పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
2030 నాటికి ఈ&పీ రంగం 100 బిలియన్ డాలర్ల పెట్టుబడి అవకాశాలు అందిస్తుంది: పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ ఎస్ పూరీ
2030 నాటికి భారతదేశ శోధన విస్తీర్ణాన్ని మిలియన్ చ.కి.మీ.కు పెంచడం మా లక్ష్యం: హర్దీప్ ఎస్ పూరీ
ఉర్జా వర్త 2024ను ప్రారంభించిన మంత్రి పూరీ: భారతదేశ ఇంధన భద్రత లక్ష్యాలకు దోహదపడేందుకు వేదికను ఉపయోగించుకోవాలని భాగస్వాములకు ఆహ్వానం
Posted On:
11 JUL 2024 5:38PM by PIB Hyderabad
శోధన, ఉత్పత్తి (ఈ&పీ) రంగం 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల పెట్టుబడి అవకాశాలను అందిస్తుందని పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. ఉర్జా వర్త మొదటి ఎడిషన్ ప్రారంభ సభలో మంత్రి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఇంధన స్వావలంబన సాధించడంలో, ఆర్థిక వృద్ధిని సుస్థిరం చేయడంలో శోధన, ఉత్పత్తి (ఈ&పీ) రంగం ప్రాధాన్యాన్ని నొక్కిచెప్పారు. భారతదేశంలో ముడి చమురు, సహజ వాయు నిల్వలు గణనీయంగా ఉన్న 26 అవక్షేప బేసిన్ల విస్తారమైన సమర్థతను సంపూర్ణంగా వినియోగించుకోవాల్సిన ఆవశ్యకతను ప్రముఖంగా ప్రస్తావించారు.
గణనీయమైన పురోగతి సాధించినప్పటికీ, “మన అవక్షేపణ బేసిన్ ప్రాంతంలో ప్రస్తుతం 10 శాతం మాత్రమే శోధన పరిధిలో ఉన్నది. రాబోయే సార్వత్రిక విస్తీర్ణ లైసెన్సుల విధానం (ఓఏఎల్పీ) రౌండ్ల కింద బ్లాకుల నిర్ణయం తర్వాత 2024 చివరి నాటికి ఇది 16 శాతానికి పెరుగుతుంది’’ అని మంత్రి అన్నారు.
కార్యాచరణ, నియంత్రణ ప్రక్రియల క్రమబద్ధీకరణ ఆవశ్యకతను ప్రధానంగా ప్రస్తావిస్తూ, “శోధన, ఉత్పత్తి రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తన వంతు కృషిచేస్తోంది. దేశ పురోగతికి దోహదపడేలా భాగస్వాములకు సాధికారత కల్పిస్తూ పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ సమూల సంస్కరణలు చేపట్టింది’’ అని శ్రీ పూరీ తెలిపారు. 2030 నాటికి భారతదేశ శోధన విస్తీర్ణాన్ని మిలియన్ చ.కి.మీ.కు పెంచాలని భావిస్తున్నట్టు తెలిపారు.
భారతదేశ ప్రత్యేక ఆర్థిక మండళ్లలో (ఈఈజెడ్) “అనధీకృత (నో – గో)” ప్రాంతాలు దాదాపు 99% తగ్గాయి” అని పూరీ పేర్కొన్నారు.
ఓఏఎల్పీ, ఆవిష్కృత సూక్ష్మ క్షేత్ర విధానం (డీఎస్ఎఫ్) వంటి కార్యక్రమాల ద్వారా శోధన కార్యకలాపాలను వేగవంతం చేయడంపై మంత్రి మాట్లాడారు. “మొదటి 8 ఓఏఎల్పీ బిడ్ రౌండ్ల ద్వారా దాదాపు 244,007 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మొత్తం 144 బ్లాకులను కేటాయించారు; ఇటీవల ప్రకటించిన ఓఏఎల్పీ తొమ్మిదో రౌండ్ తీర ప్రాంతాల్లో శోధన దిశగా దేశ గమనాన్ని విస్తరించే దార్శనికతతో దాదాపు 136,596 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో 8 అవక్షేపణ బేసిన్లలో విస్తరించి ఉంది’’ అని ఆయన తెలిపారు. ఆవిష్కృత సూక్ష్మ క్షేత్ర (డిస్కవర్డ్ స్మాల్ ఫీల్డ్/డీఎస్ఎఫ్) విధానం 2015లో ప్రారంభమైనప్పటి నుంచి దాదాపు 2 బిలియన్ డాలర్ల పెట్టుబడులను పొందిందని, ఈ రంగంలో 29 మంది కొత్త భాగస్వాములను చేర్చిందని మంత్రి చెప్పారు.
శాస్త్రీయ సమాచార ఆధారిత శోధనను ప్రోత్సహించడంపై ప్రభుత్వ దృష్టిని ప్రముకంగా పేర్కొంటూ ఈఈజెడ్, స్తరాంతర అన్వేషణకు (స్ట్రాటిగ్రాఫిక్ వెల్స్) నిధులు, క్లిష్టమైన భూభాగాల కోసం వైమానిక సర్వే డేటా సేకరణ సహా కొత్త భూ సంధ సమాచార సేకరణ కోసం రూ. 7,500 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని శ్రీ పూరీ తెలిపారు. “పశ్చిమ తీరంలోని కేరళ-కొంకణ్ బేసిన్, ముంబై తీర ప్రాంత బేసిన్, తూర్పు తీరంలోని మహానది, అండమాన్ బేసిన్లకు సంబంధించిన భౌగోళిక శాస్త్రీయ సమాచారం మన దగ్గర ఉంది” అని ఆయన అన్నారు. డీజీహెచ్ ద్వారా జాతీయ సమాచార నిధిని (నేషనల్ డేటా రిపోజిటరీ) క్లౌడ్ ఆధారిత ఎన్డీఆర్ గా నవీకరించడాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.
ఈ&పీ రంగంలో వాణిజ్య సౌలభ్యాన్ని నిర్ధారించడానికి ప్రభుత్వ చర్యల గురించి మాట్లాడుతూ, ‘‘37 ఆమోద ప్రక్రియలను ఏకీకృతం చేసి 18గా సరళీకరించాము, 9 ప్రక్రియలు ఇప్పుడు స్వీయ ధృవీకరణకు అర్హత పొందాయి. ఈ సంస్కరణలను మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన ఆవశ్యకతను గుర్తించాం’’ అని ఆయన తెలిపారు. ‘‘ఇతర ప్రక్రియలకు స్వీయ ధృవీకరణను విస్తరించే సాధ్యాసాధ్యాలను తప్పక పరిశోధించాలి’’ అని మంత్రి చెప్పారు. ‘‘క్షేత్ర అభివృద్ధి ప్రణాళికలు, వార్షిక ప్రణాళికలు, ఇతర నియంత్రణ అనుమతుల ఆమోదంలో జాప్యాన్ని తగ్గించాలి, ప్రత్యేకించి మన దేశం దిగుమతిపై ఆధారపడడం పెరుగుతూనే ఉన్నందున ఇది చాలా ముఖ్యం’’ అన్నారు.
ప్రైవేట్ ఈ&పీ నిర్వాహకులు, జాతీయ చమురు కంపెనీలు, పెట్రోలియం- సహజవాయు మంత్రిత్వ శాఖ, డీజీహెచ్ ప్రతినిధులతో ఒక ఉమ్మడి కార్యనిర్వాహక బృందం ఏర్పాటు చేసి ఈ పరిశ్రమ సమస్యలను పరిష్కరించి, ఈ రంగంలో వ్యాపారాన్ని సులభతరం చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈ ఏడాది చివరి నాటికి వివిధ ఆన్లైన్ పోర్టళ్ల సమీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని డీజీహెచ్ ను ఆదేశించారు.
చివరిగా, ఉర్జా వర్త 2024 ఇంధన రంగంలో సహకారం, ఆవిష్కరణలకు ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని మంత్రి పూరి విశ్వాసం వ్యక్తం చేశారు. భారతదేశ ఇంధన భద్రత లక్ష్యాలకు దోహదపడేలా ఈ వేదికను ఉపయోగించుకోవాలని పరిశ్రమలు, విద్యావేత్తలు, ప్రభుత్వ భాగస్వాములను ఆహ్వానించారు.
ప్రసంగం అనంతరం చమురు, వాయు రంగంలో సాంకేతిక పత్రాలు, ఆవిష్కరణల ప్రదర్శన గ్యాలరీ, ఆవిష్కరణ కేంద్రాన్ని మంత్రి పూరీ ప్రారంభించారు. సాంకేతిక పురోగతి, సుస్థిర ఇంధన ఆచరణల దిశగా భారతదేశ నిబద్ధతను ఈ ప్రదర్శన వెల్లడిస్తుంది.
ఉర్జా వర్త 2024
పెట్రోలియం, సహజవాయు మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి ఈ రోజు భారత్ మండపంలో ఉర్జా వర్త 2024 మొదటి ఎడిషన్ ను ప్రారంభించారు.
జూలై 11, 12 తేదీల్లో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ (డీజీహెచ్) ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. భారతదేశంలో వెలికితీయని హైడ్రోకార్బన్ వనరులను సుస్థిరంగా ఆవిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారత హైడ్రోకార్బన్ రంగం భవిష్యత్తు, పెట్టుబడులు, ఆవిష్కరణలు, భాగస్వామ్యాలు, సుస్థిర వృద్ధిపై చర్చలకు ఈ సదస్సు కీలక వేదికగా ఉపయోగపడుతుంది.
సంప్రదాయ, సంప్రదాయేతర ఇంధన రంగాలకు చెందిన నాయకులు, పరిశ్రమ నిపుణులు, సేవలందించేవారు, సలహాదారులందరినీ ఈ కార్యక్రమం ఒక్క చోటికి తెస్తుంది. భారతదేశంలోని చమురు, వాయు వెలికితీత పరిశ్రమ; ఇంధన పరివర్తనకు సంబంధించిన సవాళ్లు, అవకాశాలను చర్చించడానికి ఇది దృష్టిసారిస్తుంది. 400 మందికి పైగా ప్రతినిధులు, 50కి పైగా ప్రదర్శకులు, 100 మందికి పైగా వక్తలు హాజరైన రెండు రోజుల కార్యక్రమంలో నిపుణుల బృంద చర్చలు, బీ2బీ సమావేశాల్లో పాల్గొనే సీఎక్స్ వోలు, పారిశ్రామిక నాయకులతో వ్యూహాత్మక శిఖరాగ్ర సమావేశాలు ఉంటాయి. వాటితో పాటు మెరుగైన చమురు వెలికితీత పద్ధతుల నుంచి చమురు, సహజవాయు రంగంలో సాంకేతికీకరణ వరకు అనేక అంశాలపై పరిశోధకులు, నిపుణులు ఈ సాంకేతిక సదస్సులో పరిశోధనలను వెల్లడిస్తారు. ఉర్జావర్త ప్రధాన కార్యక్రమం ఆవిష్కరణ కేంద్రం, ప్రదర్శన గ్యాలరీ ద్వారా వెలికితీత రంగంలో అంకుర సంస్థలు, ఆయా సేవలందించే సంస్థలు, ఈ&పీ కంపెనీల ఆవిష్కరణలను ప్రదర్శిస్తోంది.
***
(Release ID: 2033044)
Visitor Counter : 84