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్


దేశ ప్రజలందరిపైనా రాష్ట్రపతి ముర్ము ఆత్మీయతను ప్రభావవంతంగా వ్యక్తీకరించే పుస్తకాలు, మన ప్రజాస్వామ్యానికి నిధి: శ్రీ చౌహాన్

ఈ పుస్తకాలు భావి తరాలకు గొప్ప సంగ్రహాలు: కేంద్ర సహాయ మంత్రి డా. ఎల్ మురుగన్

Posted On: 18 JUL 2024 5:35PM by PIB Hyderabad

కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ వింగ్స్ టు అవర్ హోప్స్ మొదటి సంపుటి (ఇంగ్లిష్, హిందీ)’, ‘రాష్ట్రపతి భవన్: హెరిటేజ్ మీట్స్ ది ప్రెజెంట్’, ‘కహానీ రాష్ట్రపతి భవన్ కీనాలుగు పుస్తకాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి డా. ఎల్. మురుగన్, సమాచార ప్రసార కార్యదర్శి శ్రీ సంజయ్ జాజుతో కలిసి ఈ రోజు ఆవిష్కరించారు.

 

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, నేడు విడుదలైన పుస్తకాలు భారత గణతంత్రానికి ప్రతీక అయిన రాష్ట్రపతి భవన్ ఘనమైన వారసత్వ  సంపద అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గత ప్రసంగాల సంకలనం మన ప్రజాస్వామ్యానికి, యావత్సమాజానికి ఒక నిధి. మహిళలు, అనుసూచిత కులాలు, అనుసూచిత తెగలు, ఇతర అణగారిన వర్గాలు, రైతులు, సాయుధ దళాలు, యువత సహా దేశ ప్రజలందరిపైనా రాష్ట్రపతి ముర్ము ఆత్మీయతా భావానికి ఈ సంకలనం సమర్థవంతమైన వ్యక్తీకరణ. ఈ పుస్తకం ముఖచిత్రంపై ఉన్న చిత్రం, శీర్షిక మన ప్రజాస్వామ్య చరిత్రను ప్రతిబింబిస్తాయి.

 

ప్రతి భారతీయుడిని ఆశతో, ఉన్నత శిఖరాలను అధిరోహించేలా ఈ పుస్తకాల్లోని సందేశం ప్రేరేపిస్తుంది. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి సంబంధించిన అంశాలపై ముఖ్యమైన దృక్కోణాలను తాను గమనించానని మంత్రి చెప్పారు. రాష్ట్రపతి ప్రసంగాల సంకలనాన్ని చదివితే దేశం ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక సవాళ్లు; విజయాల దిశగా ప్రస్థానం, స్వావలంబన కార్యక్రమాలపై మన దృక్పథం విస్తృతమవుతుందని తాను విశ్వసిస్తున్నట్లు శ్రీ చౌహాన్ తెలిపారు.

 

ఈ పుస్తకాలను ప్రచురించిన ప్రచురణల విభాగాన్ని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ అభినందించారు. ప్రజాప్రయోజనాలకు సంబంధించిన వివిధ అంశాలపై క్రమం తప్పకుండా పుస్తకాలను వెలువరించిన ఘనత ఈ విభాగానికి దక్కుతుందన్నారు. ఆవిష్కృతమవుతున్న పుస్తకాల గురించి చెప్తూ, వివిధ అంశాలపై రాష్ట్రపతి భావాలకు ఇవి అత్యంత ప్రామాణికమైన సంకలనాలని, రాబోయే తరాలకు గొప్ప సంగ్రహంగా ఉపయోగపడతాయని ఆయన అన్నారు.

కార్యక్రమ అనంతరం, ఈ పుస్తక ప్రతిని ప్రముఖులు రాష్ట్రపతికి అందజేశారు.

 

పుస్తకాల గురించి:

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన పదవీకాలంలో తొలి ఏడాది వివిధ సందర్భాల్లో చేసిన ప్రసంగాలు వింగ్స్ టు అవర్ హోప్స్ పుస్తకంలో ఉన్నాయి. ఈ సమయంలో 2022 జూలై - 2023 జూలై మధ్య రాష్ట్రపతి ముర్ము అనేక అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. తన నిరాడంబరత, చింతనాశీలత, ప్రతిభ ద్వారా దేశ ప్రజలకు చేరువయ్యారు. దేశ గమనంలోని వివిధ అంశాలను స్పృశించడమే కాకుండా, ప్రజల్లో ఆశను కల్పిస్తూ వారికి చేరువయ్యే రాష్ట్రపతి సహజ స్వాభావికతను కూడా ఈ ప్రసంగాలు చాటుతున్నాయి.

 

ప్రచురణల విభాగం ప్రచురించిన ఈ పుస్తకంలో 75 ప్రసంగాలున్నాయి. వాటిని 11 భాగాలుగా విభజించారు. అవి జాతినుద్దేశించి చేసిన ప్రసంగాలు, విద్య- సాధికారతకు కీలకం, కర్తవ్య పథ్ లో ప్రభుత్వోద్యోగులకు మార్గనిర్దేశం, మన దళాలు- మనకు గర్వకారణం; రాజ్యాంగ, న్యాయ స్ఫూర్తి; శ్రేష్టతకు ప్రోత్సాహకం, అంతర్జాతీయ అంశాలు, వైవిధ్యం-సుసంపన్నమైన సాంస్కృతిక వైభవం, సుస్థిరాభివృద్ధి కోసం ఆవిష్కరణలు-సాంకేతికత, ఘనమైన వారసత్వ సంరక్షణ, భవిష్యత్తు భద్రత, మహిళా నేతృత్వ అభివృద్ధికి ప్రోత్సాహం.

 

"రాష్ట్రపతి భవన్: హెరిటేజ్ మీట్ ది ప్రెజెంట్" పుస్తకం రాష్ట్రపతి భవన్ కు సంబంధించి నిశితాన్వేషణ. దాని చరిత్ర, వారసత్వం, నిర్మాణ వైభవాన్ని వెల్లడిస్తుంది. తొలినాళ్ల నుంచి రాష్ట్రపతి అధికారిక నివాసంగా ప్రస్తుత స్థితి వరకూ రాష్ట్రపతి భవన్ రాష్ట్రపతి భవన్ వైభవాన్ని వివరంగా పాఠకుల ముందుంచుతుంది. ఘనమైన దేశ నిర్మాణ వారసత్వానికి, శక్తిమంతమైన వర్తమానానికి నిదర్శనంగా నిలుస్తున్న; అత్యంత ప్రతిష్ఠాత్మకమైన రాష్ట్రపతి భవన్ కు ఈ పుస్తకం చిరు ప్రశంస.

స్పష్టమైన వర్ణనలు, అద్భుతమైన ఛాయాచిత్రాలతో రాష్ట్రపతి భవన్ లోని మూల మూలనూ జీవం ఉట్టిపడేలా చిత్రించారు. ఈ పుస్తకం పాఠకులకు రాష్ట్రపతి భవన్ లోని వివిధ గదులు, హాళ్లను కళ్లకు కడుతుంది. అవన్నీ దేనికదే ప్రత్యేకమైనవి, విలక్షణమైనవి; ఒక్కో దానికీ ఒక్కో చరిత్ర ఉంది.

ముఖ్యమైన ప్రదేశాలు:

అశోక మండపం: మనోహరమైన కుడ్యచిత్రాలు, కొమ్మల సెమ్మెలతో అలంకృతమైన అద్భుతమైన నాట్యశాల.

దర్బార్ హాల్: ముఖ్యమైన అధికారిక కార్యక్రమాలు జరిగే పెద్ద ఉత్సవ మండపం.

అమృత్ ఉద్యాన్: మొఘలు, ఆంగ్లేయ శైలుల మిశ్రమం కనిపించే అద్భుతమైన ఉద్యానవనాలు.

గ్రంథాలయం: విజ్ఞానం, చారిత్రక పత్రాల భాండాగారం.

చిత్ర శాల (డ్రాయింగ్ రూం), సమావేశ మందిరాలు: అధికారిక స్వాగతాలు పలికే, సమావేశాలు నిర్వహించే ప్రదేశం

రాష్ట్రపతి పఠనగృహం: రాష్ట్రపతి వ్యక్తిగత కార్య ప్రదేశం.

 

రాష్ట్రపతి భవన్ లో నివసించిన విశిష్ట వ్యక్తుల గురించి కూడా ఈ పుస్తకంలో ఆకట్టుకునే కథనాలున్నాయి. మొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ నుంచి ప్రస్తుత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము వరకు ప్రతి భారత రాష్ట్రపతి ప్రస్థానాన్ని ఇది తెలియజేస్తుంది. భారత ప్రజాస్వామ్యానికి, జాతి నిర్మాణానికి వారు చేసిన కృషిని; వారి పదవీ కాలంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలను క్రోడీకరించి, రాష్ట్రపతి భవన్ చరిత్రను గొప్పగా చిత్రించింది.

కహానీ రాష్ట్రపతి భవన్ కీ పుస్తకంలో పిల్లల కోసం రాష్ట్రపతి, రాష్ట్రపతి భవన్ కు సంబంధించిన సమాచారం ఉంటుంది. మూడు అధ్యాయాలుగా దీనిని విభజించారు. అవి – ‘మన రాష్ట్రపతి’, ‘రాష్ట్రపతి భవన్ ప్రధాన ఆకర్షణలు, రాష్ట్రపతి భవన్ మ్యూజియం కాంప్లెక్స్’ – దాదాపు వందేళ్ల రాష్ట్రపతి భవన్ చరిత్రను ఈ పుస్తకం సరళమైన భాషలో అందిస్తుంది. రాష్ట్రపతి భవన్ లోని వివిధ చిత్రాలతో నిండి ఉండి, ఆకర్షణీయమైన శైలిలో ఈ పుస్తకాన్ని రూపొందించారు.



(Release ID: 2034173) Visitor Counter : 7