రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

రాష్ట్రపతితో సమావేశమైన మిలిటరీ ఇంజినీర్ సర్వీసెస్ ప్రొబెషనర్లు

Posted On: 12 JUL 2024 1:59PM by PIB Hyderabad

మిలిటరీ ఇంజినీర్ సర్వీసెస్ (ఎంఈఎస్) ప్రొబెషనర్లు భారత రాష్ట్రపతి శ్రీ ద్రౌపది ముర్మును ఈరోజు (2024 జూలై 12) రాష్ట్రపతి భవన్ లో కలిశారు.

ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, మిలిటరీ ఇంజినీర్ సర్వీసులు భారతదేశ భద్రతతో ముడిపడి ఉన్న ముఖ్య విభాగాల్లో ఒకటన్నారు. అది భారత సైన్యానికి చెందిన మూడు సేనలకు మాత్రమే కాక, రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన చాలా ఇతర విభాగాలకు కూడా సేవలందిస్తుందన్నారు. మన రక్షణ దళాలకు పటిష్టమైన మౌలిక సదుపాయాలు, మంచి సౌకర్యాలు ఉండేలా చూడడమే ఎంఈఎస్ లక్ష్యం అని ఆమె పేర్కొన్నారు. కాబట్టి, వారు అందించే మౌలిక సదుపాయాలు, సౌకర్యాల విశ్వసనీయత, నాణ్యత ప్రమాణాలే ఎంఈఎస్ అధికారుల విజయానికి పరీక్షలన్నారు. ఎంఈఎస్ అధికారులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. తమ సేవల్లో అత్యున్నత నాణ్యతను కొనసాగించడం ద్వారా గౌరవాన్ని పొందాలని ఆమె అన్నారు.

మౌలిక సదుపాయాల నిర్మాణ సమయంలో పర్యావరణ మార్పునకు సంబంధించి అనుకూలన, మితీకరణ అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఎంఈఎస్ అధికారులకు రాష్ట్రపతి సూచించారు. వారు చేయబోయే పనుల్లో కర్బనోద్గారాల జాడ (కార్బన్ ఫుట్ ప్రింట్) కనిష్టంగా ఉండాలని ఆమె అన్నారు. ఈ దిశగా ఎంఈఎస్ చర్యలు తీసుకుంటోందని ఆమె హర్షం వ్యక్తంచేశారు.

సాంకేతికంగా మాత్రమే కాకుండా నైతికంగాను, నిర్వహణలోను ఎంఈఎస్ అధికారుల బాధ్యత ఉందని రాష్ట్రపతి అన్నారు. తమ ప్రతీ పనిలో దేశ వనరులను సమర్థవంతంగా, ప్రభావవంతంగా వినియోగించుకోవాలన్న సంకల్పం ఎంఈఎస్ అధికారులకు ఉండాలన్నారు. వారి సామర్థ్యం, నైతికత దేశ భద్రతను బలోపేతం చేస్తాయని ఆమె అన్నారు.

***


(Release ID: 2032922) Visitor Counter : 70