సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

శాస్త్రీయ నాయకత్వ సాధికారత దిశగా విజయవంతంగా పూర్తైన “జాతీయ సుపరిపాలన కేంద్రం (ఎన్.సి.జి.జి.) – ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ (ఐఎన్ఎస్ఏ) ‘శాస్త్ర సాంకేతిక నాయకత్వ అభివృద్ధి కార్యక్రమం (ఎల్ఈఏడీఎస్/లీడ్స్)’ మూడో బ్యాచ్


“శాస్త్రీయ నేతృత్వంపై సమగ్ర శిక్షణ ద్వారా సంస్థాగత శ్రేష్ఠతను పెంపొందించడమే లక్ష్యం”

Posted On: 15 JUL 2024 1:28PM by PIB Hyderabad

గౌరవనీయ భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విజన్ ఆఫ్ ఇండియా@2047కు అనుగుణంగా, అమృత్ కాల సమయంలో శాస్త్ర, సాంకేతిక పురోగతి కోసం జాతీయ సుపరిపాలన కేంద్రం (ఎన్సీజీజీ), జాతీయ సైన్స్ అకాడమీ (ఐఎన్సీఏ) ఎన్సీజీజీ- ఐఎన్సీఏ ‘శాస్త్ర సాంకేతికతల్లో నేతృత్వ కార్యక్రమం (ఎల్ఈఏడీఎస్/లీడ్స్)’ మూడో బ్యాచ్ ను విజయవంతంగా పూర్తిచేశాయి.

2024 జూలై 8 నుంచి 14 వరకూ న్యూఢిల్లీలోని ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీలో జరిగిన ఈ కార్యక్రమంలో ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, ఐఐఎస్ఈఆర్, నైపర్, డీఎస్టీ, సీఎస్ఐఆర్, భౌగోళిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ, కేంద్రీయ విశ్వవిద్యాలయం, డీఆర్డీవో, ఇస్రో వంటి ప్రముఖ సంస్థల నుంచి 37 మంది శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. శాస్త్రీయ సంస్థలు, ప్రయోగశాలల్లో నాయకత్వం, సుపరిపాలన కోసం భాగస్వామ్య శాస్త్రవేత్తల సామర్థ్యాలను పెంపొందించడం, విజ్ఞానం-నైపుణ్యాల నవీకరణతో వారిని సన్నద్ధులను చేయడం ద్వారా జాతీయ ప్రాధాన్యాలు, లక్ష్యాలను చేరుకునేలా ఈ సంస్థలను ప్రభావవంతంగా నిర్వహించగలిగేలా తీర్చిదిద్దడం ఈ కార్యక్రమం లక్ష్యం.

లీడ్స్ కార్యక్రమ ముగింపు సమావేశంలో పరిపాలన సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల శాఖ కార్యదర్శి – జాతీయ సుపరిపాలన కేంద్రం (ఎన్సీజీజీ) డైరెక్టర్ జనరల్ శ్రీ వి. శ్రీనివాస్ ప్రసంగించారు. ఈ సందర్భంగా వి. శ్రీనివాస్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా వివిధ శాస్త్రీయ సంస్థలకు నేతృత్వం వహిస్తున్న యువ నాయకత్వాన్ని సంస్థాగత అభివృద్ధిలో గణనీయంగా దోహదపడేలా తీర్చిదిద్దడమే కార్యక్రమ లక్ష్యం అని స్పష్టంచేశారు. వివాదం (లిటిగేషన్), సంగ్రహణ (ప్రొక్యూర్మెంట్), ఫిర్యాదులు, ఆర్థిక నియమాలు, సంభాషణ నైపుణ్యలు, విధానపరమైన విషయాలు సహా వివిధ అంశాలతో సమగ్ర పాఠ్యప్రణాళికను రూపొందించిన ఐఎన్ఎస్ఏ అధ్యక్షుడు ప్రొఫెసర్ అశుతోష్ శర్మ, ఆయన బృందాన్ని శ్రీ వి. శ్రీనివాస్ అభినందించారు.

ఐఎన్సీఏ-ఎన్సీజీజీ లీడ్స్ జూలై 2024 కార్యక్రమంలో 37 మంది శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. వారిలో 23 మంది పురుషులు, 14 మంది మహిళలు ఉన్నారు. ముఖ్యంగా ఈ మూడో బ్యాచ్ లో మహిళా భాగస్వామ్యం 38%గా ఉంది. మొదటి (14%), రెండో (25% ) బ్యాచ్ లతో పోలిస్తే ఇది గణనీయంగా పెరిగింది. నాయకత్వ పాత్రలలో లింగ వైవిధ్యాన్ని పెంపొందించాలన్న ఈ కార్యక్రమ నిబద్ధతను ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశంలోని 14 రాష్ట్రాలు, 17 నగరాల నుంచి శాస్త్రవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది దాని విస్తృత భౌగోళిక పరిధిని స్పష్టం చేస్తోంది. ప్రధానంగా ఢిల్లీ (8), మహారాష్ట్ర (4), ఉత్తరప్రదేశ్ (4), తదితర రాష్ట్రాల ప్రాతినిధ్యం ఉంది. పాల్గొన్న ముఖ్య నగరాలు ఢిల్లీ (8), పూణె (3), కలకత్తా (4), హైదరాబాద్ (3). ప్రముఖ సంస్థలైన 13 ఐఐటీలు, ఒక ఎన్ఐటీ, ఒక ట్రిపుల్ ఐటీ, మూడు ఐఐఎస్ఈర్ లతో పాటు డీఎస్టీ (7), సీఎస్ఐఆర్ (5) వంటి కొన్ని ఇతర ప్రభుత్వ సంస్థలకు ప్రాతినిధ్యం ఉంది.

ఏడురోజుల పాటు నిర్వహించిన ఈ కార్యక్రమంలో పరిపాలన, ఆర్థిక నిర్వహణ – అనువర్తనం, నాయకత్వ నైపుణ్యాలు, కమ్యూనికేషన్ – మీడియా, విధానపరమైన అంశాలు సహా విస్తృత శ్రేణి అంశాలను చర్చించారు. నిశిత అభ్యాసన, అనుభవం, శాస్త్ర సాంకేతిక రంగాల్లో సమర్థవంతంగా నేతృత్వం వహించడానికి అవసరమైన నైపుణ్యాలు, భావనలతో వారిని సన్నద్ధులను చేయడం, ప్రగతిశీల- సృజనాత్మక భారతదేశ దార్శనికతకు దోహదపడడం వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. ప్రస్తుతానికి శాస్త్ర సాంకేతికతల్లో నాయకత్వ అభివృద్ధి కార్యక్రమ (లీడ్స్) మూడు బ్యాచులను దేశవ్యాప్తంగా ఉన్న శాస్త్రీయ సంస్థలకు చెందిన 125 మంది శాస్త్రవేత్తలతో ఐఎన్సీఏ, ఎన్సీజీజీ సంయుక్తంగా విజయవంతంగా నిర్వహించాయి.

ఐఎన్సీఏ అధ్యక్షుడు, కోర్సు సమన్వయకర్త ప్రొ. అశుతోష్ శర్మ ముగింపు సమావేశానికి అధ్యక్షత వహించారు. ఐఎన్సీఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, కోర్సు సమన్వయ కర్త డా. బ్రజేశ్ పాండే, ఐఎన్సీఏ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ సునిల్ జోకర్కర్, ఎన్సీజీజీ ముఖ్య కార్యనిర్వహణాధికారి, సమన్వయకర్త శ్రీమతి ప్రిస్కా పాలీ మాథ్యూ, ఎన్సీజీజీ అసిస్టెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. గజాలా హసన్ తో పాటు రెండు సంస్థల పూర్తిస్థాయి శిక్షణ బృందాలు సమావేశంలో పాల్గొన్నాయి.  

***



(Release ID: 2033536) Visitor Counter : 41