రైల్వే మంత్రిత్వ శాఖ
గత ఏడు సంత్సరాలలో 'ఆపరేషన్ నన్హే ఫరిష్తే' కింద 84,119 మంది పిల్లలను రక్షించిన ఆర్.పి.ఎఫ్.
Posted On:
17 JUL 2024 3:06PM by PIB Hyderabad
గత ఏడు సంవత్సరాలలో, వివిధ భారతీయ రైల్వే జోన్‌లలో ఆపదలో వున్న పిల్లలను రక్షించడం కోసం నిర్వహించే 'నన్హే ఫరిష్తే' ఆపరేషన్‌లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్.పి.ఎఫ్) ముందంజలో ఉంది. గత ఏడు సంవత్సరాల్లో (2018- మే 2024), వివిధ స్టేషన్‌లు మరియు రైళ్లలో ప్రమాదంలో ఉన్న 84,119 మంది పిల్లలను ఆర్.పి.ఎఫ్. రక్షించి, వారికి ఎలాంటి హాని జరగకుండా నిరోధించినది.
'నన్హే ఫరిష్తే' కేవలం ఒక ఆపరేషన్ మాత్రమే కాదు; ప్రమాదకర పరిస్థితుల్లో వున్న వేలాది మంది పిల్లలకు ఇది లైఫ్‌లైన్ వంటిది. 2018 నుండి 2024 వరకు ఉన్న డేటా ఆర్.పి.ఎఫ్ యొక్క అచంచలమైన అంకితభావం, అనుకూలత, సహనశీలతకు నిదర్శనం. సమాజంలోని అత్యంత దుర్బలులైన బాలలను కాపాడడంలో ఆర్.పి.ఎఫ్. నిబద్ధతకు ప్రతి సహాయక చర్య ఒక నిదర్శనం.
2018 సంవత్సరం 'ఆపరేషన్ నన్హే ఫరిష్తే' కి ఒక మంచి ప్రారంభాన్ని ఇచ్చింది. ఆ సంవత్సరం, ఆర్.పి.ఎఫ్. మొత్తం 17,112 మంది బాలబాలికలను రక్షించింది. వీరిలో 13,187 మంది పారిపోయిన పిల్లలు కాగా, 2105 మంది తప్పిపోయినవారు, 1091 మంది పిల్లలు వదిలివేయబడినవారు, 400 మంది నిరాశ్రయులు, 87 మంది కిడ్నాప్ అయినవారు, 78 మంది మానసిక వికలాంగులు అలాగే 131 మంది వీధి బాలలుగా గుర్తించారు. ఇలాంటి కార్యక్రమ తక్షణ అవసరాన్ని తెలియజేసిన ఈ 2018 సంవత్సరం ఈ ఆపరేషన్ కోసం బలమైన పునాదిని వేసింది.
2019లోనూ, ఆర్.పి.ఎఫ్. ప్రయత్నాలు ఫలించడం కొనసాగింది, సంవత్సరం మొత్తం 15,932 మంది బాలబాలికలను రక్షించారు. ఇందులో 12,708 మంది పారిపోయిన పిల్లలు, 1454 మంది తప్పిపోయిన పిల్లలు, 1036 మంది వదిలివేయబడిన పిల్లలు, 350 మంది నిరాశ్రయులు, 56 మంది కిడ్నాప్ చేయబడినవారు, 123 మంది మానసిక వికలాంగులు అలాగే 171 మంది వీధి పిల్లలు ఉన్నారు. ఈ గణాంకాలు పిల్లలు పారిపోతున్న నిరంతర సమస్యను, వారి రక్షణ అవసరాన్ని తెలియజేస్తుంది.
కోవిడ్-19 మహమ్మారి కారణంగా 2020 సంవత్సరం సవాలుగా మారింది, ఇది సాధారణ జీవితానికి అంతరాయం కలిగించింది మరియు కార్యకలాపాలను గణనీయంగా ప్రభావితం చేసింది. ఈ సవాళ్లు ఉన్నప్పటికీ, ఆర్.పి.ఎఫ్. 5,011 మంది పిల్లలను రక్షించగలిగింది.
2021 లో, ఆర్.పి.ఎఫ్. ఆపరేషన్ వేగం పుంజుకుని 11,907 మంది పిల్లలను రక్షించింది. ఈ సంవత్సరం ఆచూకీ కనుగొన్న, రక్షించబడిన పిల్లల సంఖ్య గణనీయంగా పెరిగింది, వారిలో 9601 మంది పారిపోయిన పిల్లలు, 961 మంది తప్పిపోయిన వారు, 648 మంది వదిలివేయబడిన వారు, 370 మంది నిరాశ్రయులు, 78 మంది కిడ్నాప్ అయినవారు, 82 మంది మానసిక వికలాంగులు అలాగే 123 మంది వీధి బాలలు ఉన్నారు.
2022లో, 17,756 మంది పిల్లలు రక్షించబడం ఆర్.పి.ఎఫ్. నిబద్ధతకు నిదర్శనం, ఇది ఇటీవ నమోదైన వాటిలో అత్యధికం. ఆ సంవత్సరంలో అధిక సంఖ్యలో పారిపోయిన, తప్పిపోయిన పిల్లల ఆచూకీ కనుగొని అవసరమైన సంరక్షణ, భద్రత వారికి కల్పించారు. వీరిలో 14,603 మంది పారిపోయిన పిల్లలు, 1156 మంది తప్పిపోయిన వారు, 1035 మంది వదిలివేయబడిన వారు, 384 మంది నిరుపేదలు, 161 మంది కిడ్నాప్ అయినవారు, 86 మంది మానసిక వికలాంగులు, 212 మంది వీధి బాలలు ఉన్నారు. వివిధ రైల్వే జోన్‌లలో అవగాహన పెంచడం, మరింత సమన్వయంతో పనిచేయడం ద్వారా ఈ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యాయి.
2023 సంవత్సరంలో, ఆర్.పి.ఎఫ్. 11,794 మంది పిల్లలను రక్షించగలిగింది. వీరిలో 8916 మంది పారిపోయిన పిల్లలు, 986 మంది తప్పిపోయిన వారు, 1055 మంది వెనుకబడిన వారు, 236 మంది నిరాశ్రయులు, 156 మంది కిడ్నాప్ అయినవారు, 112 మంది మానసిక వికలాంగులు అలాగే 237 మంది పిల్లలు వీధి బాలలు ఉన్నారు, ఇలాంటి పిల్లల భద్రత మరియు శ్రేయస్సు విషయంలో ఆర్.పి.ఎఫ్. కీలక పాత్ర పోషిస్తూనే ఉంది.
2024 మొదటి ఐదు నెలల్లో, ఇప్పటికే 4,607 మంది పిల్లలను ఆర్.పి.ఎఫ్. రక్షించింది. ఇంత తక్కువ కాలంలో 3430 మంది పారిపోయిన పిల్లలు రక్షించబడడం ఆపరేషన్ 'నన్హే ఫరిష్తే' పట్ల ఆర్.పి.ఎఫ్. నిరంతర నిబద్ధతను సూచిస్తున్నది. పారిపోయి వస్తున్న పిల్లల నిరంతర సమస్యను అలాగే వాటిని పరిష్కరించడంలో ఆర్.పి.ఎఫ్. అంకిత భావంతో చేస్తున్న కృషిని ఈ గణాంకాలు ప్రతిబింబిస్తున్నాయి.
వారి ప్రయత్నాల ద్వారా, ఆర్.పి.ఎఫ్. పిల్లలను రక్షించడమే కాకుండా, పారిపోయిన, తప్పిపోయిన పిల్లల ఇబ్బందులను గురించి అవగాహన పెంచింది, తదుపరి చర్యల కోసం సంబంధీకులందరి మద్దతును పొందే ప్రయత్నాలు చేస్తున్నది. కొత్త సవాళ్లను స్వీకరిస్తూ, భారతదేశంలోని విస్తారమైన రైల్వే నెట్‌వర్క్‌లో పిల్లలకు సురక్షితమైన వాతావరణాన్ని సృష్టించేందుకు కృషి చేస్తూ ఈ ఆపరేషన్ నిరంతరం ముందుకు సాగుతూ ఉంది.
ట్రాక్ చైల్డ్ పోర్టల్ బాధిత పిల్లల గురించి సమగ్ర వివరాలను కలిగి ఉంది. భారతీయ రైల్వే 135 రైల్వే స్టేషన్లలో పిల్లల సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్.పి.ఎఫ్) ద్వారా రక్షించబడిన పిల్లలను జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగిస్తారు, వారు ఈ పిల్లలను వారి తల్లిదండ్రులకు అప్పగిస్తారు.
***
(Release ID: 2034016)
Visitor Counter : 82